అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 11

– విజయ గొల్లపూడి

జరిగినకథ: విశాల, విష్ణుసాయి ఆస్ట్రేలియాలో అడుగుపెట్టి, అక్కడ జీవన విధానాన్ని పరిశీలిస్తూ ఆవాసమేర్పరుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటగా వినయ్, అనిత వాళ్ళ ఇంట్లో రెండురోజులు ఆతిధ్యమిచ్చారు. కానీ వాళ్ళు వరల్డ్ టూర్ కి వెళ్ళబో తుండటంతో, వినయ్ తన స్నేహితుడు గోపీ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉండటానికి నెల
రోజులకి ఒప్పందం కుదిర్చాడు. అందరూ కలిసి బోండై బీచ్ కి వెడతారు. గోపీ, వినయ్ ని దూరంగా తీసుకొని వెళ్ళడంతో విశాల వాళ్ళ వంక చూస్తూ ఉండిపోతుంది.

***

          గోపీ, వినయ్ పని చూసుకుని వెనక్కి తిరిగి వచ్చి అందరినీ కలిసారు. అందరూ కలిసి రెండు జట్లుగా విడిపోయి క్రికెట్ గేమ్ ఫన్ గా ఆడారు. ఒక గంటసేపు ఆడిన తరువాత అందరూ ఫోటోలు దిగారు. ఇంటికి వెనుతిరుగుతూ దారిలో డామినో పిజ్జా దగ్గిర ఆగి మార్గరిటా, వెజోరమా పిజ్జాలు, గార్లిక్ బ్రెడ్ ఆర్డర్ చేసారు.

          “విశాలా! ఈ రోజు కొత్త్ర రుచి టేస్ట్ చేయబోతున్నావు. పిజ్జా అంటే ఆస్ట్రేలియాలో డామినోస్ లేదా పిజ్జాహట్ ఫేమస్. పిల్లలకి ఫేవరెట్ ఫుడ్. ఎపుడైనా బయటికి  వచ్చి నపుడు ఇలా డిన్నర్ కి వస్తాము.” అని చెప్పింది అనిత.

          “ఓ అవునా! పిజ్జా అంటే దేనితో తయారుచేస్తారు? నేను పూర్తి వెజిటేరియన్. మొదటిసారి దేశం కాని దేశంలో క్రొత్త టేస్ట్ తినడం అంటే నాకు భయంగా ఉంది.” అని కళ్ళతో సందేహం వెలిబుచ్చింది విశాల.

          అదే సమయానికి రెడీ అయిన పిజ్జా బాక్స్ లతో అమర్, అన్విత వస్తూ “ఆంటీ డోంట్ వర్రీ! యు డెఫినెట్ లీ లైక్ దిస్ టేస్ట్. వుయ్ ఆర్ ఆల్సో వెజిటేరియన్స్. ది స్పెషలిటీ ఈస్ మొజరెల్లా ఛీస్. థిస్ ఈస్ నథింగ్ బట్ బ్రెడ్ మేకప్ ఇన్ డిఫరెంట్ ఫామ్. ప్లైన్ ఫ్లార్ ఇన్ ఉడ్ ఫైర్ బేకింగ్” అంటూ అట్ట పెట్టె బాక్స్ లో ఉన్న పిజ్జాని చూపెట్టాడు అమర్.

          “వావ్! ఒక పెద్ద రౌండ్ సర్కిల్ షేప్, ట్రైయాంగిల్ కట్స్ తో ఎనిమిది పీసెస్, పైన ఛీస్, వెజిటబుల్స్ కాప్సికం, పైనాపిల్, ఆలివ్స్, ఆనియన్ తో అలంకరించబడి వేడిగా పొగలు కక్కుతూ ఆకర్షణీయంగా ఉంది కదా!” అని చూడగానే ఇష్టపడ్డాడు విష్ణు.

          అనిత అందరికీ పేపర్ ప్లేట్స్ లో రెండు పిజ్జా పీసెస్, గార్లిక్ బ్రెడ్ సెర్వ్ చేసింది.

          విశాల కాస్త డౌట్ ఫుల్ గా నోట్లో పెట్టుకుంది. ఇంత వరకు సంప్రదాయకంగా ఇంట్లో రుచులకు అలవాటు పడ్డ విశాల, పిజ్జా రుచిని నలుగురితో కలిసి ఉన్నపుడు ముక్క నోట్లో పెట్టుకుంటూ మొహమాటపడుతూ బాగానే ఉంది అని చెప్పింది. మనసులో ఒక రకమైన బెరుకు ఉన్నపుడు రుచిని ఆస్వాదించడం కష్టం అనుకుంది.

          అందరూ ఇంటికి చేరుకునేసరికి ఆరు గంటలైంది. అక్కడి నుంచి, విశాల, విష్ణు వారి సూట్ కేసులు తీసుకుని గోపి కారులో పెట్టారు. వారిద్దరూ వెడుతూ ఉంటే అనిత విశాల చేయి పట్టుకుని, “ఆల్ ద బెస్ట్!” అంటూ ఫెరరో రోషి చాక్లెట్స్ పాకెట్ చేతిలో పెట్టింది.

          వాళ్ళ నించి వీడ్కోలు తీసుకుని, విశాల, విష్ణుసాయి గోపీ కారులో అతనింటికి చేరుకున్నారు.

          గోపీ చేయి అందించి, విష్ణుతో కలిపి లగేజ్ లోపలికి తీసుకువచ్ఛాడు. రాగానే లాంజ్ రూమ్, డైనింగ్ హాలు, కిచెన్ చూపించాడు. తరువాత వాళ్ళ సూట్ కేసులు లోపల గదిలోకి చేర్చి “ఇది గెస్ట్ బెడ్ రూమ్. ప్రస్తుతం ఈ నెల రోజులు మీరు ఈ గదిని వాడుకో వచ్చు, మీరు రిలాక్స్ అవ్వండి” అంటూ హాలులోకి వచ్చి టి.వి ఆన్ చేసాడు. 

          విశాల ఇల్లును చూసి బాగానే పెద్దగా ఉంది అనుకుంది. బెడ్ రూమ్ లో క్వీన్ సైజ్ పరుపు మీద క్విల్ట్ పరిచి, ప్రక్కనే హీటర్ ఉంది. గది వెచ్చగా సమయానుకూలంగా తలదాచుకోవడానికి సరిగ్గా సరిపోతుంది వాళ్ళిద్దరికీ. నిద్రలోకి వెళ్ళిపోతు అనుకుంది మనసులో విష్ణు ఏమైనా తనకి చెపుతాడేమో, వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడికీ వెళ్ళారు? భార్యా,
భర్తలు అంటే అన్ని విషయాలు ఒకరితో ఒకరు పంచుకుంటే బాగుంటుంది కదా! మూడో మనిషి మధ్యలో వచ్చినా కానీ, ఏ పొరపొచ్ఛాలు లేకుండా, రహస్యాలు ఉండకూడదని భావిస్తుంది. కొద్దిగా ఓపిక పట్టడం మంచిది. వెంటనే ఒక నిర్ణయానికి రావడం మంచిది కాదు అని అంతరాత్మ హెచ్చరించటంతో, ఆలోచనలు ప్రక్కన పెట్టి నిద్రలోకి జారుకుంది.

          ప్రొద్దున్న త్వరగా మెలకువ రావడంతో, స్నానాదికాలు ముగించుకుని కిచెన్ లోకి అడుగు పెట్టింది. తనకు అంతా అయోమయంగా, మనసులో గందరగోళంగా ఉంది. ‘టీ తను చేయాలా వద్దా, కొత్త ప్రదేశం, పని అందుకుని చేయాలా వద్దా?’ అని ఆలోచనలో పడింది. ఇంతలో విష్ణు కూడా స్నానం చేసి హాలులోకి రావడంతో ‘హమ్మయ్యా!’ అను కుంది.

          గోపీ కెటిల్ ఆన్ చేసి, టీ తయారు చేసుకుని ఇద్దరికీ తలో కప్పు ఇచ్చి, తను కూడా వారితో కూచుని టి.వి ఆన్ చేసాడు. “ఈ రోజు నేను వర్క్ కి వెడుతున్నాను. మీకు డూప్లికేట్ కీస్ ఇస్తున్నాను. ఇక్కడ ప్రక్కనే ‘వెస్ట్ పాయింట్’, బ్యాంక్ ఉన్నాయి. కౌన్సిల్ లైబ్రరీ కూడా ఉంది. ఇంటి దగ్గరే బస్ స్టాప్. న్యూస్ ఏజెన్సీలో ట్రావెల్ టెన్ అనిటికెట్ పాస్ లు దొరుకుతాయి. దట్ అలోస్ టు ట్రావెల్ టెన్ టైమ్స్. ఇంక ఈ రోజు లంచ్ కి నేను ఎలక్ట్రిక్ కుకర్ లో రైస్, దాల్ పెడుతున్నాను. టేబిల్ మీద ప్రియ పికిల్స్ఉన్నాయి. హెల్ప్ యువర్ సెల్ఫ్” అని తను చెప్పవలసిన విషయాలు టకటక చెప్పేసాడు. “ఈ రోజు మన బ్రేక్ ఫాస్ట్ బ్రెడ్, జామ్. అంటూ బ్రెడ్ టోస్టర్ లో పెట్టి ఆరు స్లైసెస్ కి జామ్ రాసి ప్లేటులో పెట్టాడు.

          “రెండు స్టాపులు దాటితే ఇండియన్ గ్రోసరీస్ షాపు సామీస్ అని శ్రీలంకన్ షాపు ఉంది” అని వివరాలు చెప్పాడు. గోపీ బయటకు వెళ్ళబోతూ, ఇంటి అడ్రస్, ఫోన్ నంబర్, తన మొబైల్ నంబర్ పేపర్ పాడ్ పై రాసి ఇచ్చాడు.

          గోపీ అలా బయటకు వెళ్ళగానే విశాల, విష్ణు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని గట్టిగా నవ్వుకున్నారు. ఊపిరి పీల్చుకున్నారు.

          “ఓ మై గాడ్, ఏం జరుగుతోంది. మనం ఇపుడు ఎక్కడ ఉన్నాము? అన్ బిలీవబుల్. చాలా ఆశ్చర్యంగా ఉంది. మనం వచ్చి అపుడే మూడు రోజులు ఐపోయింది కదా!” అంది విశాల.

          విష్ణు, విశాల చెయ్యి పట్టుకుని, “పద, అలా బయటకు వెడదాం. పనులన్నీ చుట్ట బెట్టుకుని వద్దాం.” అంటూ చేతిలో బ్యాగ్ తీసుకుని ఇల్లు లాక్ చేసుకుని ఇద్దరూ బయట పడ్డారు. ప్రక్కనే న్యూస్ ఏజెన్సీ లో ట్రావెల్ టెన్ పాస్ చెరొకటీ కొనుక్కుని బస్ నంబర్ 783 చూసి, ఇద్దరూ బస్ ఎక్కి, బస్ పాస్ స్వైప్ చేసారు.

          బస్ ఎక్కగానే డ్రైవర్ ని చూస్తూ, “ఐ హేవ్ టు గెట్ డౌన్ ఎట్ వెస్ట్ పాయింట్, ప్లీస్ టెల్ మి వేర్ టు గెట్ డౌన్” అన్నాడు విష్ణు.

          మొదటిసారి ఆస్ట్రేలియాలో ఇద్దరూ సిటీ బస్ లో ప్రయాణం, చాలా కంఫర్ట్ బుల్ గా ఉంది ఆ బస్. బస్ ష్టాప్ రాగానే దిగడానికి ముందు ప్రయాణికులు బటన్ నొక్కగానే కూత వచ్చి, బస్ నెక్స్ట్ ష్టాప్ లో ఆగుతోంది. బస్సులో ఏ విధమైన తొక్కిసలాట లేదు. ఐదు నిమిషాల్లో డ్రైవర్ విష్ణు కూర్చున్న వైపు చూసి చేయి చూపించాడు నెక్స్ట్ ష్టాపులో దిగమని.

          బస్ దిగి, రోడ్డు దాటి ఇద్దరూ వెస్ట్ పాయింట్ లో అడుగు పెట్టారు.

          విశాల కళ్ళు ఒక్కసారిగా విప్పారాయి. “అబ్బో! చూడండి అక్కడ ట్రాలీలో ఇద్దరూ ట్విన్ బేబీస్. అచ్చం ఇద్దరూ ఒకలాగే ఉన్నారు. వావ్ రబ్బర్ బొమ్మల్లా ఉన్నారు. హౌ క్యూట్” అంటూ మురిపెంగా వాళ్ళ వైపు చూసింది.

          “అరె వా! అవును భలే బాగున్నారు విశాలా! నిజంగా పరిసరాలను చూస్తూ ఎంజాయ్ చేయటం నిన్ను చూసి నేర్చుకోవాలి” అని విష్ణు ఆమెను ఆరాధనతో చూసాడు.

          అక్కడ ఇన్ఫర్మేషన్ అన్న కౌంటర్ దగ్గర ఉన్న మేప్ తీసుకున్నాడు విష్ణు. తను ఎక్కడెక్కడకు వెళ్ళాలో రూట్ చూసుకుని, విశాలతో ప్రక్కనే ఉన్న లిఫ్ట్ లోకి వెళ్ళి థార్డ్ ఫ్లోర్ బటన్ నొక్కాడు విష్ణు.

          సెయింట్ జార్జ్ బ్యాంక్ లోకి అడుగుపెట్టి, నేరుగా విశాలతో కౌంటర్ దగ్గరకు వెళ్ళాడు. కౌంటర్ లో ఆమె “హాయ్, అయామ్ లూసీ, హౌ కెన్ ఐ హెల్ప్ యూ?” అని చిరునవ్వుతో పలకరించింది.

          విష్ణు సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేద్దామనుకుంటున్నానని చెప్పి, ఐడెంటిటీ పాస్ పోర్ట్ చూపించి, ఇద్దరి పేరుమీద కార్డ్ కావాలని ఫాం ఫిలప్ చేసి ఇచ్చాడు.

          అలా మొదటగా విష్ణు, విశాల వాళ్ళ పేరుతో సెయింట్ జార్జ్ బ్యాంక్ లో వాళ్ళ ఐడెంటిటీ తో రికార్డ్ ఓపెన్ చేసి, డబ్బు జమ చేసారు.

          ప్రక్కనే ఆనుకుని ఉన్న ‘సెంటర్ లింక్’ బోర్డ్ చూసి లోపలికి అడుగు పెట్టారు. ఆస్ట్రేలియా లోకి అడుగుపెట్టిన, అక్కడ ఉంటున్న పర్మెనెంట్ రెసిడెంట్స్, ఇంకా సీనియర్ సిటిజన్స్ అందరికీ ఈ సెంటర్ పెన్నిధి. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్స్ గానీ, ఆస్ట్రేలియాలో పిల్లలు పుట్టినపుడు వచ్చే రిలీఫ్ ఫండ్స్, జాబ్స్ కి ఆధారమైన సహాయం ఇతరత్రా అవసరాలకు ఇది నిలయం. జాబ్ సీకర్ కార్డ్ అని ఒక కార్డ్ ఇస్తారు వివరాలు నమోదు చేసుకోగానే. విశాల, విష్ణు ఇద్దరి పేర్లు అక్కడ రిజిష్టర్ చేసుకున్నారు. విశాల అక్కడ వెయిట్ చేస్తూ, సీట్ దగ్గిర ఒక న్యూస్ పేపర్ చూడగానే చేతిలోకి తీసుకుంది. ఇంతలో అక్కడకు వచ్చిన ఒక బట్టతల ఆసామీ, విశాల చేతిలో పేపర్ లాక్కుని, “దిస్ ఈస్ మై పేపర్” అని కరుకుగా అన్నాడు. ఒక్కసారిగా ఆ పరిణామా నికి విశాల అవాక్కయింది. 

          ‘ఇండియాలో మరి న్యూస్ పేపర్లు అసలు నీ, నా అనే బేధం లేకుండా చేతిలోంచి లాగేసుకుంటారు కదా, దేశం తీరు తెన్నులు, పరిసరాలు తెలుసుకుని మసలుకోవాలి’ అని మనసులో అనుకుంది.

          ఇంతలో విష్ణు వచ్చి, “రా ఇక్కడ పని అయిపోయింది. మనకు జాబ్స్ కోసం ఇన్ఫ్ర్మేషన్ కోసం ఇక్కడ బ్లాక్ టౌన్ మైగ్రేషన్ రిసోర్స్ సెంటర్ ఉంది. ఇపుడు అక్కడకు వెడదాం. అంటూ ఇద్దరూ రోడ్డు దాటుకుని అక్కడ సెంటర్ లోకి అడుగు పెట్టారు.

          అక్కడ రిసెప్షన్ లో వివరాలు చెప్పగానే, రిసెప్షనిష్ట్, “హాయ్ దిస్ ఈస్ జోయన్. లెట్ మి ఇంట్రడ్యూస్ యు టు మాగీ” అని వేరే గదిలోకి తీసుకెళ్ళి ఇద్దరినీ మాగీ కి పరిచయం చేసింది.

          మాగీ ఇద్దరివైపు చూస్తూ కూర్చోమని కుర్చీ చూపించింది. ఇద్దరి సర్టిఫికెట్స్ చూసి, ఓ యూ బోత్ ఆర్ హైలీ క్వాలిఫైడ్. యు కెన్ అసెస్ యువర్ క్వాలిఫికేషన్ టు షో దట్ దే ఆర్ ఈక్వలెంట్ టు ఆస్ట్రేలియన్ డిగ్రీ. ఆల్ సో ఐ కెన్ రికమెండ్ విశాల టు డు వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రాం ఎట్ ఎ మార్కెటింగ్ రీసెర్చు ఆర్గనైజేషన్. అదర్ ఆప్షన్ యూ కెన్ బి ఎ టీచర్. ఫర్ దట్ యు నీడ్ టు డూ ఎ కోర్స్ ఫర్ ఒన్ ఇయర్ అని సమగ్రంగా చాలా వివరాలు ఇస్తూ అరగంట సమయం వారితో గడిపింది.

          విశాల, వర్క్ ఎక్స్పీరియన్స్ వైపు మ్రొగ్గు చూపుతూ, ‘టీచర్ జాబ్ కోసం వన్ ఇయర్ కోర్స్ కన్నా, వర్క్ చేయటం బాగుంటుంది కదా!’ అని భావించింది. విష్ణు వైపు చూస్తూ, “ఇపుడే ఎం.బి.ఏ పూర్తి చేసాను కదా! ఇంక మళ్ళీ నాకు చదివే ఓపిక లేదు.” అని చెప్పింది. దానికి విష్ణు,

          “సరే నీ ఇష్టం, నిర్ణయం నీకే వదిలేస్తున్నాను.” అన్నాడు.

          ప్రక్కనే ఆ సెంటర్ ని ఆనుకుని ఉన్న కౌన్సిల్ లైబ్రరీలోకి ఇద్దరూ అడుగుపెట్టారు. స్ట్రైట్ గా ఉన్న రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి లైబ్రరీ కార్డ్ కోసం ఫాం నింపి ఇచ్చారు. లైబ్రేరి యన్ వాళ్ళ ఐడెంటిటీ చెక్ చేసుకుని, చేతిలో వాళ్ళ పేర్లతో లైబ్రరీ కార్డ్స్ పెట్టింది.

          “మీరు పది ఐటెమ్స్ దాకా తీసుకోవచ్చు. పుస్తకాలు లేదా విసిడి కాసెట్స్ తీసుకో వచ్చు. డ్యూ డేట్ అయిపోగానే ఐటెమ్స్ రిటర్న్ చేయాలి అని ఫ్లైయర్ ఇచ్చింది.

          ఇద్దరూ లైబ్రరీ షెల్ఫ్ లు చూసుకుంటూ అరగంట అటు, ఇటు తిరిగి రెండు పుస్తకాలు తీసుకున్నారు. విశాల తన సబ్జెక్ట్ కి సంబంధించి, ఇంటర్నెట్ మార్కెటింగ్ రీసెర్చ్ బుక్ తీసుకుంది. 

          లైబ్రరీలో పని ముగించుకుని, ఇద్దరూ ఆపోజిట్ లో ఉన్న మెక్ డోనాల్డ్ దగ్గరకు వెళ్ళారు. 

          విశాలా, మళ్ళీ కాస్త ఫ్యూయల్ కావాలి, మెనూ కార్డ్ తీసుకో, ఏమైనా తిందాం అనగానే, ఇద్దరూ అక్కడ ఒక టేబుల్ దగ్గర కూలబడ్డారు.

          మెనూ కార్డ్ లో మెక్ ఫ్లరీ ఐటెమ్ ఐస్క్రీమ్ విత్ బిస్కట్స్ బాగుంటుందేమో అని ఊహించి, ఆర్డర్ చేయమని విష్ణుకి ఇచ్చింది. ఇద్దరూ చల్లని హిమక్రీమి క్రొత్త రుచులని ఆస్వాదించి అక్కడనించి బయటపడ్డారు.

          మళ్ళీ వెస్ట్ ఫీల్డ్ లోకి వెళ్ళి, మొబైల్ షోరూంలోకి అడుగులేసారు. విష్ణు సీరియస్ గా షోరూంలో సేల్స్ రిప్రెజెంటివ్ తో అన్ని విషయాలు చర్చించి, తనకు అవసరాలకు తగినట్లుగా ఇద్దరికీ పేకేజ్ డీల్ లో రెండు ప్రీ పెయిడ్ మొబైల్ ఫోన్స్ తీసుకున్నాడు.

          ఇద్దరూ ఆ మొబైల్ ఫోన్ ఫీచర్స్ ఎలా వాడాలో అన్ని తెలుసుకుని ఆనందంగా బయటకు వచ్చారు.

          బయట ఇద్దరూ నవ్వుకుంటూ, చాలా పనులే చేసుకున్నాము విశాలా! మహలక్ష్మీ లా నువ్వు, నా ప్రక్కనుంటే నాకు అన్నీ దిగ్విజయంగా అలా జరిగిపోతాయ్! అన్నాడు.

          విశాల, ఆ మాటకి “మరే నేను మహాలక్ష్మిని ఐతే, మీరు విష్ణుమూర్తి కదా!”అని నవ్వింది.

          ఇద్దరూ సూపర్ మార్కెట్ లో అరటిపళ్ళు తీసుకుందామని కోల్స్ లోకి వెళ్ళారు. అక్కడ వీళ్ళ తెలుగు సంభాషణ విని, వెంటనే ఒకతను వెనుతిరిగి వీళ్ళవైపు చూసాడు.

          “హలో! నా పేరు రవి. మీరు ఎక్కడ నుంచి వచ్చారు? మేము హైద్రాబాద్ నుంచి వచ్చాము” అని నవ్వుతూ పలకరించాడు.

          “హాయ్, నా పేరు విష్ణు సాయి, నా భార్య విశాల, మేము ఇక్కడకు శనివారం వచ్చాము. వెరీ న్యూ టు దిస్ కంట్రీ!” అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు.

          “మేము ఇక్కడకి దగ్గర్లోనే ఉంటాము, మా ఇంటికి రండి, కాసేపు కబుర్లు చెప్పు కుందాము. నా కారు ఇక్కడే పార్క్ చేసాను” అని ఆప్యాయంగా పిలిచాడు రవి.

          ఊహించని ఆ కొత్త పరిచయానికి, ఇద్దరికీ ఏం చెప్పాలో తెలియలేదు. విశాలతో విష్ణు గుసగుసగా “వెడదామా?” అని అడిగాడు. దానికి విశాల “ఫర్వాలేదు వెడదాము, పరిచయాలు ఉంటే మంచిదేగా!” అంది.

          అందరూ కారులో ఐదు నిమిషాల్లో ఒక అపార్ట్మెంట్ దగ్గర కారు పార్కింగ్ లో పెట్టి లోపలికి వెళ్ళారు. రవి తన భార్య వాణిని పరిచయం చేసాడు. వాళ్ళు దుబాయ్ నించి ఆరు నెలల క్రితమే సిడ్నీ వచ్చాము అని చెప్పారు.

          లంచ్ టైం భోజనం చేయండి అని వాణి గొడవ చేసి అందరికీ భోజనం వడ్డించింది. అపుడే చేసిన బంగాళదుంప వేపుడు, కొబ్బరి పచ్చడి, చారు, అప్పడాలు అప్యాయంగా కొసరి కొసరి తినిపించింది. ఇంతలో వాళ్ళ అమ్మాయి ఏడెళ్ళ స్వప్న వచ్చి, ఆంటీ అంటూ కబుర్లు చెపుతూ విశాలను అల్లుకుపోయింది.

          “క్రొత్త ప్రదేశం కదా మాకు కూడా ఇక్కడ సెటిల్ అవ్వడానికి టై పట్టింది. నాకు తెలుగు వాళ్ళు అంటే చాలా ఇష్టం, మనం మనని సపోర్ట్ చేసుకోవాలి. చైనా వాళ్ళు ఇతర దేశస్థులు వాళ్ళ వర్గం వాళ్ళని బాగా సపోర్ట్ చేసుకుంటారు. మన వాళ్లలో కూడా ఆ ఐకమత్యం ఉండాలి. అంతే గాని ఇక్కడకు కూడా నువ్వు వచ్చావా, అన్న ద్వేషభావాన్ని విడనాడాలి. మన దేశం, మన భాష అనగానే భారతీయతత్వంతో అప్యాయంగా పలకరిం చుకోవాలి అని భావిస్తాను” అని రవి ఎమోషనల్ గా అన్నాడు.

          విశాల ఆనందంగా “మీ పరిచయం ఈ రోజు ఇలా కలగడం చాలా సంతోషంగా ఉంది రవి గారు” అంది.

          ఇద్దరూ ఇంక వెడతాము అని లేవబోతుంటే, వాణి విశాలకు బొట్టు పెట్టి, చేతిలో మిక్చర్ పొట్లం, దానిమ్మ పళ్ళు పెట్టింది.

          రవి “నేను మిమ్మల్ని నా కారులో దింపుతాను రండి” అని ఇద్దరినీ ఇంటి దగ్గర దింపుతూ “మీకు, ఏ అవసరం, సమాచారం కావాలన్నా నన్ను అడగండి” అని చెప్పి వెళ్ళిపోయాడు.

          ఇద్దరూ ఇంట్లోకి తాళం తీసుకుని లోపలికి వెళ్ళగానే, ఫోన్ మోగుతుండటంతో, ఫోన్ తీయాలా, వద్దా? ఒకవేళ గోపీ మనకోసమే ఫోన్ చేసాడా? అన్న సందిగ్థంలో విశాల ఫోన్ తీసి హలో అంది.

          అవతల నుంచి ఒక ఆడ గొంతు, “నేను గోపీ బంధువుని, ఎలా ఉన్నారు మీరు? నాకు అక్కడ ఫోన్ ప్రక్కన ఉన్న డైరెక్టరీలో ఒకరి నంబర్ కావాలి, చాలా అవసరం”
అని అడగ్గానే, మారు ఆలోచించకుండా తను సహాయం చేస్తున్నానని భావించి విశాల ఆమెకు వివరాలు ఇచ్చింది.

          ఇంతలో బాత్రూంలోంచి విష్ణు వచ్చి, ఎవరు ఫోన్ చేసారు అని విషయం తెలుసు కుని, “నువ్వు ఫోన్ ఎత్తకుండా ఉండాల్సింది, ఎవరో తెలియకుండా మనం ఎందుకు వాళ్ళ వ్యక్తిగత వివరాలు ఇవ్వడం విశాలా” అని విష్ణు అనగానే, విశాల మొహం చిన్న బుచ్చుకుంది.

          అపుడే గోపీ తాళం తీసుకుని ఇంట్లోకి వస్తాడు. ‘అతనికి ఫోన్ వచ్చిన విషయం చెప్పాలా వద్దా అని విశాల ఆలోచనలో ఉంది. గోపీ కాస్త సీరియస్ గా ఉన్నాడు, ఇపుడే వచ్చాడు కదా, తరువాత చెపుదాంలే!’ అని ప్రస్తుతానికి ఆ విషయాన్ని ప్రక్కన పెట్టింది విశాల.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.