తడబడనీకు నీ అడుగులని …

(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

-అజయ్ కుమార్ పారుపల్లి

          “అమ్మా నేను వెళుతున్నా, తలుపు వేసుకో” అంటూ స్రవంతి బ్యాగ్ , కీస్ తీసుకుని బయటికి వచ్చి లిఫ్ట్ దగ్గరికి నడిచింది.

          జానకి తలుపు దగ్గరికివచ్చి కూతురు లిప్ట్ లోకి వెళ్ళేవరకు చూస్తుండి పోయింది.
లిప్ట్ లోకి నడిచి తల్లికి చేయి ఊపుతూ టాటా చెప్పింది స్రవంతి.

          లిప్ట్ కిందికి వెళ్ళగానే తలుపు మూసి బెడ్ రూమ్ లోకి వెళ్ళింది జానకి. సగం సర్దిన బీరువాలోని బట్టలను తిరిగి సర్దటం ప్రారంభించింది. మూడో అరలోని బట్టలను బయటి కి తీసి మంచం మీద వుంచింది.

          బట్టల అడుగున పాత ఆల్బమ్ కనిపించింది. అప్రయత్నంగానే ఆల్బమ్  తెరిచింది. మొదటి పేజీలోనే వుంది… తను, రఘురామ్ కలసివున్న పెళ్ళి ఫొటో. దాన్ని చూస్తునే జానకి కళ్ళల్లో నీరు ఉబికింది. మనసు పాత జ్ఞాపకాలను నెమరువేస్తూ గతంలోకి ఉరికింది.

***

          జానకి డిగ్రీ చదువుతూ ఉండగానే మంచి సంబంధం అని రఘురాంతో పెళ్ళి కుదిర్చారు జానకి తల్లీ తండ్రి.

          రఘురాం అప్పటికే బ్యాంకులో జాబ్ చేస్తున్నాడు, మంచి అందగాడు, తల్లితండ్రు లకు ఒక్కడే కొడుకు, ఏ వంకా పెట్టటానికి వీల్లేని సంబంధం.

          జానకికి డిగ్రీ పూర్తి చేయాలని కోరికగా ఉన్నా రఘురాంను చూసి పెళ్ళికి సరే అనేసింది.

          వారు కోరినంత కట్నం, పెట్టుపోతలు అన్నీ లేదనకుండా ఇచ్చి ఘనంగా పెళ్ళి చేసి కాపురానికి పంపించారు.

          రఘురాం తల్లి కోడలి మీద పెత్తనం చూపించేది. మరీ అంత గయ్యాళి కాకపోయినా అత్త చెప్పింది, కోడలు చెయ్యాలి అని భావించే సగటు అత్తగారికి ప్రతీక ఆమె. జానకి మీద అత్తగారి పెత్తనం ఎక్కువకాలం సాగలేదు.

          రఘురాంకు హైదరాబాద్ ట్రాన్ఫర్ అయి క్రొత్త దంపతులిద్దరూ పట్నంలో కాపురం పెట్టారు. రఘురాం తల్లీ తండ్రి వూళ్ళో పొలాలు చూసుకుంటూ స్వగ్రామంలోనే ఉండి పోయారు.

***

          పట్నంలో కాపురం జానకికి మరో స్వర్గంలా అనిపించింది. రఘురాం భార్యను తీసుకుని ప్రతీ ఆదివారం చూడాల్సిన ప్రదేశాలన్నీ తిప్పేవాడు. క్రొత్తగా పెళ్ళైన జంట … ముద్దు ముచ్చట్లతో మురిపెంగా సాగింది వారి కాపురం కొద్దికాలం పాటు.

          రోజులు గడుస్తున్నకొద్దీ రఘురాం బలహీనతలు బయటపడటం మొదలెట్టాయి.
రఘురాం సిగరెట్ కాల్చడం చూసి జానకి మొదట్లో అభ్యంతరం చెప్పబోయింది. రఘు రాం చిరునవ్వుతో ఇదిప్పుడు అందరూ చేసేదే అని కొట్టిపడేశాడు.

          అప్పుడప్పుడు ఫ్రెండ్స్ పార్టీలో బలవంతం చేశారని తాగి వచ్చేవాడు. ఆదివారాలు యింట్లో ఉండటం తగ్గిపోయింది. జానకి ఎక్కడకు వెళుతున్నారని అడిగితే బయట సరదాగా ఫ్రెండ్స్ తో పేకాట ఆడానని చెప్పేవాడు. జానకి వారించబోతే ‘నీకన్నా ముందు నుంచే ఇవన్నీ ఉన్నాయి నా లైఫ్ లో, నువ్వే క్రొత్తగా వచ్చావు ‘ అని కసిరేవాడు.

          ఈ పరిస్థితులలోనే జానకి గర్భవతి అయింది.  పుట్టిన పిల్లలను చూసైనా మనిషిలో మార్పు రాకపోతుందా అని జానకి ఆశపడింది.

          తల్లీ, తండ్రి వచ్చి కూతురుని డెలివరీకి ఇంటికి తీసుకువచ్చారు. రఘురాం సంగతులు తల్లీతండ్రికి చెప్పకుండా దాచింది.

          ముద్దుల మూటగట్టే అమ్మాయికి జన్మనిచ్చింది జానకి.

          రఘురాం, అతని తల్లీతండ్రులు బారసాలకు వచ్చారు. రఘురాం కోరిక మీద అమ్మాయికి స్రవంతి అని పేరుపెట్టారు. మూడు నెలలు కాగానే హైదరాబాద్ వచ్చేసింది జానకి పిల్లను తీసుకుని. తల్లి వస్తానన్నా వద్దని చెప్పేసింది.

          రఘురాం ప్రవర్తనలో పెద్దగా మార్పేమీ లేదు. జానకి చేసేదేమీ లేక పరిస్థితులతో రాజీ పడసాగింది.

***

          కాలింగ్ బెల్ మోతతో ఉలికిపడుతూ ఈ లోకంలోకి వచ్చింది జానకి. లేచి వెళ్ళి  తలుపు తీసింది. ఎదురుగా కూరగాయల సంచితో కమల నిలబడి వుంది.

          “ఏందమ్మా ! తలుపు తీయటానికి ఇంతసేపా ? నిద్ర పోయావా ?” అంటూ లోనికి నడిచింది కమల.

          “లేదే ! బీరువా సర్దుతున్నాను. “

          “నేనొచ్చే దాకా ఆగొచ్చుగా. నిన్ను ఏం పనిచేయొద్దని అక్క చెప్పిందిగా. నువ్వు సోఫాలో కూర్చొని ఏదైనా పుస్తకం చదువుకో. వంట అయ్యాక నువ్వు దగ్గరుంటే నేను సర్దుతాను బీరువా “

          “సర్లే ! ముందు వంటకానీయ్ ” అంటూ జానకి సోఫాలో కూర్చుని ప్రక్కనే వున్న పుస్తకాన్ని చేతిలోకి తీసుకొంది.

          కళ్ళు పుస్తకంలోకి చూస్తున్నా మనసు ఈసారి కమల చుట్టూ తిరగసాగింది.

          కమలకు పాతికేళ్ళు ఉంటాయి. తమ దగ్గరకు వచ్చి అప్పుడే ఐదేళ్ళు దాటి పోయాయి.

          కమల తల్లితండ్రులు కూలినాలి చేసుకొనే పేదవారు. కమల పెద్దమనిషి కాగానే తాపీ పనిచేసే అప్పారావుకు ఇచ్చి పెళ్ళిచేసారు. అప్పారావు రోజూ రాత్రి పీకల దాకా తాగొచ్చి కమలను కొడుతుండేవాడు. పుట్టింటి పేదరికం తెలుసు కనుక కమల మొగుడి ఆగడాలను భరించేది. పెళ్ళి అయి అయిదు ఏళ్ళు గడిచినా కమలకు పిల్లలు కలుగ లేదు. పెద్దాసుపత్రిలో చూయించుకుంటే గర్భసంచిలో లోపం కారణంగా పిల్లలు పుట్టరు అని డాక్టర్లు చెప్పారు.

          అంతే …అప్పారావు కమలను ఒగ్గేసి మారుమనువు చేసుకున్నాడు. తల్లితండ్రు లకు కూడా కమల భారమయింది. వయసులో ఉన్న పిల్ల ఎక్కడైనా పనికిపోతే ముందుగా ఆమె పై కోరికతో చేయి పట్టుకునే మగవారే ఎదురయ్యారు ఆమెకు. అలాంటి బతుకు బతకటం ఇష్టంలేక హుస్సేన్ సాగర్ లో దూకి చావబోయింది.

          ఆ సమయానికి అక్కడే ఉన్న స్రవంతి ఆమెను కాపాడి ఇంటికి తీసుకువచ్చింది. తల్లీకూతురు ఆమె సంగతులన్నీ అడిగి తెలుసుకున్నారు. జీవితమున్నది జీవించటా నికే గాని చావటానికి కాదని చెప్పారు. గౌరవంగా వుండేచోట పనిచేసుకుని బతుకుతా కానీ మగ పురుగులు నన్ను అలా ఉండనీయటం లేదమ్మా అని వాపోయింది కమల.

          తనకిష్టమయితే తమ ఇంట్లోనే పనిచేస్తూ ఉండమన్నారు. కమల సంతోషంగా సరేనని అన్నది. ఇంట్లోనే అన్ని వసతులు సమకూర్చి నెలకింతని కొంత సొమ్మును కమల పేరు మీద బ్యాంకులో జమచేస్తూ వస్తున్నది స్రవంతి.

          “అమ్మా వంటయ్యింది. వడ్డించమంటారా?” కమల పిలుపుతో ఆలోచనల నుండి బయటపడింది జానకి.

          “వడ్డించు! వస్తున్నా!”అంటూ సోఫాలో నుండి లేచింది జానకి.

***

          స్రవంతి ఆఫీస్ నుండి బయటకి వచ్చి కారులో కూర్చొని స్టార్ట్ చేసి దగ్గరలో వున్న సూపర్ మార్కెట్ దగ్గర ఆపింది.

          సూపర్ మార్కెట్ లో సరుకులు తీసుకుంటుండగా ” స్రవంతీ ” అన్న పిలుపు వినపడి వెనక్కు తిరిగి చూసింది.

          అంబిక నవ్వుతూ కనిపించింది.

          ” అంబికా నువ్వా ? ఎంత కాలమైంది నిన్ను చూసి ! బాగున్నవా ?” దగ్గరికెళ్ళి చేయి పట్టుకొని పలుకరించింది ఆనందంగా.

          ఇద్దరు స్నేహితురాళ్ళు చాలాకాలం తరువాత కనపడటంతో ఆనందం వారి కళ్ళలో కనిపిస్తున్నది.

          పెదవుల పై చిరుదరహాసాలు వికసిస్తున్నాయి.

          “ముందు సరకులు తీసుకొనే పని కానీయ్! తర్వాత ఎక్కడైనా కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చు ” అంబిక అనగానే స్రవంతి కావలసినవి తీసుకుని కౌంటర్ లో అమౌంట్ పే చేసింది.

          ఇద్దరూ ప్రక్కనే వున్న ఐస్క్రీమ్ పార్లర్ లోపలికి వెళ్ళి రెండు బట్టర్ స్కాచ్ ఆర్డర్ చేసి ఒక మూలగా కూర్చొన్నారు.

          ” ఇప్పుడు చెప్పు సంగతులన్నీ. ఎన్నో నెల?” స్రవంతి అడిగింది ఎత్తుగా ఉన్న అంబిక పొట్ట వైపు చూస్తూ.

          6 వేళ్ళు చూపించింది అంబిక.

          “డిగ్రీ తరువాత మళ్ళీ ఇప్పుడు కనపడటమే. నీ దగ్గర నుండి లెటర్స్ కానీ ఫోన్ లు కానీ లేవు.

          పెళ్ళెప్పుడు అయింది?

          మీ వారు ఏం చేస్తున్నారు ?

          నువ్వు ఏమైనా జాబ్ చేస్తున్నావా ?

          ఈ వూరెప్పుడు వచ్చావు ?”

          ” ప్రశ్నలన్నీ ఐ పోయాయా ? ఇంకా ఏమైనా మిగిలాయా ” నవ్వుతూ చూసింది అంబిక. .

          “చెప్పాలంటే చాలా వుంది. వినే ఓపిక నీకుంటే …” గట్టిగా ఊపిరి పీల్చుకొని చెప్పటం కొనసాగించింది అంబిక.

          “డిగ్రీ కాగానే పెళ్ళి చేసుకోమని ఆన్నారు అమ్మానాన్న. నీకు తెలుసుగా నేను కాలేజీలో నాటకాలు, డాన్స్ ల్లో పొల్గొనేదాన్నని. నటనంటే నాకు చిన్నప్పటి నుండి వ్యామోహం. ఒకరకమైన పిచ్చి! సినిమాలలో గానీ, టీవీ రంగంలో కానీ నన్ను నేను నిరూపించుకోవాలనే కోరికతో అమ్మనాన్నలకు ఇష్టం లేకపోయినా పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను. అక్కడ పరిచయం అయ్యాడు అవినాష్ .”

          బేరర్ ఐస్ క్రీం కప్పులు తీసుకురావడంతో చెప్పటం ఆపింది అంబిక.

          స్పూనుతో ఐస్ క్రీం తీసుకుని తింటూ …

          ” నీ హీరోగారి పేరు అవినాష్. ఊ ! చెప్పు చెప్పూ ” తొందరపెట్టింది స్రవంతి.

          ” మా బ్యాచ్ లో నేను, అవినాష్ ఇద్దరమే తెలుగువాళ్ళం. మిగిలిన వారిలో ఒకరి ద్దరు తమిళియన్స్ ,ఎక్కువుగా నార్త్ ఇండియన్స్ వున్నారు. 

          సహజంగానే మా ఇద్దరి మధ్య పలకరింపులు ,స్నేహం మొదలయ్యాయి. రోజులు గడిచే కొద్దీ ఒకరి మీద ఒకరికి ఆకర్షణ, ప్రేమ పెరగసాగింది. ఒకరిని విడిచి ఒకరం ఉండలేని స్థితికి చేరుకున్నాం. ఇద్దరికీ ఆప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు. నటనా రంగంలో మేము రాణించాకే పెళ్ళి అని అనుకున్నాం. పెళ్ళికి మా పెద్దలు ఒప్పుకోరు.
మా ఇద్దరి కులాలు వేరు. కానీ తనువు , మనసు శరీరాకర్షణ వైపు మొగ్గు చూపాయి. ఇద్దరం పరస్పర అంగీకారంతో సహజీవనం దిశగా ఆడుగులు వేశాం. పిల్లలు వద్దను కొన్నాం. ఒకరికి ఒకరు గౌరవించుకోవాలని, ఎవరి ఇండివిడ్యువాలిటీ వారికె ఉండాలని, ఒకరి పై ఒకరు పెత్తనం చెయ్యటం ఉండకూడదని ఎన్నో, ఎన్నెన్నో అనుకున్నాం.  బాసలు చేసుకున్నాం.

          సంగతి తెలిసి అమ్మానాన్న వచ్చారు. ఏడ్చారు, బతిమిలాడారు. అందరికి తెలియక ముందే ఇంటికి వచ్చేయమన్నారు. నా ఆశలు, ఆకాంక్షలు, వయసు ఉద్రేకాలు వారి మాటలను పెడచెవిన పెట్టాయి. అమ్మానాన్న ఇక యింటికి రావద్దని నేను ఇక్కడ చనిపోయానని అందరికీ చెపుతామని మిగిలిన బిడ్డల భవిష్యత్ ముఖ్యమని ఏడుస్తూ వెళ్లిపోయారు” చెపుతున్న అంబిక కళ్ళలో తడి కనిపించింది.

          స్రవంతి అంబిక వైపు బాధగా చూసింది.

          కర్చీఫ్ తో కళ్ళు తుడుచుకొని చెప్పసాగింది అంబిక…

          ” అదంతా గడిచిపోయిన గతం. అమ్మానాన్న వెళ్ళిపోయిన తరువాత కొద్దిగా బాధ అనిపించింది. అవినాష్ సాహచర్యం ఆ బాధను మరిపింపచేసింది. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పూర్తయింది. ఇద్దరం హైదరాబాద్ వచ్చి సినీ రంగం, టీవీ రంగంలో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాం.

          మా టీవి, ఈ టీవి సీరియల్స్ లో నటించే చాన్స్ వచ్చింది నాకు. అవినాష్ సినీ రంగంలో ఛాన్స్ కోసం విశ్వ ప్రయత్నాలు చేయసాగాడు.

          నేను సినిమాల కోసం అని చూడకుండా టీవి సీరియల్స్ లో బిజీ అయిపోయాను.
పగలంతా షూటింగుల హడావుడి, ఒక్కోసారి రాత్రి కూడా షూటింగులు ఉండేవి. ఆ సమయంలో అవినాష్ లో వచ్చిన మార్పును గమనించలేకపోయాను.

          సినిమాలో వేషం ఇప్పిస్తానన్న ఒక వర్ధమాన తారకు దగ్గరయ్యాడు. నాకు విషయం మొత్తం తెలిసేసరికి అవినాష్ నా చేయి దాటిపోయాడు. అప్పుడే నాకు తెలిసింది మరో సంగతి, నేను గర్భం దాల్చానని …ఇద్దరం సహజీవనం చేసేటప్పుడే అనుకున్నాం పిల్లలు అప్పుడే వద్దని. కుటుంబ నియంత్రణ పద్ధతులు ఖచ్చితంగా పాటించేవాళ్ళం.
ఎలా జరిగిందో , ఎప్పుడు జరిగిందో తెలియదు. మేము వాడే సాధనాలు మరచి మేము కలయికలో పాల్గొన్నామేమో తెలియదు. షూటింగ్స్ బిజీలో నా నెలసరిని  గమనించ లేదు. రెండు నెలల తర్వాత అనుమానం వచ్చి డాక్టర్ దగ్గరకి వెళితే తెలిసింది నేను అమ్మను అవుతున్నానని. అవినాష్ ఆ విషయం తెలిసి చాలా గొడవ చేసాడు. అబార్షన్ చేయించుకోమన్నాడు.

          ‘మనం కుటుంబ నియంత్రణ సాధనాలు ఖచ్చితంగా వాడుతున్నాం. అసలు ఆ కడుపు నా వల్ల వచ్చి ఉండదు ‘ అని నింద మోపాడు.

          మాములుగా అయితే అబార్షన్ కు ఒప్పుకునేదాన్ని. ఎప్పుడైతే నా మీద నింద వేశాడో అప్పుడే అవినాష్ అంటే విరక్తి పుట్టింది. నేను అబార్షన్ కు ఒప్పుకోలేదు. అప్పటికే అవినాష్ నన్ను ఎలా వదిలించుకోవాలని చూస్తున్నాడేమో ఈ కారణం సాకుగా చూపి నన్ను దూరం పెట్టేసాడు. నేను అతన్ని ప్రాధేయపడలేదు. ఒంటరిగా బతకాలని అనుకున్నాను. బతుకుతున్నాను. తెలిసినవారు, టీవి సహ నటులు అబార్షన్ చేయించు కోమన్నారు.

          నా రక్తంలో రక్తం నా కణంలో కణం అయిన ప్రాణిని చంపలేక పోయాను. అమ్మ తనం అప్పుడే నాలో ఊపిరి పోసుకుంది. ఒంటరిగా పిల్లలను పెంచటం సాధ్యం కాదని ఎంతో మంది పిరికితనం నూరిపోశారు. నేనెవ్వరి మాటా వినలేదు. ఒంటరిగానే ఈ సమాజాన్ని ఎదుర్కోదలిచాను. నేను గమనించింది ఒక్కటే. మనం తలవంచితే  ఈ సమాజం మన తలను మరింత క్రిందకు వంచుతుంది. ఒక్కసారి తల పైకెగరేసి చూస్తే ఈ లోకం మనలను పట్టించుకోదు.

          అమ్మనాన్నల దగ్గరికి వెళ్ళలేను.

          అవినాష్ ది అవకాశవాదం. ప్రేమని భ్రమపడ్డాను. ఉన్నత భావాల మనిషని పొంగి పోయాను. అతను అచ్చమైన మగవాడిలాగే ప్రవర్తించాడు. ఇదొక గుణపాఠం నాకు! కేవలం సెక్స్ కోసమే అతను నా చెంత చేరాడు. అతని మాయ మాటల ముసుగులో నేను పడిపోయాను. ఇన్నాళ్ళ సావాసంలో అతని నైజం కనిపెట్టలేకపోయాను. అతను చెప్పిన వన్నీ అబద్దాలేనని తరువాత తెలిసింది. అతనికి చిన్నతనంలోనే పెళ్ళి అయింది.  భార్య చదువురాని మొద్దని వదిలేసి నాతో పెళ్ళి కాలేదని అబద్దం చెప్పాడు.  మగవాడు మోసం చేయటానికే చూస్తాడు, మన జాగ్రత్తలోనే మనం ఉండాలి. మొత్తానికి మగవాని చేతిలో మోసపోయిన మగువను. 

          నన్ను చూస్తే నీకు అసహ్యం వేస్తుందా?” చెప్పటం ముగిస్తూ అడిగింది అంబిక .

          స్రవంతి చప్పున అంబిక చేతిని తన చేతిలోకి తీసుకుంటూ

          “అదేం లేదు అంబికా …మగవారి ఆగడాలకు, దుర్మార్గాలకు నిత్యం ఎంతో మంది బలవుతూనే ఉన్నారు. దీనికి చదుకున్నవారు, చదువులేనివారు, పేదవారు, డబ్బున్న వాళ్ళు అని తేడాలేదు. మోసం చేసేది మగవాడు, మోసపోయేది ఆడది … అంతే … మనం స్కూల్స్, కాలేజీలలో చదివిన పాఠాలు ఎందుకు పనికిరావు. జీవితమే ఒక పాఠశాల. ఇది నేర్పేదే అచ్చమైన పాఠాలు. ఎదురుదెబ్బలు తగిలి నేర్చుకునేదే గుణ పాఠాలు. అదిసరే ఇంతకూ నువ్వు ఉండేది ఎక్కడ ?” అడిగింది .

          ” ప్రస్తుతానికి వర్కింగ్ విమెన్ హాస్టల్ అమీర్ పేట.”

          “అయితే ఈ రోజు నువ్వు నాతో మా ఇంటికి రా! అమ్మ, నేను, కమల ఉంటాం యింట్లో మోహిదీపట్నంలో త్రీ బెడ్ రూం అపార్టుమెంట్. హాస్టల్ కి ఫొన్ చేసి చెప్పు చుట్టాలింటికి వెళుతున్నానని. రాత్రి నీకు ఎన్నో సంగతులు చెప్పాలి. మనసు విప్పి మాట్లాడుకుందాం ” అంటూ అంబిక చేయి పట్టుకొని లేచి బేరర్ కు డబ్బులిచ్చి
బయటకి నడిచింది స్రవంతి.

          అంబిక ఇప్పుడు కాదులే మరోసారి వస్తానన్న స్రవంతి వినలేదు. ఒకరకంగా బలవంతం చేసి కారులో ఇంటికి తీసుకుని వెళ్ళింది.

***

          ” అమ్మా , డిగ్రీలో నా క్లాస్ మెట్ అంబిక. మా అమ్మ జానకి , ఇది నా చెల్లెలు కమల.” ఇంటికి వస్తూనే పరస్పర పరిచయాలు చేసింది స్రవంతి.

          “కమలా! ఇది ఈ రోజు ఇక్కడే ఉంటుంది. నీ పాకశాస్త్ర నైపుణ్యం మొత్తం చూపించు ఇయ్యాల ” కమలతో అని..


          ” అమ్మా మేము కాస్త ఫ్రెష్ అప్ అయి వస్తాము. ఈ లోగా కాస్త కాఫీ కలపండి ” అంటూ అంబికను తీసుకుని లోపలికి నడించింది.

          కాఫీ తాగుతూ అంబిక విషయాలను టూకీగా చెప్పింది అమ్మతో. 

          “కథలు వేరైనా వ్యధలు ఒక్కటే ” నిట్టూర్చింది జానకి.

          భోజనాలు అయ్యాక ” అమ్మా మీరు పడుకోండి. మేము కాసేపు కబుర్లు చెప్పుకుం టాం ” అని సోఫాలో సెటిలయ్యారు స్నేహితురాళ్ళిద్దరు.

          ” స్రవంతీ, మరి మీ నాన్నగారు …..” అంటూ ఆర్దోక్తిలో ఆగింది అంబిక.

          స్రవంతి నవ్వుతూ

          ” ఇంకా అడగలేదేమిటా అనుకుంటున్నాను. నువ్వు అడగకపోయినా చెప్పాలనే నిన్ను ఇక్కడకు తీసుకొచ్చింది. ఇందాక అమ్మ మాట వినలేదా ?’ కథలే వేరు …వ్యధలు ఒక్కటే ‘ అని అన్నది. నువ్వూ ,అమ్మా, కమల ,నేనూ అందరం ఏదో ఒకరకంగా గాయపడ్డ వాళ్ళమే. గాయాలంటే శారీరకంగా కాదు.  మానసికంగా… …ఒక్కొక్కరి జీవితం వేదనా భరిత చరిత్రలే …కవులు రాయని కావ్యాలే ..ముందుగా మా అమ్మ గురించి చెపుతాను విను. “

          అంటూ స్రవంతి చెప్పటం ప్రారంభించింది.

          ” అమ్మమ్మ , తాతయ్యలు మంచి ఆస్తిపరులు. అమ్మ ఒక్కతే సంతానం. మంచి అందగాడు, బ్యాంకు ఉద్యోగి అని నాన్నతో పెళ్ళి జరిపించారు. నేను పుట్టాక నాకు పది సంవత్సరాల దాకా అమ్మా నాన్నా కలిసే ఉన్నారు. నేను ఆరవ తరగతి చదువుతుండగా అమ్మకు పెద్ద జబ్బు చేసింది. ఆ సంగతులన్నీ పెద్దయ్యాక అమ్మమ్మ చెపితే తెలిసాయి.

          అమ్మకు కుడివైపు రొమ్ములో కాన్సర్ వచ్చింది. డాక్టర్లు పరీక్షలు చేసి కుడివైపు రొమ్మును సర్జరీ ద్వారా తొలగించాలని చెప్పారు. లేకపోతే కాన్సర్ కణాలు యితర భాగాలకు కూడా విస్తరిస్తాయి అనిచెప్పారు. సర్జరీ జరిగాక కొంత కాలం పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలని అవసరమైతే కీమోథెరపీ కూడా చేయవలసి వస్తుందని చెప్పారు.

          కూతురు ప్రాణాలతో వుంటే చాలని అమ్మమ్మ తాతయ్యలు అమ్మను మద్రాస్ తీసు కెళ్ళి హాస్పిటల్ లో ఉంచారు. నన్ను ఒక బోర్డింగ్ స్కూల్ లో జాయిన్ చేశారు. అమ్మ ఆసుపత్రిలో ఉన్నంత కాలం నాన్న అసలు అటు తొంగిచూడలేదట. ఆపరేషన్ చేసి కుడివైపు రొమ్మును తొలగించారు. మందుల ప్రభావం వల్ల అమ్మ జుట్టు అంతా ఊడిపో యిందట.

          మూడు, నాలుగు నెలల తర్వాత అమ్మ ఆసుపత్రి నుండి వచ్చింది. అమ్మ ఆకారం పూర్తిగా మారిపోయింది. బలమైన ఆహారంతో అమ్మ మామూలుగా అవుతుందని చెప్పార ట డాక్టర్లు. ఇంటికి వచ్చిన అమ్మను చూసి నాన్న కనీసం ఎలా ఉన్నావని కూడా అడగ లేదట. కొంతకాలం అమ్మ అమ్మమ్మ దగ్గరే వుంది. పాలు ,పెరుగు బలవర్ధకమైన ఆహారం తో అమ్మ ఆరోగ్యం మెరుగుపడింది.

          ఇంతలోనే నాన్న పిడుగులాంటి మాట చెప్పాడు. అమ్మకు విడాకులు ఇస్తానని. అమ్మ, అమ్మమ్మ, తాతయ్య అందరూ కలసి నాన్నను కూర్చోబెట్టి నచ్చచెప్పబోయారు.
కానీ నాన్న వినలేదు. రొమ్ము లేని ఆడదాన్తో కాపురం చేయలేడట. అమ్మను అలా చూస్తే కోరిక కలగటం లేదట. అమ్మతో సెక్స్ చెయ్యాలని అనిపించటం లేదట .’నేను  కోరిక లను వదులుకొని సన్యాసిలా బతకలేను. నాకు రోజూ సెక్స్ కావాలి .’ నిస్సిగ్గుగా నాన్న చెపుతున్న మాటలకు నివ్వెరపోయారు.

          నాన్న తల్లీతండ్రీ అతనికే వత్తాసు పలికారు. ఆ మాటలకు అమ్మ మనసు ముక్కలై పోయింది. నన్ను తన దగ్గరే వుంచుకోటానికి ఒప్పుకుంటే విడాకులు యిస్తానన్నది అమ్మ. బంధాలు, భాద్యతలు భరించలేని నాన్నకు అంతకంటే కావల్సింది ఏముంది? అమ్మమ్మ, తాతయ్యలు చేసేదేమి లేక అమ్మకు మద్దతుగా నిలిచారు.

          సంవత్సరం తరువాత మ్యూచువల్ సమ్మతి ద్వారా విడాకులు వచ్చాయి. అమ్మకు ఆర్థికంగా ఏ లోటు లేదు.

          ఈ గొడవలకు నేను బలికాకూడదని దూరంగా హాస్టల్స్ లో ఉంచి చదివించారు నన్ను. డిగ్రీ వరంగల్ లో చేస్తున్నప్పుడే నీ పరిచయం జరిగింది. పీజీ చేస్తున్నప్పుడు అమ్మమ్మ , తాతయ్య సంవత్సర కాలంలోనే ఒకరొకరు కాలం చేశారు. తరువాత అమ్మను హైదరాబాద్ తీసుకు వచ్చాను. ఈ అపార్ట్ మెంటు కొని ఇద్దరం ఉంటున్నాము. పీజీ తరువాత MBA చేశాను. ప్రస్తుతం ఒక కంపెనీలో డెవలప్ మెంట్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను.”

          స్రవంతి లేచి వెళ్ళి ఫ్రిడ్జ్ లో నుండి వాటర్ బాటిల్ తెచ్చింది .కొద్దిగా నీళ్ళు తాగి కొనసాగించింది.

          ” తరువాత నాన్న మాకెప్పుడు తటస్థ పడలేదు. నా జ్ఞాపకాలలో కూడా నాన్న ముచ్చట్లు లేవు. అమ్మ కూడా నాన్న గురించి పెద్దగా బాధ పడలేదు. అమ్మ బెంగల్లా నా పెళ్ళి గురించే.”

          “మరి, నీవింకా పెళ్ళెందుకు చేసుకోలేదు ” ఆసక్తిగా అడిగింది అంబిక .

          ” అదో పెద్దకథ …చాలా పొద్దుపోయింది. ఇంకా నిద్రపోదాం. రేపు చెపుతా ఆ సంగతులు ” అంటూ సోఫాలో నుండి లేచింది స్రవంతి.

***

          స్రవంతి మంచం పై పడుకున్నది గానీ నిద్దుర దూరం అయింది. మనసంతా ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ్!

          ఇందాక పెళ్ళి ఎందుకు చేసుకోలేదు అని అంబిక అడిగిన ప్రశ్న గతంలోకి దారి తీసింది.

          జాబ్ లో చేరిన క్రొత్తలో ఒక సంబంధం వచ్చింది మద్యవర్తుల ద్వారా. తల్లీ కూతురు గురించి మధ్యవర్తి అన్ని విషయాలు ఆ సంబంధం వారికి వివరంగా చెప్పాడు.
అన్నీ విని ఓకే చెప్పిన సంబంధం.

          పెళ్ళి కొడుకు సాఫ్టు వేర్ జాబ్ చేస్తున్నాడు. డిగ్రీ చదువుతున్న చెల్లెలు వుంది.
తండ్రి మెడికల్ డిపార్ట్ మెంటులో జాబ్. తల్లి ప్రైవేటు కాలేజ్ లో లెక్చరర్ గా చేస్తుంది.
అబ్బాయి రాజశేఖర్ మంచి అందగాడు, ఆరడుగుల ఎత్తు. చూడటానికి సినిమా హీరోలా ఉంటాడు. స్రవంతిని బయట ఎక్కడో చూసి ఇష్టపడి వివరాలు తెలుసుకున్నాడట. అమ్మనాన్నలను ఒప్పించి మధ్యవర్తి ద్వారా కబురు పంపించారు.

          పెళ్ళిచూపులు జరిగాయి. ఇరువైపులా వాళ్ళు ఓకే చెప్పేసుకున్నారు. నెల రోజుల్లో మంచిరోజు చూసి తాంబూలాలు పుచ్చుకున్నారు. స్రవంతి పెళ్ళి రిజిస్టర్ ఆఫీస్ లో చేసుకుందామని అన్నది. కానీ దానికి ఎవరూ ఒప్పుకోలేదు. తల్లి కూడా పీటల పెళ్ళి  అయితేనే తనకు సంతోషం అని అన్నది.

          స్రవంతి సరే అనక తప్పలేదు.

          రెండు నెలల్లో మంచి ముహూర్తం కుదిరింది.

          స్రవంతి, రాజశేఖర్ ల మధ్య చనువు పెరిగింది. సెల్ ముచ్చట్లు, కుదిరితే కప్పు కాఫీలు, సినిమాలు, షికార్లు సాగిపోతున్నాయి ఇద్దరి మధ్య.

          కానీ రాజశేఖర్ ఏనాడు హద్దులు మీరలేదు. స్రవంతితో మర్యాదగా, సంస్కార పూరితంగానే మెలిగేవాడు. 

          అప్పటికే స్రవంతి కొన్ని మహిళా ఆర్గనైజేషన్స్ లో వాలంటరీగా పనిచేస్తుండేది. మహిళల జాగృతి కొరకు పత్రికలలో వ్యాసాలు రాస్తుండేది. స్కూల్స్ ,కాలేజీ వాళ్ళు ఆహ్వానిస్తే వెళ్ళి మహిళా చైతన్యం మీద ఉపన్యాసాలు ఇచ్చేది. రెండు సార్లు స్రవంతి ఉపన్యాసాలను విన్న రాజశేఖర్ చాలాబాగా చెప్పావని ప్రశంసించాడు.

          ఆ రోజు సిటీకి కొద్దిదూరంలో వున్న KGBV స్కూల్ వార్షికోత్సవం. స్రవంతిని గెస్ట్ గా పిలిచారు. రాజశేఖర్ కు ఫోన్ చేసింది. తనకు వేరే పని వుంది రాలేను అన్నాడు. సాయంత్రం తల్లికి చెప్పి బయలుదేరింది.

          కార్యక్రమం సజావుగా జరిగింది. వచ్చిన అతిధుల అందరిలోనూ స్రవంతి బాగా మాట్లాడిందని స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్లు మెచ్చుకున్నారు. అప్పటికే బాగా లేట్ అయింది. స్రవంతి అందరి దగ్గర వీడ్కోలు తీసుకుని కార్ స్టార్టు చేసి బయలుదేరింది.

          పది కిలోమీటర్లు వరకు ప్రయాణం బాగానే సాగింది. ఒక్కసారిగా కారు కుదుపులకు లోనయి ఆగిపోయింది. స్రవంతి ఎంత ప్రయత్నించినా కారు స్టార్టు కాలేదు.

          స్రవంతి రాజశేఖర్ కు ఫోన్ చేసి విషయం చెప్పి లొకేషన్ షేర్ చేసింది. రాజశేఖర్ వెంటనే బయలు దేరుతున్నానని, జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. అమ్మకు కూడా ఫోన్ చేసి కంగారు పడవద్దని చెప్పింది. రాజశేఖర్ వస్తాడని చెప్పింది. కారు అద్దాలు కొద్దిగా క్రిందకు దించి లోపలికి వస్తున్న చల్లగాలిని ఆస్వాదించసాగింది.

          ఇంతలో దూరం నుండి ‘అమ్మా ‘ అన్న ఆర్తనాదం వినిపించింది. స్రవంతి ఒక్క సారిగ ఉలిక్కిపడి ఆ కేక వినిపించిన వైపు చూసింది. 

          చిక్కటి చీకటిలో ఏమీ కనిపించలేదు. స్రవంతి కారు దిగి డోర్ లాక్ చేసి ఆ కేక వినపడిన దిశగా నడిచింది. నడుస్తూనే ఎందుకైనా మంచిదని తెలిసిన షీ – టీమ్ కు లొకేషన్ షేర్ చేసింది. ఫోన్ డైల్ చేసి విషయం చెప్పింది చిన్నగా.

          కొద్ది దూరంలో తుప్పలు కనిపించి అటు నడిచింది. అక్కడ దృశ్యం చూడగానే స్రవంతిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఇద్దరు మగవాళ్ళు పది, పన్నెండు సంవత్స రాల చిన్నపిల్లను పట్టుకొని అత్యాచారం చేయబోతున్నారు.

          “ఏయ్, ఆ అమ్మాయిని వదలండి ” అంటూ అరిచింది. 

          వాళ్ళు స్రవంతిని చూసి వెకిలిగా నవ్వుతూ “కసికాయను కొరికితే ఏం రుచిరా ? నిండారిన పొంకాలతో కైపెక్కించే ఈ సుందరే మన విందు ఈ రోజు” అంటూ స్రవంతి చేయి పట్టుకోబోయాడు ఒకడు.

          స్రవంతి ప్రక్కకు తప్పుకొని వాడి మెడ మీద ఒక్క చరుపు చరిచింది. స్రవంతికి మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం వుంది. ఆ ఇద్దరూ బలంగా ఉన్నా తాగివున్నారు, తూలి పోతున్నారు. రెండు, మూడు నిమిషాల్లోనే వారిద్దరినీ మట్టికరిపించింది.

          అప్పటికే స్పృహ తప్పిన ఆ అమ్మాయిని చేరి బుగ్గలు తట్టి లేపింది. ఆ అమ్మాయి లేచి చుట్టూ చూసి భయంతో ఏడ్చింది. స్రవంతి భయం లేదని ధైర్యం చెపుతూ కారు దగ్గరకి తీసుకు వచ్చింది.

          రెండు నిమిషాల వ్యవధిలోనే రాజశేఖర్, షీ -టీమ్ అక్కడకు వచ్చారు. జుట్టు చెదిరి, మట్టికొట్టుకొని చీరంతా నలిగి ఉన్న స్రవంతిని ఆదుర్దాగా చూశాడు రాజశేఖర్.
స్రవంతి జరిగినదంతా చెప్పింది.

          ఇద్దరు రౌడీలను స్టేషనుకు తీసుకువచ్చారు. స్రవంతిని కూడా స్టేషన్ కు వచ్చి రిపోర్టు ఇయ్యమన్నారు.

          ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ కనుక్కొని పోలీస్ సాయంతో ఇంటికి పంపించారు. అన్నీ పూర్తి చేసుకుని ఇంటికి చేరుకునేసరికి అర్ధరాత్రి దాటిపోయింది.

***

          రెండవ రోజు ఆ విషయం పేపర్ ల్లో వచ్చింది. అందరు స్రవంతి సాహసాన్ని మెచ్చుకొన్నారు.

          ఆ రోజు మధ్యాహ్నం రాజశేఖర్ స్రవంతి ఆఫీస్ కు వచ్చాడు. మనిషి కొద్దిగా దిగులుగా ఉన్నాడు.  స్రవంతి యెదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమని అన్నది. రాజశేఖర్ కూర్చోలేదు.

          ” స్రవంతీ హాస్పిటల్ దాకా వెళ్ళి వద్దాం. పర్మిషన్ తీసుకో ” అన్నాడు.

          ” ఎందుకు ? నాకేం దెబ్బలు తగలలేదు. కొద్దిగా అక్కడక్కడా చర్మం గీరుకు పోయింది. అంతే “

          “అదికాదు… మాకు తెలిసిన లేడీ డాక్టర్ దగ్గరకు “

          ఏమీ అర్థం కాలేదు స్రవంతికి. ఆశ్చర్యంగా చూస్తూ ” దేనికి ?” అని ప్రశ్నించింది.

          రాజశేఖర్ కొద్ది క్షణాలు యేమి మాట్లాడలేదు.

          కొద్దిగా వూపిరి పీల్చుకుంటూ ” నాకు ఇష్టం లేదు గానీ ,అమ్మ చెప్పింది … డాక్టర్ దగ్గరకి నిన్ను తీసుకెళ్ళమని ..” నసుగుతూ అంటున్నాడు.

          స్రవంతికి మనసులో ఏదో అనుమానం మొదలైంది. ముక్కు పుటాలు అదురుతుం డగా స్వరం పెంచి గట్టిగా అడిగింది “ఎందుకు ?”

          కుర్చీలో నుంచి లేచింది. సూటిగా రాజశేఖర్ కళ్ళలోకి చూసింది స్రవంతి.

          రాజశేఖర్ తత్తరపాటుతో ఆమెవైపు చూడకుండా ఎటోచూస్తూ

          ” అదే …అదే..వర్జిన్ టెస్ట్ ..”నసిగాడు.

          అంతే …..

          స్రవంతి కుడి చేయి రాజశేఖర్ చెంపను బలంగా తాకింది.

          ఒక్కసారిగా వినవచ్చిన టప్ మన్న శబ్దానికి అందరూ ఉలిక్కి పడి స్రవంతి వైపు చూశారు.

          నిప్పులుకక్కే కళ్ళతో చూస్తూ…

          ” యూ రాస్కెల్ …గెటౌట్ ఫ్రమ్ హియర్… అసలు ఎవరికి వచ్చింది ఆ ఆలోచన ..నీ అమ్మకా? నీకా ? అసలు ..అసలు నువ్వు వర్జిన్ వేనా ? అసలు ఎందుకు వస్తాయి మీ కిలాంటి పాడు ఆలోచనలు. మీ మనసులు కుళ్ళి కంపు కొడుతున్నాయా? ఆ రోజు జరిగిన దంతా నీకు చెప్పాను. ఆ రోజు ఏదైనా జరగరానిది జరిగితే దాచి పెట్టి నిన్ను మభ్య పెట్టాల్సిన అవసరం నాకు లేదు. నిజాన్ని నిర్భయంగా చెప్పే గుండె ధైర్యం నాది.  చీకటి రాత్రి …ఇద్దరు మగవాళ్ళు ..ఆడది ..ఏదో జరిగిందన్న ఊహ ..ఇలాగే జరుగు తుందన్న మీ చెడు తలపులు …ఇంతకు మించి ఆలోచించలేని మగపుంగవులు మీరు.
మీకో నమస్కారం ..మళ్ళీ నా కంటపడితే …ఈసారి చేయి కాదు. చెప్పుచ్చుకుకొడతా . వెళ్ళిక్కడ నుంచి …గెట్ లాస్ట్ …”

          ఆవేశంగా అరుస్తూ చూపుడు వేలితో తలుపు వైపు చూపించింది.

***

          మంచం పై అసహనంగా కదులుతున్న స్రవంతిని చూసింది అంబిక.

          ” స్రవంతీ ” అని చిన్నగా పిలిచింది.

          స్రవంతి లేచికూర్చొని “ఏమిటి ” అన్నది.

          “నిద్రరావటం లేదా ? అటూ ఇటూ మెసులుతున్నావ్ ఇందాకటి నుండి.”

          “ఏవో ఆలోచనలు …” అంటూ టైం చూసింది.

          తెల్లవారుఝాము నాలుగున్నర.

          “ఇక ఇప్పుడేం నిద్ర …కాఫీ కలుపుకొని తాగుదామా “అంటూ మంచం దిగింది స్రవంతి.

          ఇద్దరూ లేచి కిచెన్ లోకి వెళ్ళారు.

          కాఫీ తాగుతూ తన సంగతులన్నీ చెప్పింది స్రవంతి. కమల విషయాలను కూడా చెప్పింది.

          “అతను మరలా కలవలేదా ?”అంబిక అడిగింది.

          “మూడుసార్లు కలవటానికి ప్రయత్నం చేశాడు. మధ్యవర్తి ద్వారా కబురు చేశాడు. కానీ నేను అతన్ని క్షమించలేను. అలాంటి మనిషిని కట్టుకుని కాపురం చేయలేను. అమ్మకు చెప్పాను .’నమ్మకం లేనిచోట సంసారాలు నిలవ్వు ‘ అంది అమ్మ. విమెన్ ఆర్గనైజేషన్స్ లో లీడింగ్ పాత్ర పోషిస్తున్నాను. కానీ రాజకీయాల జోక్యంతో చేయాలను కున్నవన్నీ చేయలేకపోతున్నాను. ప్రస్తుతం నేనే స్వంతంగా ఒక ఆర్గనైజేషన్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాను. డబ్బులకు కొదవలేదు అభాగ్య స్త్రీలకు సేవ చేస్తానంటే అమ్మ ఎప్పుడూ కాదనదు. మదర్ థెరిస్సాలా కాదు కానీ , మహిళలకు అండగా ఉండాలనే ఆకాంక్ష ఎక్కువుగానే వుంది నాకు. నేను కలలు కనే గమ్యం ఎంతో దూరంలో లేదు. వేసే అడుగులు తడబడకుండా వేయాలి. నడిచే దారులన్నీ రహదారులు కావు. ముళ్ళబాట లు కూడా ఉంటాయి. జాగ్రత్తగా చూసుకుంటూ అడుగులు వేయాలి. మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే. మన అడుగులు మరి కొంత మందికి మార్గం చూపాలి.

          మనిషిగా పుట్టినందుకు మన వంతుగా ఈ సమాజానికి ఉపయోగపడాలి. ఆడదాని కష్టాలు ఆడవాళ్ళకే అర్ధమవుతాయి. కొంత మంది ఆడవారి కన్నీళ్ళనైనా తుడవగలగాలి.
ఈ అపార్ట్ మెంటుకు దగ్గరలోనే ఒక ఇండివిడ్యుయల్ ఇల్లు కొని నా ఆలోచనలకు అను గుణంగా దాన్ని మార్పులు చేయించాను.

          ‘ఆసరా ‘ అనే పేరుతో రిజిస్టర్ చేయించాను. మహిళా సమస్యల పట్ల అవగాహన, సానుభూతి, సమాజసేవ పై అనురక్తి , అందరినీ సమానంగా ఆదరంగా ప్రేమించే వారు అనుకొన్న కొంత మందిని కలిశాను. ఒక డాక్టర్, ఒక న్యాయవాది, ఒక టీచర్, ఒక కార్మికురాలు, ఒక కర్షకురాలు ….

          ఇలా ఒకో రంగం నుండి కొంత మందితో సొసైటీ ఒకటి ఏర్పాటు చేస్తున్నాను.
ఈ కృషి వెనుక అమ్మ ప్రోత్సాహం ఎంతో వుంది.

          కమల విషయం కూడా అమ్మ చూస్తున్నది. మంచి మనిషి దొరికితే దానికి పెళ్ళి చెయ్యాలని అమ్మ ఆలోచన. ఈ మధ్యనే ఈ అపార్ట్ మెంటు వాచ్ మెన్ రంగయ్య అడిగాడట అమ్మను. రంగయ్య భార్య ఈ మధ్యనే ఒక పిల్లవాడిని ప్రసవించి చని పోయింది. ప్రస్తుతానికి రంగయ్య మంచివాడే. తాగుడు లాంటి అలవాట్లు లేవు. కమల సంగతి, దానికి పిల్లలు పుట్టరన్న విషయం కూడా రంగయ్యకు చెప్పింది. కమల ఒప్పు కుంటే పెళ్ళి చేయాలి. 

          ఇక నా సంగతి అంటావా!

          పెళ్ళి చేసుకోకూడదని పంతం లేదు. నా భావాలు, నా ఆశయాలు, నా పనులు, నా కార్యక్రమాలు నచ్చిన వాడు వస్తే అప్పుడే పెళ్ళి సంగతి ఆలోచించేది. 

          ఎల్లుండి మార్చ్ 8 , అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ‘ఆసరా ‘ను
లాంఛనంగా అమ్మ చేతుల మీదుగా ప్రారంభించాలని ప్లాన్ చేశాను …”

          స్రవంతి వంక ఆరాధనగా చూసింది అంబిక.
         
          “ఇన్ని మంచి పనులు చేస్తూ ఎంతో ఎత్తుకు ఎదిగిపోయావు స్రవంతీ … ఈ పనుల లో నేను కూడా నీతో కలసి నడుస్తాను. నన్ను కూడా నీ ఆర్గనైజేషన్ లో చేర్చుకోవా? “

          అంబిక మాటలకు ‘ఓకే’ అంటూ స్రవంతి సంతోషంతో అంబిక చేతులు పట్టుకొని ఊపేసింది.

          “అపార్ట్ మెంటు పైకెళ్ళి చల్లగాలిని మనసారా పీల్చుకుందాం పద ” అంటూ అంబికను తీసుకుని లిప్ట్ లో పైకి వెళ్ళింది స్రవంతి.

          అప్పుడే తూరుపున అరుణారుణ కిరణాలు విచ్చుకుంటున్నాయి. ఉషోదయ వెలుగులతో ఆకాశం సప్తవర్ణ శోభితమై విరాజిల్లుతున్నది. ఉదయించే సూర్యుణ్ణి కనులారా చూస్తూ నిలుచున్నారు మదినిండా ఉన్న క్రొత్త క్రొత్త ఆశలతో ….

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.