బతుకు చిత్రం-40

(ఆఖరి భాగం)

– రావుల కిరణ్మయి

జరిగిన కథ: తల్లి ఆరోగ్యం బాగు చేయించడం కోసం సయిదులు ఆరాట పడుతుం టాడు .అందుకోసం మందులతో కాక తక్కువ ఖర్చులో మంత్రాలు తంత్రాలతో నయం చేయవచ్చని సరూప ఆశపెడుతుంది. అందుకోసం ఏం చెయ్యాలో చెప్తుంది. దాని కోసం సయిదులు  ప్రయత్నిస్తుంటాడు. ఆ తరువాత  

***

          జాజులమ్మ, అమ్మ లేకుంటే అసలు ఈ ఇల్లు నిలబడేదా? నా భార్య ఏనాడయినా ఈ ఇంటి కోడలుగా, ఈ ఇంటి మనుషులను తన మనుషులని భావించిందా?కుటుంబాన్ని గాలికి వదిలేసిన నన్ను ఏనాడయినా హెచ్చరించి దారి చూపిందా? అసలు ఈ ఇంటి కోడలుగా తనకు, జాజులమ్మకు నక్కకు, నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది.

          ఎన్నోసార్లు తను తన ఇంటి పరిస్థితిని చెప్పినప్పుడు కూడా తానూ తన పుట్టింటి గురించి చెప్పి వారినే తనవారుగా అనుకుంది, కానీ నేను వారిని కలుపుకున్నట్టుగా తను తన వారిని కలుపుకోలేక పోయింది.ఇప్పుడు తనతో ఇక్కడ కాపురం పెట్టడమంటే చిక్కని పాలలో విషాన్ని చిమ్మడమే అవుతుంది.

          పచ్చని సంసారం లాంటి తన వారి జీవితాలకు మనశాంతి కరువు చేయడమే. మేలు చేయకున్నా కీడు చేయడం ధర్మం కాదు. నేను సమానంగా ఆస్తి పంచుకున్నా వాళ్ళను పువ్వులో పెట్టి చూస్తాననేది సందేహమే. ఇట్లాంటి నేను ఇక్కడ ఉండడం కంటే ఎప్పటిలా చుట్టపు చూపులా అప్పుడప్పుడు నా వాళ్ళ కోసం వచ్చి వెళ్ళడమే మర్యాదగా ఉంటుంది. పైపెచ్చు బలవంతంగా వారి వద్ద నుండి ఆస్తిని పొంది తానూ వారి దృష్టిలో ప్రేమను గౌరవాన్ని కోల్పోయినవాడిని అవుతాను ……అని ఎన్నో తర్జన భర్జనల మధ్య మరో వారం రోజులు గడిపి చిన్నవాడు పట్నం బయలుదేరాడు.

          ఈర్లచ్చిమి చెప్పింది.

          ఒరేయ్! అన్నకు మగోళ్ళు లేరు, అదృష్టవంతుడు. ఆడిపిల్లలను మంచిగా సదివించుకొని ప్రయోజకుల చేసి ఒడ్దేక్కుతడు, కానీ నీవే మగపిల్గాండ్లని ఇద్ధరికిద్దరు బిర్రు మీదుండి పట్టించుకోక పోతే నట్టేట్లో నావ లెక్కన మునుగుతవ్ రా! ఇప్పటికయినా మీ భార్యాభర్తలిద్దరు వాళ్ళను ఊ రేవు తేవడానికి దారి చూడుండ్రి. లేదంటే ఈన్నె మాతో పాటు ఈ యవుసం పనిల పెట్టి పొండ్రి. బలాదూరు తిరుగుడు బంధు వేట్టాల్నంటే ఇదే మంచి మార్గం. సోచాయిన్చుకొండ్రి అన్నది .

          అమ్మ చెప్పేది కూడా నిజమే అనిపించింది.

          పిల్లలు సదువులో అంతంతమాత్రంగానే ఉన్నరు. వారిని ఆ పట్నంలో ఉంచి చెడగోత్తుడు కంటే ఈన్నే సర్కారు బడిలో చేర్పించి చదివించడం మేలని తలిచి ఆ విషయమే ఈర్లచ్చిమికి చెప్పి పిల్లలను ఊర్లోనే వదిలి పట్నం వెళ్ళిపోయాడు.

          ఈ ఆలోచన్ చేసింది జాజులమ్మ అనేది ఒక్క ఈర్లచ్చిమికి తప్ప ఎవరికీ తెలియదు.

          పిల్లలు చెల్లెళ్ళు అనే ఆప్యాయతతో అందరూ కూడి ఉండడం ఆ ఇంటిని పండుగలా చేస్తున్నది

          చూస్తుండగానే ఇల్లు పూర్తయింది.

          మగపిల్లలు కొంచెం పెద్ద తరహా ఆలోచనలలోకి వచ్చారు. అనుబంధాలను గౌరవించడమే కాక కాపాడుకోవడం కూడా వారికి ఎంత ముఖ్యమో తెలిసివస్తున్నది. ఆ బాధ్యతలతోనే ఒకనాడు జాజులమ్మతో…

          పెద్దమ్మా! నువ్వు చాలా ఓపికతో పెద్దబాపును, తాతయ్యను దారికి తెచ్చావు. మాయమ్మ కూడా నీ లాగే ఉండుంటే మాకూ ఈ రోజు ఈ ఊర్లో ఇల్లు ఉండేది కదూ!అన్నాడు.

          నిండా ఇరవై ఏళ్ళు కూడా లేని ఆ పసి మనసు ఆలోచన నిజంగానే తన తోటికోడలు కు ఉంటె అలాగే ఉండేది అనుకున్నది. దానికి పరిష్కారమార్గం కోసం ,

          ఎందుకయ్యా? అంతా దిగాలు పడుతావ్ ! మీకూ ఇక్కడ సొంతంగా ఒక ఇల్లు కావాలి అంతేగా! నువ్వు ఊ…..అంటే మనం ఇప్పుడే మరికొంత సాగు భూమిని కౌలుకు తీసుకుందాం. మీరిద్దరూ చదువుకుంటూనే బాపమ్మతో పాటు ఎవుసం చేస్తే మన కట్టం తెర్లు కాకుండా మీకూ ఇక్కడ ఇల్లు మిగులుతుంది. అని సర్ది చెప్పింది. అంతేకాక ఈర్లచ్చిమితో మాట్లాడి తమ పక్కన ఉన్న జోగయ్య భూమిని కూడా కౌలుకు తీసుకుంది.

          ఆ ఏడు ఏరువాక పున్నం నాడు అందరూ కొత్త బట్టలు కట్టి ఉత్సాహంగా చెల్క దగ్గరకు చేరుకొని కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు.

          ఊర్లో తన ఇద్దరు కొడుకులూ ఎవుసం పనిలో దిగారని తెలుసుకున్న మరిది, తోటికోడలు వచ్చారు. మళ్ళీ ఏం గొడవ జరుగుతుందోనని భయపడ్డారు. కానీ ఈ సారి తోడికోడలు కూడా సంతోషించింది. అందుకే ,

          అక్కా ! ఇన్నేండ్లు నేను నిన్ను ఏ మాత్రం లెక్క చెయ్యక పోతి. నువ్వు మాత్రం నా పిల్లల బాగోగులు సోచాయించి వారిని పనిలో పెట్టి బాధ్యతతో చదివిస్తుంటివి, నా పొరపాట్లను సైసక్కా! అని కంటతడి పెట్టింది.

          సూడు సెల్లె మనం ఇట్లా ఒకరికొకరం అర్థం చేసుకొని బాగు చేసుకోవాల్సింది మన పిల్లల బతుకులు కూడా. గందుకే ఊర్లె వాళ్ళ సదువులు అయిపోయేతాళ్ళకు మంచి కాలేజీలల్ల ఎయ్యాలె. అందుకోసమే ఇప్పుడు మనం కట్టం, అదే మన లశ్యం కావాలన్న ట్టుగా బోధ చేసింది.

          అలా ఆ ఇంటివారందరూ ఏకమయ్యారు.

          పిల్లలు చిన్న కొడుకు భర్త అందరూ వ్యవసాయం పనిలో సహకరిస్తుండడంతో ఈర్లచ్చిమికి కొంత తీరుబాటు దొరుకుతున్నది.

          పీరయ్య కొడుకులు కూడా రెక్కలు కట్టుకొని వచ్చి తండ్రి బాధ్యతంటూ నక్క వినయాలు చూపిస్తూ మళ్ళీ దగ్గరకు చేరాలనుకున్నారు, కానీ పీరయ్య , వారు గతంలో జాజులమ్మకు చేసిన అన్యాయం గుర్తురాగా చేరదీయలేక పోయాడు.

          వారు జాజులమ్మను చూడడానికి కూడా వచ్చి,

          తండ్రి తమను పట్టించుకోవడం లేదంటూ మొసలి కన్నీరు కార్చగా, ఈర్లచ్చిమి కల్పించుకొని ,

          ఏం కొడుకులయ్య? మీరు ? ఇయ్యాల నాలుగు రాళ్ళు చేతిల ఆడుతున్నయని తండ్రని, చెల్లె అని చేరిండ్రు గని , ఏ ఒక్కనాడన్న చెల్లె కట్టాలు చూసి కన్ను తడిపితిరా !సెల్లె , బావ , పిల్లలు అని ఇయ్యాల ఈగ లెక్కన ఆలితిరి. అదేందో మరి ఒక్క సెట్టు కాయలయినా , జాజులమ్మ తియ్యగేట్లైంది? మీరు ఇంత కస్కలెట్ల అయిండ్రు? నా కొడుకు కూడా మొన్నటిదాంక గసొంటోడే . మొన్నటి సందే రేవుల వడ్డడు. ఆ పున్నెం గూడ మీ సెల్లె దే. గందుకే సెప్తాన ఇగనన్న మీరు సుత మీ నాయనను కండ్లల్ల పెట్టి చూసుకొండ్రి. పెద్దదాన్ని తల్లి లాంటి దాన్ని అర్థం చేసుకొండ్రి అని బుద్ది పెట్టింది.

          వాళ్ళు వచ్చిన దారినే పోయారు తప్ప తండ్రి బాధ్యతను గురించి మాట్లాడలేదు.

          పీరయ్యకు ఒకటి మాత్రం బాగా అర్థమయింది. ఇగ వాళ్ళు మళ్ళీ తనకు కనపడరని. అదే తనకు ఎంతో మేలని నిట్టూర్చాడు.

          సైదులు తన కుటుంభంలో వస్తున్న మార్పులకు చాలా సంతోషించాడు. దీని కంతటికీ కారణం తన తల్లి, భార్యలె అని మనసులోనే నమస్కరించుకున్నాడు,ఇందుకు ప్రతిగా తన ముగ్గురు ఆడపిల్లలని ప్రయోజకులని చేసి చూపాలని నిర్ణయించుకున్నా డు.

          అది కూడా  ఇదివరలో మద్యానికి బానిసయిన తన లాంటి వారి లాగే సరయిన చదువు లేక చెడి పోతున్న వారికి  నచ్చచెప్పి మంచిదారిలో నడిపించే  ఉపాధ్యాయు రాలీని ఒకరిగా, ఎంతో ప్రమాదకరమయిన క్యాన్సెర్ వ్యాదిని నయం చేసి ఉచితంగా చికిత్స అందించే మంచి డాక్టర్ గా మరొకరిని, మూడనమ్మకాల ఊబిలో కూరుకు పోతున్న సమాజాన్ని శాసిస్తూ అందరికీ సమ న్యాయం దిశగా విధి నిర్వహణ చేయుటకు మంచి ప్రభుత్వ అధికారిణిగా మరొకరిని చూడాలని నిర్దేశించుకున్నాడు.

***

          ఆ లక్ష్యాలకు తగ్గట్టు జాజులమ్మ ఊరికే అదే ఆలోచనల్లో గడుపుతుండడం వల్ల కాబోలు , ఆమెకు ఎప్పుడూ అడవితో కూడిన కలలు వస్తుంటాయి.

          అవి కొన్ని భయపెట్టేవిగా ఉన్నా …భవిష్యత్తు సూచికలుగా భావిస్తూ …గడిచిపోయిన గతంలోని చేదును మరిచిపోతూ శ్రమిస్తున్నది.

          అడవి లాంటి ఈ సమాజాన మంచి వృక్షాలుగా ఎదిగి సమాజానికి మేలును శ్రేయస్సును అందిస్తూ తన పిల్లలు వృద్దిలోకి రావాలని క్రూర జంతువులు లాంటి మృగాళ్ళ  మధ్యన చిక్కుకొని బేలలుగా బలికాకూడదని తపించి వారిని బాగా చదివించి బంగారు భవిష్యత్ఇయ్యాలని తన జీవితంలోని సంఘర్షణలను, సవాళ్ళను , అనుభవాలను కలగలిపి తన బిడ్డల బతుకు చిత్రం ఇంద్రధనుసు చేయడానికి ఆత్మ స్తయిర్యపు కుంచె చేపట్టింది.

          జాజులమ్మ మెడలో విజయహారం వేయడానికి కాలం ఎప్పుడో సిద్ధమయింది.

*****

(సమాప్తం)

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.