ఒంటరి కాకి దిగులు

-కందేపి రాణి ప్రసాద్

          నల్లమల అడవిలో చెట్ల మీద పక్షులు ఎన్నో ఉన్నాయి. అన్నీ గోలగోలగా మాట్లాడు కుంటున్నాయి. ఎవరి కుటుంబంలో సమస్యల్ని అవి చర్చించుకుంటున్నాయి. కొన్ని మగ పక్షులు పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నాయి. మరి కొన్ని ఆడ పక్షులు వంటల గురించి, పిల్లల గురించి మాట్లాడుకుంటున్నాయి. చెట్టు నిండా ఉన్న పక్షులన్నీ ఇంత గోలగోలగా మాట్లాడుకుంటుంటే, ఒక కాకి ఒంటరిగా ఉన్నది. ఒక కొమ్మ మీద కూర్చుని దిగాలుగా మొహం వేసుకుని కూర్చున్నది.
 
          ఆ కాకి మనసులో ఎన్నో భావాలు మెదులుతున్నాయి. తన బాధ గుర్తుకొచ్చి కళ్ళు చేమరుస్తున్నాయి. తన బంధువులెవరూ తన గురించి పట్టించుకోవడం లేదు. ఇంటి చుట్టు పక్కల వాళ్ళు కూడా సంతోషాన్ని పంచుకునే వారే గానీ బాధల్ని పట్టించుకునే వారు లేరు. ఏమిటి లోకం ఇలా మారిపోయింది. ఎక్కడ చూసినా స్వార్థమే రాజ్యమేలు తుంది.
 
          ఆ కాకి చాలా కాలం కిందే భర్తను కొల్పోయింది. ఒక్కగానొక్క కొడుకును పెంచి పెద్ద చేసింది. కొడుకు బాగా సంపాదిస్తున్నాడు. ఆనందంగా పెళ్ళి చేయాలని కలలు కన్నది. మనవడో మనవరాలో పుడితే చూసి సంతోషించాలని కలలు కన్నది.
 
          ఇదేమీ అసాధారణ కల కాదే, ఎవరూ కోరని కోరిక కూడా కాదే..మనుషులు కూడా ఇలాగే ఎదిగిన పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి బాధ్యతలు తీర్చుకుంటారట. అయినా ఇలాంటి రోజొకటి వస్తుందని కలలో కూడా ఊహించలేదు.
 
          పెళ్ళిళ్ళ బ్రోకర్ వచ్చి ఈ మాట చెబుతుంటే ఆశ్చర్యపోయింది. ఆడ కాకుల సంఖ్య తగ్గి పోతున్నదట. మగ పిల్లలకు పెళ్ళి చేయాలంటే ఆడపిల్లలు దొరకడం లేదట. ఈ సమస్య మనుషుల్లో కూడా ఉందట “ఇప్పుడెలా పిల్లాడి పెళ్ళి చేయడం” ఆలోచనల్లో మునిగిపోయింది కాకి.
 
          ఆ చెట్టు మీద అన్ని పక్షులున్నా ఈ కాకిని ఎవరూ పట్టించుకోలేదు. ఈ కాకి మనసు లోని బాధను గుర్తించలేదు. అసలు దాని ముఖాన్ని సరిగా చూస్తే కదా! అది బాధలో ఉందని గుర్తించటానికి. ఈ మధ్య అడవిలోని జంతువులు, పక్షులు కూడా మనుషుల అలవాట్లు నేర్చుకుంటున్నాయి.
 
          ఇలా కాకి మనసులో రకరకాల భావనలు మెదులుతున్నాయి. తనకెవరూ సహాయం చేయటం లేదని దిగులు పడుతున్నది. తనకు కాకుల సంఖ్య తగ్గిపోతున్నది అని తెలుసు గానీ ఆడ కాకుల సంఖ్య తగ్గిపోతున్నదని తెలియదు. రోజూ మనసులో ఇదే ఆలోచన వస్తున్నది. పరిష్కారం తెలియడం లేదు.
 
          ఆ చెట్టు మీద ఒక ముసలి కాకి కూడా ఉంటున్నది. ఒక రోజు ఒంటరిగా దిగులుగా ఉన్న కాకిని చూసింది. “ఏమైంది దీనికి ? ఎందుకలా ఒంటరిగా ఉంటున్నది? నవ్వడం లేదు! ఉత్సాహంగా లేదు! ఎప్పుడు చూసినా నీరసంగా ఉంటున్నది ఇది” అని మనసు లో అనుకున్నది.
 
          మెల్లగా ముసలి కాకి ఒంటరి కాకి దగ్గరకు వచ్చింది. దాని భుజం మీద చెయ్యేసి “ఏమైంది. అలా ఉంటున్నావు అందరికీ దూరంగా కూర్చుంటున్నావు. నీ భాద ఏమిటో చెప్పు! నువ్వు మనసులో దేనికో బాధపడుతున్నావని నాకనిపిస్తోంది ? అన్నాది.
 
          ఆ మాత్రం పలకరింపుకే కాకి పొంగిపోయింది దాని మనసు కరిగి నీరయింది. దాని కళ్ళ వెంట నీళ్ళు ధారాపాతంగా కారసాగాయి. అలా కాసేపు ఏడవనిచ్చింది. కాసేపటి తర్వాత ముసలి కాకి ఒంటరి కాకి యొక్క కళ్ళు తుడిచింది. ఆ కాకిని  దగ్గరకు తీసుకుం ది. మెల్లగా కాకి వీపు నిమిరింది.
 
          కాకి ముసలికాకి వీపు పై తలవాల్చి సేద దీరింది. కాసేపటికి దాని మనసులో భారమంతా దిగిపోయింది. మనసేమిటో తేలికగా అనిపించింది. అప్పుడు కళ్ళు తుడుచు కుని తన మనసులో పడుతున్న బాధను మెల్లగా చెప్పనారంభించింది.
 
          “తాతా! నా కొడుకు పెళ్ళి చేయాలనుకుంటున్నాను. కానీ ఆడ కాకుల సంఖ్య తగ్గిపోతున్నదట. గదా! అసలే మా ఆయన ఎప్పుడో చనిపోయాడు కదా నా కొడుక్కి పెళ్ళి ఎలా చేయాలో అర్థం కావట్లేదు. నాకు ఈ సమస్య కన్నా కూడా మన చెట్టు మీద నివసించే ఏ పక్షి కూడా నన్ను ఎందుకిలా ఉన్నావని అడగలేదు. మనుషుల మాదిరిగా మనం కూడా ఎవరితో పలక్కుండా ఉంటే మనం కూడా వాళ్ళలా మారిపోతాం కదా!”
మరీ మనకీ మనషుల కొచ్చే జబ్బులన్నీ వస్తాయి కదా! మనుషులు మానసికంగా ఎంతో బలహీనంగా తయారవుతున్నారు. తద్వారా యాంక్సైటీ న్యూరోసిస్, డిప్రెషన్, సైకోసిస్ వంటి మానసిక జబ్బులు వస్తాయి కదా! అని అన్నది కాకి.
 
          దానికి ముసలి కాకి నవ్వేస్తూ “నువ్వు దీనికే భయపడుతున్నావా! కాకుల సంఖ్య తగ్గుతోంది. కానీ మన చేతిలో ఏమీ లేదు కదా! కాబట్టి దిగులు పడకు. మా చుట్టాలమ్మాయి ఉంది కానీ వాళ్ళు పేదవారు నీకిష్టమైతే చేసుకుందువు గానీ ముందు దిగులు పడటం మానెయ్యి.
 
          “నువ్విలా ఒంటరితనంలో మునిగిపోతుంటే నువ్వు చెప్పిన జబ్బులన్నీ నీకే వస్తాయి. సమస్యలన్ని వస్తాయి. వాటిని పరిష్కారించుకోవాలి. అంతేగానీ నిరాస పడకూడదు. వాటిని చూసి భయపడి పారిపోకూడదు. మిగతావాళ్ళు పలకలేదని అనుకోవటం మానేసి మనమే పలకరిద్దాం. కొంత వరకు పరిస్థితి మారవచ్చు” అంటూ ముసలికాకి హితబోధ చేసింది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.