ఈ తరం నడక – 2

చీకటి గొంతు

(నిర్మలారాణి తోట కవితాసంపుటి “అద్దం నా చిరునామా కాదు” పై సమీక్ష)

-రూపరుక్మిణి. కె

          కవిత్వం అనగానే వెన్నెల ఆరబోసినట్లు సౌందర్య లోకంలో ఊరేగుతున్నట్లు ఎక్కడో ఉద్విజ్ఞమైన భావాలను చూస్తూ అరెరే అని అబ్బురపడాల్సిందే కవిత్వం అంటూ కితాబులు ఇచ్చిన సందర్భాలు మనం కోకోల్లలుగా చూస్తూనే ఉంటాం.

చీకటి ఆకాశం,
చీకటి దారి
చీకటి వెనుక వెలుగు
చీకటి నిండిన ప్రవాహము

          చాలా తక్కువగా కనిపిస్తుంది కవిత్వంలో అందమైన జీవితాన్ని అందితే బావుండు అనుకునే భావ కవిత్వంలో కలల రంగుల్ని ఇష్టపడని వారు ఎవరు ఉండరేమో కానీ చిక్కంతా ఇక్కడే వచ్చింది.

          ఒక స్త్రీ కవిత్వం అయితే అది అందంగా ఉందా మనోభావాల్ని కవిత్వీకరిస్తుందా, ఈతి బాధల్ని రాస్తుందా… అంటూ ముద్రలు కడుతుంది. కొన్నిసార్లు అలాంటి ముద్రల న్నీ దాటుకుంటూ స్త్రీలు కవిత్వం తమ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్న దారివైపు నడవడం మొదలెట్టాక చూసే చూపులో పలకరించే మాటల్లో చాలా మార్పులు వచ్చాయి ఆ మార్పుల్లో భాగంగా స్త్రీలు తాము ఎదుర్కొంటున్న సమస్యలని కవిత్వం చేయడం మొదలుపెట్టాక ముందుతరం రచయితలు ఎన్నో ఎదురు దెబ్బలు ఎదుర్కొని నిల బడ్డారు స్త్రీలు మాత్రమే చూడగలిగిన కోణాల్ని కవిత్వం చేయడంలో సాంప్రదాయపు సంకెళ్ళలో మనుధర్మ సూక్తుల్ని చీకటి కోణాల్ని తవ్వి తీసి దారి సుగమం చేశారు. ఇప్పుడు హింస రూపం మార్చుకుని ఇంకా చీకటి చెర నుంచి బయటకు రావడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉంది ఈ నాటి ఈ తరం మహిళగా నిర్మల గారు మంచి ప్రయత్నం అయితే చేశారు ఈ కవిత్వ సంపుటి నిండా పూర్తి స్త్రీవాదమే కాదు సామాజిక కోణంలో కొత్త నడకని తట్టి చూపారు వస్తువు కొరత కనిపించదు, నూతనత్వం ఉంటుంది అక్కడక్కడ సూటి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అంతే కాక తన కవిత్వంలోపలికి అందరూ ఒక అడుగు వేసి మునక వేయవచ్చు ఇది ఏ వర్గానికో, ఏదో ఒక పక్షానికో ముడి వేసే వీలుండదు. సమసామాజిక వ్యవస్థలోని లొసుగుల్ని జల్లెడ వేస్తుంది యుద్ధభూమిని చూడలేక

/ఇక్కడ వేల గొంతుకలు /గుండెల్లోనే ఉరిపోసుకుంటున్నాయి/ ప్రశ్నించిన గొంతుకు తూటాలే తుది బహుమానమిక్కడ /

రాజ్యం గురించి చట్టాల గురించి మాట్లాడుతూ ఇక్కడ ఇంకా

/అత్యాచారాసులను జెల్లకీడిస్తే/ తలదాచుకోవడానికి అమ్మ గర్భము దొరక్క/ ఆడతనం పురిట్లోనే వణుకుతుంది / అంటూ రాజ్యాధికారం పై దండయాత్ర చేస్తుంది.
మార్పుని ఆశించొద్దు, అది కల అని బాధని వ్యక్తం చేస్తుంది.

          నిర్మల గారికి చుట్టూ ఉన్న మనుషుల పట్ల కాస్త ఆపేక్ష ఎక్కువే అనిపిస్తుంది నిత్యం లేచింది మొదలు మనకు అన్ని వసతులు అమర్చిపెట్టె కరెంటు కష్టాల్ని పంచుకుంటుంది. అంగడి బతుకుల్ని అక్కున చేర్చుకున్న నేర్పు కనిపిస్తుంది. జఖ్మోంకీ బారత్ గీతం అవుతుంది.

/ యుద్ధాలు మనుషుల్ని గెలిచిన దాఖలాలు ఎక్కడా లేవు/ ఏదో రోజు అందరూ కలిసి పోయే యోజనాల మట్టి తప్ప / అంటూ మట్టిలో కలిసిపోతున్న మానవత్వాన్ని గురించి మాట్లాడుతుంది

          పరామర్శలో సఫకేషన్ల మధ్య ఆక్రందనలు, ఆవేదనలు, ఆరాటాలు అన్ని ఇంటెన్సీవ్ కేర్ యూనిట్ లోనే “సురక్షితం”. 
అన్నమాట మాత్రం జేబు బరువు మీదనో…
గుండె బరువు మీదో…
ఆధారపడ్డ జీవితాల్లో చెల్లాచెదురవుతున్న గుండే మంటల్ని, ఆర్థిక లావాదేవీల మధ్య మధ్యతరగతి బతుకులెంత కష్టమో అక్షరాక్షరంలో చెప్తుంది.

          రాజకీయ చదరంగంలో రంగురంగుల మొహాలను అద్దుకొని వస్తున్న నాయకుల్ని మాయ మాటల్ని మూటలుగా కడుతూ పేదవాడి బతుకు ఆటగా చేసి ఎలా బలి తీసుకుంటుందో చెప్తూ ఇప్పుడు
/జానెడు పొట్ట కోసం బతుకు తీగల మీద ముసుగుల గారడి / ఇప్పుడు నేను ఓ కొత్త ముఖం తోడుకొని వస్తా అంటుంది /

          నాయకులు పార్టీల ముసుగుల్లో రాష్ట్రాల్ని తాకట్టు పెట్టి తెచ్చే ఉచితాలలో సగటు మానవుడి బ్రతుకు గల్లంతుని వ్యక్తీకరించిన తీరు బావుంటుంది.

          సామాజిక కోణంలోని స్త్రీ అస్తిత్వంలోకి అడుగుపెడితే ఒక సందర్భంలో నన్ను ప్రవహించనీయండని స్త్రీలందరి తరపున విన్నవిస్తుంది
/ గమ్యాన్ని నేనెప్పుడూ ప్రేమించలేదు తీరపు కంచెల్లో అడుగులకు సంకెళ్ళు వేసి సముద్రాన్ని చేయొద్దు నన్ను ప్రవహించనియ్యండి/ అంటుంది ఇంకిపోయిన ప్రపంచానికి తడి గొంతు కావాలని ఆశవాహాన్ని వెల్లడి చేస్తుంది. అమ్మనై పుట్టినందుకు
పంటి బిగునా నొప్పిని నవ్వై పూయించాను అటువంటి అమ్మను కొంగు చాచే  బిచ్చగత్తె ను చేసినందుకు కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో నిలదీస్తుంది.

/ రేయ్!ఎవడ్రా అక్కడ?
అపుత్రస్య గతిర్నాస్థని కూస్తున్నది!
మాతృత్వపు మహాకావ్యాన్ని అందంగా
నా నెత్తుటి కన్నీళ్ళతో రాస్తున్నది?/

అంతేనా ఆవేదనని అంతా కూడగట్టుకొని ఆడకూతురు బతుకులో ఆత్మాభిమానాన్ని చంపుకుతినే సందర్భాలని గుర్తు చేస్తూ
/ మై లార్డ్..
లూప్ హోల్స్ జల్లెడ నుండి జారగా
మిగిలిన కాసింత న్యాయాన్ని యుగాంతం లోపు అందించవలసిందిగా మనవి / అంటూ విన్నపాల జోలే పడుతుంది.

          మగువను అద్దాల చాటున అంగడి బొమ్మను చేసి ఆడే చోట ఆమెను ఆమెకే గుర్తు చేస్తూ

/ నువ్వంటే గులాబీ రంగు అద్దుకున్న ఆకారం కాదని చర్మపు కోతల వెనక రక్త మోడుతున్న పిడికెడు గుండె అని నీ వాళ్లకు ప్రపంచానికే కాదు నీకు అర్థం కాదు / అంటూ ఆమెలో లోపలి గుండెకు అతుకుల టాకా వేస్తూ త్యాగమే అస్తిత్వం అనుకునే అమాయకత్వాన్ని ప్రశ్నిస్తుంది.

/అనుబంధం ఓ పిచ్చుక గూడు ఎన్నిసార్లు కట్టినా కూలిపోక తప్పదు ఎన్నిసార్లు కూలినా మళ్లీ మళ్లీ అదే పసితనం కట్టిన ప్రతిసారి అదే నమ్మకంతో / ఎలా ఉంటావ్ అంటూ ప్రేమంటే ఉనికి కాదు విశ్వాంతరాల నుంచి వినిపించే గుండె చప్పుడు అని చెప్తుంది
అంతలోనే అమాయకత్వాన్ని ఏదో అద్దుకుంటూ
/ సుట్టుక్కున ఏతాడు తెంపుకు పోవుడు నాకెరుకలే…
గూటిలో దీపం అవ్వడమే
తెలుసు కానీ చీకటవుడేమెరుక?

నిన్నటి గాయాల మీద ఎందుకు అంత మమకారం?/
అంటూ జీవితాన్ని పలుచ పలుచని అక్షరాలతో పలకరిస్తుంది.
జీవితం అంటే ఆకలేసినంత నిజం అని చెప్తుంది.
అన్యధా శరణం నాస్తి అంటూ
/ ఆడతనాన్ని కాదు అమ్మతనాన్ని అడుగడుగునా వణికిస్తుంటే పాలు పట్టడానికి లాలపోయడానికి భయమేస్తోంది రా / అంటూ రక్త మోడుతున్న కన్నులతో కీచకుల పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తుంది.
నిత్యం వండి, వార్చి,వడ్డించే చేతిని చివాట్లు పెట్టే నోటిని, ధిక్కరిస్తూ
/బోనెక్కించడానికి బోలెడు నేరారోపణలు
నోరు ఉండి లేని యంత్రంపై /
/ఒక్కసారి నువ్వు పోసింది పూసింది నువ్వే కడుక్కో రా ఆ బుక్ ఎటు తిండేదో నేనే నీకు పెడ్త/ అంటుంది.

          ఏ ఆడపిల్లకైనా రాజీ తప్పదని ఎవరి యుద్ధం వాళ్లే చేయాలని నీ కత్తి నువ్వే తెచ్చుకోవాలి, ఎవరి దయోదాక్షిణ్యం మీదో ఆధారపడకు అంటూ స్ఫూర్తి వాక్యాలు నింపుతుంది.

          ఎన్నో విషయాలు చెప్పాలని చెప్పలేక ఆగిపోతున్న మాటల్ని బంధాల మధ్య ఫెడరెక్కలు విరిచి కట్టే సమయాన్ని ఛేదించుకొని బయటికి రావడం ఎంత కష్టమో చెప్తూ జాగ్రత్త సుమీ అంటుంది..

          ఆఖరి బొట్టు దాకా ఎటు చూసినా ఎండమావులే ఎదురొస్తున్నాయి గుండె గుండె కో ఇంకుడు గుంత తోడితే తప్ప పొడి బారిన శ్వాసలిక చెమ్మగిల్లవు.. అంటూ ముగిస్తుంది
ఇలా నిర్మల కవిత్వం అంతా గుండె తడి అద్దుకుంటుంది.. “అద్ధం నా చిరునామా కాదు ” తనకు మూడవ కవిత్వ సంపుటి..

          అభినందనలు నిర్మల గారు ఇంకముందు కూడా మీ కవిత్వం నుండి సామాజిక కోణాన్ని ఆశిస్తూ….

*****

Please follow and like us:

3 thoughts on “ఈ తరం నడక – 2 చీకటి గొంతు (నిర్మలారాణి తోట కవితాసంపుటి “అద్దం నా చిరునామా కాదు”పై సమీక్ష)”

  1. స్త్రీ నిత్య జీవితంలో ఎదుర్కొనే పోరాటాలను తన పదునైన కలంతో దిక్కారస్వరంతో స్త్రీల అందరి పక్షాన నిలిచిన “అద్దం నా చిరునామా కాదు” కవయిత్రి తోట నిర్మల రాణి కవిత సంపుటిని సమగ్రంగా సమీక్షించిన రూప రుక్మిణికి కవయిత్రి తోట నిర్మల రాణి కి ఇద్దరికీ అభినందనలు. ఈ కవిత సంపుటి స్త్రీవాద కవిత్వ చరిత్రలో నిలిచిపోతుంది అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు.

  2. స్త్రీవాదము తో పాటు సామాజిక అంశాల్ని స్పృశించిన తోట నిర్మల రాణి మూడవ కవితా సంపుటి అద్దం నా చిరునామా కాదు నుండి చిక్కని కవిత్వం పై చక్కని సమీక్ష రాసింది వర్ధమాన కవయిత్రి రూపా రుక్మిణి రచయితకు సమీక్షకురాలికి ఇద్దరికీ అభినందనలు

  3. నా కవితాక్షరాలను అర్ధం చేసుకొని ఎంతో ఓపికగా ఇంత చక్కని సమీక్షను రాసిన రూప రుక్మిణి గారికి, ప్రచురించిన ‘నెచ్చెలి’ వారికి చాలాచాలా ధన్యవాదాలు🙏

Leave a Reply

Your email address will not be published.