అప్పుడే మొదలైంది (కథ)

– డా.కే.వి.రమణరావు

 

          తలుపు తెరిచి రూమ్మేట్స్ లోపలికొచ్చిన చప్పుడుకు సగం మగత సగం ఆలోచన ల్లో నుంచి మేలుకుంది తను. వాళ్ళ మాటలు గుసగుసల్లోకి మారాయి. ‘ఫష్ట్ షో సినిమా అప్పుడే ఐపోయిందా’ అనుకుంది.

          పక్కలు సర్దుకుంటున్నారు. సినీ విశ్లేషణ కొనసాగించబోయింది దివ్య. “ష్.. ప్రతిమ నిద్రలోవుంది. అసలే తనని పిలవకుండా వెళ్ళాం, యింక పడుకో” అంది నందన. వినయ చిన్ననవ్వు తర్వాత నిశ్శబ్దం అలుముకుంది. ఎప్పుడో నిద్రపట్టి తెల్లవార్ఝామునే మెలుకువొచ్చింది తనకి. కిటికీలోంచి చూస్తే క్షితిజరేఖలో సన్నని వెలుతురు తప్పిస్తే చీకటింకా పోలేదు.

          ‘రాత్రి సినిమా కెళ్తున్నట్టు వాళ్ళు తనకు చెప్పనైనా లేదు. కొన్నిరోజులుగా బ్రేక్ ఫాస్ట్ డిన్నర్లకు వెళ్ళేప్పుడు కూడా తనకోసం చూడ్డంలేదు. నాలుగేళ్ళలో ఎప్పుడూ ఇలా లేదు. ఒకే కాలేజిలో బీటెక్ పూర్తిచేసాక ఉద్యోగాలనుకోకుండా టీచింగ్ మీద ఇష్టంతో నలుగురూ ఇక్కడ ఎంటెక్ చేరింది ఆ స్నేహబంధం మీదే. హాస్టల్లో ఒకే రూము వేయించు కున్నారు. ఎన్నిట్లో తేడాలున్నా మొన్నటిదాకా అనుబంధం గట్టిగానే ఉండేది. ఈ మధ్య తను గిరికి దగ్గరైనప్పటి నుండే ఇలా చేస్తున్నారు. రోజురోజుకూ మానసికంగా కూడా తనకి దూరంగా వెళ్తున్నారు. గిరితో స్నేహంగా ఉండడమంటే తప్పుచేస్తున్నట్టా? అడగడానికి తనకూ ఇబ్బందిగానే ఉంది. ఎప్పుడో వాళ్ళే బయటపడాలి!’ లేచి అసైన్మెంటు పూర్తి చేద్దామని టేబిల్ దగ్గర కూర్చుంది.

          ల్యాప్ టాప్ తెరిచిందేగాని మనసు లగ్నం కాలేదు. ‘గిరి పరిచయమే తమాషగా జరిగింది. ఎంటెక్ కొత్తల్లో ఓ రోజు కాలేజీలో దామెర్ల రామారావు మీద ప్రోగ్రాంకి తను వెళ్లింది. మధ్యాహ్నం సెషన్లో రామారావు రేఖాచిత్రాల శైలి మీద గిరి చక్కగా మాట్లాడాడు. “బాగా చెప్పారు, మీరు డ్రాయింగ్ టీచరా” అనడిగింది తను. “మీరు గుర్తు పట్టినట్టులేదు, నా పేరు గిరీష్, నాదీ కంప్యూటర్సే, మీ క్లాస్మేటునే మేడం” అన్నాడు చిన్నపిల్లాడిలా నవ్వి.

          ఆ తర్వాత ల్యాబ్లో తమని ఒకే టీంలో వేయడంతో స్నేహం ఏర్పడింది. తరచుగా తామిద్దరూ క్యాంటీన్లో కనపడ్డం, లేటైనప్పుడు గిరి పాతబైకులో హాస్టల్ దగ్గర దింపడం జరిగాక అందరి చూపుల్లో మార్పొచ్చి ఊహాగానాలు మొదలైనట్టు తెలిసింది. అతన్ని స్నేహబృందంలో కలుపుకోవడానికి తన రూమ్మేట్స్ ఎందుకో ఇష్టపడలేదు. అతనూ ఆసక్తి చూపలేదు.

          బృందంలో తను చదువులో ముందైనా, ఇష్టాలు వేరైనా, మొన్నటిదాకా అన్నీ తనను అడిగే చేసేవాళ్ళు. బయట మగవాళ్ళ చూపులు మొదట తన మీదే పడుతున్నా పట్టించుకునేవాళ్ళు కాదు. ఎక్కడికైనా కలిసే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ‘నీకిష్టముండదని చెప్పట్లేదు’ అని దాటేస్తున్నారు’. నిస్తేజంగా ల్యాప్ టాప్ వైపు చూసింది.

          ‘స్క్రీన్ మీద వాల్ పేపరుగా తమ నలుగురి ఫోటో. తనకి పాతకాలేజిలో గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు ముగ్గరూ తనచుట్టూ చేతులేసి నవ్వుల పువ్వులతో, ప్రేమగా. ఇప్పుడా పువ్వులేవి?’ ల్యాప్ టాప్ మూసేసి వెళ్ళి పడుకుంది. ఇంకా అవే ఆలోచనలు.

          ‘తను నిజంగానే గిరికి దగ్గరౌతూందా? అతని దగ్గర చాలా విషయాలు నేర్చుకోవడం, తమ భావాలు కలవడం మాత్రం నిజం. గిరితో స్టూడియోకి వెళ్ళినప్పట్నుంచే సన్నిహిత మవడం మొదలైందా?

          ఓ సారి అతని పెయింటింగ్ చూసి ఆశ్చర్యపోయి “మీరు వేసిన బొమ్మలు చూపిం చండి” అనడిగింది.

          “నాకు డిజిటల్ కంటే కాన్వాసు మీద వెయ్యడమే యిష్టం. చూడాలంటే నాతో దూరంగా వొకచోటికి రావాలి. రాగలరా?” అన్నాడు.

          “యీ ఆదివారమొస్తా” అంది వెంటనే.

          ఆ రోజుని తనెప్పటికీ మరచిపోలేదు. బైకులో ఊరికి దూరంగా పావుగంట ప్రయాణించి కచ్చా రోడ్డులోకి తిరిగి కొద్దిసేపు వెళ్ళాక ఓ మామిడితోటలోని పాతషెడ్డుకి చేరారు. అక్కడ గుడిసెలో వాచ్ మ్యాన్ దగ్గర తాళంచెవి తీసుకుని లోపలికి తీసుకెళ్ళాడు. తనకెందుకో భయం వెయ్యలేదు.

          లోపల అదొక ఆర్ట్ స్టూడియో. స్టాండుల మీద, గోడలకు ఫ్రేముల్లో, చుట్టలుగా కాన్వాసులు, బల్లల మీద ప్యాలెట్లు, రంగులు పడివున్నాయి.

          “యిది నా ఫ్రెండు స్టూడియో. దయతో కొంత చోటిచ్చాడు” అని ఒక మూలకు తీసుకెళ్ళి అతని పెయింటింగ్స్ చూపించాడు. సూచనామాత్రంగా రేఖలతో, గాఢమైన రంగులు నిండిన చిత్రాలు. చాలా వరకు చెట్లకింద, గుడిసెల ముందు పనులు చేస్తున్న గ్రామీణ స్త్రీలవి. ఎరుపు, పసుపు, నలుపు డామినేట్ చేస్తున్నాయి. మొహాల్లో అమాయక త్వం, వేదన కనిపిస్తున్నాయి.’

          “యిదే నా నేపథ్యం. మా యిల్లు యిలాగే వుంటుంది. టీచర్ల దయ, స్కాలర్షిప్పులతో చదువులో యింతదూరం రాగిలిగాను” అన్నాడు.

          “నువ్వింత.. సారి.. మీరింత ప్రొఫెషనల్ గా వేస్తారని తెలీదు. ఎగ్జిబిట్ చేసారా?”

          “యింకా నేర్చుకుంటున్నాను ప్రతిమగారూ. ఆధునిక బెంగాలి, తెలంగాణ చిత్రకా రులు నాకాదర్శం. కథలకు బాపు గీసిన రేఖాచిత్రాలు కూడా నాకు ప్రేరణ. వాటి అనుభూతి గాఢతనెవరూ గుర్తించినట్టు లేదు” విచారంగా నవ్వాడు.

          గోడకున్న వృద్ధురాలి ముఖచిత్రం చూపించి “యిదెవరిది?” అంది.

          “మా అమ్మది. ఆమె కళ్ళలోని ఆశే మమ్మల్ని బతికించింది. కానీ మా అన్న చదువై నిలదొక్కుకునే లోపలే ఆ కళ్ళు బలహీనపడ్డాయి” దిగులుగా కళ్ళను చూసాడు.

          “రవివర్మవేసే బొమ్మలాగుంది”

          “వ్యక్తిత్వమంతా చూపే రెంబ్రాంట్ స్టైల్ ప్రయత్నించాను. అది రెనైసెన్స్ క్లాసికల్ చివరిదశ. క్రమంగా మోడెర్న్ ఆర్టు వచ్చింది. రెనైసెన్స్ అంటే విశ్వాసం నుంచి పేగ నిజం మీదుగా హేతువు వైపుకి అనికూడా చెప్తారు. విశ్వాసానికి ముందూ వెనకా హేతువే వుందనుకుంటా”

          రంగుల తపస్సులో మునిగివున్న మనుషుల రేఖాచిత్రం చూపిస్తూ “వుపనిషద్ రుషులు. వాళ్ళది గొప్ప హేతుదృష్టి. మనం తిరిగి తెచ్చుకోవాల్సిన మన విలువైన ప్రశ్నించే తత్వం! ఆ పక్కది శివుడు, పేదవాళ్ళ కోసం నిరుపేదగా వున్న దేవుడని మా అమ్మకు ఇష్టం.. నాపేరదే” అని నవ్వాడు.

          “మీయిల్లు, వూరు చూడాలనిపిస్తోంది. తీసుకెళ్తారా?”

          “అట్లాంటి సాహసం చేయకండి” నవ్వాడు.

          “మీ ఆర్టుని యింకా ముందుకు తీసుకెళ్తారా?”

          “నాకైతే యీ చదువైపోగానే గ్లోబల్ అనుభవం కోసం ప్యారిస్ వెళ్ళి ఆర్ట్ స్కూల్లో చేరాలనివుంది. ముందైతే వుద్యోగం తెచ్చుకుని, మా యింట్లోవాళ్ళకో దారిచూపాలి. మరి మీరు?”

          “నాకీ పీజీ తర్వాత పరిశోధనలోకి దూకి మునుగుతూ తేలుతూ వుండాలని వుంది. కానీ, మా లాంటి కుటుంబాల్లోని ఆడపిల్లలు యేది చేయాలన్నా సంధి షరతులకు లోబడే” అని విచారంగా నవ్వింది.

          తిరిగొచ్చేప్పుడు రెస్టారెంట్లో భోంచేసారు. దారిలో ‘మీరు’ మాయమై ‘నువ్వు’ స్థిరపడింది. తను చెప్పేది గిరి శ్రద్ధగా వింటాడు. వ్యతిరేకించినా ఎదుటివారి దృష్టితోనే సవరించినట్టు ఉంటుంది. అతని సమక్షంలో మనసంతా హాయిగా ఉంటుంది. అతని మీద ఇష్టం అలాంటి భ్రమ కలిగిస్తోందా?’ నవ్వుకుంది. తూర్పువెలుగులు పలకరిస్తూండ గా పడకమీంచి లేచింది.

          కొన్నాళ్ళు మధనపడ్డాక ఓ సాయంత్రం క్యాంటీన్ బయట లాన్లో, గిరితో తన రూమ్మేట్స్ ప్రవర్తన గురించి ప్రస్తావించింది.

          “క్రమంగా షాపింగులు, పార్టీలు, అన్నిచోట్లకు పిలవడం మానేసారు. ఈ మధ్య మాటలు తగ్గించారు, నేవెళ్తే టాపిక్ ముగిస్తున్నారు”

          “వాళ్ళ స్పేస్ నాకిచ్చావని అఫెండ్ అయ్యారేమో”

          “స్నేహానికీ పరిధి వుంటుందా?” ఆమె గొంతులో తడి.

          “మనిషి జీవితం స్థల కాల భావజాలాలకు బందీగా మొదలౌతుంది అంటారు. సంచితకర్మ యిదేనని మా పంతులుసారు చేప్పేవాడు. సంఘ నియమాలు పాటించక పోతే యెదురీత తప్పదు. నీతో స్నేహానికి నేను తగనని మీవాళ్ళు అనుకుంటున్నారేమో” అన్నాడు గిరి.

          తను నిర్ఘాంతపోయింది.

          ‘ఐనా తన ఆలోచనల్లో గిరి సమయం పెరగడం తెలుస్తూనే వుంది. మెదడు హాయి నిచ్చే అనుభూతుల్నే తల్చుకుంటుందేమో! రొటీన్ గా తప్ప రూమ్మేట్సుతో గడపడం తగ్గింది. తనతోవున్న పాతతేడాలు కూడా ఇప్పుడు వాళ్ళలో బయటికొస్తున్నాయా? తనను ఇంకా గిరివైపుకు జరుపుతున్నాయా? ఏమో!’ అనుకుంది క్యాంటిన్నుంచి వచ్చాక.
ఓ సెలవు పూట తను లైబ్రరిలో ఉండగా నందిని వచ్చింది. ముగ్గురిలో నందిని కాస్త సున్నితం. మాటల్లో గిరి ప్రసక్తి తెచ్చింది. ఆమె ముందుగానే ఏదో నిర్ధారించుకుని వచ్చి నట్టుంది, తను చెప్పేది వినిపించుకోలేదు.

          “అన్నీ ఆలోచించుకున్నావా? ఆశలు మాకు లేవనుకోకు. దిగాక యేదీ మనవశంలో వుండదు. వొక్కోసారి రెండువైపులా ఆదరించరు. మాఅక్క తెల్సుగా, యెటూకాకుండా పోయింది. అందుకే” అని చెమ్మగిల్లిన కళ్ళతో తనవైపు చూడకుండా వెళ్ళిపోయింది.

          ఆ సాయంత్రం తనకి ల్యాబ్ లో లేటై బయటికి వచ్చేసరికి వర్షం. చిన్నప్పటిలా చినుకులను చూస్తూ మెట్ల మీద కూర్చుంది. చీకటి పడుతూండగా గిరి గొడుగు తీసుకుని వచ్చాడు. వానచప్పుడులో తన బాల్యం, కుటుంబం, నాన్నప్రేమ, ఆయన ఆధునిక భావాల గురించి చెప్పింది. అదే మొదటిసారి తను ఓపెన్ అయి ఎవరికైనా చెప్పడం. తడిసిన చీకటి వెలుగుల్లో తను, గిరి ఒకే గొడుగు కింద హాస్టలుకి రావడం కిటికీల్లోంచి రూమ్మేట్లు కూడా చూసారు.

          వారం తర్వాత ఒకరాత్రి రూములో దివ్య, వినయ వచ్చి “వొక విషయం మాట్లాడాలి” అంటూ ఎదురుగా కూర్చున్నారు.

          వినయ మొదలుపెట్టి తనకు గిరికి స్నేహం చాలా ముందుకు పోతున్నదని, చెడ్డ పేరు వస్తోందని, సరిదిద్దుకోమని చెప్పింది. ఆమెను బలపరుస్తూ మాట్లాడింది దివ్య.
“గిరి మా టీంమేట్, టెక్నికల్ గా షార్ప్. కాలేజిలో అలాంటి స్నేహాలెన్ని లేవు? మీక్కూడా బాయ్ ఫ్రెండ్సున్నారుగా” బర్స్ట్ అయింది తను.

          “వుండచ్చు, కానీ నీలా కాదు. మనవాళ్ళల్లో అలా యెవరూలేరు” అంది వినయ.

          “మనవాళ్ళంటే?”

          “మనలాంటి సోషల్ స్టేటస్ లో వున్నవాళ్ళని. తెలీదా ప్రతిమా” విసుక్కుంది దివ్య.

          తను అవాక్కైచూసింది.

          “మీ ఫ్యామిలి స్థాయేమిటి? అతందేమిటి? నువ్వు ఫ్యామిలికంటే వేరుకాదు. మీ నాన్న మీవూళ్ళో పెద్ద లాయరు, హైప్రొఫైల్ సంఘాల ప్రెసిడెంటు. చుట్టాల సంగతి చెప్పే పన్లేదు. నువ్వింత మందిని బాధపెడ్తావా? ఆలోచించు. యింక యీ క్యాంపస్లో మనవాళ్ళదే నాయకత్వమంతా. ఆ రక్షణ వుందనే నిర్భయంగా మనల్నిక్కడ చేర్చారు. నువ్వు చేస్తున్నపని మనవాళ్ళకి నచ్చట్లేదు. మానకపోతే నిన్ను డిసోన్ చేస్తారు”

          “గిరితో స్నేహంకూడా తప్పేనా?”

          “మొదట్లో అవి అలాగే అనిపిస్తాయి” అని వినయ వెళ్ళి పడుకుంది. దివ్య తన భుజం చుట్టూ చెయ్యివేసి “ప్రతిమా మాకు నువ్వే అన్నిట్లో రోల్ మాడల్. నువ్వంటే మాకిష్టం, అందుకే చెప్తున్నాం. అర్థం చేసుకో” అని నుదుటి మీద ముద్దుపెట్టి వెళ్ళింది.

          ‘తను ఇంత ఎత్తైన కృత్రిమ గాలిమేడలో ఉందా’ అనుకుంటూ చీకట్లోకి చూస్తూ కూర్చుంది.

          ఇది గిరితో చెప్పకుండా ఉండలేక పోయింది తను. దానికతను “మీవూళ్ళో  మా మామయ్య వున్నాడు, వస్తూంటాను. కానీ మీ బంగళాకొచ్చే సీన్ నాకు లేదు. మీ వాళ్ళు  చెప్తున్నదాంట్లో వాస్తవం వుంది. మగవాణ్ణి కాబట్టి మావాళ్ళనించి నాకీ సలహాలు నిదానంగా వస్తాయి. నాసంగతికేం గాని, నువ్వు మీ రూమ్మేట్స్ మాట వినడం మంచిది” అన్నాడు నిజాయతీగా కళ్ళల్లోకి చూస్తూ.

          ‘ఆ స్వచ్చతే తనని దగ్గరచేస్తూంది’ అనుకుంది.

          “టీం మార్తాను. యిక దూరంగా వుందాం” అన్నాడు.

          తను అస్సలు ఒప్పుకోలేదు.

          సెలవులకు ఇంటికొచ్చింది తను. గిరితో ఫోనులో మాట్లాడుతున్నా, అతని సమక్షంలో కలిగే ఫీలింగ్ కావాలని చాలాసార్లు అనిపించింది. ఆ పెద్దకళ్ళలో కాంక్ష లేదు, తల్లిలోని స్త్రీత్వం ఒయాసిస్సులా కనపడుతుంది.

          ఓ రోజు హఠాత్తుగా గిరి ఫోన్ చేసి “పనిమీద నిన్న మీ వూరొచ్చాను, యెల్లుండెళ్తాను. నిన్ను కలవడం కుదర్దని తెలుసు, నీకేమైనా ఆరోసెన్సుతో తెల్సిందేమోనని వూరికే అడుగుతున్నా” అన్నాడు గలగలా నవ్వి.

          “గ్రేట్! నువ్వొక పూట డిన్నర్కి రావాలి, తప్పదు” అంది గట్టిగా, తన ఎక్సైట్మెంట్ తనకే కొత్తగా తోచింది.

          “లేనిపోని ట్రబుల్స్ పెట్టుకోకు, నీకింకా తత్వం బోధపడలేదు”

          “మాయింట్లోవాళ్ళు చాలా లిబరల్. నేను నాన్నకి ‘గోల్డెన్ ప్రతి’. పైగా నువ్వు ఆర్టిస్టు వి, హి విల్ ఎంజాయ్ యువర్ కంపెని” గిరిని బలవంతంగా ఒప్పించింది.

          గిరి రావడం గురించి ఇంట్లో చెప్పింది తను. నాన్న, అన్నయ్య అతని గురించి చాలా ప్రశ్నలడిగారు. కొన్ని ఇబ్బందిగా అనిపించాయి, మరికొన్నిటికి తన దగ్గర సమాచారం లేదు. ‘అన్నయ్య ఫ్రెండ్స్ నేరుగా వచ్చేసేవాళ్ళు, తనకీ ప్రశ్నలేమిటి?’ అనుకుంది.

          గిరి సాయంత్రం ఐదుకు వచ్చాడు. అమ్మకి పరిచయం చేసింది, మూడో అంతస్తు లోని పెంట్ హౌస్ తో సహా ఇల్లంతా చూపించింది. వెనక తోటలో కూర్చుని అమ్మ పంపిన టీ తాగి కబుర్లు చెప్పుకున్నారు. తమ ఫ్యామిలి ఫోటోలు, అక్క పెళ్ళి ఆల్బం చూపించిం ది. చెల్లికి అనాటమి పరీక్షలని సెలవుల్లేవనీ చెప్పింది.

          ఆరుకి నాన్న వచ్చాడు. హాల్లో కూర్చుని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. తను అటూ యిటూ తిరిగింది, అమ్మకు వంటలో సాయంచేసింది.

          నాన్న గిరితో కెరీర్, ఇండస్ట్రీ, పోలిటిక్స్ గురించి మాట్లాడాడు. మధ్యలో కుటుంబ వివరాలు అడగడం వినిపించింది. గిరి ఉత్సాహంగానే మట్లాడాడు. నాన్న నవ్వుతూనే అతన్ని పరీక్షగా చూసినట్టు తోచింది తనకు. గిరి మాటలు స్వచ్చంగా, నాన్నవి తెచ్చి పెట్టుకున్నట్టుగా, నాన్న అతని అభిప్రాయలను తేలిక చేస్తున్నట్టూ అనిపించింది ఎందుకో. ఏడుగంటలకి అన్నయ్య వచ్చాడు. గిరిని పలకరించి పనుందంటూ మేడమీది కి వెళ్ళిపోయాడు.

          డిన్నర్ టేబుల్ దగ్గర కూడా కబుర్లు సాగాయి. అన్నయ్య కిందికి రాలేదు.

          “యివాళ మంచి సీఫుడ్ ఐటెమ్స్ చేసింది మా ఆవిడ. మాటేస్టు నీకు నచ్చుతుందో లేదోగాని” అని అవెంత అరుదైనవో చెప్పాడు నాన్న.

          “సారీసర్, చిన్నప్పట్నుంచి నేను వెజిటేరియన్నండి” అన్నాడు గిరి వినయంగా.
అశ్చర్యంతో నా వైపు చూసాడు నాన్న.

          “మాఅమ్మ మాకు బుద్ధుడి కథలు చెప్పేది. నాన్ వెజ్ కొనలేక అలా చేసిందని మా అన్న యిప్పటికీ జోక్ చేస్తూంటాడు” నవ్వాడు గిరి.

          తను గిరి పెయింటింగ్స్ గురించి చెప్పింది. నాన్న అతని పెయింటింగ్ కెరీర్ ప్లాన్స్ అడిగాడు. ఆ తర్వాత నాన్న పెద్దగా మాట్లాడలేదు. తనూ గిరీనే జెనరల్ విషయాలు ప్రస్తావించారు. నాన్న తన ఎక్సైట్మెంట్ ని పరిశీలనగా చూస్తున్నట్టు అనిపించింది. డిన్నర్ ముగిసాక కాసేపుండి వెళ్ళిపోయాడు గిరి.

          ‘గిరి వచ్చివెళ్ళాక నాన్న, అన్నయ్య తనతో మాట్లాడ్డం తగ్గించారు. వాళ్ళ అమాయక త్వం గాయపడినట్టుగా కనిపించారు. వాళ్ళిచ్చే చనువు కూడా తగ్గింది. నాన్న అభ్యుద య భావాలు ఇంట్లోవాళ్ళ కోసం కాదేమోనని అనుమానం వచ్చింది తనకి. అక్కమాటల్లో జాలి మొదలైంది. తక్కువగా మాట్లాడే అమ్మే తనని దగ్గరకి తీసుకుని కబుర్లు చెప్పింది. తన చుట్టూవున్న ఖాళీ పెరిగినట్టు’ అనిపించింది.

          సెలవులైపోయి తిరిగొచ్చిన వారానికి నాన్న నుంచి పెద్ద మెయిలు వచ్చింది తనకి. రూంలో యెవరూ లేకపోయినా రాత్రి పదయ్యాక చదివింది. తమ కుటుంబ నేపథ్యం, ప్రతిష్ట, అందరూ తనని ఎంతగా ప్రేమిస్తున్నారు, లోకంలోని ఆకర్షణల బలం, పర్యవసా నాలు, తన లక్ష్యమేమిటి.. ఇలాంటివన్నీ ఒక పద్దతిగా ఉన్నాయి. గిరి ప్రస్తావనే లేక పోయినా విషయమంతా అతనిచుట్టే తిరిగింది. భాష సున్నితంగా ఉన్నా లాయరు పరోక్షంగా పంపిన మెత్తని నోటీసులాగుంది. ఇదివరకటి ఉత్తరాల్లోని ఆర్ద్రత లేదు. తన మనస్సు వికలమైంది, లైటార్పేసి వెళ్ళి పడుకుంది.

          ‘గిరితో తన అనుబంధం స్నేహంగానే కొనసాగుతుందా లేక భవిష్యత్తులో ప్రేమగా మారుతుందా అన్నది ఇంకా తనకే స్పష్టంగా తెలియడంలేదు. అప్పుడే తనవాళ్ళు  అనుకున్న అందరూ మొదట్లోనే తనకి దూరం జరిగి తనని ఒంటరిని చేస్తున్నారు. ఒక్కరైనా నిజాయతీగా తన మనసులో ఏ ముందో తెల్సుకునే ప్రయత్నం చెయ్యలేదు. గిరి చెప్పినట్టు సంఘం కళ్ళు, చేతులు ఇంత కఠినమైనవా? ఐనాసరే గిరికి దగ్గరగా ఉండాలనే అన్పిస్తోంది. ఐతే ముందు అసలు తనేమిటో తాను తెల్సుకోవాలి’ అను కుంది, దూరదూరంగా మినుకుమంటున్న నక్షత్రాల మధ్య ఘనీభవించిన చీకటిని చూస్తూ. టైము చూసింది, పదకొండైంది. ఫోన్ తీసుకుని గిరికి చేసి “యీ వీకెండ్ మీ వూరికి వెళ్తున్నాం, రెడీగా వుండు” అని చెప్పేసి ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది.

*****

Please follow and like us:

One thought on “అప్పుడే మొదలైంది (కథ)”

  1. చక్కని చిక్కని (అంత సులభంగా మేధకు చిక్కని) కథ రాశారు రమణారావు గారు. వారిని విమర్శించే స్థాయి నాకు లేకపోయినా కొన్ని విషయాలు చెప్పక తప్పదు. రచనలో అవసరమైన చోట మాత్రమే కాకుండా చాలా చోట్ల అనవసరంగా ఆంగ్ల పదం ప్రయోగం జరుగుతున్నది. మీ లాంటి పెద్దలు కూడా ఇలా చేయరాదు. ఇక పోతే అచ్చుల స్థానం లో హల్లులు ( యేదో, యెలాగ ..ఇలాంటివి) గత కాలంలో చలంగారు అప్పటి రచనలపై విషయికం గానూ, భాషలోనూ ఒక తిరుగుబాటుగా వ్రాసేవారు. మరి రమణారావు గారు ఎందుకు అలాగే వ్రా వారి శైలి అదేనేమో నాకు తెలియదు. వారి రచనలు నేను పెద్దగా చదవలేదు. ఈ మధ్య కాలం లో ఇదేనేమో. ఏదీ ఏమైనా ఇది కూడా వాంఛనీయం కాదు. ఈ తరం రచయితలు ఇదే సరియైనదేమో అనుకునే ప్రమాదం ఉన్నది

Leave a Reply

Your email address will not be published.