తులసి

(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

-డాక్టర్ ఎమ్ సుగుణ రావు

          ధీరజ్‌ బెంగుళూరు వచ్చి రెండు రోజులయ్యింది. అతను ఒక ముఖ్యమైన పనిమీద వచ్చాడు. ఐదేళ్ళ తర్వాత ఇండియా రావడం. అమెరికాలోని మసాచూట్స్‌ విశ్వ విద్యాలయంలో కంప్యూటర్‌ సైన్స్‌లో పిహెచ్‌.డి. చేశాడు. ప్రస్తుతం అక్కడే ఉద్యోగం. స్వస్థలం విజయవాడ. ముందుగా అమ్మానాన్నలను కలవకుండా బెంగుళూరు రావడం ఇష్టం లేదు. అయినా వారి అభీష్టం మేరకే, బెంగుళూరు రావలసి వచ్చింది. ఒకరోజంతా పూర్తిగా విశ్రాంతి తీసుకుని తను బస చేసిన బెంగుళూరు గేట్‌ హోటల్‌ నుంచి బయట పడ్డాడు. ఆ చుట్టుపక్కల అంతా యువతీ, యువకులతో నిండిపోయి ఉంది. అక్కడకు దగ్గరలోనే రెండుమూడు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలున్నాయి. ఆ కంపెనీల్లో పనిచేసే ఆడా, మగా అంతా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.
 
          సాయంత్రం ఐదయింది. డిసెంబర్‌ మాసం. బెంగుళూరు వాతావరణం మరింత చల్లగా ఉంది. నడుస్తున్న వాడల్లా, ఒక కాఫీ బంక్‌ దగ్గర షాక్‌ తగిలినట్టు ఆగిపోయాడు. అక్కడ చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు కాఫీలు, టీలు తాగుతూ కబుర్లలో పడ్డారు. ఆ అమ్మయిల మధ్యలో తెల్లగా, పొడుగ్గా ఉన్న ఒక అమ్మాయిని చూసి, ఒకసారి అతని గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. ఆ అందరిలో ఆమె ప్రత్యేకంగా ఉంది. జుట్టు ముడి వేయకుండా, జడ వేయకుండా వదిలేసింది. మోకాలి క్రింద వరకూ ఫ్రాక్‌, స్లీవ్‌లెస్‌.
వాళ్ళమధ్య దేవకన్యలా మెరిసిపోతోంది. అయితే ఆమె వేళ్ళ మధ్య కాలుతున్న సిగరెట్‌ను చూసి అతనికి కాస్త అలజడి కలిగింది. తాను ఇంత వరకూ గడిపిన విదేశీ జీవితంలో ఆడపిల్లలు సిగరెట్లు కాల్చడం తనకు ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. ఆ సమయంలో అమ్మానాన్నలు తనను ప్రత్యేకంగా బెంగుళూరు పంపిన ముఖ్యమైన విషయం మరోసారి మదిలో మెదిలింది. తను బెంగుళూరులో ఒక అమ్మాయిని కలవడం కోసం వచ్చాడు. అది ఒకరకంగా పెళ్ళిచూపులే. అమ్మానాన్నలు ఆ అమ్మాయిని చూసేశారు, మాట్లాడేసుకున్నారు. అయితే పెళ్ళి చేసుకునే తాము ఒకరినొకరు చూసుకో లేదు. తనకు ఆ అమ్మాయి ఫోటోలు పంపారు. తనకు నచ్చింది. ఆ అమ్మాయి కూడా తన ఫోటో చూసి తన వివరాలు తెలుసుకుని, తాత్కాలికంగా ఒకే చెప్పేసిందట. ఇక ఫైనల్‌గా తాము ఇద్దరూ కలుసుకోవడం, మాట్లాడుకోవడం, పెళ్ళి డేట్‌ ఫిక్స్‌ చేయడం.
 
          ఆ అమ్మాయికి కనబడకుండా కొంచెం దూరంగా నుంచుని చూస్తూనే ఉన్నాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. కారణం… తను పెళ్ళిచూపులకు చూసుకోవడానికి వచ్చింది ఆ అమ్మాయినే! ఆమె దృష్టిలో తను పడతాడేమోనని.. వెనక్కితిరిగి వేగంగా నడుస్తూ హోటల్‌ రూముకు చేరుకున్నాడు. గదిలో ఏ.సీ. చలి పుట్టిస్తున్నా.. వొళ్ళంతా వేడిగా, మనసులో బాధగా అనిపించింది. తను ఊహించని దృశ్యం అది. తనలోని సగటు మగవాడు బయటకు వచ్చాడు. లాప్‌టాప్‌ తెరిచి, ఆమె బయోడేటాలోకి దృష్టిసారించాడు.
 
          చెన్నై ఐఐటిలో ఇంజనీరింగ్‌, ఆ తరువాత అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీలో ఎమ్‌.ఎస్‌. అక్కడ వచ్చిన మంచి అవకాశాలను వదిలేసుకుని బెంగుళూరు వచ్చేసింది. ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో వైస్‌ ప్రెసిడెంట్‌. అమ్మా, నాన్నా ఆమె చిన్నప్పుడే విడిపోయారు. తల్లే పెంచి పెద్ద చేసింది. తల్లి ఉండేది విజయవాడలో. ఆమె వివరాలన్నీ చదివి ఆలోచనలో పడ్డాడు.
 
          ఆమెను కలవాల్సింది రేపే. ఇప్పుడు అనుకోకుండా తను ఊహించని రీతిలో ఆమె ప్రత్యక్షమైంది. ఇంతలో ఫోన్‌ మోగింది. ఇంజనీరింగ్‌ కాలేజీలో డిగ్రీ చదివినప్పటి తన క్లాస్‌మేట్‌ ధనుంజయ్‌ ఫోన్‌ చేశాడు.
 
          ధనుంజయ్‌ ఆమె కొలిగ్‌ అని తనకు బెంగుళూరు వచ్చిన తర్వాత తెలిసింది. ఫ్లైటు దిగ్గానే మెసేజ్‌ పెట్టాడు. తులసి గురించిన సమాచారం కావాలని. తనకు అలా అడగడం గిల్టీగా అనిపించింది. పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి గురించి తను ఎంక్వైరీ చేయబోతున్నాడా… ఇది సబబా! తను ఆమెను కలిసినప్పుడు, తన గురించి తెలుస్తుంది కదా అనుకుంటే, అమ్మా నాన్నలు బాబాయ్‌లు ఆమె గురించి ఎంక్ష్వైరీలు మొదలెట్టారు. తన మిత్రుడు ధనుంజయ్‌ ఆమెతో కలసి పనిచేస్తున్నాడని చెప్పింది కూడా వారే.
ఫోనెత్తాడు.
 
          “హలో బాస్‌… ఎలా వున్నావ్‌..? బెంగుళూరు ఎప్పుడు వచ్చావ్‌” అవతలివైపు నుంచి ధనుంజయ్‌ పలకరింపు. 
 
          “రెండ్రోజులైంది. తులసి మీ కంపెనీలో పనిచేస్తుంది కదా! తెలుసా నీకు?” అన్నాడు.
 
          “అవును ఆమె మా బాస్‌. “ద స్మోకింగ్‌ గాళ్‌” అన్నాడు.
 
          ఆ మాటలకు మళ్ళీ గుండె వేగంగా కొట్టుకుంది ధీరజ్‌కి. ఏమీ మాట్లాడలేక పోతున్నాడు.
 
          అతను చెప్పుకుంటూ పోతున్నాడు “ఆమె వర్క్ హాలిక్‌ అనడం కన్నా, వర్క్‌ లవర్‌ అని అనవచ్చు. పనిపట్ల నిబద్ధత, అలాగే పనిలో సృజనాత్మకత ఉండేలా… టీమ్‌ను నడిపిస్తుంది. ఇంతకీ ఆమెకు గురించిన వివరాలు దేనికి?” అన్నాడు.
 
          “ఎలయన్స్‌ కోసం” అన్నాడు ధీరజ్‌. 
 
          “ఎవరికి?” ఆ మాటల్లో కాస్త అనుమానం.
 
           “నాకు కాదులే అంటూ” అబద్ధం చెప్పాడు.
 
          “ఓహ్‌.. మంచి అమ్మాయే. ఈ రోజుల్లో అలాంటివారు అరుదు. సోషల్‌ యాక్టివిటీస్‌లో కూడా ముందుంటుంది” ఇంకా అతను చెబుతున్న మాటలను కట్‌ చేసి “సరే కలుద్దాం” అంటూ ఫోన్‌ పెట్టేసాడు.
 
          మంచం మీద వాలిపోయిన ధీరజ్‌కి, పావుగంట క్రితం ఆమెను చూసిన దృశ్యమే గుర్తుకొస్తోంది.
 
          “ఎంత బావుందో… మిగిలిన అమ్మాయిల మధ్య ప్రత్యేకంగా మెరిసిపోతోంది. కానీ వేళ్ళమధ్య కాలుతున్న సిగరెట్‌. ఆ దృశ్యం పదే పదే గుర్తొచ్చి, మనసులో ఏదో కలత.
ధీరజ్‌కి తలంతా దిమ్ముగా ఉంది. విశ్రాంతి తీసుకున్నా. జెట్‌లాగ్‌ వల్ల వచ్చిన అలసట తీరినా, ఏమిటో ఈ తలపోటు అనుకుంటూ భారంగా నడుం వాల్చాడు. నిద్ర పట్టేసింది.
లేచి చూసేసరికి గడియారం రాత్రి పది చూపుతోంది. రూమ్‌ లాక్‌చేసి బయటకు వచ్చాడు.
 
          బెంగుళూరు నగరం దేదీప్యమానంగా వెలుగుతోంది. నడుచుకుంటూ చుట్టుపక్కల హోటళ్ళని పరిశీలిస్తూ ముందుకు సాగుతున్న ధీరజ్‌కి ‘యూత్‌’ పబ్‌ అనే బోర్డు కనిపించింది. ఆ పబ్‌ ముందు నీలం రంగు యూనిఫాంలో ఉన్న సెక్యురిటీ, “రండి సార్‌” అన్నాడు.
 
          ఒక్కక్షణం ఆలోచనల్లో పడి ‘మూడ్‌ బాగోలేదు. కాసేపు రిలాక్స్‌ అవుదాం అను కుంటూ లోపలకు నడిచాడు. లోపల సంగీతపు హోరు. 1980 ప్రాంతంలో వచ్చిన “’బోనియం” ఇంగ్లీషు పాట ‘రారా రస్‌పుత్తీన్‌’. దానికి లయబద్ధంగా అడుగులు వేస్తున్న యువతీ యువకులు. ఒక టేబుల్‌ దగ్గర కూర్చుని, చుట్టూ చూస్తున్నాడు.
 
          వెయిటర్‌ వచ్చి “ఏమి కావాలి” అని అడిగాడు.
 
          “ఒక లెమన్‌ సోడా మాత్రమే” అన్నాడు.
 
          నిముషం తర్వాత తనకు పొడుగు గాజు గ్లాసులో నురగలు కక్కుతున్న సోడా ఇచ్చి వెళ్ళిపోయాడు వెయిటర్‌.
 
          ధీరజ్‌ మెల్లగా సిప్‌ చేస్తూ చుట్టూ చూశాడు. కొంచెం దూరంలో పల్చగా వెలుగు తున్న లైట్ల వెలుగులో కనిపించిన అమ్మాయిని చూసి మళ్ళీ షాక్‌కు గురయ్యాడు.
ఆమె తులసి.
 
          గబగబా బిల్లు చెల్లించి, ఆ పబ్‌లోంచి బయటకొచ్చి నడుస్తున్నాడు. అది వెన్నెల రాత్రే అయినా, అమావాస్యలా అనిపించింది. మనసులో దిగులు మేఘం కమ్ముకున్న ట్టయ్యింది. రూమ్‌కు వచ్చి భోజనం ఆర్దరిచ్చి, ఏదో అయిందనిపిచ్చి, మంచం మీద వాలాడు. చాలాసేపు వరకూ నిద్రపట్టలేదు. ఆమె గురించే ఏవో ఆలోచనలు. అలా ఆలోచనలతోనే ఎప్పుడో తెల్లవారుఝామున నిద్రపట్టింది. లేచేసరికి ఉదయం తొమ్మిది.
ఆ రోజు ఉదయమే తను తులసిని కలవాల్సింది. అరగంటలో గబగబా తయారయ్యాడు. ఇంతలో ఫోన్‌. అవతల తులసి.
 
          “ఒక ముఖ్యమైన పనుంది. ఒక గంట పడుతుంది. మాతో రాగలరా? లేదా సాయంత్రం వచ్చి నేనే కలుస్తాను” అంది.
 
          “మనం కలిసి మాట్లాడుకోవచ్చు, నేను జాయిన్‌ అవుతాను మీతో” అన్నాడు.
 
          “అరగంటలో మీ దగ్గరకు వస్తాం, మీరు అరగంట తర్వాత కిందకి దిగండి” అంది
 
          “సరే” అంటూ ఫోన్‌ పెట్టేశాడు.
 
          అప్పటికే హోటల్‌ గదిలో తయారై ఉన్నాడు. తలస్నానం చేసి తెలుపురంగు టీ షర్ట్‌, నీలం జీన్‌ ఫాంటు తొడుక్కుని, పదే పదే టైం చూసుకుంటున్నాడు. అరగంట గడవక మునుపే లిఫ్ట్‌ దిగి హోటల్‌ కిందకు వచ్చాడు. ఐదు నిముషాల తర్వాత హోటల్‌ ముందుకుకారొచ్చి ఆగింది.
 
          డ్రైవ్ చేస్తున్న తులసి. నవ్వుతూ చూసి, కారు డోరు తెరిచింది. బారుగా ఉన్న జడ, కోల ముఖం, నుదుటి మీద వెలుగు రేఖలా మెరుస్తున్న నిలువుబొట్టు. ప్రశాంతంగా ఉన్న ముఖం. ఆకుపచ్చరంగు చుడీదార్‌, ‘పైజమా. మెడ నుంచి కిందికి చుట్టిన దూపట్టా. వెనుక సీటులో ఇద్దరమ్మాయిలు, ఒకబ్బాయి. కారు ముందుకు కదిలింది. వారిని పరిచయం చేసింది ధీరజ్‌కు.
 
          ఎప్పుడొచ్చారు, వంటి వివరాలు అడుగుతోంది. ఆమె మాటలకు సమాధానాలు చెబుతున్నా ఆలోచనల్లో కూరుకుపోతున్నాడు ధీరజ్‌. అరగంట తర్వాత కారు, ఆ వీధి మలుపులు దాటి, కొంచెం నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపక్కనున్న గుడి దగ్గర ఆగింది.
ఆ గుడిముందు భక్తులు పల్చగా ఉన్నారు. గుడి పక్కనే బాగా పెరిగిన గడ్డం, తైల సంస్కారం లేని జుట్టు, చాలా రోజులుగా స్నానం చేయనట్టున్న దేహం. చిరిగిన బనీను, మాసిపోయిన లుంగీలో ఒక యాచకుడు.
 
          కారు దిగిన తులసి ఆ యాచకుడితో ఏదో మాట్లాడింది. అతను రెండు చేతులు జోడించి, ఆమె కాళ్ళకు నమస్కారం చేయబోయాడు. ఆమె దూరంగా జరిగి, కారు దగ్గరకు పరుగెత్తి, డిక్కీలోంచి బ్యాగ్‌ తీసింది. బ్యాగ్‌లోంచి ఒక బట్ట అతని చుట్టూ కప్పింది. ఆ బ్యాగ్‌లోంచి తీసుకున్న కత్తెర అతని నెత్తిమీద చకచకా కదిలింది. పావుగంటలో అతని క్షవరం పూర్తయ్యింది. బాగా పెరిగిన అతని గడ్డాన్ని కూడా ఆమె తొలగించింది. కారు వెనుక కూర్చున్న ఆమె కొలిగ్స్‌ కూడా ఆమెకు సాయపడ్డారు. బకెట్‌తో నీళ్ళు తెచ్చారు. షాంపుతో అతనికి తలస్నానం చేయించింది.
 
          ఇదంతా చూస్తున్న ధీరజ్‌ విస్మయానికి లోనయ్యాడు. అతని దగ్గరకు వెళ్ళడానికి బయపడిన తను దూరంగా ఉండి చూస్తున్నాడు. ఆ యాచకుడి చుట్టూ ఈగలు, ముక్కు మూసుకునేలా ఉన్న దుర్గంధం. ఒక తల్లి పిల్లాడికి స్నానం చేయించినట్టుగా ఆమె అతనికి స్నానం చేయించింది. కారులోంచి తీసుకొచ్చిన, తెల్లచొక్కా తెల్లలుంగీ అతని కిచ్చింది. అతను వొళ్ళు తుడుచుకుని ఆ బట్టలు వేసుకున్నాడు. ధీరజ్‌ అతన్ని చూసి మరింత ఆశ్చర్యపోయాడు. అంతకు ముందు అరవై ఏళ్ళ వృద్దుడిలా కనిపించిన వ్యక్తి, నలభై ఏళ్ళ యువకుడులా మారిపోయాడు.
 
          తులసితోపాటు వచ్చిన ఆ ఇద్దరూ భోజనం పాకెట్‌ ఆ వ్యక్తికి అందించారు. అతను ఆనందంగా వాటివంక చూస్తూ, మళ్ళీ నమస్కారం చేస్తూ, తులసి కాళ్ళమీద పడ బోయాడు.
 
          “ఫర్వాలేదు బాబూ! మీకేదయినా పని ఏర్పాటు చేస్తాను. ఇక నుంచి శుభ్రంగా ఉండండి. మళ్ళీవచ్చి కలుస్తాను” అంటూ తన కారువైపు కదిలింది.
 
          ధీరజ్‌ ఆమెవంక చూస్తూ ఉండిపోయాడు. ఆమెలో సేవా, కరుణ కలిసిన అమ్మ తనం ఆ అందాన్ని మరింత ద్విగుణీకృతం చేసింది అనుకున్నాడు.
 
          మళ్ళీ కారును తనున్న హోటల్‌ వైపుగా నడిపించింది తులసి. అప్పటికే మధ్యాహ్నం అయ్యింది. కారు దిగి, తాళాలు తన వెనుకనున్న అబ్బాయికిచ్చి
“సాయంత్రం కలుద్దాం.. బై” అంటూ చేయి ఊపింది.
 
          ఆ అబ్బాయి డ్రైవింగ్ సీటులోకి వచ్చి కారును ముందుకు నడిపిస్తూ, ఆ ఇద్దరినీ చూసి నవ్వుతూ చేయి ఊపాడు. వెనుక సీటులో ఉన్న అమ్మాయిలు “హేవ్‌ ఎ నైస్‌ డే” అంటూ వాళ్ళకి బై చెప్పారు.
 
          లిఫ్ట్‌లో తన రూముకి చేరుకున్నారిద్దరూ. లోపలకు అడుగు పెడుతూనే, “ప్రెష్‌ అయ్యి వస్తాను” అంటూ వాష్‌రూమ్‌కి వెళ్ళింది.
 
          “భోజనం ఆర్దరిస్తాను” అంటూ ఆమెతో చెప్పి రెస్టారెంట్‌కు ఫోన్‌ చేశాడు.పావుగంట తర్వాత వాష్‌ రూమ్‌ నుంచి వచ్చిన ఆమె అలసటగా ఆ గదిలోని సోఫా వెనక్కివాలి “ఒక విషయం… ఏమీ అనుకోరుగా..” అంటూ తన బ్యాగ్‌లోంచి సిగరెట్‌ ప్యాకెట్‌ తీసింది. సిగరెట్‌ అతడికి ఇవ్వబోతుంటే…
 
          “నో, థాంక్స్‌” అన్నాడు చిన్నగా నవ్వి.
 
          సిగరెట్‌ తీసుకుని, ఆ హోటల్‌ గది బాల్కనీలోకి వెళ్ళింది. సిగరెట్‌ వెలిగించి పొగ పీల్చి వదులుతూ ఆమె ఆ రోడ్డున పోయే వాహనాలను, మనుషులను చూస్తూ నుంచుంది.
ధీరజ్‌ మనసు అస్థిమితంగా ఉంది. మనసులో ప్రశ్నను బయట పెట్టేశాడు.
 
          “మీకు ఈ సిగరెట్‌ ఎలా అలవాటయ్యింది” అన్నాడు.
 
          “అవును మంచి ప్రశ్నే వేశారు. దానికి బోల్డు కథ చెప్పాలి” అంటూ బాల్కనీకి ఆనుకునే ఉన్న గోడమీద చేతులు అన్పి చెప్పడం మొదలెట్టింది.
 
          “మా అమ్మానాన్నలది ప్రేమ వివాహం. పెద్దల్ని ఎదిరించి పెళ్ళి చేసుకున్నారు. కారణం నాన్నది లోయర్‌ మిడిల్‌ క్లాస్‌. అమ్మ గొప్పింటి పిల్ల. నాన్నకు సరైన ఉద్యోగం దొరక్క ఒక బిల్డర్‌ దగ్గర పనిచేసేవాడు. అయితే ఆ బిల్డర్‌కి లాస్‌ రావడంతో, ఆయన తన బిల్డింగ్‌ కన్స్‌స్ట్రక్షన్‌ ఆపేసాడు. నాన్నకు ఉద్యోగం లేకుండా పోయింది. రకరకాల ఉద్యోగాలు చేశాడు. అప్పటికే నేను అమ్మ కడుపులో పడ్డాను. అమ్మను బాగా చూసుకో వడం కోసం అప్పులు చేయడం మొదలెట్టాడు నాన్న నేను భూమ్మీద పడిన తర్వాత కూడా మా నాన్న ఎక్కడా స్థిరమైన ఉద్యోగం సంపాదించలేకపోయాడు. అమ్మలో అసంతృప్తి, తను ఊహించని జీవితం. దాంతో గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవల తోటే నా బాల్యం గడిచింది. నేను ఎల్‌కెజిలోకి వచ్చేసరికి ఆ గొడవలు తారాస్థాయిని అందుకున్నాయి. అమ్మకు అసహనం ఎక్కువైంది. నాన్నకు తాగుడు అలవాటైంది. నేను పదవ తరగతికి వచ్చేసరికి ఒకరోజు జరిగిన పెద్ద గొడవతో, నాన్న తాగి వచ్చి, అమ్మ ను కొట్టడంతో, అమ్మ నన్ను తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. నాన్నను విడిచిపెట్టాలని నిర్ణయించుకుంది. నాన్న వచ్చి బతిమాలినా, అమ్మ కరగలేదు. ఇంటికి వచ్చిన నాన్న ను అమ్మమ్మ, తాతయ్యలు పనివాళ్ళచేత గెంటించేశారు. అమ్మకు విడాకులు మంజూర య్యాయి. ఆర్థిక స్థిరత్వం లేని ఒక తాగుబోతు దగ్గర కూతుర్ని ఉంచడం ఇష్టం లేదంటూ, అమ్మ శాశ్వతంగా నాన్న నుంచి నన్ను దూరం చేసింది. నేను ఇంట్లోంచి బయటకు వచ్చి స్కూలుకు వెళుతున్నప్పుడు నాన్న నన్ను దూరం నుంచే చూసి వెళ్ళిపోయేవాడు. నేను ఆఖరి సారిగా నాన్నను చూసింది ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో చేరినప్పుడు. మనం ఇందాక ఆ గుడి దగ్గర చూసిన యాచకుడిలా ఉన్నాడు. ఆయన్ని చూస్తే జాలేసింది. నాన్నకు స్నానం చేయించి, మంచి బట్టలు తొడగాలనిపించింది. గబగబా నాన్న దగ్గరకు పరుగెత్తాను. ఆ సమయంలో వచ్చిన అమ్మ, నాన్న దగ్గరకు వెళుతున్న నన్ను లాక్కెళ్ళిపోయింది. నాన్న ఏడుస్తూనే అక్కడ్నించి కదిలాడు. నా కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నా అమ్మ నన్ను నాన్న దగ్గర్నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకే, నాన్నఏ దిక్కూ మొక్కూ లేకుండా చనిపోయాడని, బంధువు లు అంత్యక్రియలు జరిపారని తెలిసి నా గుండె పగిలింది. నాన్నను మరచిపోవడానికి నేను చదువు మీద దృష్టి పెట్టాను. ఐఐటిలో సీటు వచ్చింది. హాస్టల్లో, ఆ ఒంటరితనంలో నాన్న దీనంగా చూస్తున్న ఆ చూపులు, ఆ బాధ నన్ను కృంగదీసేవి. ఆ సమయంలోనే నాకు తోడుగా దొరికింది ఈ నేస్తం” అంటూ కాలుతున్న సిగరెట్‌ను అతనికి చూపించింది.
ఆమె మాటలకు ధీరజ్‌ కళ్ళనుంచి నీళ్ళు జలజలా రాలాయి.
 
          “ఎవరైనా రోడ్డు మీద అలా దీనంగా, ఇందాకటి యాచకుడిలా స్నానపానాలు లేకుండా చూస్తే నాకు నాన్నే గుర్తుకొస్తాడు. ఇక ఆగలేను. అలాంటి క్షతగాత్రులలో నాన్నను చూసుకుంటాను. నాన్నకు చేయలేని పనిని, వారికి చేస్తాను. అందుకు నాకు సాయం చేసే మిత్రులు నాకు దొరకడం నా అదృష్టం” అంటూ కళ్ళు తుడుచుకుంది.
 
          “ఒక్కక్షణం” అంటూ ధీరజ్‌ వాష్‌రూమ్‌లోకి వచ్చి, తలుపు మూసి జేబులోంచి సిగరెట్‌ పెట్టెలోని ఆఖరి సిగరెట్‌ తీసి వెలిగించాడు. ఇదే ఆఖరిది అనుకుంటూ ఆ సిగరెట్‌ చివరి వరకూ కాల్చి, తన గదిలోకి వచ్చాడు. బ్యాగ్‌ తెరిచి ఒక సీసా బయటకు తీశాడు. సగం ఖాళీగా ఉన్నఆ సీసాలోని ద్రవాన్ని, తనకు అప్పుడప్పుడు మత్తు కలిగించే ఆ ద్రవాన్ని టాయ్‌లెట్‌లోకి వంపి ఆ సీసా డస్ట్‌విన్‌లో పడేశాడు. ఆమె బాల్కనీ లోంచి బయటకు వచ్చింది. తన సంచిలోంచి చిన్న కవర్లో మట్టితో నింపిన ఒక మొక్క “ఇది నా బహుమానం” అంటూ అతనికి అందించింది.
 
          అతను ఆశ్చర్యంగా, ఆనందంగా ఆ మొక్కవంక చూశాడు.
 
          “ఆమె తెరిచిన పుస్తకం. ఎంతటి పారదర్శకత. మరి తను ముసుగులోంచి బయట కు రాలేకపోతున్నాడు. తను ఆమె వ్యక్తిత్వానికి సరితూగాలంటే ఎంత కాలం పడు తుందో… బహుశా జీవితకాలమేమో… ఇంతటి మహోన్నత వ్యక్తిని తను వదులుకో వడమా’ మనసులో అనుకొని ఆమెవైపు తిరిగి అన్నాడు…
 
          “ఇంటికి ఫోన్‌ చేయబోతున్నాను… పెళ్ళి ముహూర్తం పెట్టించమని. మీకు ‘ఒకేనా”
ఆమె నవ్వుతూ చూసి అతని చేయి పట్టుకుని నొక్కింది. ఆమె బహుమతిగా ఇచ్చిన ఆ తులసి మొక్కను చేతిలోకి తీసుకున్నాడు ధీరజ్‌.

*****

Please follow and like us:

3 thoughts on “తులసి(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)”

  1. ‘తులసి ‘ కధ, కధనం బాగున్నాయి! రచయితకు అభినందనలు!!
    అంతటి వ్యక్తిత్వం గల తులసి, పెళ్లిచూపులకు వచ్చిన వరుణ్ణి, కారులో తీసికెళ్లి చూపించిన దృశ్య సంఘటన, కధకు అవసరమే అయినా.. ఎబ్బెట్టుగా, స్కొత్కర్షగానూ అనిపించింది!
    చివర ముగింపులో.. ధీరజ్ లో వచ్చిన మార్పుతో బాటుగా, తులసితో ‘ మీ అలవాటుకు బలమైన కారణముంది! ఏ సంజాయిషీ యిచ్చుకోలేని నా దుర్గుణాలను ఈరోజుతో వదులుకుంటున్నాను! మీ ఈ అలవాటు మీ పేరుకు శోభ కాదు! ఈ రోజు నుండి మనం మన ప్రేమ మత్తులో వీటికి దూరంగా ఉందాం!! ఏమంటారు? ‘ అనే సంభాషణతో ముగింపు చేస్తే బాగుండేదేమో!.. అని రచయిత సుగుణరావు గారికి విన్నపం!

  2. సాధారణంగా బాహ్యరూపం చూసే మనుషుల్నిఅంచనా వేయడo జరుగుతుంది. తులసి లాంటి వ్యక్తులు అరుదు కనుక. కథనం ఆగకుండా చదివించింది. అభినందనలు.

  3. రచయత గారు చాలా బాగుంది తులసి. ఐతే అటువంటి వ్యక్తిత్వాలు వాస్తవిక జీవితం లో చాలా అరుదేమో! కథలో తులసి లాంటి వ్యక్తిత్వం గల నూతి కి ఒకరైనా చాలు.ఎప్పటికైనా మన సమాజం బాగు పడుతుందని ఆశించవచ్చు.అభినందనలు.

Leave a Reply

Your email address will not be published.