మెరుగైన సగం

(The Better half)

(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

-దత్తశర్మ పాణ్యం

          పెళ్ళి. రెండు ఆత్మలనూ, శరీరాలనూ కలిపే ఒక అపురూప ఘట్టం. సహజీవన
సౌందర్యం రూపుదిద్దుకునే ఒక అపూర్వ సన్నివేశం.

‘‘రాఘవ్‌ వెడ్స్‌ మహిత!

          వధూవరుల అందమైన చిత్రాలను ముద్రించిన రంగుల ఫ్లెక్సీ బోర్డు నియాన్‌ లైట్ల
కాంతిలో మెరిసిపోతూంది. ఆహూతులందరూ కల్యాణ మంటపానికి ఇదివరకే విచ్చేశారు. పెళ్ళితంతు జరిపించే బ్రహ్మగారు వేదిక మీద కావలసినవన్నీ సర్దుకుంటున్నారు.
పెళ్ళికూతురు మహిత పక్క గదిలో ‘‘గౌరీపూజ’’ చేస్తూన్నది. తన భర్త అనురాగాన్ని,
అత్తమామల ఆదరణను, ఒక చక్కని వైవాహిక జీవితాన్ని ప్రసాదించమని అమ్మవారిని
ప్రార్థిస్తూన్నది.

          పెళ్ళికొడుకు రాఘవ్‌ పీటమీద కూర్చుని వినాయకునికి పూజ చేస్తున్నాడు. ఇంతలో మహిత మేనమామలిద్దరు ఆమెను ఒక బుట్టలో కూర్చోబెట్టి తీసుకుని వచ్చారు.
వివాహపు తంతు జరగసాగింది. పురోహితుడు అనేక మంత్రాలను సంస్కృత భాషలో
ఉచ్చరిస్తూ, కొన్నింటిని వధూవరులతో పలికిస్తున్నాడు. వారికి ఆ మంత్రాలకి అర్థం
తెలియదు! యాంత్రికంగా ఆయన చెప్పిన దానిని పలుకుతున్నారు.

          ఆయన వారితో ఒక ‘ప్రతిజ్ఞ’ చేయించాడు. జీవితాంతం ఒకరిపట్ల ఒకరు బద్ధులమై
ఉంటామనీ, సుఖాల్లో, దుఃఖాల్లో భాగస్వాములమవుతామనీ వైవాహిక సిద్ధాంతాలను
మీరమనే ఆ ప్రతిన. వరునితో ‘నాతిచారమి’ అనీ, వధువుతో ‘నాతి చరితవ్యా’ అనీ ముమ్మారు చెప్పించాడాయన. మహిత ఆయన్ను అడిగిందిలా.

          ‘‘స్వామీ, ఈ మాటలకు అర్థం చెప్పరా, దయచేసి?’’

          ‘‘పురోహితుడి ముఖంలో సంతోషం, ఆశ్చర్యం!

          ‘‘తల్లీ! నా పాతికేళ్ళ వృత్తి అనుభవంలో ఇలా అడిగినవారు లేరమ్మా! కేవలం
మొక్కుబడిగా పలుకుతారే తప్ప, అర్థాన్ని గురించి పట్టించుకున్నవారే లేరు. చెబుతా
వినమ్మా’’

          ‘‘నాయనా నీవు కూడా శ్రద్ధగా విను. నేను ఎన్నో మంత్రాలు చదువుతున్నాను,ఎన్నో
రకాల ‘తంతు’లను చేయించాను మీతో, ఇవన్నీ మన వివాహ వ్యవస్థను, దాని పవిత్రత ను, దాని గొప్పదనాన్ని నొక్కి చెప్పేవే. అవి ఇద్దరు స్త్రీ పురుషుల శరీరాలను ఆత్మలను,
విడదీయరాని విధంగా ఏకం చేసే విధానాలే!’’

          ‘‘ఒక్క విషయం. వివాహాలు ఎప్పుడు విజయవంతంమవుతాయంటే, ఇద్దరూ రెండో
వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అభిప్రాయాలను గౌరవించినపుడే. ‘నాతి చరామి’, ‘నాతి చరితవ్యా’ అన్న మాటలు ఈ సందేశాన్ని స్ఫుటంగా ప్రతిబింబిస్తాయి. ‘నాతి చరామి’ అని వరుడు అంటాడు. అంటే ‘‘నేను అతిక్రమించను’’ అని అర్థం. అట్లే, వధువు అనే ‘నాతి చరితవ్యా’ అంటే, ‘‘దీనిని దాటి ప్రవర్తించను’’ అని, రెండూ ఒకటే. లింగభేదం వల్ల గ్రామరు మారింది! ఇవి రెండు వివాహ సమయంలో, కాబోయే భార్యాభర్తలు
ఒకరికొకరు చేసుకునే వాగ్దానాలు! అర్థమయిందా?’’

          మహితకి బాగా అర్థమయింది! భర్తవైపు సాభిప్రాయంగా చూసిందామె. రాఘవ్‌
చిరునవ్వు నవ్వాడు. అందులో ఒక హామీ ఉంది.

***

          వారి వైవాహిక జీవితం ప్రారంభమైంది. కొన్ని నెలలపాటు పరస్పర అవగాహనను
శృంగారం అధిగమించింది! భౌతిక ఆకర్షణ తగ్గిన తర్వాత, రాఘవ్‌లోని మగ పొగరు తన నిజరూపాన్ని ప్రదర్శించసాగింది. ఇద్దరూ ఉద్యోగస్తులే. అతడొక జాతీయ బ్యాంకులో క్లర్క్‌ కమ్‌ క్యాషియర్‌. ఆమె ఫార్మసీలో పట్టభద్రురాలు ఒక మందుల కంపెనీలో పని చేస్తూంది. ఆమె జీతం భర్త జీతం కంటే కొంచెం ఎక్కువే. మొదటి తారీఖున జీతం ఆమె
అందుకున్న వెంటనే, మొత్తం తానే తీసేసుకునేవాడు. అప్పటికింకా జీతాలు డైరెక్ట్‌గా
ఉద్యోగస్తుల అకౌంట్లలో వేసే విధానం రాలేదు మరి. ఆమె ఖర్చుల కోసం బొటాబొటిగా డబ్బు ఇచ్చేవాడు.

          అత్తామామలు వాళ్ళతోనే ఉండేవారు. మామ రిటైర్డ్‌ ఎలిమెంటరీ స్కూలు టీచరు.
కొద్దిగా పెన్షన్‌ వస్తుందాయనకు. అత్తకు అన్నీ ఒక క్రమశిక్షణగా జరగాలి. దేంట్లో రాజీ పడదు. రాఘవ్‌కు ఒక తమ్ముడున్నాడు మహేష్‌. ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌. ఒక చెల్లెలు మాన్వి. ప్లస్‌ టు చదువుతూంది.

          మహిత కోడలిగా ఆ యింట అడుగుపెట్టినప్పటి నుండి వంట గదికి ఆమె ఇన్‌ఛార్జ్‌
అయ్యింది. మామగారు ఒక అద్భుత, హృదయంలేని విమర్శకుడు. ఆయనకు ఉదయం కాఫీయివ్వడం ఒక విషమ పరీక్ష మహితకు. ‘‘చాలా వేడిగా ఉందమ్మా’’ అంటాడుమొదట.
కొంచెం చల్లార్చి తెస్తే, రుచి చూసి ముఖం చిట్లిస్తాడు.

          ‘‘ఇదేంటి? ఇంత లైట్‌గా ఉంది!’’ ‘‘కొద్దిగా డికాక్షన్‌ కలుపు’’

          ఇలా సాగిపోతూ ఉంటాయి ఆయన సూచనలు. అత్తయ్య తక్కువ తినలేదు. ఆమె
సాధింపు విభిన్నంగా ఉంటుంది. 

          ‘‘ఒరే రాఘవా, నీ పెళ్ళాం ఈ రోజు పులిహోర దరిద్రంగా చేసింది కదా! ఆఫీసులో
తిన్నావా, చెత్తబుట్టలో వేశావా?’’

          ‘‘అమ్మా, దానికి నా కంటే జీతం ఎక్కువని తలబిరుసే. అందుకే మనమంటే లెక్కలేదు’ అంటాడా అమ్మకూచి.

          ‘‘ఎక్కువ కట్నం ఇస్తామని ఎంత మందొచ్చారు. దీని అందం చూసి వలచావు
రంభను.’’

          ‘‘నిజమేనే! మెరిసేదంతా మేలిమి కాదన్నారు కదా!’’

          ఇలా ఉంటుంది తల్లీ కొడుకుల సంభాషణ. మహిత నోరెత్తదు. ఆమె మోమున
చిరునవ్వు చెరగదు. మహేష్‌కు వదినంటే ఇష్టం, గౌరవం. ఆమెను పల్లెత్తుమాటనడు. కానీ, మాన్వికి ఆమె అంటే మత్సరం. తల్లికి వంతపాడుతూంటుంది. చిన్న విషయాలలో వదినను తప్పుపట్టి, తల్లికి ఫిర్యాదు చేస్తుంది.

          ఇదంతా ఇలా ఉండడం మధ్య తరగతి కుటుంబాలలో సహజమే అనుకుంటుంది
మహతి. ఆమె ‘రియాక్ట్‌’ అవకపోవడం వీళ్ళకు మరింత అలుసుగా మారింది. కొంత కాలానికి ఆమెకు ఉద్యోగంలో పదోన్నతి లభించింది. ఎక్జిక్యూటివ్‌ క్యాడర్‌ పొందింది. ఆమె జీతం గణనీయంగా పెరిగింది. రాఘవ్‌లోని న్యూనతా భావానికిది మరింత ఆజ్యం పోసింది. సందు దొరికితే చాలు, నిర్దాక్షిణ్యంగా, సూటిపోటు మాటలతో, ఆమె మనసును
గాయపర్చేవాడు.

          కొన్ని సంవత్సరాలు గడిచాయి. మహిత ఒక బాబుకు, పాపకు తల్లయింది. ఆమె
వర్కింగ్‌ వుమన్‌ కాబట్టి, పిల్లలను నాన్నమ్మ చూసుకోవలసి వచ్చింది. ఆమె ఈ
అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని, పిల్లలకు, మహితకు మధ్య దూరం పెరిగేలా చేసింది.

          వాళ్ళు పెరిగి పెద్దయ్యేకొద్దీ, తల్లిపట్ల ఒక చులకన భావాన్ని పెంచుకున్నారు. అమ్మకు కుటుంబంలో విలువలేదని గ్రహించారు. కంపెనీలో ఆమె బాస్‌ చాల పెద్ద మనిషి, నిగర్వి, చక్కని సంస్కారవంతుడు. మహితను ఎంతో గౌరవంగా, ఆదరంగా చూసేవాడాయన. ఆయనతో తన బాధలు చెప్పుకునేదామె. ఆయన పేరు వాసుదేవ్‌. నలభై ఏడేళ్లుంటాయనకు.

          ఈ లోపు మహిత అత్తయ్యకు మైల్డ్‌గా పక్షవాతం వచ్చి, మంచాన పడిరది. ఎంత
ఆదరంగా సేవలు చేసినా, ముసలామె వైఖరి మారలేదు సరికదా, మరింత దురుసుగా,
నిర్దయగా మారింది. కుడివైపు చచ్చుపడిన కాలినీ చేతినీ మహిత మసాజ్‌ చేస్తున్నపుడు పొరపాటున కొంచెం ఒత్తిడి కలిగితే అంతే!

          ‘‘రాక్షసీ! చంపేశావు కదే! నాకు నొప్పి కలిగితే నీకు సంతోషం! ముదనష్టపుదానా!’’
కొడుకు యింటికి వస్తూనే కోడలి మీద ఫిర్యాదులు. అతనికి కోపావేశాలు, ఫలితంగా
మహితకు ఏమాత్రం బాధ్యతలేని కోడలుగా నిందలు!

          మామగారికి డెభై ఏళ్ళు నిండాయి. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు, అతనివి విషపుచూపులు! కోడలి శరీరాన్ని కామంతో తడుముతూంటాయవి. నిజంగా అది ఒక ఎంబరాసింగ్‌ సిట్యుయేషన్‌. మామగారి మీద భర్తకు ఫిర్యాదు చేయలేదు. నిశ్శబ్దంగా
కుమిలిపోతున్నదామె. ఆమె పిల్లలకు కూడ ఆమె అంటే చిన్నచూపే. నాన్నమ్మ తాతయ్యలతో చేరి అమ్మను కించపరుస్తారు. ఇది ఆమెను మరింత క్రుంగదీస్తూంది. ఇంట్లో పరిస్థితులు ఆమెను తన బాస్‌కు మానసికంగా దగ్గర చేశాయి. ఆమెకు ధైర్యం చెప్పి ఓదార్చేవాడాయన. వారి స్నేహం అమలినం. ఆయన ఆమెకు నేస్తం, శ్రేయోభిలాషి, మార్గదర్శి కూడా.

          మహిత వాసుదేవ్‌తో చనువుగా ఉంటుందన్న సంగతి రాఘవ్‌కు తెలిసింది.నిర్మల వాళ్ళ దూరపు బంధువు. మహిత ఆఫీసులోనే పనిచేస్తుంది. పని దొంగ కాబట్టి నిర్మలకు
ప్రమోషన్‌ రాలేదు. పైగా మహిత కొచ్చిందని కుళ్ళు. వీళ్ళిద్దరికీ అక్రమ సంబంధం అంటగట్టి ప్రచారం చేయసాగిందామె రాఘవ్‌కు ఒక ఆకాశరామన్న ఉత్తరం కూడ రాసింది. రాఘవ్‌కు అంతకు మునుపే ఉన్న న్యూనతా భావం, అనుమానపిశాచిగా మారింది. భార్య శీలాన్ని శంకించసాగాడు. అతనిలో పురుష వరాహం ఘూర్ణిల్లసాగింది.

          ఒకరోజు సాయంత్రం, ఆఫీసులో ఉండగా, మహితకు అకస్మాత్తుగా ఒంట్లో నలతగా
అనిపించింది. విపరీతమైన నిస్సత్తువ ఆవరించిందామెను. తీవ్రమైన జ్వరం, తలనొప్పి!

          వాసుదేవ్‌ అది గమనించాడు. ‘‘అమ్మా మహితా! ఏమయింది’’ అంటూ నుదిట మీద చేయివేసి చూశాడు. కాలిపోతూంది! అటెండర్‌తో ఒక మాత్ర, వేడిగా టీ తెప్పించి ఇచ్చాడాయన.

          ‘‘పద నిన్ను ఇంటి దగ్గర దిగబడెతాను’’ అన్నాడు.

          ‘‘పరవాలేదు సార్‌. నేను ఆటోలో వెళ్ళిపోగలను’’ అన్నది మహిత.

          ‘‘భలేదానివే, జ్వరంతో నీరసంతో తూలిపోతున్నావు! అదేం కుదరదు’’ విధిలేక
ఒప్పుకుందామె. ఇద్దరూ ఆయన కారులోనే బయలుదేరారు.

          ఇంటి ముందు కారాగింది. శబ్దం విని రాఘవ్‌, అతని కుటుంబ సభ్యులు అంతా
బయటికి వచ్చారు. వాసుదేవు నడవలేని ఆమెను రెండు చేతులతో పట్టుకుని నడిపించు కుని వస్తున్నాడు. ఆమె తల అతని భుజం పై వాలి ఉంది. ఆమెను లోపలికి తీసుకు వచ్చి, సోఫాలో పడుకోబెట్టాడాయన. రాఘవ్‌కు విషయం చెప్పి జాగ్రత్తగా ఆమెను చూసుకోమని, వెళ్ళిపోయాడు.

          అత్త కళ్ళు కుత్సితంతో మండుతున్నాయి.! మహితను చూస్తూ యిలా అరిచింది.

          ‘‘ఎవడితోనో ఇలా వాటేసుకుని రావడానికి సిగ్గులేదేమే నీకు? ఎంత తెగించావే!
ఎవడేవాడు? నీ రంకుమొగుడా?’’

          నిశ్చేష్టురాలయింది మహిత. భర్త తన తల్లిని వారిస్తాడని అతని వైపు చూసింది అతని కళ్ళు ఆమెను ద్వేషంగా చూస్తున్నాయి. అతని నోటి నుండి ఈ విధంగా గబ్బు ప్రవహించింది.

          ‘‘ఈ బాగోతం నాకు చాలా రోజులుగా తెలుసులేమ్మా! బరితెగించింది. దీని రంకు పురాణం దీని ఆఫీసులో అందరికీ తెలుసు. పాడుముండా, నీకిక మా యింట్లో స్థానం
లేదు. నడువు బయటకు. నీలాంటి బజారు దానిని ఉచ్చం, నీచం మరచిన దానిని
పౌరుషవంతుడెవడూ ఏలుకోలేడు’’ అని కేకలు వేశాడు.

          ఈ ‘ఏలుకోవడం’ అనే మాట ఎవడు కనిపెట్టాడోగాని, భర్త పాలకుడు, భార్య
పాలితురాలు (బానిస) అనే భావాన్ని బా….గా ఎస్టాబ్లిష్‌ చేశాడు.

          మహిత ఆ మాటలు విన్నది. అవి మెదడులోకి ఎక్కటానికి కొన్ని సెకన్లు పట్టింది.
వాటిని జీర్ణించుకునేసరికి, అత్తా, మగడూ తన వ్యక్తిత్వాహననానికి పాల్పడేంతగా దిగజారి పోయారని ఆమెకు అర్థమయింది. అంత వరకూ ఆమెలో నిక్షిప్తమై ఉన్న అపారమైన
సహన సంపద ఆవిరైపోగా, స్వరం కంపిస్తున్నా, చెక్కు చెదరని మనోబలంతో అరిచిం దామె!

          ‘‘ఆపండి మీ చెత్తవాగుడు! వెంటనే నోళ్ళు మూసుకోండి!’’ శివంగిలా గర్జించిందామె.
‘‘ఇంతకాలం మొగుడివైనందుకు నీ నీచత్వాన్ని భరిస్తూ వచ్చాను. నిస్సహాయ స్థితిలో, జ్వరం నీరసంతో ఉన్న నన్ను దయతో ఇంటికి తీసుకొచ్చారు మా బాస్‌, వాసుదేవ్‌
పెద్దమనిషాయన. పెద్ద మనసున్నవాడు కూడా. మీలాగా కుళ్ళు రోగి కాడు. ఆయన నా
స్నేహితుడు, శ్రేయోభిలాషి, వేదాంతి కూడా! ఈ యింట్లో కునారిల్లే కంపు నుండి
ఉపశమనమిచ్చే స్వచ్ఛమైన ప్రాణవాయువు. మా ఇద్దరి అనుబంధం పవిత్రమైంది. దాన్ని అర్థం చేసుకునే స్థాయి మీకులేదు!

          ‘‘మిస్టర్‌ రాఘవ్‌!’’ తనను పేరు పెట్టి పిలిచేసరికి బిత్తరపోయాడా అసూయాకుష్టు రోగి. ‘‘గుర్తుంచుకో! నేను ఈ ఇంటికి ఆశ్రయం పొందటానికి వచ్చిన రెప్యూజీని కాను.
కానే కాను. అయామ్‌ యాన్‌ ఇమ్మిగ్రెంట్‌ విత్‌ ఫుల్‌ రైట్స్‌ ఆఫ్‌ మై ఓన్‌!’’ ‘‘నేనూ చదువు కున్నాను. నీ కంటె ఎక్కువే సంపాదిస్తున్నాను. కుటుంబ పోషణలో నావంతే ఎక్కువ. కాని పెళ్ళయినప్పటి నుండి నన్నొక రెప్యూజీగానే చూస్తున్నారు మీరంతా. మీ యింట్లో నాకు ఆశ్రయం ఇచ్చినట్లు ఫీలయిపోతున్నారు. నేను వినయంగా, విధేయతగా, అణగి మణగి పడి ఉండాలని మీ తపన.’’

***

          ‘‘దౌర్భాగ్యమేంటే ఈ దేశంలో కోడళ్ళంటే తమ దయాదాక్షిణ్యాల మీద బ్రతకాల్సిన
ఆశ్రితులని భావిస్తారు. మేమెంత చాకిరీ చేసినా, అత్తింట్లో మేము రెండో రకం పౌరులమే!
‘‘కాని మిస్టర్‌ రాఘవ్‌!’’ అతని వైపు తర్జని చూపిస్తూ కొనసాగించిందామె. ‘‘నేను మీ
ఇంటికి, మన దేశ సంప్రదాయం ప్రకారం, వలస వచ్చినదాన్ని. భార్యగా నాకిక్కడ పూర్తి
హక్కులున్నాయి. పురుషాహంకారం, అమ్మ కూచితనం నిన్నో కళ్ళున్న గుడ్డివాడిని చేశాయి!

          మన పెళ్లైనపుడు నీవు చేసిన వాగ్దానం మరిచావా?’’

          ‘‘మీ అమ్మకు నేనొక సహజ శత్రువును. మీ నాన్న ఓ కామ పిశాచి! కూతురిలాంటి
నన్ను అపవిత్ర దృష్టితో చూసే నికృష్టుడు!’’

          ‘‘నా పిల్లలను కూడ నా నుండి దూరం చేశారు. చివరికి నా శీలాన్ని శంకించేంతగా
దిగజారిపోయారు! మళ్ళీ చెబుతున్నాను విను. నేను మీ మోచేతి కింద నీళ్ళు తాగే రెప్యూజీని కాను. భారత రాజ్యాంగం అన్ని హక్కులూ ప్రసాదించిన ఇమ్మిగ్రెంట్‌ని శరణార్ధిగా చూడకు. ఈ దేశం చట్టాలు నాకు పూర్తి రక్షణ కల్పిస్తాయి తెలుసుకో!’’

          ‘‘ఏమిటీ, నేను ఇంట్లో నుండి వెళ్లిపోవాలా? నాకిక్కడ స్థానం లేదా? సిగ్గులేకుండా
ప్రతినెలా నా జీతం తీసుకుని, అందులో నుండి హౌసింగ్‌ లోన్‌ ఇయమ్‌ఐ కట్టే నీకు ఆ
హక్కు ఎక్కడేడ్చింది! ఇప్పట్నించి పూర్తి భిన్నమయిన మహితను చూస్తారు మీరు! ఇదే నా చివరి వార్నింగ్‌! ఇప్పటికైనా, బుద్ధి తెచ్చుకుని మారారా సరేసరి! లేదా పరిణామాలు అతి తీవ్రంగా ఉంటాయి.”

          మహిత ముఖం క్రోధావేశాలతో ఎర్రబడిరది! కాని అది ఆత్మ విశ్వాసంతో, స్వస్వరూప జ్ఞానంతో జ్వలిస్తూంది! ఒక ఆది పరాశక్తిలా, ఒక దుర్గా దేవిలా గోచరించిం దామె. అత్త, మగడు ఆ ఉగ్ర రూపానికి కంపించారు. సిగ్గుతో అవమానంతో తలలు వంచుకున్నారు. మహిత పిల్లలు తమ తల్లివైపు అబ్బురంగా, ఆరాధనగా చూస్తున్నారు. అమ్మ విశ్వరూపాన్ని చూశారు మరి!

          ఆడవాళ్ళను పూజించకపోయినా పర్వాలేదు. గౌరవిస్తే చాలు!

*****

Please follow and like us:

2 thoughts on “మెరుగైన సగం (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)”

  1. ప్రస్తుత పరిస్థితులకు దర్పణం ఈ కథ. ఇంకా చాలా చాలా
    సంసారాల్లో ఈ జాడ్యం పోలేదు. కథకి చక్కటి
    ముగింపు ఇచ్చారు శర్మ గారు.మహితకు భూదేవికి
    ఉన్నంత ఓర్పు చూపెట్టారు. మహి అంటే భూదేవే కదా;

  2. పాణ్యం దత్తశర్మగారు మధ్యతరగతి జాడ్యాలను కథలో చక్కగా వివరించారు. ఆడవారికి సహనం చచ్చి ఆవేశం పెల్లుబికితే ఎలా ఉంటుందో చివరలో నాయిక పాత్ర చేత చెప్పించారు. వాస్తవానికి దగ్గరగా ఉన్న కథ..రచయితకు అభినందనలు

Leave a Reply

Your email address will not be published.