సాయిపద్మకు నివాళి!

-ఉమా నూతక్కి

 

(ప్రముఖ రచయిత్రి సాయిపద్మగారికి నెచ్చెలి నివాళి తెలియజేస్తూంది. ఈ సందర్భంగా ఉమా నూతక్కి గారు రాసిన ఆత్మీయ వాక్యాల్ని నెచ్చెలి పాఠకుల కోసం ప్రత్యేకంగా అందజేస్తున్నాం-)

          పరిచయం ఉన్నవాళ్ళంతా స్నేహితులు కాలేరు. స్నేహితులంతా ప్రాణస్నేహితులు కారు. ఇలా చూసిన, మాట్లాడుకున్న కాసిన్ని రోజుల్లోనే ప్రాణస్నేహితులవ్వాలంటే ఆ లెక్క వేరుగా వుంటుంది. సాయిపద్మా, మాలినీ, నేనూ ప్రాణస్నేహితులం.

          సాయిపద్మని మొదటిసారి చూసినప్పుడే ఆమె ఒక ఫాంటసీలా అనిపించింది. అంతంత పెద్దకళ్ళు, కనీకనిపించనట్టు బుగ్గల్లో చిన్ని చిన్ని సొట్టలు ఈ అమ్మాయి అచ్చంగా ఏదో దివ్యలోకంలోంచి దిగివచ్చింది అనుకునేదాన్ని. జీవితం తనని ఎన్ని రకాలుగా ఆపాలని ప్రయత్నించినా, ఏదో ఒక ప్రత్యామ్నాయ రహదారిని ఎన్నుకుని వెవ్వెవ్వే.. అంటూ వెటకరించే తెంపరిలా అనిపించేది సాయిపద్మ.

          నేను విజయనగరం నుండి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు మొదటిసారి నేనూ మా అబ్బాయి కలిసి వెళ్ళాం తన దగ్గరకి. విజయనగరం జిల్లాలో ఒక Hamletలో పిల్లలకి లంచ్ ప్లేట్లు కావాలని అడిగింది తను. ఆ తర్వాత తనని చాలా సార్లు కలిసాను. ఆ పిల్లలంటే ప్రాణం పెట్టేది. ఫండ్ ఫండ్ ఎప్పుడూ అదే ధ్యాసలో వుండేది. తన పుట్టిన రోజూ, పెళ్ళి రోజూ, కొత్త సంవత్సరం, ఇంకేదో పండగా.. అది ఏదైనా కావచ్చు! మనం విష్ చేసామా, మరి మా పిల్లలకేంటి! అనేది. తనని విష్ చేయడం అంటే, తన హాంలెట్ పిల్లలకి మనం ఏదో ఒకటి చేయడమే.

          నాకు బాగా గుర్తు. ఒకసారి మార్చ్ 11 తన పుట్టిన రోజు పొద్దున్న ” Happy Birthy Day to ME” అంటూ తన పుట్టినరోజుని, తన పిల్లల కోసం జరుపుకుంటున్నా అంటూ వాళ్ళకి సహాయం చేయమని ఒక పోస్ట్ పెట్టింది. అది చూసి మా అబ్బాయి, తన సేవింగ్స్ అన్నీ డ్రా చేసుకుని పరిగెత్తాడు తన దగ్గరకి.

          సాయిపద్మ చాలా తెలివైంది. ఎన్నో డిగ్రీలు చేసింది. న్యాయ విద్యలో మాస్టర్స్ చేసింది. ICWA చేసింది. పుస్తకాలు విపరీతంగా చదివేది. చలం అంటే ప్రాణం. మేమిద్ద రం కూచుని పుస్తకాల గురించి గంటలు గంటలు మాట్లాడుకునే వాళ్ళం. సంగీతం అంటే ఎంతో ఇష్టం తనకి. వాళ్ళమ్మగారి వీణ వుండేది తన దగ్గర. సగంలో ఆపేసిన వీణ ప్రాక్టీస్ చేయాలనేది. పాటలు భలేగా పాడేది. రైఫిల్ షూటింగ్‌లో తను నేషనల్ ప్లేయర్.
ఇదీ అదీ అని కాదు. క్షణం క్షణం చాలెంజ్ విసిరే ఆ అరోగ్యంతో తనన్ని పనులు ఎలా చేస్తోందో అర్థం అయ్యేది కాదు.

          మా ఇద్దరినీ కలిపిన కామన్ పాయింట్ సాహిత్యం కాబట్టి దానిమీద తన అభిరుచి చూసి ఆశ్చర్య పోయేదాన్ని. ఎన్నెన్ని పుస్తకాలు కొనేదో. అది కాక ఇద్దరం కలిసిటొరెంట్స్ ని తెగ మైంటైన్ చేసేవాళ్ళం, బోలెడు పీడీఎఫ్‌లు. ఎన్నో పుస్తకాలు ఒకేసారి మొదలెట్టి, ఒకేసారి పూర్తి చేసి గంటలు గంటలు వాటి గురించి చర్చించుకునేవాళ్ళం. సాయిపద్మ కథలూ, కవిత్వం రెండూ రాసేది. వ్యాసాలు కూడా! తను రాసిన “అకవిత్వం”, ” అమ్మకథలు” , ” సాయిపద్మ కోట్స్” చాలా మంది అభిమానుల్ని సంపాదించి పెట్టాయి తనకి.

          తన జీవితం, మానసికంగా శారీరకంగా తను ఎదుర్కొన్న సవాళ్ళు తనకి ఎన్నో పాఠాలు నేర్పాయి. ముఖ్యంగా మనుషులని కాచి వడపోచే కౌశల్యం అబ్బింది. అన్నిటికీ మించి తనలో తాత్వికత పెంచింది. చిన్నపిల్లలా పకపకా నవ్వుతూనే మనకి నేర్పాలను కున్న ఎరుకనివ్వగల చాకచక్యం అబ్బింది.

          గ్లోబల్ ఎయిడ్ సంస్థ తన మానస పుత్రిక. planning- execution ఎప్పుడూ గ్లోబల్ ఎయిడ్‌కి సంబంధించి ఇదే ధ్యాసలో ఉండేది. ఎవరితో మట్లాడుతుంది? ఎప్పుడు మాట్లాడుతుంది? తన ఆరోగ్యం, తన అభిరుచులూ , ఇంట్లో బయటా తను ప్రేమించే మనుషుల కోసం సమయం… ఇవన్నీ ఎప్పటికీ తెగని ఆశ్చర్యం నాకు. సాయి గురించి ఎంత చెప్పుకుంటే తన సహచరుడు ఆనంద్ గురించి అంత చెప్పుకోవాలి. అలాంటి స్నేహితుడూ, అలాంటి సహచరుడూ దొరకడం ఒకరకంగా తన అదృష్టం.

          సర్వీస్ చేయగల ఏ అవకాశాన్ని సాయి వదులుకునేది కాదు. ఒక అంబులెన్స్ వుండి మూడు ఉత్తరాది జిల్లాల్లో ట్రైబల్ ఏరియాల్లో జనాలకి మెడికల్ కాంపుల్లాంటివి పెట్టగలిగితే బావుండు అనేది ఎప్పుడూ. అలానే LIC Golden Jubilee Foundation నుండి గ్లోబల్ ఎయిడ్ సంస్థకి అదునాతనమైన సదుపాయాలతో కూడిన అంబులెన్స్ సాంక్షన్ అయింది. ఉమా వాళ్ళ అంబులెన్స్ అని సంబరపడుతూ చెప్పేది అందరికీ. నిజానికి LIC అలా ఇవ్వగలదు అని చెప్పడం తప్ప నేను చేసింది ఏమీ లేదు. మనం చేసిన చిన్న మాట సాయాన్ని అలా చెప్పుకోవడం సాయి తత్వం.

          కనీసం ఒక మూడేళ్ళపాటు మేం కలవని రోజులు తక్కువ. మా కాఫీ సమయాలు మా All Time Favorites.

          ఎంత చెప్పుకున్నా ఈ దుఃఖం తీరదు. ఇప్పుడు తను వెళ్ళిపోయింది. ” పిల్లా! ఓ మాటు ఫోన్ సేస్తవేటి?” అంటూ ఉత్తరాది యాసలో ఫక్కుమనే వాయిస్ మెసేజులు నాకింక రావు. జీవితపు నలుపు తెలుపులను తెలుసుకుని, అయినా రంగురంగుల స్వప్నాలను చివరిదాకా వదులుకోకుండా బతగ్గలిగిన సాయిపద్మ తన స్నేహితురాళ్ళకి మాత్రం లోటుని మిగిల్చి వెళిపోయింది.

          బతికున్నంతకాలం నాలుగడుగులు గట్టిగా వేయడానికి ప్రయాసపడింది గానీ, తన అడుగుజాడల్ని మాత్రం బలంగానే వేసి వెళ్ళింది. తనని తలచుకుంటూ ఈ నాలుగు ముక్కలు రాస్తుంటే ఈ పక్కనే కూచుని మాటలాపి, పని చూడు పిల్లా అని కసురుతున్న ట్టే వుంది.

*****

Please follow and like us:

4 thoughts on “సాయిపద్మకు నివాళి!”

  1. సాయి పద్మ గారి వ్యాసం చదువుతుంటే కళ్ళనీళ్ళు వస్తున్నాయి .ఎంత మంచి వారైనా పద్మ గారికి హృదయపూర్వక కన్నీటి నివాళులు అర్పిస్తున్నాను

  2. ఉమా నూతక్కి గారి సాయి పద్మ కి నివాళి చదువుతుంటే ఎంతో దుఃఖం కలిగింది. సాయి పద్మ గారి గురించి ఇదివరకే తెలుసు గాని ఉమా నూతక్కి ద్వారా తెలుసుకున్న మరిన్ని విషయాలు కళ్ళకి నీళ్లు తెప్పించాయి. సాయి పద్మ జీవితాన్ని ఎంత స్ఫూర్తిదాయకంగా మలచుకుందో అర్ధమై హృదయం ఆర్ద్రమైంది.
    ‘ జీవితపు నలుపు తెలుపులను తెలుసుకొని, అయినా రంగురంగుల స్వప్నాలను చివరిదాకా వదులుకోకుండా బతకగలిగిన సాయి పద్మ తన స్నేహితురాళ్ళకి మాత్రం లోటును మిగిల్చి వెళ్లిపోయింది’

    బతికున్నంత కాలం నాలుగడుగులు గట్టిగా వేయడానికి ప్రయాస పడింది గానీ తన అడుగుజాడల్ని మాత్రం బలంగానే వేసి వెళ్ళింది ‘ అన్నమాటలు సాయిపద్మ వ్యక్తిత్వాన్ని తెలియజెప్పాయి. సాయి పద్మను ఇలా స్మరించుకున్నందుకు ఉమా నూతక్కి గారికి ధన్యవాదాలు.

  3. సాయిపద్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. చూస్తూ ఉండగానే కనుమరుగై పోయింది.. నివాళులు🙏💐

Leave a Reply

Your email address will not be published.