నల్ల గులాబి (కథ)

-ఇందు చంద్రన్

          చీకటిగా ఉన్న గదిలో ఏదో మూలన టేబుల్ మీద చిన్న లైట్ వెలుగుతుంది, ఆ వెలుగు నీడ కొద్ది దూరం మాత్రమే కనిపిస్తుంది. నా జీవితంలో తను ఉన్న కొద్ది రోజు ల్లాగే..

          సగం కాలిన సిగిరెట్ ని విదిలిస్తూ బాల్కనీలోకి అడుగు పెట్టాను.

          ఈ ఎనిమిదేళ్ళలో ఎన్నో మారిపోయాయి.

          తనతో ఊహించుకున్న జీవితం కాకపోయినా, ఇప్పుడున్న జీవితం కూడా అందంగా ఆనందంగానే ఉంది.

          పెద్దగా చెప్పుకునే కష్టాలేమి లేవు. అందరి ముందు గొప్పగా చెప్పుకోడానికి ఆరంకెల జీతంతో ఓ ఉద్యోగం. ప్రేమ లేని పెళ్ళే, కాని పెళ్ళి తర్వాత ప్రేమకి గుర్తుగా ఇద్దరు పిల్లలు ఉన్నారు.. సజావుగా సాగిపోతున్న జీవితమే నాది కూడా.

          తన జీవితం కూడా దాదాపుగా అలానే ఉంటుందని నాలో నేనే చాలా సార్లు అనుకున్నాను. తనకొక పాప ఉంటే అచ్చం తన పోలికలతో ఉంటుందేమో అని అప్పుడప్పుడు అనిపించేది. ఒకవేళ తను సంతోషంగా లేకపోతే అనే ఆలోచన ఏదో భయాన్ని పుట్టించేది కాని తన గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయలేదు.

          వారం క్రితం తను రోడ్ పక్కన కార్ పార్క్ చేసి వెళ్తూ ఉంటే చూసాను. తనేనని నిర్దారించుకోడానికి చాలా సమయం పట్టిందెందుకో. మెరుగులు దిద్దుకున్న తన రూపు రేకల వలనేమో. తనేనని తెలిసాక పదే పదే గుర్తొస్తుంది. తన గురించి ఆలోచించడం ఇదేం మొదటిసారి కాదు. అప్పుడప్పుడూ గుర్తొస్తూ ఉంటుంది. కొన్నిసార్లు తన జ్ఞాపకాలు నన్ను తడిమేసి వెళ్ళిపోతుంటాయి.

          కాని, మళ్ళీ తనని చూస్తానని అసలు అనుకోలేదు. ఈ సారి మళ్ళీ చూడాలని పిస్తుంది….ఎందుకో మరి ?

          “నువ్విక్కడున్నావా? లైట్ అయినా వేసుకోవచ్చు కదా? అంటూ స్విచ్ ఆన్ చేస్తూ నా దగ్గరికి వచ్చింది సుధ.

          “వచ్చేటప్పుడు పెరుగు ప్యాకెట్ తీసుకు రమ్మన్నా అది కూడా మర్చిపోయావ్…అంటూ తను మాట్లాడుతూనే ఉంది.

          బెడ్రూం బాల్కనీలో సిగరెట్ తాగొద్దని వంద సార్లు చెప్పాను అంటూ విసుక్కుని  చెరో మూల పడిఉన్న సాక్స్ ని తీసుకొని వెళ్ళిపోయింది.

          ఇంతలో ఫ్రెండ్ ఒకడు వాట్సప్ లో తన వివరాలు షేర్ చేసాడు. స్క్రీన్ పైన తన పేరు కనపడగానే చూస్తూనే నిలబడిపోయా.

          ఒక్కసారి కలవాలని , మాట్లాడాలని తనకి మెసేజ్ పంపి తన సమాధానం కోసం ఎదురు చూస్తున్నా.

          తన కోసం ఎదురు చూడటం నాకు కొత్త ఏమీ కాదు. కాని ఈ సారి ఎందుకో నాలో ఉత్సాహం పుట్టుకొచ్చింది దాంతో పాటు భయం కూడా.

          తన పేరుని చూస్తుంటే తన రూపం కనిపిస్తున్నట్టు అనిపించింది. ఆ పేరు ఎవరు పెట్టారో కాని నిజంగా తనకి తగ్గట్టే పెట్టారు.

          “మధుర వాణి”….తన మాటలు కూడా అలానే ఉంటాయి. వింటున్నకొద్ది వినాలని పించేలా ఉంటాయి. ఎన్నో చెప్పేది కొన్ని అర్థం అయ్యేవి, కొన్ని అర్థమయ్యేవి. తన గొంతు విని ఏళ్ళు గడిచిపోయాయి అయినా సరే తన గొంతు ఎలా ఉంటుందో చెవిలో సన్నగా వినిపిస్తున్నట్టు అనిపిస్తూ ఉంది.

          పూర్తిగ కాలిన సిగరెట్ చురుక్కుమని తగిలి మిగిలిన పీకని కింద పడేసాను.

          సెకన్లలో రిప్లై వచ్చింది. తను కలవడానికి ఒప్పుకుని అడ్రెస్ పెట్టింది. తను పెట్టిన అడ్రెస్ గతాన్ని మళ్ళీ తవ్వుకునేలా ఉంది.

          ఏదైతేనేం…తను నా గతంలోనే మిగిలిపోయింది అక్కడే కలవడం నాకు బావుంటుందన్నట్టు అనిపించింది.

***

          ఎనిమిదేళ్ళ తర్వాత మళ్ళీ తనని కలవబోతున్నానన్న ఆనందం ఒక వైపు ఉన్నా ఏదో తెలియని భయం మరో వైపు ఉంది.

          ఒక వేళ పాత విషయాల గురించి తను ప్రశ్నిస్తే అని సమధానాలు వెతుక్కుని గుర్తుపెట్టుకుంటూ వెళ్తున్నా. వెళ్తున్నంత సేపు తన ఆలోచనలే నా చుట్టూ తిరుగు తున్నాయి.

          తనని మొదటి సారిగా కాలేజీ బస్టాప్ లో చూసా ఓ చేత్తో ఎర్ర రంగు ఓణీని సర్దు కుంటూ మరో చేత్తో చెవి వెనక్కి జుట్టుని సవరిస్తూ మెల్లగా నడిచొస్తుంటే చూసా. చూడగానే ఎర్ర గులాబీలా అనిపించింది బహుషా ఎర్ర రంగు ఓణీ వలనేమో.

          కొన్నాళ్ళు కళ్ళతో మాట్లాడుకున్నాం తర్వాత మా పరిచయాలకి ఎక్కువ సమయం తీసుకోలేదు. పరిచయంతోనే స్నేహం మొదలై అది కాస్త ప్రేమలోకి అడుగుపెట్టింది. ఇద్దరం కలిసి ఎన్నో కలలు కన్నాం. ప్రేమ , పెళ్ళి ,పిల్లలు ఇంకా వాళ్ళ పేర్లు చెప్పా లంటే పరిపూర్ణ  కుటుంబాన్ని ఊహించుకున్నాం. నక్షత్రాలని లెక్క పెడుతూ ఎన్నో క్షణాల్ని భారంగా గడిపితే, ఇద్దరం కలిస్తే నిండు పున్నమిలా కుదరని రోజుల్ని అమావాస్యలా నెట్టుకొచ్చేసాం. చాలా వరకు మా ఇద్దరి అభిరుచులు కలిసాయి. కాని ఆలోచనలే ఎందుకో కలవలేకపోయాయి.

          ఎవరికైనా మంచి ఇల్లు కనీస అవసరాలకి ఓ ఉద్యోగం , ప్రేమించే భాగస్వామి ఇవి ఉంటే చాలు కదా? సామాన్యులు ఇలానే కదా ఆలోచిస్తారు. ప్రశాంతమైన జీవితాన్నే కోరుకుంటారు. ప్రపంచాన్ని ఉద్దరించాలి ఎవరనుకుంటారు ? కని కనిపించని ప్రపంచంతో పోరాడాలి అని ఎవరూ అనుకుంటారు. అయినా ఒక్క రోజులో ఒకరితో మారిపోయేది కాదీ ప్రపంచం అదే తనకి చెప్పడానికి ప్రయత్నించా. నా ఆలోచనలు ఎప్పుడూ సామాన్యంగా సరాసరి మనుషులు కలిసి ఉండటానికి సరిపడ్డట్టు ఉంటే తన ఆలోచనలు పూర్తిగా భిన్నంగా ఉండేవి. సామాన్యులకైతే తన ఆలోచనలు అర్థం కావేమో. ఎవరైనా నల్లటి చీకటిని ఇష్టపడుతారా? తనకి నిశీ , నిశ్శబ్దం , నల్ల గులాబీలు ఇలాంటివే ఇష్టం. నిశీ నిశ్శబ్దం అయినా పరవాలేదు. ఈ నల్ల గులాబీనే ఉంటాయో ఉండవో కూడా తెలీదు. సరిగ్గా గుర్తు లేదు కాని నల్ల గులాబీ గురించి ఏదో చెప్పింది కూడా. నల్ల గులాబీ లు పున : జన్మ ఇంకా కొత్త లైఫ్ కి సింబాలిక్ అని. అయినా నలుపు రంగు కొత్త లైఫ్ కి సింబాలిక్ ఏంటో అని విడ్డూరంగా అనిపించింది.

          ప్రేమ కొద్ది రోజులే బావుంటుందన్నట్టు మొదట్లో తన ఆలోచనల్ని ఏకీభవిస్తూ వచ్చా , కొన్నాళ్ళకి ప్రశ్నించడం మొదలు పెట్టా. నువ్వు నేను వేరు కాదు..నువ్వే నేను, నేనే నువ్వు…అవన్నీ చెప్పుకునే స్టేజీ దాటేసి ఇప్పుడు ప్రతి మనిషికి సొంత అభిప్రాయా లు ఉంటాయి అని వాటిని గుర్తించి ఒకరిని ఒకరు అర్థం చేసుకుని అభిప్రాయాలని గౌరవిస్తూ కలిసి నడవాలి అనే స్టేజీకి వచ్చేసాం. తను మాట్లాడే ప్రతి మాట చాలా క్లియర్ గా ఉండేది. కాని నాకే సగం సగం అర్థమయ్యేవి. తనని పూర్తిగా అర్థం చేసుకోడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. అదేంటో ఒక మనిషి గురించి పూర్తిగా తెలుసుకునే లోపే మధ్యలో వాళ్ళలో లోపాలన్నీ కనిపిస్తాయి.

          ప్రవహించాలనుకున్న నీటి ప్రవహాన్ని అరచేతుల్లో బంధించాలనుకున్నా వేళ్ల సంధుల్లోంచి జారిపోయింది.

          సగం చదివిన పుస్తకంలా తను మధ్యలోనే వెళ్ళిపోయింది. కాదు తనని ఆపడానికి ప్రయత్నించలేదు నేనూ.

          తను చెప్పిన అడ్రెస్ కి , మేం చివరగా కలిసిన చోటుకి చేరుకున్నాను.

          అప్పటి ఖాళీ ప్లేస్ లో ఓ మంచి ఇల్లు చుట్టూ చెట్లతో అందంగా ఉంది. దేన్నైనా అందంగా మార్చడం మధుకి మాత్రమే సాధ్యమని అందరూ అంటూ ఉండేవాళ్ళు.అది నిజం అని చూస్తూ ఇంటి వైపు అడుగులు వేసాను.

***

          తలుపు ముందు నిలబడి కాలింగ్ బెల్ నొక్కాను నుదుట మీద జారుతున్న చెమటని తుడుచుకుంటూ. తలుపు తీసే చప్పుడు కన్నా నా గుండె చప్పుడే గట్టిగా వినిపిస్తున్నట్టు ఉంది.

          తలుపు తెరచి “మీరు కూర్చోండి సర్…మేడం పైనున్నారు వచ్చేస్తారు” అని ఇంట్లో పని చేసే ఆవిడ అనుకుంటా చెప్పేసి వెళ్ళిపోయింది.

          లోపలకి అడుగు పెట్టాను. పై నున్న లైట్ల కాంతికి గోడలకి ఉన్న పెయింటింగ్ అక్కడక్కడా మెరుస్తుంది.

          ఇంటిని చూడగానే అర్థమయ్యింది ఆర్థికంగా తను బానే స్థిరపడిందని. ఇంట్లో ఉన్న ప్రతి చిన్న వస్తువు చూస్తేనే అర్థమవుతుంది తనే వెతికి కొన్నట్టు ఉంది. తన ఇష్టాలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు.

          గోడకి ఉన్న పెయింటింగ్ చూస్తూ ఉంటే…

          “ఎలా ఉన్నాయి.. పిచ్చి గీతలు అంది నా వెనక నుండి…తన గొంతు మళ్ళీ వినగానే ఏదో తెలియని ఒక అనుభూతి కలిగింది. అర చేతులో చెమటని కర్చీఫ్ తో తుడుచు కుంటూ తన వైపు చూసాను.

          అప్పటికీ ఇప్పటికీ తనలో ఉన్న మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సూటిగా తన కళ్ళలోకి మూడు సెకన్లు కూడా చూడలేకపోయా.

          “టీ….కాఫీ అంది ఆలోచిస్తున్నట్టు చూస్తూ…

          నిజంగా తనకి తెలియదా? లేక మర్చిపోయిందా? నేను కాఫీ తాగనని తనకి బాగా తెలుసు అయినా అడుగుతుందనుకున్నాను మనస్సులో.

          మంచి నీళ్ళ గ్లాస్ అందించి ఎదురుగా కూర్చుంది.

          చాలా సేపు మౌనం…మాట్లాడానికి మాటలు వెతుక్కోవ్వాల్సి వచ్చింది.

          ఇంతలో పనావిడ వచ్చి తనని చూసి సైగ చేసింది.

          “డిన్నర్ రెడీగా ఉంది…తిందామా? అంది తన మొహంలో సగం విరిసిన చిరునవ్వు కనిపించింది.

          తననే అనుసరిస్తూ నడిచా…పెద్ద టేబుల్ మీద వంటకాలు అందంగా పింగాణీ పాత్రలో సర్ది పెట్టి ఉంది.

          కూర్చోగానే నా ప్లేట్ లో వడ్డిస్తూ ఉంది. తన చేతికి ఉన్న వాచ్ దాదాపుగా లక్ష ఖరీదు చేసేలా ఉంది.

          ప్లేట్ లో అన్నం కలుపుతూ ఉన్నాను.

          “చాలా రోజుల తర్వాత వంట చేసాను. కాస్త అటు ఇటూ ఉంటే సర్దుకో అంది ముసి ముసిగా నవ్వి.

          నా కోసం తనే స్వయంగా చేసిందని అనుకుని సంతోష పడాలే తప్ప అడిగే ధైర్యం చనువు నాకు లేదిప్పుడు.

          ఉప్పు కారాలు కాస్త తక్కువైనా పైకి నవ్వుతూ “బావున్నాయి అన్నాను.

          “నువ్వు అబద్దాలు చెప్తే దొరికిపోతావు రఘూ, నీ కళ్ళని చూస్తే తెలిసిపోతుంది  అంది మెల్లగా నవ్వు మొహంతో

          చెప్పాలంటే తన కళ్ళలోకి చూడలేకపోతున్నాను. కాని చెప్పే ధైర్యమూ లేదు.

          తను రఘూ అని పిలుస్తుంటే మా మధ్య ఉన్న దూరం స్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి తను నన్నలా పిలవదు.                                         

***

          తినడం పూర్తవగానే ఇద్దరం ఇంటి బయట ఆవరణలో కూర్చున్నాం. తన పక్కన కూర్చునే చనువిప్పుడు లేదు ఎదురుగా కూర్చున్నాను అయినా దగ్గరగా కనిపిస్తుంది. చల్లగాలి ఇద్దరినీ మెల్లగా తాకి వెళ్ళిపోతూ ఉంది. సగం కట్ చేసిన తన జుట్టు మొహం మీదకి వస్తుంటే చెవుల వెనక్కి నెట్టేసి బంధించే ప్రయత్నం చేస్తూ ఉంది. ముడుచు కున్న పెదవుల్ని చూస్తుంటే నన్ను తాకిన తన పెదవుల తడి స్పర్శ గుర్తొచ్చింది. సర్దు కుని కూర్చుంటూ “నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారి ఎక్కడున్నా బావుండాలి, సంతోషంగా ఉండాలి అనుకునే వాన్ని” అన్నాను మెల్లగా తన వైపు చూడకుండా.

          తను కాసేపు మౌనంగా ఉండి ఆ మౌనాన్ని చీరుస్తూ “సంతోషంగా కనిపిస్తున్నానా? అంది చిరునవ్వుతో

          “నీ పెదవుల పై చిరునవ్వు ని చూసి చెప్పలేను అలా అని కళ్ళలోకి చూసే ధైర్యం లేదని చెప్పేసాను.

          తను లేచి ఇంకా కొన్ని పిచ్చి గీతలు ఉన్నాయి చూస్తావా? అంది. మారు మాట్లాడ కుండా తన వెనకనే నడిచాను. లైట్ ఆన్ చేస్తూ లోపలికి వెళ్ళింది. అక్కడక్కడా పడి ఉన్న కాగితాలు, రంగుల మరకలు చూస్తూ లోపలికి నడిచాను.

          గోడకి తగిలించి ఉన్న కొన్నిటిని చూపించింది. అందులో కొన్ని అర్థనగ్నంగా ఉంటే కొన్ని అసలు అర్థం కాలేదు.

          ఇవన్నీ నువ్వే గీసావా? అన్నాను ఆశ్చర్యంగా చూస్తూ…

          “అంటే అప్పుడప్పుడూ ఈ గదిలోకి ఒక ఆర్టిస్ట్ వచ్చి వెళ్తుందిలే అని చెప్పి నవ్వింది.

          ఈ సారి తను పూర్తిగా నవ్వినట్టు అనిపించింది.

          అర్థనగ్నంగా ఉన్న ఓ బొమ్మని చూపించి దాని గురించి వివరిస్తూ ఉంటే వినడానికి ఇబ్బందిగా అసలు అనిపించలేదు. శృంగారాన్ని రేకెత్తించేలా ఉన్న ఆ బొమ్మ వెనుక అంతటి అర్థం దాగి ఉంటుందని ఊహించనే లేదు. ఎప్పటిలాగానే తన ఆలోచనలు నాకు అందని ఎత్తులోనే ఉన్నాయి.

          ఆ గదిలోనే సగం గీసి ఆపేసిన కాన్వాస్ బోర్డ్ పక్కనే MP3 ఆడియో ప్లేయర్ కనిపించింది. ఆ ఆడియో ప్లేయర్ తన దగ్గరింకా ఉండటం చూసాక ఆశ్చర్యమేసింది.

          అప్పట్లో ఫోన్స్ తక్కువ పాటలు వినడానికి మెమొరీలో పాటలు ఎక్కించి ఆ ఆడియో ప్లేయర్ లో ఇద్దరం కలిసి వినే వాళ్ళం. కొన్నిసార్లు గంటలకొద్ది పాటలు వింటూ సముద్రపు ఒడ్డున కూర్చుని ఉండేవాళ్ళం.

          “ఇది ఇంకా పని చేస్తుందా?” అన్నాను తనకి చూపిస్తూ.

          పక్కన ఉన్న ఇయర్ ఫోన్స్ నా చెవిలో ఒకటి తన చెవిలో ఒకటి పెట్టి పాటని ప్లే చేసింది. ఇద్దరం దగ్గరగా జరిగినట్టనిపించింది. రఫీ పాటలు వినిపిస్తున్నాయి.

          “పత్తర్ కె సనమ్ పాట పూర్తవకముందే తను ఆడియో ప్లేయర్ చేతికి ఇచ్చేసి వెళ్ళి పోయింది.

          టీ కప్ తో తిరిగొచ్చి కప్ చేతికి ఇస్తూ “ఎలా ఉంది జీవితం ?” అంది.

          కప్ లో టీని ఒక సిప్ చేసి “నిజం చెప్పాలంటే బావుంది…అప్పుడప్పుడూ నువ్వూ గుర్తొస్తుంటావు. ఒక సిగరెట్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళి చీకట్లోకి చూస్తూ ఉంటాను. నీతో గడిపిన జ్ఞాపకాలు కొన్ని గుర్తొస్తాయి. చెప్పాలంటే ఆ సమయంలో బాధగా అనిపిస్తుంది కాని నిన్ను అలా గుర్తు చేసుకోవడం నాకు నచ్చుతుంది కూడా అన్నాను చిన్నగా నవ్వి.

          ఫోన్ లో ఉన్న ఫ్యామిలీ ఫోటోని చూపించాను.

          తను ఫోటోని జూమ్ చేసి చూస్తూ…అచ్చం నీలానే ఉన్నాడు రాఘవా….తను కూడా నీకు పక్కన బావుంది అంది మెల్లగా.

          తనలా పిలుస్తుంటే దగ్గరగా అనిపించింది.

          “నువ్వెలా ఉన్నావు ?” అన్నాను మెల్లగా ఒక్కో అక్షరాన్ని కూడబలుక్కుంటూ…

          నవ్వుతూ నా వైపు చూసింది. దానికర్థం ఏంటో అని తన వైపే చూసా మళ్ళీ…

          “బావున్నాను…ప్రశాంతంగా ఉన్నాను… నువ్వు లేకుండానే చాలా దూరం వచ్చేసా రాఘవా…ఎన్నో దాటుకొచ్చేసా…చీకటి వెలుగుల మధ్య ఎన్నో ఎత్తు పల్లాలని చూసేసా. ఈ జర్నీలోనే కిరణ్ ని పెళ్ళి చేసుకున్నాను కాదు ఇంట్లో వాళ్ళే చేసారనుకో తర్వాత లైలా పుట్టింది అంది నవ్వుతూ ఫోటో ఆల్బమ్ చేతికి ఇస్తూ

          నేను అనుకున్నట్టే పాప అచ్చం మధులాగే ఉంది.

          “మన జీవితంలో వీళ్ళు ఉంటే చాలు అనుకుని వాళ్ళతో జీవితాన్ని ఊహించు కున్నాక మధ్యలో వాళ్ళు వెళ్ళిపోతే ఎలా ఉంటుందో తెలుసా రాఘవా? ఇప్పుడైతే నా కళ్ళలో నీళ్ళు తిరగట్లేదు కాని అప్పుడు నువ్వు గుర్తొస్తే నా కళ్ళలో నీటి ధారలు ఆగేవి కాదు అంది మళ్ళీ నిస్సత్తువగా నవ్వి.

          జీవం లేని తన నవ్వు చూస్తేనే అర్థమయ్యింది, మౌనంగా తన మాటల్ని వింటూ ఉన్నాను.

          “గతంలో మాత్రమే మనం కలిసి ఉన్నాం.. కాని ప్రస్తుతంలో వేరొకరి జీవితాల్లో ఉన్నాం. చాలా సార్లు నిన్ను వెనక్కి తెచ్చుకోవాలని అనుకున్నా మధు. కాని ఎందుకో నాకది కరెక్ట్ అనిపించలేదు. ప్రేమ ముసుగులో నిన్ను బంధించలేననిపించింది. మనం వెళ్ళాలనుకున్న దార్లు వేరే. ప్రపంచంలో ప్రేమించిన మనిషినే ద్వేషించడం కన్నా ఘోరమైన పరిస్థితి మరొకటి ఉండదు. కలవని ఆలోచనలతో కలిసి ఉండలేం. అందుకే నువ్వెక్కడున్నా సంతోషంగా ఉంటే చాలనిపించింది అన్నాను తన వైపే చూస్తూ.

          మా మధ్య కాసేపు మౌనం ఊగిసలాడుతూ ఉంది. సరే బయట కూర్చుందామా? అంది బయటకి నడుస్తూ

          బయట చెట్ల మధ్యలో సన్నగా పారుతున్న పిల్ల కాలువ అది ఎంత వరకు ఉందో చీకట్లో స్పష్టంగా కనిపించలేదు.

          నా చేతిలో సిగరెట్ ని పెట్టి మరో చేత్తో లైటర్ ని వెలిగించింది.

          “ఇప్పుడు ఇది అవసరం లేదు… అన్నాను సిగరెట్ ని వెళ్ళ మధ్య తిప్పుతూ.

          “నువ్వు..మళ్ళీ కనిపిస్తావని మనం తిరిగిన ప్రతి చోటుకి వెళ్ళాను రాఘవా.. మన జ్ఞాపకాల్ని మోసుకుంటూ…

          సముద్రపు ఇసుకలో రాసుకున్న పేర్లలాగా కొన్ని మన మధ్య పొరపొచ్చాలు అలల్లాగా వచ్చేసి చెరిపేసాయి.

          అని అంటూనే నా పక్కన కూర్చుంది. ఎందుకో అనుకోకుండా దూరంగా జరిగి కూర్చున్నాను తనది గమనించలేదు.

          ఒకప్పటి తను నాదే కాని ఇప్పుడు తను మరొకరి భార్య అనే సన్నటి గీత స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.

          “నిజంగానే ప్రేమించిన వాళ్ళని మర్చిపోయి మూవ్ అన్ అయిపోతారా? అంది చీర కొంగుని కప్పుకుని కూర్చుంటూ.

          “నిజంగా నాకు తెలీదు కాని గతం నుండి బయట పడాలి అని ప్రస్తుతంలో బిజీగా గడిపేస్తూ ఉంటారు. బయట పడినట్టు ఫీల్ అవుతూ గడిపేస్తూ ఉంటారు అన్నాను మెల్లగా

          “నాకైతే మనం కలిసి ఉన్న కాలం తక్కువే అయినా, పుస్తకంలో కొన్ని పేజీలు మనకి బాగా నచ్చుతాయి కదా అలా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడూ తెరిచి చూసి మళ్ళీ పక్కన పెట్టేస్తూ ఉంటాను అంది దూరంగా చూస్తూ.

          మెల్లగా మా మాటలు అల్లుకుని పోతున్నాయి. గతాన్నీ వీడి ప్రస్తుతం గురించి చాలానే మాట్లాడుకుంటూ ఉన్నాం. నేను ఊహించిన దానికంటే తన జీవితం ఇంకా బావుందన్నట్టు మాటల్లోనే తెలిసిపోయింది. సరదాగా కొన్ని కబుర్లు చెప్పుకుని నవ్వు కున్నాం. మాటల మధ్యలో తను ఎప్పటిలాగే కాస్త గట్టిగా పైకి నవ్వేస్తూ ఉంది. తనలా నవ్వుతుంటే తన వైపే చూస్తూ ఉన్నాను నేను కూడా.

          నల్ల మబ్బులు వీడిపోయి తెరలు తెరలుగా తెల్లవారుతూ ఉంది. మబ్బుల మధ్యలో చంద్రుడు మసగ్గా కనిపిస్తున్నాడు. కూర్చున్న బెంచీలోనే తను తల పక్కకి వాల్చి నిద్రపోతూ ఉంది. అందమైన కలలో తను ఆడుకుంటున్నట్టు ప్రశాంతంగా ఉంది తన మొహం. తనని నిద్ర లేపడం నాకిష్టం లేదు. నా మనస్సులో మాటల్ని అక్షరాలుగా కాగితానికి అప్పజెప్పేసాను.

“మధు….

ఇన్నాళ్ళు నువ్వు ఎలా ఉన్నావో అని చీకట్లో వెతుక్కునే వాడిని. ఈ రోజు వెన్నెల వెలుగు ల్లో నిన్ను చూసాక నాలో చీకటి మాయమైపోయింది. నువ్వు సంతోషంగా ఉన్నావని తెలిసాక నాలో ఏదో మూలన దాగి ఉన్న భయం కూడా కరిపోయింది. ఈ కొన్ని గంటల్ని ఇంకొన్ని జ్ఞాపకాలు గా మిగిలిన జీవితంలో అప్పుడప్పుడూ గుర్తూ చేసుకుంటూ గడిపే స్తాను. నచ్చిన పేజీల్లా మిగిలిన….

                                                                                                                                                                                నీ  రాఘవా..

కాగితాన్ని మడిచి తన పక్కనే పెట్టి వచ్చేసాను.

***

          “డాడీ నేనో బొమ్మ గీసాను చూడూ అంటూ గోల చేస్తున్న కొడుకు వైపు బలవంతంగా కళ్ళు తెరిచి చూసా.

          “అదేంట్రా….గులాబీ పువ్వుకి ఎవరైనా బ్లాక్ కలర్ వేస్తారా? రోజెస్ ఆర్ రెడ్ అని రైమ్ ఉంది మర్చిపోయావా? అంది సుధ దుప్పట్లు సర్దుతూ

          అన్నీ రంగులు ఒకదాని మీద ఒకటి రుద్దేసినట్టు ఉన్నాడు చివరకి అది నలుపుగా మారిపోయి ఉంది. పువ్వు అంచులో బోల్డ్ గా ఉన్న బ్రౌన్ కలర్, మధ్యలో కారు నలుపుతో ఉంది.

          “బహుసా నల్ల గులాబీ ఉంటే ఇలానే ఉండేదేమో అనిపించింది…..

*****

Please follow and like us:

2 thoughts on “నల్ల గులాబి (కథ)”

  1. నల్ల గులాబి (కథ) చదివాక ఎవరికైనా తమ గతం గుర్తుకు రాకపోదు, అది తీపి అయనా చేదు అయనా.
    “వెలుగు నీడ కొద్ది దూరం మాత్రమే కనిపిస్తుంది. నా జీవితంలో తను ఉన్న కొద్ది రోజు ల్లాగే..”
    ” ఏదైతేనేం…తను నా గతంలోనే మిగిలిపోయింది అక్కడే కలవడం నాకు బావుంటుందన్నట్టు అనిపించింది.”
    “నక్షత్రాలని లెక్క పెడుతూ ఎన్నో క్షణాల్ని భారంగా గడిపితే, ఇద్దరం కలిస్తే నిండు పున్నమిలా కుదరని రోజుల్ని అమావాస్యలా నెట్టుకొచ్చేసాం”
    “జీవితంలో వీళ్ళు ఉంటే చాలు అనుకుని వాళ్ళతో జీవితాన్ని ఊహించు కున్నాక మధ్యలో వాళ్ళు వెళ్ళిపోతే ఎలా ఉంటుందో తెలుసా”
    “నీతో గడిపిన జ్ఞాపకాలు కొన్ని గుర్తొస్తాయి. చెప్పాలంటే ఆ సమయంలో బాధగా అనిపిస్తుంది కాని నిన్ను అలా గుర్తు చేసుకోవడం నాకు నచ్చుతుంది కూడా అన్నాను చిన్నగా నవ్వి.”
    “తనకి నిశీ , నిశ్శబ్దం , నల్ల గులాబీలు ఇలాంటివే ఇష్టం. నిశీ నిశ్శబ్దం అయినా పరవాలేదు. ఈ నల్ల గులాబీనే ఉంటాయో ఉండవో కూడా తెలీదు.”
    ఎంతో అందమైన వాక్య నిర్మాణం

Leave a Reply

Your email address will not be published.