తులాభారం

(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

-విజయ్ ఉప్పులూరి

          “చూడు తల్లీ! నేనిలా చెప్పాల్సిన రోజు వస్తుందని ఏ నాడూ అనుకోలేదు. అమ్మ పోయిన బాధ నుంచి నువ్వింకా తేరుకోకముందే నీకు మరో చేదు వార్త చెప్పక తప్పడం లేదు. నాకూ చివరి ఘడియ సమీపిస్తోందని సాయంత్రం డాక్టర్ గారు చెప్పారు. నా చెస్ట్ ఎక్స్ రే, ఈ.సి.జి, ఏకో టెస్ట్ మొదలైనవి పరిశీలించాక నా గుండె బాగా సాగి ఎన్లార్జ్ అయిందనీ, ఎంత ట్రీట్ మెంట్ చేసినా, ఏదో క్షణంలో సడన్ హార్ట్ అటాక్ తో ప్రాణం పోయే ప్రమాదం పొంచి ఉందనీ తేల్చి చెప్పారు.

          నీ పెళ్ళి చేయకుండానే నేనూ కన్ను మూస్తానేమోనని భయంగా ఉంది తల్లీ! లక్షలు పోసి కట్నాల మార్కెట్లో వరుడ్ని కొని తెచ్చే తాహతు నాకు లేదని నీకు తెలుసు. అలా అని నీ పెళ్ళికి తాత్సారం చేసి నిన్ను రక్షణ లేని అబలగా ఈ పాడు లోకం కోరలకు బలి చేయడం నేను ఊహించుకోలేను. ఈ సమస్యకు పరిష్కారంగా ఒక మార్గం తోచింది. కాని, అది వెల్లడించడానికి నాకు నోట మాట రావడం లేదు. విని నన్ను చీదరించు కుంటావని వెరపుగా ఉంది.”

          అలా మాటలు కూడబలుక్కుని చెప్తున్న తండ్రి మాటలు చేష్టలుడిగిన దానిలా వింటున్న పునీత ఇక తట్టుకోలేకపోయింది. “మీరింత దిగులు చెందడం చూసి భరించలేకపోతున్నా నాన్నా! మీరే నిర్ణయం తీసుకున్నా నా మంచి కోసమేనని నాకు తెలియదా? అమ్మ పోవడంతో సగం చచ్చి బ్రతుకుతున్న నాకు మీరు కూడా ఉండరని వింటుంటేనే గుండాగినంత పనవుతోంది. మీరలా మధనపడటం మాని నన్నేం చెయ్య మంటారో దయచేసి చెప్పండి!” పూడుకుపోతున్న గొంతుతో అంతకుమించి మాట్లాడలేక పోయింది పునీత.

          అప్పుడన్నాడు లోకనాథం – “నువ్వు నా మాట కాదంటావని కాదమ్మా! రెండో పెళ్ళివాడ్ని చేసుకోమనడానికి నాకే మనసు రావడం లేదు.”

          క్షణం పాటు ఉలికిపాటుకు గురైనా, అది ముఖంలో కనిపించకుండా జాగ్రత్త పడుతూ తిరిగి తండ్రి మాటలు ఆలకించసాగింది.

          ” ఇలా గుండెలు అవిసే మాట నా నోట పలకాల్సి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు తల్లీ! ఏం చెయ్యను? చావు దగ్గర పడుతున్న సమయంలో గత్యంతరం లేక ఈ నిర్ణయానికి రాక తప్పలేదు. రెండో పెళ్ళివాళ్ళైనా, యోగ్యులైన వాళ్ళు ఇద్దరు నా దృష్టిలో ఉన్నారు. వాళ్ళలో నువ్వు ఎవర్ని చేసుకున్నా నీ క్షేమం గురించి బెంగ లేకుండా నేను కన్ను మూయొచ్చు అని నాకనిపించింది. కానీ……..!

          ” ఎవరు నాన్నా వాళ్ళు?” తండ్రి మాటలకు అడ్డం వస్తూ స్థిరమైన గొంతుతో అడిగింది పునీత.

          “ఇద్దరూ మా ఆఫీస్ లోనే పనిచేస్తున్నారు. ఇద్దరికీ ఇంకా నాలుగు పదుల వయసు దాటలేదు. ఒకరి పేరు అమర్. ఇద్దరు కూతుళ్ళు. ఇద్దరి వయసూ నాలుగేళ్ళ లోపే! భార్యకు గర్భస్రావమై కన్ను మూసింది. రెండో అతని పేరు మోహన్. ఇతనికీ నాలుగేళ్ళ లోపు వయసున్న అడపిల్లలే! భార్య వంట గదిలో చీరకు నిప్పంటుకుని కాలి దుర్మరణం పాలయింది. ఇద్దరూ మా పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్ ఆఫీస్ లోనే డ్రాఫ్ట్స్ మెన్ గా పని చేస్తున్నారు. ఇద్దరికీ దుర్వ్యసనాలంటూ ఏవీ లేవు. పిల్లలకు తల్లి అవసరం ఎంతో తెలిసిన వాళ్ళుగా రెండో పెళ్ళికి మొగ్గు చూపారు. నువ్వు సరేనంటే రేపు ఉదయం ఇద్దర్నీ ఇంటికి పిలుస్తాను. చూసాక నువ్వు ఒక నిర్ణయానికి రావడానికి వీలుంటుంది.” గరళం సేవిస్తున్నవాడిలా మాటలు దిగమింగుతూ ఎట్టకేలకు తన మనసులో మాట బయట పెట్టగలిగాడు లోకనాథం.

          ” సరే నాన్నా! నాభవిష్యత్ కు సంబంధించి మీరు ఎంతో సంఘర్షణకు లోనై తీసుకున్న నిర్ణయమిది. మళ్ళీ చెప్తున్నా! మీ పెంపకంలో పెరిగినదాన్ని నేను! ఎప్పటికీ మీ మాట జవదాటను. విధి మెడపై కత్తి పెట్టిన పరిస్థితిలో కూడా నా మెడలో తాళి కట్టే వ్యక్తిని ఎంపిక చేసుకునే అవకాశం నాకే ఇచ్చారు. మీరు అనుకున్న విధంగానే వాళ్ళను రేపు ఇంటికి పిలవండి!” కంపిస్తున్న స్వరాన్ని అదుపులో పెట్టుకోవడానికి శతథా ప్రయత్నిస్తూ చిన్నగా చెప్పింది పునీత.

          కిమ్మనకుండా తన మాటకు విలువిచ్చి రెండో పెళ్ళికి తల వంచుతున్న పునీత మాటలు విని చలించాడు లోకనాథం. ఎంతైనా తండ్రి! అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెను మరో దారి లేక రెండో పెళ్ళికి ఒప్పిస్తున్నందుకు లోలోనే కుమిలిపోయాడు. అప్రయత్నంగానే అతని కళ్ళవెంట నీళ్ళు జలజలా రాలాయి. తను కంటతడి పెట్టడం కూతురు గమనించకుండా తల పక్కకు తిప్పుకున్నాడు.

          ఇద్దరి మధ్యా కొద్ది క్షణాలపాటు మౌనం రాజ్యమేలింది.

          ” చాలా పొద్దుపోయింది. ఇక భోజనానికి లేవండి నాన్నా!” చివరికి స్తబ్దతను దూరం చేస్తూ అన్నది పునీత.

          “ఒక్క క్షణం తల్లీ! వాళ్ళిద్దర్నీ రేపు ఉదయం మన ఇంట్లో అల్పాహారం తీసుకునేం దుకు రమ్మని పిలవడానికి ఫోన్లుచేసి వస్తాను.” చెప్పాడు లోకనాథం.

***

          “తండ్రి భోంచేసి నిద్రకు ఉపక్రమించాక పునీత తన భోజనం కూడా అయిందని పించి ముందు గదిలోకి వచ్చి కూర్చుని ఆలోచనల్లో పడింది.

          తల్లి ఆరోగ్యం మొదట్నుంచీ అంతంత మాత్రమే! ఇంజనీరింగ్ చదివి రేపో మాపో మంచి ఉద్యోగం సంపాదించి ఇంటి బాధ్యతలు తీసుకుంటాడనుకున్న తన అన్నయ్య రోడ్డు ఏక్సిడెంట్లో మరణించడం ఆమె తట్టుకోలేకపోయింది. ఆ బెంగతోనే చివరికి ఆమె కన్ను మూసింది. క్లర్క్ గా పని చేస్తున్న తండ్రి ఇంటి ఖర్చులు, అమ్మ మందుల ఖర్చులూ భరిస్తూ ఎలాగో నెట్టుకొస్తున్నా అన్నయ్య చదువు కోసం తీసుకున్న అప్పూ, ఇల్లు కట్టడానికి తీసుకున్న లోనూ ఇంకా తీరనే లేదు. తండ్రి రిటైర్ మెంటుకు ఇంకా రెండేళ్ళ వ్యవధి మాత్రమే ఉంది. రిటైరయ్యాక సెటిల్ మెంట్ లో వచ్చిన డబ్బుతో అప్పు తీర్చేసి తన పెళ్ళి కూడా చెయ్యాలనేది తండ్రి ఉద్దేశం. డిగ్రీ చదివిన తను కంప్యూటర్ కోర్సులు పూర్తి చేసి ఉద్యోగంలో చేరి తండ్రికి సాయపడాలని అనుకుంది. కాని ఇంతలోనే మళ్ళీ విధి ఇలా చిన్న చూపు చూసింది. తండ్రి తోడు కూడా తనకు లేకుండా పోతున్నదన్న చేదు నిజాన్ని తల్చుకుంటేనే ఆమెకు పిచ్చి పట్టినట్లుగా ఉంది.

          మృత్యువు వాకిలిలోకి వచ్చి నిలుచున్నా ధైర్యాన్ని వీడక తన భవిష్యత్ గురించి ఆందోళన చెందుతున్న తండ్రి మీద ఆమెకు గౌరవం రెట్టింపయ్యింది. తండ్రి తన ముందుంచిన ప్రతిపాదనను కూడా ఆమె అపార్థంచేసుకోలేదు. మరో పరిష్కారం లేనప్పుడు తన తండ్రి మాత్రం ఇంతకన్నా ఏం చెయ్యగలడు? తన కూతుర్ని వరించి పెళ్ళాడడానికి ఏ రాకుమారుడో వస్తాడని తల్లి కలలు కనేది. కాని –  కలలకూ, వాస్తవానికీ ఎంత దూరమో ఇప్పుడు గ్రాహ్యమవుతోంది. మరుసటి రోజు తనకు జరగబోయే చిత్రమైన స్వయంవరం తలపుకు రాగానే చిన్నగా నిట్టూర్చకుండా ఉండలేకపోయింది.

          మర్నాడు మాములుగానే తెల్లారినా, తర్వాత జరిగిన సంఘటనలు మాత్రం పునీత అనుకున్న విధంగా జరగలేదు.

          అమర్ ఆ ఇంట్లో అడుగు పెట్టేసరికి పునీత వంటింట్లో పని చేసుకుంటోంది. లోకనాథం అతడ్ని ముందు గదిలో కూర్చోబెట్టి కుశల ప్రశ్నల అనంతరం పునీతను పిలిచాడు. కాఫీ కప్పుతో వచ్చిన పునీతను అమర్ కు పరిచయం చేసాడు. ” మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి! నేనిప్పుడే వస్తాను.” అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. తామిద్దరూ ఏకాంతంలో మాట్లాడుకునే అవకాశం కల్పించే ఉద్దేశంతోనే తండ్రి అక్కడి నుంచి వెళ్ళిపోయాడని పునీత గ్రహించింది.

          అమర్ కు ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ అతడ్ని తేరిపార చూసి ” అందగాడే – సెకెండ్ హ్యండ్ రాకుమారుడు ” అనే భావన మదిలో మెరవగానే వెలిసిపోయిన నవ్వు ఒకటి ఆమె పెదాల పై వెలసింది.

          కాఫీ సేవిస్తూ ఆమెనే గమనిస్తున్న అమర్ చిన్నగా నవ్వి అన్నాడు –  నేను చాలా అందంగా ఉన్నానని మనసులో అనుకున్నావు కదూ? ఏ ఆడపిల్లయినా నన్ను చూసిన మరుక్షణం అలాగే అనుకుంటుందని నాకు తెలుసు. ఎవరిదాకో ఎందుకు? మీ అక్క ….అదే చచ్చి స్వర్గాన ఉన్న నా భార్య కూడా నా అందానికి పరవశురాలై నన్ను తప్ప మరొకర్ని పెళ్ళాడననని తనవాళ్ళ దగ్గర భీష్మించుకు కూర్చుని పంతం నెగ్గించు కుంది. నా ఇద్దరు పిల్లలకి తల్లయింది. మరి ఈ సారి తొమ్మిదో నెల వచ్చాక జాగ్రత్తగా ఉండొద్దూ? అజాగ్రత్తగా వ్యవహరించి కళ్ళు తిరిగి కిందపడి గర్భస్రావమై మృత శిశువును కని కన్ను మూసింది. ప్చ్! అదీ ఆడపిల్లే! నువ్వలా కాక మన పెళ్ళయ్యాక నాలాంటి మగబిడ్డను కానుకగా అందిస్తావు కదూ?”

          ” అలాంటి విషయాలు ఇప్పటికిప్పుడు తేల్చి చెప్పేవి కాదు కదా? ఆలోచించుకుని చెప్పడానికి అమ్మాయికి కొంత సమయం కూడా అవసరం.” లోపలి నుంచి వస్తూ చిన్నగా నవ్వుతూ అన్నాడు లోకనాథం.

          ఓహ్! నా మాటలన్నీ వింటూనే ఉన్నారా? బిగ్గరగా నవ్వేసాడు అమర్. అవును. తొందరేముంది? ఆలోచించుకునే చెప్పమనండి! ఇక నేను వెళ్తాను. బజారులో చిన్న పని ఉంది.” అంటూ సెలవు తీసుకున్నాడు.

          అతడు వెళ్ళగానే లోకనాథం పునీత వైపు ప్రశ్నార్థకంగా చూసాడు. పునీత ముఖంలో ఎలాంటి భావం వ్యక్తం కాలేదు. మౌనంగా వంటగది వైపు నడిచింది.

          అరగంట తర్వాత తండ్రి పిలవడంతో వంటగది లోంచి బయటకు వచ్చిన పునీత చేతికి ఒక ఉత్తరం అందించి చెప్పాడు లోకనాథం – ” ఇప్పుడే ఒక కుర్రాడు తెచ్చి ఇచ్చాడు.”

          పునీత ఉత్తరం అందుకుని చదవసాగింది. అది మోహన్ దగ్గర నుంచి వచ్చింది.

          “లోకనాథం గారూ! మీరు నన్ను క్షమించాలి. మీరు నన్ను ఇంటికి రమ్మని ఆహ్వానించగానే వస్తానని చెప్పాను. కాని రావడానికి నాకు మనస్కరించుట లేదు. నిన్న మీ అమ్మాయిని వాళ్ళ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ దగ్గర చూసాను. చూడ ముచ్చటగా ఉంది. అలాంటి చక్కని అమ్మాయిని పెళ్ళాడడానికి నేను తగినవాడ్ని కాదని నా మనసు చెప్తోంది. మీ అమ్మాయి పెళ్ళి నిమిత్తం మీరు అమర్ ను కూడా ఇంటికి ఆహ్వానించారని నాకు తెలుసు. మనస్ఫూర్తిగా చెప్తున్నా! నా కన్నా అమరే మీ అమ్మాయికి తగిన వరుడు. మీరు వాళ్ళిద్దరికీ పెళ్ళి చేస్తే నేనూ సంతోషిస్తాను. ఇలా చెప్తున్నందుకు అన్యధా భావించకండి!

ఇట్లు

మీ మోహన్

          ఉత్తరం చదివిన పునీత ముఖంలో ఈ సారి కూడా ఎలాంటి భావాలూ ద్యోతకం కాలేదు. మౌనంగా ఉత్తరం తిరిగి ఇచ్చేసింది.

          ” ఈ మోహన్ భలేవాడే!” అన్న తండ్రి మాటలకు మాత్రం చిన్నగా నవ్వి వంటిం ట్లోకి వెళ్ళిపోయింది.

          ఆ రోజు సాయంత్రం తనతోపాటే కంప్యూటర్ కోర్సెస్ చేస్తున్న ప్రాణ స్నేహితురాలు విమలతో పాటే ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చింది పునీత.

          పక్కనే ఉన్న బస్ స్టాప్ లో ఇంటికి వెళ్ళే బస్ కోసం నిరీక్షిస్తూ విమలతో క్రితం రోజు సాయంత్రం నుంచి ఆ రోజు ఉదయం వరకూ జరిగిన సంగతులన్నీ వివరంగా చెప్పు కొచ్చింది.

          అంతా విన్న విమల నోరెళ్ళబెట్టి – “అయితే రెండో పెళ్ళివాడ్ని చేసుకోవడానికి ఒప్పుకున్నావన్న మాట.” అన్నది.

          ” మరి వేరే దారి లేదు కదా!? ” శుష్క మందహాసం చేస్తూ అంది పునీత.

          అంతలోనే విమల పునీత భుజం నొక్కుతూ – “అదిగో రోడ్ కి అవతల మెడికల్ షాప్ బయట షాప్ యజమానితో మాట్లాడుతున్న నీలం రంగు షర్ట్ వ్యక్తిని చూడు!” అంది నెమ్మదిగా.

          అప్రయత్నంగా అటువైపు దృష్టి సారించింది పునీత. సరిగ్గా అదే సమయంలో అతనూ యాదృచ్ఛికంగా ఇటు తిరిగాడు. అతని ముఖం నల్లగా కమిలి అక్కడక్కడా కాలిన మచ్చలతో చూడడానికి వికృతంగా ఉంది. పునీతను చూసిన అతడు వెంటనే ముఖం తిప్పుకున్నాడు. వెనువెంటనే రెండో వ్యక్తికి వెళ్తున్నట్లు చెయ్యి ఊపి బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు.

          ” ఆయనే నీ నాన్నగారు చెప్పిన రెండో వ్యక్తి మోహన్!” చెప్పింది విమల.

        “అనుకున్నాను” లోగొంతుతో అంది పునీత.

          “మా వీధిలోనే ఉంటారు. ఆయన భార్యకు వంటింట్లో ప్రమాదవశాత్తు చీర అంటుకుని అగ్నికి ఆహుతైపోతుంటే కాపాడడానికి వెళ్ళి కాలిన గాయాల పాలయ్యారు. అయినా ఆమె దక్కలేదు. పాపం! తీవ్రమైన కాలిన గాయాల కారణంగా ఆమె ఆసుపత్రిలో కన్ను మూసింది. ఇది జరిగి మూడు నెలలై ఉంటుందేమో!” జాలిగా అంది విమల.

***

          ఆ రాత్రి భోజనాలయ్యాక ముందు గదిలో పడక కుర్చీలో కూర్చుని ఏదో ఆలోచిస్తున్న తండ్రి దగ్గరకు వచ్చి నిలబడింది పునీత. ఆమె రాకను గమనించిన లోకనాథం తలెత్తి చూసాడు.

          “మీతో మాట్లాడాలి నాన్నా! నా పెళ్ళి విషయంలో నేనొక నిర్ణయానికి వచ్చాను.”

          “రా తల్లీ! ఇలా వచ్చి కూర్చో!”

          పునీత తండ్రికి దగ్గరగా ఒక కుర్చీ లాక్కుని కూర్చుంది.

          “మీరు చెప్పిన ఇద్దరిలో ఒకర్ని నా జీవిత భాగస్వామిగా ఎంపిక చేసుకున్నా నాన్నా!”

          “ఎవర్ని ఎంచుకున్నావ్? అమర్ నే కదూ?” ఆతురతగా ప్రశ్నించాడు లోకనాథం.

          “కాదు నాన్నా! నేను మోహన్ గారిని పెళ్ళాడడమే సరైన నిర్ణయంగా భావిస్తు న్నాను.” స్థిరమైన స్వరంతో చెప్పింది పునీత.

          “అలాగా? నేనింకా నీకు అమర్ సరైన ఈడూ జోడూ అనుకున్నా!” ఆశాభంగానికి గురైనవాడిలా అన్నాడు లోకనాథం.

          “లేదు నాన్నా! నేను ఎంతో ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. అమర్ గారు అందగాడే! కాదనను. కాని ఆయన మూర్ఖత్వానికి ఆయన భార్య బలయిపోయిందన్న చేదు నిజం నన్ను కలచివేసింది. వరస ప్రసవాల తర్వాత ఆమె తిరిగి గర్భం దాల్చిం దంటే అది ఎవరి ప్రోద్బలంతో జరిగిందో ఊహించడం కష్టమేమీ కాదు. మొగ పిల్లాడు కావాలనే భర్త మొండి పట్టుదలే కారణమని నేనంటే మీరు కాదనగలరా? ఆమె కళ్ళు తిరిగి క్రింద పడిపోవడం వల్లనే గర్భస్రావమయిందని ఆయన మాటల్లోనే వెల్లడయింది. వరస ప్రసవాలతో ఏ స్త్రీకి అయినా ఆరోగ్యం దెబ్బతిని నీరసించిపోవడం సహజం. అలాంటి పరిస్థితిలో గర్భస్రావమయి చివరికి ఆమె ప్రాణాలు కోల్పోతే అజాగ్రత్త అనడం భావ్యమేనా? పైగా ఆమె పోయిందన్న బాధకన్నా, ఆ మృతశిశువు కూడా ఆడపిల్లే కావడం ఆయనకు ఎక్కువ నిరాశ కలిగించిందనడం ఆయన మాటల్లోనే తేటతెల్లమయింది.” ఆవేశంగా మాట్లాడుతున్న పునీత ఒక క్షణం ఆగి ఊపిరి పీల్చుకుని తిరిగి చెప్పసాగింది.

          ఆయనేమన్నాడో మీరూ విన్నారుగా? నేను కూడా పెళ్ళయ్యాక ఒక మగబిడ్డను కనాలట! ఖర్మ కాలి నాకూ వరస ఆడ సంతానమే కలిగితే….? ఏమవుతుందో……? ఊహించుకోవడానికి కూడా భయమేస్తోంది. చూడబోతే ఆయనకు కావల్సింది భార్య కాదు – కేవలం మగబిడ్డను కనే యంత్రం అని నేను నిర్ధారించుకున్నాను. అందుకే ఆ అందగాడిని వద్దనుకుంటున్నాను.

          “ఇక మోహన్ గారు….! తనకు ప్రమాదమని తెలిసి కూడా దృఢ సంకల్పంతో భార్యను కాపాడుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించారు. ఆమెను దక్కించుకోలేకపోగా కాలిన గాయాల పాలయ్యారు. అందవికారంగా మారారు. అయితే ఏం?

          బాహ్య అంద వికారానికి ప్లాస్టిక్ సర్జరీ చెయ్యొచ్చు! కాని, అంతర్గత మనో వికారానికి అసలు సరైన చికిత్సే లేదు నాన్నా! అందుకే అమర్ గారితో కాక మోహన్ గారితో జీవితం పంచుకోవాలని కోరుకుంటున్నాను.

          ఇక నేను ఇష్టపూర్వకంగానే ఆయనతో పెళ్ళికి ఒప్పుకుంటున్నానని ఆయనకు నచ్చజెప్పే బాధ్యత ఇక మీదే నాన్నా!” తను ఎందుకు మోహన్ వైపు మొగ్గు చూపిందో సహేతుకంగా వివరించాక చిన్నగా నవ్వి చెప్పింది పునీత.

          తన కళ్ళ ముందే మానసికంగా ఎంతో ఎదిగిపోయిన కుమార్తెను చూసి ఆనందం, వ్యథ కలగలిసిన అనుభూతితో లోకనాథం కళ్ళు చెమర్చాయి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.