ప్రమద

అగ్ని పుత్రి – టెస్సీ థామస్

-నీలిమ వంకాయల

          “మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గా పిలువబడే డాక్టర్ థెస్సీ థామస్ భారత దేశ ప్రజలంతా ప్రపంచం ముందు ధైర్యంతో, గర్వంగా నిలబడేటట్లు మిస్సయిల్స్ తయారు చేసిన శాస్త్రవేత్త. ఏరోస్పేస్ ఇంజనీర్ అయిన టెస్సీ భారతదేశ క్షిపణి సాంకేతికతను గణనీయంగా అభివృద్ధి చేయడంలో విశేష కృషి చేసారు. భారత రక్షణ పరిశోధన రంగం లో అద్బుత విజయాల కోసం నిరంతరం శ్రమించిన అభినవ స్ఫూర్తి ఈమె. మాతృభూమి కి విశ్వ విఖ్యాతిని ఆర్జించి పెట్టిన భారత ముద్దు బిడ్డ. రాకెట్ ప్రయోగాలతో ఆరంభించి మిస్సైల్ రంగంలోకి దూసుకుపోయిన అభినవ తేజం.

          ఏప్రిల్ 2, 1963న కేరళలోని అలప్పుజాలో జన్మించిన డా. టెస్సీ థామస్ పురుషుల ఆధిపత్య పరిశోధన రంగంలో లింగ అడ్డంకులను ఛేదిస్తూ స్ఫూర్తిదాయక వ్యక్తిగా మారారు. ఆమె తల్లి కుంజమ్మ, తండ్రి టిజె థామస్ కుమార్. నౌకాదళ అధికారి సరోజ్ కుమార్ పటేల్ ఒడిస్సా ఆమె భర్త. ఆమె కుమారుడు తేజస్ ఇంజనీరింగ్ విద్యార్థి.
కేరళలోని గ్రామీణ ప్రాంతంలో జన్మించిన ఆమె ఆకాశంలో ఎగిరే విమానాలను చూసి పసి తనం కేరింతలు కొట్టేది. ప్రత్యక్షంగా రాకెట్లను చూడటంలోనే ఇంత ఆనందంగా ఉంటే వాటి నిర్మాణంలో ఇంకెంత ఆనందంగా ఉంటుంది అనుకుంది. చాలా మంది కలలు కంటారు కానీ నిజం చేసుకోలేరు. టెస్సీ మాత్రం అలా కాకుండా ఆచరణలో అకుంఠిత దీక్ష కనపరిచింది. ఆమె చదువులో చురుకుగా ఉండేది. శాస్త్రవేత్త కావాలనే సంకల్పం తీసుకున్నప్పటి నుంచి మ్యాథమెటిక్స్, సైన్సులో కృషి చేసింది. ఆమె సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రపంచంలోకి ప్రయాణం సుందరమైన అలప్పుజాలో ప్రారంభమైంది. కేరళ లిఫ్టిలోని సెంట్ జోసెఫ్ పాఠశాలలో విద్యాభ్యాసం సాగించింది. అక్కడే కాలేజీ చదువు ముగించి తిరుచూరు ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అభ్యసించింది. ఆ తరువాత D.R.D.O గైడెడ్ మిస్సైల్ ప్రోగ్రాం లో M.E పూర్తి చేశారు. ఆ కోర్స్ కొరకు దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన పదిమందిలో ఆమె మొదటి వ్యక్తిగా నిలిచింది. క్షిపణి సాంకేతి కతలో ఆమె భవిష్యత్ ప్రయత్నాలకు పునాది వేసింది.

          1988లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లో శాస్త్రవేత్త డాక్టర్ టెస్సీ థామస్ యొక్క వృత్తిపరమైన ప్రయాణం గణనీయమైన మలుపు తిరిగింది. ఆమె మిషన్-క్రిటికల్ మిస్సైల్ సిస్టమ్స్ అభివృద్ధి పై దృష్టి సారించింది. ఎన్నో సంవత్సరాలుగా ఆమె అసాధారణమైన సాంకేతిక చతురత, నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ ర్యాంకుల ద్వారా ఎదిగింది. పురుషుల ఆధిపత్యం ఉన్న రంగంలో లింగా ధారిత సవాళ్ళను ఎదుర్కొన్నప్పటికీ, ఆమె నిరాటంకంగా ఉండి, మూస పద్ధతుల్ని సవాలు చేస్తూ తన ప్రతిభను నిరూపించింది.

          DRDOలో ఆమె చేరినప్పుడు అబ్దుల్ కలాం గారు డైరెక్టర్ గా ఉండేవారు. ఆమె విద్యార్హతలు, ప్రాజెక్టులు చూసి ఆమెను అగ్ని ప్రాజెక్ట్ కొరకు పని చేయమని చెప్పారు, మిస్సైల్ డిజైన్, స్టిమ్యులేషన్ మొదలైనటు వంటి కార్యక్రమాలు ఆమె నిర్వహించేది. ఆ తర్వాత అగ్ని సిరీస్ ప్రాజెక్టు డైరెక్టర్ గా ఆమెనే నియమించారు. అప్పటి నుంచి అగ్ని మిస్సైల్ బాధ్యతలు ఆమెనే చూసుకుంటున్నారు.

          హైదరాబాదులోని అడ్వాన్స్ సిస్టం లేబరేటరీ పరిశోధనలకు పెద్దపీట వేసింది. అది దేశ రక్షణ రంగంలో కీలక సమయం. చైనా క్షిపణుల రంగంలో మాదే పై చేయి అంటున్న కాలంలో భారత్ కు పోటీగా పాకిస్తాన్ ను బలోపేతం చేసే కుతంత్రాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో క్షిపణుల రంగంలో భారత్ ముందడుగు వేసింది. దీనికి అనుగుణంగా కలాం నేతృత్వంలో ఏర్పాటైన బృందంలో థెస్సీ పాలు పంచుకుంది. ఉపరితలం నుండి ఉపరితలానికి పంపించే మధ్య శ్రేణి క్షిపణి అగ్ని-I ప్రాజెక్టులో భాగస్వామురాలు అయ్యింది. 700 కిలోమీటర్లు ప్రయాణించి లక్ష్యాన్ని ఛేదించే ఈ క్షిపణి ప్రయోగం విజయవంతం అయ్యింది. అగ్ని రెండో దశ ప్రయోగంలో పాలుపంచుకునే అవకాశం ఆమెను వరించింది. ఈసారి నిర్దేశిత లక్ష్యం 2000 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను చేధించాల్సిన అగ్ని-ii ప్రయోగంలో రెట్టించిన ఉత్సాహంతో పాల్గొని దాని నిర్మాణంలో అసాధారణ కృషి చేసి సారథ్యం వహించింది. కీలక ప్రయోగ దశల్లో అత్యంత అసాధారణ సాంకేతిక ప్రతిభ, అత్యంత సునిశిత సామర్ధ్యాలను ప్రదర్శించి అందరి మన్ననలు అందుకుంది. శాస్త్ర నిపుణులతో చర్చలు చేస్తూ, సిబ్బందిని సమన్వయపరచడంలో అందె వేసిన చేయిగా గుర్తింపు సాధించింది. అగ్ని-ii విజయవంతం అయ్యింది.

          దేశంలోనే ఒక మహిళా శాస్త్రవేత్తకు లభించిన అరుదైన గౌరవం ఇది. గురుతర బాధ్యతలు స్వీకరించిన థెస్సీ అగ్ని-III కోసం రేయింబవళ్ళు శ్రమించారు. దాని నిర్మాణం కోసం విశేష ప్రతిభను వినియోగించారు. కౌంట్ డౌన్ మొదలయ్యింది ఉత్కంఠతతో అశేష భారత దేశం చూస్తుండగానే ఆకాశంలోకి ఎగిసింది. కానీ అగ్ని- iii సూటిగా తన లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. పాక్షిక విజయమే లభించింది. కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూసిన థెస్సీ ఆ నిరాశతో కృంగిపోలేదు.

          తన కనుల ముందు ఎగిరే త్రివర్ణ పతాకాన్ని, మంచుతో కరిగిపోయినా గంభీరంగా నిలిచే ఎవరెస్ట్ ను చూసి స్ఫూర్తిని పొంది మళ్ళీ తన ప్రయాణం కొనసాగించింది. ఆలోచ నలు కదం తొక్కాయి. సాంకేతిక వ్యూహాలు పదునెక్కాయి. కాల గమనం మరచి సిబ్బంది తో కలిసి పరిశోధనలో మళ్ళీ మునిగిపోయారు. ఏడాది గడిచింది. నవంబర్ 11, 2017 అత్యాధునిక పరిజ్ఞానంతో అగ్ని- iv సిద్ధమైంది ప్రయోగానికి. ఆమె కళ్ళల్లో అంతులేని ఆత్మవిశ్వాసం. గెలుపు తమదే అనే ఆమె ధీమా నిజమైంది. 3,000–4,000 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేధించ గలిగే అగ్ని- iv ప్రయోగం ఆనందాన్ని పంచింది.

          అఖిల భారతదేశం థెస్సీను అగ్నిపుత్రికగా గుర్తించింది. అగ్ని 5 కి ఈమె ప్రాజెక్టు డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఐదు నుంచి ఎనిమిది వేల కిలోమీటర్ల దూరంలో వెళ్ళ  గలిగే క్షిపణిని తయారు చేయటం అంత సులువు కాదు. ఈ అగ్నిపరీక్షకు ఆమె సిద్ధ పడింది. ప్రముఖ దేశాల ఖండాంతర్గత పరిజ్ఞానాన్ని కూలంకుషంగా పరిశీలించారు. దేశ రక్షణ అవసరాలు తీర్చేలా స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని నిర్మించేలా అధ్యయనం కొనసాగించారు. మెరికల్లాంటి శాస్త్రవేత్తలకు నేతృత్వం వహించి లక్ష్యం దిశగా ప్రయాణించారు. వేల డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకునేలా విడిభాగాల తయారీ అణ్వస్త్రాల ను తీసుకెళ్ళే సామర్థ్యం, రిలయబుల్ నేవిగేషన్ ఆన్ బోర్డ్ కంప్యూటర్ సిస్టంలో ఏర్పాటు తో ముందంజ వేశారు. సాంకేతిక ప్రపంచం విస్తూపోయే రీతిలో స్వల్ప కాలంలోనే అగ్ని-v ను పరీక్షకు సిద్ధం చేశారు. అగ్ని 5 లక్ష్యాన్ని చేరుకుని అఖండ భారతదేశం పులకిం చేలా తన విజయాన్ని అందించింది ప్రపంచ దేశాలన్నీ ఒకసారిగా భారత్ వైపు చూసేలా చేసింది. ఈ సాంకేతికత కలిగిన అగ్ర రాజ్యాల సరసన భారత్ చేరింది. 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో ఉన్న దీని ప్రత్యేకతలు వింటే ఎంతో గర్వంగా ఉంటుంది. ఖండాంతర క్షిపణి ఐదువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను అవలీలగా చేరుస్తుంది. సూటిగా టార్గెట్ ను చేరుకోవడంలో దానికి అదే సాటి.

          నావిగేషన్ గైడెన్స్, కంట్రోల్ సిస్టమ్స్‌లో ఆమె ఖచ్చితత్వాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది. ఇది భారతదేశ వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాలకు దోహదం చేసింది.

          అగ్ని క్షిపణి శ్రేణికి కృషితో పాటు, డా. టెస్సీ థామస్ పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ (PAD) వ్యవస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఇది టెర్మినల్ దశలో ఇన్‌కమింగ్ బాలిస్టిక్ క్షిపణులను అడ్డగించడానికి, నాశనం చేయడానికి రూపొందించబడిన యాంటీ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ. స్వదేశీ క్షిపణి వ్యవస్థల పై ఆమె చేసిన కృషి భారతదేశ రక్షణ సామర్థ్యా లను పెంపొందించడమే కాకుండా విదేశీ సాంకేతికత పై దేశం ఆధారపడటాన్ని కూడా తగ్గించింది.

          డాక్టర్ టెస్సీ థామస్ ప్రయాణం సులభంగా సాగలేదు. అడుగడుగునా ఎన్నో సవాళ్ళని ఎదుర్కొంది. ఆమె పట్టుదల, అంకితభావం, సాంకేతిక నైపుణ్యం ఈ సవాళ్ళను అధిగమించడంలో ఆమెకు సహాయపడింది. డాక్టర్ టెస్సీ థామస్ విజయం ఔత్సాహిక శాస్త్రవేత్తలకు, ముఖ్యంగా మహిళలకు, STEM రంగాలలో వృత్తిని కొనసాగించడానికి వారిని ప్రోత్సహిస్తుంది.

          డా. టెస్సీ థామస్ వారసత్వం ఆమె వ్యక్తిగత విజయాలకు మించి విస్తరించింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో మహిళా సాధికారతకు ఆమె చిహ్నంగా మారింది. లింగ వివక్షతలను ఛేదించి పురుషాధిక్య రంగాలలో మహిళలు రాణించగలరని నిరూపించారు. ఆమె విజయ గాథ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతిధ్వనిస్తుంది. ఏరోస్పేస్ ఇంజినీరింగ్, డిఫెన్స్ రీసెర్చ్‌లో కెరీర్‌ను కొనసాగించడానికి యువతను ప్రేరేపిస్తుంది.

          అంతేకాకుండా, డాక్టర్ టెస్సీ థామస్ విజయాలు క్షిపణి సాంకేతికతలో భారతదేశాన్ని బలీయమైన శక్తిగా నిలిపాయి. స్వదేశీ క్షిపణి వ్యవస్థల విజయవంతమైన అభివృద్ధి, విస్తరణ భారతదేశ రక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసింది, బాహ్య వనరుల పై ఆధారపడటాన్ని తగ్గించింది. ఆమె కృషి భారతదేశ భద్రతను మెరుగుపరచడమే కాకుండా క్షిపణి సాంకేతికతలో ప్రపంచ పురోగతికి దోహదపడింది.

          టెస్సీ థామస్ క్షిపణి సాంకేతికత రంగంలో భారతదేశాన్ని స్వావలంబనగా మార్చడంలో ఆమె చేసిన కృషికి లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అవార్డును అందుకుంది. ఆమె 2018లో ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ – ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌ మెంట్, జైపూర్ (FMS-IRM)లో డాక్టర్ థామస్ కాన్గన్ లీడర్‌షిప్ అవార్డును కూడా అందు కుంది. ఆమెకు 2022లో లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు కూడా లభించింది.

          తాను ఈ స్థితిలో ఉండటానికి కారణం భగవంతుడే అని చెబుతూ ఉంటారు థెస్సీ. ‘నేను చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలోనూ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాను, ప్రతి పనిలో విశేష కృషి చేస్తాను. తర్వాత ఫలితం ఆ భగవంతుని వదిలేస్తాను. నా విశ్వాసం ఎప్పుడూ వమ్ము కాలేదు. నిజాయితీతో పని చేస్తే ఆ దేవుడు అందరికీ విజయాన్ని ఇస్తాడు’ అని టెస్సీ చెబుతారు.

        డా. టెస్సీ థామస్ కేరళలోని ఒక చిన్న పట్టణం నుండి “మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గా నిలిచి  అసాధారణ ప్రతిభ, అంకితభావాలకి నిదర్శనమయ్యారు. క్షిపణి సాంకేతికతలో ఆమె చేసిన అద్భుతమైన పని భారతదేశాన్ని అధునాతన రక్షణ సామర్థ్యాలతో కూడిన దేశాల లీగ్‌లోకి నడిపించడమే కాకుండా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ రంగంలో లింగ మూస పద్ధతులను బద్దలు కొట్టింది. డాక్టర్ టెస్సీ థామస్ కథ శాస్త్ర విజ్ఞానం, సాంకేతిక పురోగతి సాధనలో పట్టుదల, అభిరుచి శ్రేష్ఠత ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ  రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది.

*****

Please follow and like us:

One thought on “ప్రమద – టెస్సీ థామస్”

  1. చాలా స్ఫూర్తివంతమైన మహిళ గురించి మంచి వివరాలు ఇచ్చారు. ఆమె గురించే కాక ఆమె పరిశోధన గురించి కూడా వివరంగా చెప్పారు. ధన్యవాదాలు నీలిమ గారు.
    శారద (బ్రిస్బేన్)

Leave a Reply

Your email address will not be published.