మళ్ళీ మొలకెత్తిన మందారం

(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

-అక్షర

          అది మా ఒక్కగానొక్క కూతురైన ‘మాధవి’ పెళ్ళి పందిరి. పీటల పై కూర్చుని కన్యా దానానికి సన్నిద్ధులు అవుతున్నాము నేనూ, మహేశ్. తన సంగతి ఏమోకానీ నా ఆలోచనలు మాత్రం పరి-పరి విధాలుగా గతంలోకి పోతున్నాయి. పురోహితులు చెప్పిన విధంగా అన్నీ చేస్తున్నా, నా మనసుకి మాత్రం ఏకాగ్రత ఇవ్వలేక పోతున్నాను. ఈ నాడు ఈ వివాహ మండపంలోనే కాదు, మాధవి వివాహ నిశ్చితార్థం అయిన దగ్గర నుంచి నా మనస్థితి ఇలాగే ఉంటునది. పెళ్ళిలో ఏ లోటూ ఉండకూడదని ఎంతో శ్రద్ధగా కావాల్సిన వన్నీ అమర్చుతూనే ఉన్నా“మాధవి వివాహం సార్థకం అవుతుందా? లేక మా లాగే …….!!” అన్నసందేహం మనసుని పీకుతూనే ఉంది.

***

          పెళ్ళికి ప్రధాన పురోహితులు అయిన కాళిదాసుగారు వధు- వరులకు ‘జీలకర్ర-బెల్లం‘అన్న తంతుకి అర్థం మరియు ప్రాధాన్యత వివరిస్తూ ఆ ఘట్టం జరిపిస్తున్నారు. పెళ్ళిలో ముఖ్యమైన ప్రతి మంత్రానికి, ప్రతి వేడుకకి ప్రాముఖ్యత వధు-వరులకు క్లుప్తంగా చెప్పి ఆ ఘట్టం జరిపించ వలసిందిగా కాళిదాసుగారిని ముందే అడిగాను. ఆయన కూడా నా కోరిక మన్నించి అదే విధంగా పెళ్ళి జరిపిస్తున్నారు_

          “జీలకర్ర బెల్లం ఒక సారి కలసిపోతే వేరు చేయటంఎంత కష్టమో, వివాహానంతరం వధు-వరులిద్దరి జీవితాలు కూడా అలా ఒకరితో ఒకరు పెనవేసుకుపోవాలి. ఎటు వంటి పరిస్థితుల్లో అయినా అన్యోన్యయంగా మెలగాలి……….”

          నా వివాహ సమయంలో పెళ్ళి మంత్రాలు విని అర్థం చేసుకోవాలన్న ఆసక్తి నాకైతే కలగ లేదు. మరి మహేశ్ ఎంత వరకు విన్నారో తెలీదు. విని ఎంత వరుకు అర్థం చేసు కున్నారో అంతకంటే తెలీదు. మేమిద్దరం మా వైవాహిక జీవితంలో చేసిన తప్పు‘మాధవి-రాహుల్’ చేయకూడదని వాళకి కూడా మరీ-మరీ చెప్పాను –“ పెళ్ళి అంటే అందంగా  అలంకరించుకుని, ఫోటోలు వీడియొలు తీయించుకోవటమేకాదు మధు. ఆ సరదాలు కూడా తప్పకుండా తీర్చుకోండి. కానీ వాటి కంటే ముఖ్యం, మీ వైవాహిక జీవితాన్ని బాధ్యతా పూర్వకంగా స్వీకరించి, ఒకర్ని ఒకరు అర్థం చేసుకుంటూ వ్యవహరించటం. మన పురోహితులు మీ వివాహ కార్యక్రమంలో చదివే మంత్రాలు, వాటి  తాత్పర్యం గ్రహించటానికి ప్రయత్నించండీ.” అని చెప్పాను.

          ‘మాధవి-రాహుల్’ తో పాటూ నేను కూడా కాళిదాసుగారు చెపుతున్నది విని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను.

          “………..ధర్మేచ, కామేచ ఇమామ్ నాతిచరామి, నాతిచరామి, నాతిచరామి.” అనగా భర్తగా నా విధి నిర్వహణలో కానీ, నా కుటుంబం కోసం ధనార్జన విషయంలో కానీ, నా అవసరాలు పూర్తి చేసుకోవటంలో కానీ ఆఖర్కి మోక్ష మార్గం పట్టాలన్నా నేను నా వామాంగి అయిన భార్య సహమతి లేకుండా ఏది చేయను, అని ఈ క్షణం నుంచి వచన బద్ధుడునై ఉంటాను………….”  కాళిదాసుగారు రాహుల్ చేత మంత్రోచ్ఛారణ చేయించి అర్థం చెప్పుకు పోతున్నారు.

***

          మహేశ్ తో నా వివాహం కూడా మా అమ్మా –నాన్నా ఏ లోటూ లేకుండా ఎంతో సరదా పడుతూ చేశారు. నేను కూడా మనస్ఫూర్తిగా ఇష్టపడే మహేశ్ ని చేసుకున్నాను.పెళ్ళి  అయి ఐదేళ్ళు ఎటువంటి చికాకులు లేకుండా గడిచి పోయినాయి. కానీ మాధవి పుట్టిన రెండేళ్ళ నుంచి తనలో మార్పు రావటం గమనించాను. సాయంత్రాలు ఆరింటికల్లా ఇంటికి వచ్చే మనిషి ఆలస్యంగా రావటం ఆరంభించాడు. అదేమని అడిగితే ఆఫీసులో పని వత్తిడి పెరిగింది అన్నారు. సరే అని సరిపెట్టుకున్నాను కొన్నాళ్ళు. మాధవికి మూడేళ్ళు నిండాయి. తనని స్కూల్లో వేయడానికి, మిగతా సందర్భాల్లో కాదనకుండా వెంట వచ్చి తన బాధ్యత నెరవేర్చుకునేవాడు. శని ఆదివారాలు మహేశ్ కి ఆఫీసు శెలవు. ఆ రెండు రోజులూ ఇంట్లో ఉన్నంతసేపూ మధుతో ఆడుకునేవాడు కానీ మధ్యాహ్నం భోజనం చేశాక ఆఫీస్ పని ఉందంటూ వెళ్ళిపోయి రాత్రి ఏ తొమ్మిదింటికో తిరిగి రావటం ప్రారంభించాడు.

          ఆ శనివారం నాడు కూడా ఎప్పటిలాగానే మధ్యాహ్నం భోజనం చేసి ఆఫీస్ పని ఉందంటూ బయల్దేరాడు. నాకు కూడా నెలసరుకులు కొని తెచ్చుకునే పని ఉండింది. మహేశ్ తో వెల్తే కారులో సామాను పడేసి తెచ్చుకోవచ్చును కదా అని తనని అడిగితే “ అబ్బా!! నాకు లేటు అయిపోతుంది, ఈ సారికి నువ్వే తెచ్చుకో శైలూ. లేదూ నాతోనే వెళ్ళాలి అంటే రెండు రోజులు ఆగాలి. “ అని తప్పించుకుని వెళ్ళిపోయాడు. చేసేది లేక, నేను మాధవిని తీసుకుని బయల్దేరాను. నాకు బాగా అలవాటైన డిపార్ట్మెంటల్ స్టోర్ ముందు ఆటో దిగుతుంటే మహేశ్ సహకర్మచారిణి అయిన ‘రశ్మి’ కనిపించి “ ఇదేమిటి ఇలా ఎండలో వక్కర్తివీ పాపని తీసుకుని వచ్చావు?” అంటూ పలకరించింది.

          “ మరేం చెయ్యను? మీ ఫ్రెండు ఆఫీస్ పని ఉందంటూ వెళిపోతే.” అంటూ తన వేపు పలకరింపుగా చూశాను.

          “ఆఫీసు పనా!!! నాకు తెలిసి ఈ రోజు ఆఫీస్ పనేమీ లేదే………..ఇంకా ఎదో చెపుతూ ఉంటే రశ్మి ఐదేళ్ళ కొడుకు తనని తొందర పెడుతూ టాయ్ షాపులోకి లాక్కుపోయాడు. నేను కొంచెం తెరుకుని స్టోరులోకి నడిచాను. ఆ తరువాత లిస్టు ప్రకారం సామాను ఎంచుకుని, ఒక పక్క మధుని చూసుకుంటూ బిల్లు చెల్లించి ఇంటికి తీరిగి వచ్చే సరికి సాయం సమయం అయిపోయింది. మాధవికి ఒక ఆపిల్ పండు కోసి ఇచ్చి నేను ఇంత నిమ్మరసం కలుపుకుని సేద తీర్చుకున్నాక ‘రశ్మి’ అన్న మాట గుర్తుకు వచ్చింది. ఈ రోజు ఆఫీసు పనేమీ లేదంటుంది ఏమిటి!!! మరి మహేశ్ నాతో అబద్దం ఎందుకు చెప్పాడు? రాకూడని ఆలోచనలు వచ్చి మనసుని అశాంత పరుస్తుంటే చల్లటి నీరుతో మొహం కడుక్కుని ఊరుకో పెట్టి, రాత్రి వంట ప్రయత్నం మొదలు పెడుతూ “మహేశ్ వచ్చాక అడిగితే సరిపోతుంది కదా!! చూద్దాం ఏమంటాడో.” అని నా ఆలోచన్లకి విరామం ఇచ్చాను. మరి కాసేపటికి తను రానే వచ్చాడు. అప్రయత్నంగా తననే గమనిస్తున్నాను. కాళ్ళూ చేతులు కడుక్కు వచ్చాక కాఫీ కావాలా అని అడిగితే ‘ఏమీ వద్దు. ఆఫీసులొనే టీ తో స్నాక్స్ తీసుకున్నాను.’ అని మాధవితో ఆడుకోవటం మొదలెట్టాడు. అడగటమా! మానటమా! అని  అనుకుంటూనే ఉండబట్టలేక అడిగాను“బజారులో మీ కొలీగ్ రశ్మి కనిపించింది. ఈ రోజు ఆఫీసులో మీటింగ్ ఏమీ లేదన్నది.” అని ప్రశ్నార్థకంగా చూశాను మహేశ్ వైపు. “నిజమే. తనది వేరే డిపార్ట్మెంట్ కదా. రశ్మికి ఎలా తెలుస్తుంది మా మీటింగ్ విషయం.” చాలా సహజంగా చెప్పిన మహేశ్ జవాబు విని నిజమేనేమో అని ఆ విషయా న్ని అంతటితో వదిలేశాను. అనవసరంగా తనని అనుమానిస్తున్నానా అని సంశయిం చాను.

          ఇంతలో మళ్ళీ ఒక నాడు అనుకోకుండా నేను బజారుకు వెళ్ళవలసి వచ్చింది. బట్టల షాపులో అడుగు పెడుతూనే  బిల్లు పే చేస్తున్న మహేశ్ తన మరో కొలీగ్ రోహిణీతో కలిసి ఎదురు పడ్డారు. ఒక్కసారిగా నన్ను చూసేసరికి ఇద్దరి మొహాలు పాలిపోయినాయి. షాపులో అందరి ముందర గొడవ పడటం ఇష్టం లేక వెనుతిరిగి ఇంటికి వచ్చేశాను. అదృష్టవశాత్తు అప్పుడు మాధవి నాతో లేదు. తనని స్కూల్ కి పంపించే నేను మార్కెట్టుకి వెళ్ళాను అవసరం అయిన పని మీద. తను తిరిగి ఇంటికి రావటానికి ఇంకా రెండు గంటలు పడుతుంది. నా మనసు, మనసులో లేదు. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తోచటంలేదు. గాయపడిన మనసు మెదడు పై హావీ అయిపోతున్నది. ఒక పక్క కోపం, దుఃఖం వల్ల ఏడుపు తన్నుకు వస్తునది. ఇంత వరకు మహేశ్ ని అనుమానించి నిలదీయక పోవటం నేను చేసిన తప్పా?? ఏం చెయ్యాలో తెలీక అమ్మ కి ఫోన్ చేసి ఇన్నాళూ జరిగింది చూసిందీ చెప్పాను, దుఃఖం వల్ల పూడుకుపోతున్న గొంతుతో.

          “రాత్రి మధు పడుకున్నాక అల్లుడితో మాట్లాడి చూడు, ఎమాంటాడో.  నేను కూడా మీ నాన్నతో మాట్లాడి అవసరం అయితే  వస్తాము. అధైర్య పడకు. ఆవేశ పడకుండా ఉండటానికి ప్రయత్నించు” అని ధైర్యం చెప్పింది. నాకు ధైర్యం చెప్పిన అమ్మ ఎంత ధైర్యంగా ఉండగలిగిందో తెలీదు.

          రాత్రి మధు పడుకున్నాక మహేశ్ తాగి తూలిపోతూ వచ్చాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అప్పుడు తనతో ఏం మాట్లాడి ప్రయోజనం ఉండదని తెలిసి మధు పక్కకి వచ్చి పడుకున్నా. మహేశ్ అలాగే వెళ్ళి సోఫా పై జార్గిల్లపడ్డాడు. చిన్న పిల్ల ముందు గొడవ పడటం ఇష్టం లేక ఇంత సేపు వేచి ఉంటే, అది తెలిసే నన్ను తప్పించు కోవటానికి తాగి వచ్చి పడి  ఉన్నాడు. ఇంక ఏం మాట్లాడుతాను. ఎలాగో రాత్రి గడిచి తెల్లవారింది. అతి కష్టం మీద లేచి మధుని తయారు చేసి స్కూల్ బస్ ఎక్కించి వచ్చి చూస్తే మహేశ్ అప్పటికే ఆఫీసు వెల్టానికి తయారై పోయాడు. నేను ఏం మాట్లాడకుండా తన కోసం కాఫీ టిఫిన్ టేబుల్ మీద పెడితే, మారు మాట్లాడకుండా ఆ రెండూ పుచ్చుకుని బయల్దేరాడు. ఇక ఉండ పట్టలేక అడిగాను. రాత్రికి మీకు వంట చెయ్యాలా వద్దా అని. వండోద్దు అని చెప్పి వెళిపోతుంటే నేను గట్టిగా అరిచినట్టే అన్నాను “ మీరు రోజంతా ఎక్కడ ఎవరితొ తిరిగినా వేళకి ఇంటికి వచ్చి కనీసం తండ్రిగా మాధవితో సమయం గడపండి చాలు. నేను మిమ్మల్ని ఏమీ అడగను. కానీ మధు మీ బిడ్డ. మీకు తన పట్ల బాధ్యత ప్రేమ ఉందని ఏ మాత్రం గ్రహింపు ఉన్నా, అన్నీచూసి అర్థం చేసుకుని మిమ్మల్ని నిలదీసిన నాడు మధుని ఎలా సమాధాన పరుస్తారో ఆలోచించి ఉంచు కోండి.” అంతే. ఆ రోజు మొదలు మా ఇద్దరి మధ్య మాటలు కరువు అయినాయి. అమ్మ-నాన్నా ఆందోళన పడుతూ రెండు మూడు సార్లు ఫోను చేసి అడిగారు. ఉన్న విషయమే చెప్పాను. “అలా ఏం మాట్లాడక పోతే నువ్వు ఎందుకు ఊరుకున్నావమ్మా? నన్ను వచ్చి గట్టిగా అడగమంటావా ?” అడిగారు నాన్న. వొద్దని అడ్డుపడ్డాను. అలాంటి అవసరం వస్తే నేనే పిలుస్తానని చెప్పి నాన్నని శాంత పరిచాను.

          ఆ రోజు మొదలు మహేశ్ కొంచెం పెంద్రాళ్ళే ఇంటికి రావటం మొదలెట్టాడు. ఏ పూటకి ఆ పూట భోజనం చేస్తానంటే తన కోసం వంట చేయటం లేకపోతే మానేయటం. కొన్నాళ్ళు పోయాక తనకి కావల్సిన వంట తానే చేసుకోవటం ప్రారంభించాడు. తన వస్తువులు వేరే గదిలోకి మార్చి ఒకే ఇంట్లో వేరుగా ఉండటం మొదలెట్టేసరికి మా ఇద్దరి మధ్య ఆ మాత్రం మాటలు కూడా అవసరం కూడా లేకుండా పోయింది. మేము ముగ్గురం కలిసి బయటకి వెళ్ళే ప్రసక్తే లేదు. మాధవి ఎప్పుడైనా బయటకి తీసుకు వెళ్ళమని మారాం చేస్తే మహేశ్ తీసుకుని వెళ్ళి వచ్చేవాడు. ఎవరైనా ఇంటికి వస్తే మాత్రం వారి ముందు చాలా సహజంగా ప్రవర్తిస్తూ జాగ్రత్త పడేవాళం.

          అనుకోకుండా మహేశ్ తల్లీ-తండ్రి వచ్చారు ఒక వారం రోజుల కోసం. రెండు రోజుల్లో మా వ్యవహారం పసిగట్టారు. ఏమైందని అడగటానికి కొడుకు దొరక్క పోతుంటే నన్ను అడిగారు. జరిగిందంతా చెప్పి “చూస్తున్నారుకదా మిమ్మల్నిఎలా తప్పించుకుని తిరుగుతున్నారో నాతోనూ ఇలాగే ప్రవర్తించారు. మా మధ్య ప్రస్తుతం మాటలు కూడా లేవు. మాధవి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఒక ఇంట్లోనే వేరు-వేరుగా ఉంటున్నాము . మీ మనవరాలు పెద్దయ్యి ప్రశ్నించేదాకా ఇలా గడిచిపోనివ్వండి అత్తా. గొడవ పడి వాదించుకుని, ఇంటి రభస బయట పడేసే కంటే ఇది నయం కదా?” అన్నాను. ఏమనుకున్నారో కానీ అత్తా-మావగారు కన్నీళ్ళు పెట్టుకుంటూ మాధవిని దగ్గర్కు తీసుకుని ముద్దు చేసి తిరుగు ప్రయాణం అయ్యారు. జరిగినది అమ్మ-నాన్నకి, అత్తా-మావగారికి చెప్పాను. వారు పని కట్టుకుని మిగతా బంధువులుకి చెప్పక పోయినా ఇటు వంటి విషయాలు ఎలాగోలాగా ఎప్పటికైనా తెలియక పోవు. అయినా ఏమాత్రం సభ్యత-సంస్కారం ఉన్నవారు ఎదుటపడి మన స్వవిషయాలు కెలకరు అన్న ధైర్యం నాకు ఉండింది. అదృష్టవశాత్తు మాకు ఇరు వైపులా బంధువుల తాకిడి కూడా తక్కువే.

          మాధవి స్కూల్లో కార్యక్రమాలికి మాత్రం పిలిచినప్పుడు తప్పని సరిగా కలిసి వెళ్ళేవాళం. తన ఆటపాటలు చూసి ఇద్దరం సరదా పడేవాళం కానీ ఆ సరదా కలిసి పంచుకోలేక పోయేవాళం. మా ఇద్దరిలో ఎవరికి వంట్లో చికాకు చేసినా ఒకరికి ఒకరు కావాల్సింది అందించి అమర్చి పెట్టేవారం కానీ ‘ఎలా ఉన్నావని’ పలకరించుకునేవారం కాదు.

          ఇంట్లోకి కావల్సిన వస్తువుల కోసం మాత్రం మహేశ్ ఎన్నడూ నన్నుఇబ్బంది పెట్టలేదు. అది మహేశ్ లోని మంచితనమా! తన భార్య-కూతురి పట్ల బాధ్యతా భావమా!! మా పట్ల ప్రేమానురాగాలా!!! ఇదేది కాదు తాను చేసిన తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నమా!!!  లేక ఇవి అన్నీనా!!! అన్నది మాత్రం నాకు ఇప్పటికీ బోధపడని విషయం.

          నేను నిలదీసి ఏమీ అడగలేదు కదా తనే స్వయంగా వచ్చి ఎందుకు సంజాయిషీ చెప్పుకోవాలని మహేశ్. ఏ తప్పూ చెయ్యని దాన్ని నేను ఎందుకు తనతో మాటలు కలపాలి అని ఇద్దరం పంతం పట్టాము. మా పంతాలతో రాగద్వేషాలతో ప్రమేయం  లేకుండా కాలం గడిచి పోయింది. ఇంట్లో విషయాలు అర్థం చేసుకుని మెలిగే పరిజ్ఞానం, మెళుకువ మాధవికి బాగానే అలవడింది. విద్యావంతురాలు అయ్యాక  పెళ్ళిపీటల పై కూర్చుంది.

          “ ………….మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా …..”ఖంగు మంటూ కాళిదాసుగారి కంఠం వినిపించి ఇహ లోకానికి వచ్చాను. “ …..కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదా శతం. అనగా ఓ వధువా నా జీవితానికి కారణం అయిన ఈ సూత్రం నేను నీ మెడలో మాంగల్య రూపంలో కట్టుచున్నాను. నా జీవితానికి, జీవన గమనానికి హేతువు అయిన మంగళసూత్రం ధరించి, నూరు సంవత్సరములు జీవిస్తూ ఇచ్చటనే ఉండాలని కాంక్షిస్తున్నాను. ……” మాంగల్యధారణ జరిపిస్తూ, దాని ప్రాముఖ్యత వివరించారు. ఆ తరువాత తలంబ్రాల సంబరం. ఇరు పక్కల బంధు-మిత్రులు  రాహుల్ మాధవి చుట్టూ చేరారు. పురోహితులు మళ్ళీ అందుకున్నారు-“ ఈ ఘట్టం వధు వరుల మధ్య వేడుక మాత్రమే కాదు. దీనికి ఉన్న పరమార్థం మీకు తెలుసా? “ అందరూ తలెత్తి ప్రశ్నార్థకంగా చూశారు. ఈ వేడుక ద్వారా వరుడు వధువు తల పై తలంబ్రాలు పోస్తూ కోరుకుంటాడు_“ వధువా నీవు మా గృహ ప్రవేశం చేసాక, మన ఇంట ధాన్యం ఇలాగే కుప్పలగా విరివిగా ఉండి, మన జీవితాలకి ఆధారభూతమైన ధాన్యంతో, నిత్య సంపదలతో కలిగి ఉండాలని, ఈ కన్య నా వంశాన్ని వృద్ధి చేయ్యుగాక అని. వధువు కూడా తన అంగీకారం తెలుపుతూ వరుడి తల పై తలంబ్రాలు పోస్తుంది. “ ఒక పక్క నుంచి  కాళిదాసుగారు చెపుతున్నది చెవిలో పడుతున్నా నా మనసు మాత్రం గతంలోకి జారీ పోతున్నది.  

***

          మాధవి యుక్త వయస్కురాలు అవుతోంది. తన తోటి స్నేహితుల ఇళ్ళకి వెళ్ళి  రావటం మొదలెట్టిన దగ్గర్నుంచీ తమ ఇంటి వ్యవహారంలో వెలితీ- వ్యత్యాసం గమనించి నన్ను ప్రశ్నిస్తే చెప్పాను-“ మరేం లేదు మధూ, మీ నాన్నా నేనూ మాటా-మాటా అనుకున్నాము. తప్పు మీ నాన్నది అయినా ఒక్క సారైనా నాతో’ సారీ’ చెప్పలేదు. నాకు ఇంకా కోపం వచ్చి మీ నాన్నతో మాట్లాడటం మానేశాను.”

          “ అవునా? అయితే నేను నాన్నతో మాట్లాడుతానుండు.” అంది తను.“అలాగే అడుగుదువులే సాయంత్రం నాన్న వచ్చాక.” ఇలా ఏదొకటి ఆ సమయానికి తోచింది చెప్పి తాత్కాలికంగా మాధవిని సమాధాన పరిచినా మా పరిస్థితిని అవగాహన చేసుకోగలిగె పరిపక్వత వచ్చిందన్న ధైర్యం కలిగాకనే అసలి విషయం మాధవికి విడమరిచి చెప్పాను. విని అంతా నా తప్పే అంటుందో లేక మహశ్ ని నిలదీస్తుందో ’ అన్నఒక లాంటి భయం నాకు లేకపోలేదు. విన్నది పూర్తిగా జీర్ణించుకున్నాక అడిగింది “ ఆ తరవాత నాన్నా, నువ్వు జరిగిన దాన్ని గురించి ఏం మాట్లాడుకోలేదంటున్నావు. పోనీ నేను నాన్నని అడగనా ఏమంటారో?”

          “తప్పకుండా అడుగు మధు. నాకు కూడా తెలుసుకోవాలని ఉంది.” అన్నాను. మధుతో మనసువిప్పి మాట్లాడాక, గత ఇన్నేళ్ళుగా నన్ను పీడిస్తున్న పెద్ద బరువు దింపుకున్నంత తెలిగ్గా అనిపించింది. ఫలితంగా మధు నాకు దూరం అయిపోయినా తట్టుకోవటానికి సిద్ధ పడ్డాను. కాసేపు మౌనంగా ఉండిపోయి మళ్ళీ అంది-“ లేదమ్మా, నేను ఏమీ  అడగలేను. నాన్నని నిలదీసెంత  ధైర్యం నాకు లేదు.” తండ్రి పట్ల సహజంగా ఉండే గౌరవ భావన మాధవికి అడ్డుపడుతున్నాయని నాకు అర్థంఅయింది. నేను కూడా తనని బలవంత పెట్టలేదు. ఈడోచ్ఛిన్న పిల్ల. ఇంతకాలం ఎంత క్షోభ అనుభవించి ఉంటుందో పాపం. తన వయసుకి తగ్గ అనుభవం మధుకి ఉంటుంది కదా!!బయట ప్రపంచం చూస్తూ ఈ పాటికి కొంత అవగాహన చేసుకునే ఉండాలి. అందుకే నేమో నేను చెప్పింది విని అంతగా  ఆశ్చర్య పోలేదు మాధవి. కొంచెం తెరుకున్నాక ‘ఇన్నేళ్ళు ఇంత బాధ మనసులో దాచుకుని ఎలా బ్రతకగలిగావమ్మా?’ అని నన్ను పట్టుకుని ఏడవటం మొదలెడితే ‘నిన్ను చూసుకుని. పెద్దయ్యాక తప్పక పరిస్థితిని  అర్థం చేసుకుంటావన్న నమ్మకమే నాకు ఆ నిగ్రహం ఇచ్చింది తల్లీ’ అని ఓదార్చా ను. అలా ఒకర్ని ఒకరు ఓదార్చుకుంటూ ఎంత సేపు ఉండిపోయామో మాకే తెలీదు. కానీ ఆ తరువాత మా ఇద్దరి మనసులు  చాలా తేలిక పడ్డాయని మాత్రం చెప్పగలను. మహేశ్ కీ నాకు మధ్య ఉన్న దూరం, తండ్రి, కూతుర్ని దూరం చేయకూడదని మాధవిని వాళ నాన్నతో మునపటి లాగానే ప్రవర్తించమని మాట ఇవ్వమన్నాను. అలాగే ప్రయత్నిస్తా నంది మధు.

***

          సప్తపది జరిపిస్తూ వధు-వరుల చేత ఏడు వాగ్దానాలు చేయిస్తున్నారు పురోహితు లు_”ఒకర్ని ఒకరు పోషించు కుంటూ, సమర్థత పెంచుకుంటూ, ధనార్జనలో ఒకర్కి ఒకరు సాయం చేస్తూ, కష్ట-సుఖాల్ని పంచుకుంటూ, ఒకర్నిఒకరు సంరక్షించుకుంటూ, సంతానానికి తథా పెద్దలకి సంరక్షణ కల్పిస్తూ జీవితాంతం సహచరులుగా కలసి ఉండటానికి ఈ క్షణం నుంచీ వచనబద్ధులం అయ్యాము.” ఏడు వాగ్దానాలు విన్న నేను అనుకోకుండా మహేశ్ వేపు చూసేసరికి చూపులు కలిసి ఇద్దరం తడబడి మళ్ళీ ముఖాల పై నవ్వు పులుముకుని, సందడిలో పాల్గున్నాము.

          మాధవి-రాహుల్ వివాహం అప్పగింతల దాకా వచ్చింది. అప్పటి వరకూ సరదా  ఆనందంతో నిండిన వాతావరణంలో గాంభీర్యం చోటు చేసుకుంది. పైకి గాంభీర్యం నటిస్తున్న మహేశ్ కూడా తప్పకుండా లోలోపల నా లాగానే ఎంత బాధ పడుతున్నాడో నేను ఊహించగలను. ఇన్నాళూ మా ఇద్దరికి మధ్యవర్తిగా ఉన్న మాధవి అత్తవారింటికి వెళిపోయాక నేనూ మహేశ్ ఏం చూసుకుని, ఎలా బ్రతకాలి?? మనసులో మాట పంచుకో వల్సిన సహచరుల మధ్య మాటలే లేవు. ఈ ప్రశ్న ఇప్పుడే కాదు, మధుకి వివాహం నిశ్చయించన దగ్గర నుంచీ నన్ను వేధిస్తూనే  ఉండింది. వివాహ ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ ఆ ప్రశ్న పెనుభూతంలా తాయారయి పీడిస్తునది.

          వివాహా సన్నాహం పూర్తయింది. ఇరువైపుల బంధు మిత్రులు భోజనాలు ముగించి తిరిగి వెల్టానికి సన్నిధులవుతున్నారు. నేనూ మహేశ్ వారిని సాదరంగా సాగనంపు తున్నాం. ఎక్కడి వారు అక్కడ సర్దుకున్నాక పెళ్ళికి పెద్దరికం వహించిన మా అమ్మా నాన్నా, అత్తా మావగారూ మా దగ్గరకు రాంగానే ఇక నిగ్రహించుకోలేక అమ్మని గట్టిగా వాటేసుకుని  ఏడుస్తున్న నన్ను అదిమి పట్టుకుని “ ఊరుకొమ్మా శైలూ,ఇన్నేళ్ళు బాధని దిగమింగుతూ ధైర్యం, ఒర్మి తెచ్చి పెట్టుకుని ఇంత ఘనంగా కూతురి పెళ్ళి చేశారు మీరిద్దరూ. నిన్ను ఇలా చూసింది అంటే మధు మిమ్మల్ని విడిచి ఎలా వెల్తుంది చేప్పు ……….” అని నన్ను ఓదారాస్తూ చెమ్మగిల్లిన తన కళ్ళని తుడుచుకున్నది అమ్మ.

          పెళ్ళి పందిరి సర్దుమణిగాకనా గదిలోకి వెళ్ళి మంచం మీద చిందర వందరగా పడి ఉన్న వస్తువులు సర్దే ఓపిక లేక అలాగే వాటిని పక్కకి నెట్టి కాళ్ళు జాపుకుని కళ్ళు  మూసుకుని మనసులో చెలరేగుతున్న భావోద్రేకతను అదుపులో పెట్టుకోటానికి ప్రయత్ని స్తున్నాను. నుదిటి పైన మధు చేతి స్పర్శకి కళ్ళు తెరిచి చూశాను. ” అమ్మా, నువు ఒప్పుకుంటె ఒకసారి మీ ఇద్దరితో మాట్లాడాలని ఉంది. నాన్నని పిలుచుకురానా? ప్లీజ్ వొద్దనకమ్మా …”అంటూనే వెళ్ళి మహేశ్ చేయ పట్టుకుని తీసుకువచ్చి నా పక్కనే మంచం మీద కూర్చోపెట్టి తను ఒక కుర్చీ లాక్కుని ఎదురుగా కూర్చుంది. హటాత్తుగా మధు చేసిన చర్యకి స్పందించేలోగానే మళ్ళీ మధు అందుకుంది._” మీ ఇద్దరిలో తప్పు ఒప్పు ఎవరిది అని తీర్మానించి విమర్శించే హక్కు నాకు లేదనే అనుకుంటా. ఒక వేళ ఆ హక్కు ఉన్నా దానికి ఇది సరైన సమయం కాదు. మా పెళ్ళి నిశ్చయించాక నేనూ, రాహుల్ మీ ఇద్దరి విషయం చాలా సార్లు చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చాము.

          ఆ రోజుల్లో నాన్న చేసింది తప్పే. కానీ ఆ తరువాత మళ్ళీ నాన్న ఎప్పుడైనా నిన్ను నొప్పించేగా ప్రవర్తించారా, లేదు కదా? నేను నాన్నని వెనకేసుకు వస్తున్నాని అనుకోకు అమ్మా!!! నాన్న ఆ రోజుల్లో చేసిన తప్పుకి  మీరిద్దరూ ఈ నాటి వరకు శిక్ష అనుభవిం చారు. కాదంటారా? తల్లీ- తండ్రి ఇద్దరి ప్రేమ నాకు ఆందాలనే కదా మీరిద్దరూ ఇష్టం ఉన్నాలేకున్నా నా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఒకే ఇంట్లో వేరు-వేరుగా ఉంటూ ఇన్నేళు గడిపారు. ఇద్దరూ కావాల్సినంత  ప్రేమ నాకు పంచి పెట్టారు కానీ ఒక్కసారైనా ముగ్గురం కలిసి సరదాగా కాలం గడపలేక పోయాము. నాకు చిన్న బాధ కలిగినా నా కంటే ఎక్కువగా మీరిద్దరూ బాధ పడటం నేను చూసాను. కానీ ఇద్దరూ కలిసి నన్ను ఓదారిస్తే ఎంత బావుండునో అని ఆశపడి నిరాశ చెందిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. నాకు ఐదేళ ప్రాయంలో జరిగిన సంఘటన అది. ఇప్పుడు నాకు పాతికేళ్ళు. అంటే గత ఇరవై ఏళ్ళగా మీరిద్దరూ ఒకర్ని ఒకరు శిక్షించుకుంటూనే ఉన్నారు కదా? ఇంత కాలం  అనుభవంచిన శిక్ష మీకు చాలదా? ఆ నాడు నన్నుదృష్టిలో పెట్టుకుని ఒకే ఇంటిలో వేరు-వేరుగా ఉండటం ప్రారంభించిన మీరు మళ్ళీ నా సంతోషం కోసం కలిసి మిగతా జీవితం గడపలేరా???…….ఉలిక్కిపడి నేనూ మహేశ్ ఒకేసారి మాధవి కళ్ళలోకి చూసాము. నా ఊహాకి కూడా అందని ప్రశ్న. మా కోసం మాధవి పడుతున్న ఆరాటం చూసి నామనసు చలించింది. మేము తెరుకుని ఏమైనా అనే లోపునే మళ్ళీ అందుకుంది నా కూతురు_” అదేమిటి అలా చూస్తున్నారు నా వేపు? నేను అంత అసహజమైనది, అసంభవమైనది కోరుకున్నానా? ఇన్నాళ్ళు మీ-మీ కష్ట- సుఖాలు నాతో పంచుకున్నారు. ఎంతో ఘనంగా నా పెళ్ళి చేసి నన్ను పంపినా, రాహుల్ నన్ను ఎంత బాగా చూసుకున్నా మిమ్మల్ని తల్చుకుని వ్యథ చెందకుండా ఉండగలనా??? ఒక్కసారి నేను అడిగింది నా వైపు నుంచి ఆలోచించుకుని చెప్పండి. వెంటనే వద్దు, నేను రేపు రాహుల్ తో వాళ ఇంటికి బయల్దేరే ముందు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అప్పటికి మీజవాబు తయారుగా ఉంచుకోండి” అంటూ వడి వడిగా బయటకు వెళిపోయింది.

          మర్నాడు ఉదయం మధుని అత్తవారింటికి పంపే సన్నాహంలో ఉన్నాము మేము. బయల్దేరే ముందుమళ్ళీ వచ్చి అడుగుతానంది. ఏం చెప్పాలి!! తను కోరిన విధంగా నేను మహేశ్ మరల కలసి మెలసి బ్రతకగలమా? వధు వరులతో పాటూ నేనూ మహేశ్ కూడా పెళ్ళి మంత్రాలు విన్నాము కదా!! గతమంతా పక్కన పెట్టి మళ్ళీ మా ఇద్దరి సంబంధానికి మరో అవకాశం ఇవ్వ గలమా!! ఒకర్ని ఒకరు శిక్షించుకొవటానికి వెనకాడని  మనసు-మెదడు క్షమించటానికి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాయి !!! యథాలాపంగా అన్ని పనులూ చేసుకుపోతున్నానే కానీ మనసంతా అల్ల-కల్లోలంగా తయారయింది. అంత లోనే వాళ నాన్నచేయి పట్టుకుని తీసుకు వచ్చింది మధు. ఇక తప్పించుకునే అవకాశం లేదు_” ఇదిగో ఇదే ఆఖరిసారిగా అడుగుతున్నాను మిమ్మల్ని. నేనూ రాహుల్ మీ దగ్గరకు వచ్చి కొంత కాలమయినా గడపాలంటే, మీరీద్దరు కూడా కలిసి ఉండటానికి  ప్రయత్నిస్తామని నాకు మాట ఇవ్వాలి….” అంటూ చేయి జాపింది మా వేపు.

          “అలాగే లేవే. వేరేగా మాట ఇచ్చేదీ ఏముంది మధు?? ఇన్నాళు నువు వెంట ఉన్నావు కాబట్టి వీరి ఆటలు సాగాయి. ఇక మీదట మనం వదన్నా వీరు మాట్లాడుకోక తప్పదు, కలసి బ్రతకగా తప్పదు……“ అంటూ అప్పుడే అక్కడికి  వచ్చారు మా అత్త వెంట మావగారూ మా అమ్మా-నాన్న. ‘అవునా అయితే మరి నా చెయి మీద చేయ వేయటానికి ఎందుకు అంత సంశయం’ అన్నట్టు చూసింది మధు మా ఇద్దరి వెపూ. ఇక చేసేదిలేక నా చేయి పెట్టేసరికి మహశ్ కూడా చేయి వేసి సరే అన్నట్టు తల ఊపేడు. ఎనలేని ఆనందంతో  నన్నూ మహేశ్ ని ఒకే సారి వాటేసుకున్న మధు వెనకాతల గోలెంలో ఇక ఎండి పోతుందనుకున్న మందార మొక్క మళ్ళీ మొలకెత్తటం చూసి, మాధవి కోరుకున్నది అంత అసంభవమైనది కాదేమో అనిపించింది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.