యాదోంకి బారాత్-19

-వారాల ఆనంద్

జీవగడ్డ – ఆత్మీయ సృజనాత్మక వేదిక- రెండవ భాగం

ఎదో అనుకుంటాం కానీ ‘జీవితం’ పెద్ద పరుగు. ఊపిరాడనంత దరువు. పరుగంటే గుక్క పట్టుకుని ఓ వంద మీటర్లు పరుగెత్తి గెలుపో ఓటమో ఒక చోట నిలబడ్డం కాదు. జీవితం ఓ మారథాన్. సుదీర్ఘమయిన పరుగు. ఊపిరి రావడానికీ పోవడానికీ నడుమ నిరంతరం సాగే ఉరుకులాట. దాంట్లో ఎన్నో మెరుపులు మరకలు. మలుపులు. ఎత్తులు, పల్లాలు.

          పరుగు ఓ క్షణం ఆపి వెనక్కు చూసుకుంటే ఎంతో చీకటీ మరెంతో వెలుతురూ. కొన్ని స్మృతులు పరవశింప జేస్తే మరికొన్ని పలవరింప చేస్తాయి. కొన్ని ఉద్వేగాన్నీ మరి కొన్ని ఉద్రేకాన్నీ ముందుకు తెస్తాయి. ఏది ఏమయినా గతించిన కాలం అనుభవాల్ని ప్రోది చేస్తుంది.

అదెంత బాగా జరిగింది,

అదట్లా జరగకపోతే బాగుండు,

అది అట్లా కాకుండా ఇట్లా చేస్తే బాగుండు …

లాంటివి అనేకం మనముందు సినిమా రీలులాగా గిర్రున తిరుగుతాయి.

          ఈ జ్ఞాపకాలు ఎన్నో పాఠాలని బోధిస్థాయి, మరెన్నో గుణ పాఠాలని అందిస్తుంది.

          ఇదంతా ఇట్లా వుంటే ‘జీవగడ్డ’ నాకూ నా మిత్రబృందానికి బతుకు యాత్రలో ఓ చైతన్యవంతమయిన మజిలీ. చర్చలకూ, రాతలకూ అదో గొప్ప వేదిక. అందులో మా అందరి చేతా కాలమ్స్ రాయించడమే కాకుండా జీవగడ్డలో సినిమా సమీక్షలకు కూడా స్థానంకల్పించారు. ‘సినిక్’ పేర నన్ను ఆ రివ్యూలు రాయమన్నాడు చారి. ‘మార్కులన్నీ ముద్దుల మనవరాలికే’, ప్రచారాడంబరం తప్ప ప్రయోజనం లేని ‘శిక్ష’, రెండున్నర గంటల బలి ‘అనుభవం” ఇట్లా అనేక సినిమాల గురించి సూటిగా రాసాం. ఇక్కడ ఒక విషయం గుర్తోస్తున్నది. దాదాపు అదే సమయంలో దర్శకుడు జీవీ అయ్యర్ సంస్కృతం లో “ఆది శంకరాచార్య” తీసాడు. సర్వదమన్ బెనర్జీ ప్రధాన పాత్రధారి. జాతీయ చలన చిత్రాభివృద్ది సంస్థ (NFDC) నిర్మించింది. ఆ సినిమాకు దేశ వ్యాప్తంగా విశేష పేరు ప్రఖ్యాతులతో పాటు జాతీయ అవార్డులూ వచ్చాయి. దాని మీద నరెడ్ల శ్రీనివాస్ జీవగడ్డ లో ఓ వ్యాసం రాసాడు. సినిమా షూటింగ్ జరుగుతున్న కాలమంతా దర్శకుడు భక్తి భావంతో చెప్పులు లేకుండా ఉన్నాడని రాసాడు. ఎమోషనల్ గా బాగా రాసాడని అందరమూ అనుకున్నాం. రెండు రోజుల తర్వాత పత్రికాఫీసుకు ఓ ఉత్తరం వచ్చింది. “ఒక సినిమా ఎట్లా వుందో రాయాలి బాగుంటే ఎందుకు బాగుందో.. బాగా లేకపోతే ఎందుకు బాగా లేదో రాయాలి కానీ దర్శకుడు చెప్పులు వేసుకున్నాడా లేదా, ఆయన వేసుకుంటే ఏమిటి లేకుంటే ఏమిటి.. ఇలాంటివి సరి కాదు…” అంటూ ఘాటుగా ఉందా ఉత్తరం. అందరమూ సైలెంట్ అయిపోయాం. ఆలోచనలో పడ్డాం. తర్వాత తెలిసింది అది ప్రముఖ రచయిత తుమ్మేటి రఘోత్తమ రెడ్డి గారు రాసారని. అంటే అప్పుడు జీవగడ్డలో ఎవరు ఏది రాసిన పాఠకులు ఎంత సీరియస్ గా తీసుకునేవారో ఆ సంఘటన ద్వారా తెలిసింది. అంటే రాసేవారెవరూ ఏది రాసినా సరే అనుకోకూడదని ఎవరో ఎక్కడో ఒకరు చదివి స్పందిస్తారని తెలియజెప్పిన లెస్సన్ అది. ఇప్పటికీ అందరికీ వర్తిస్తుంది. తర్వాత NFDC  ‘ఆది శంకరాచార్య’ సినిమాను కరీంనగర్ ఫిలిం సొసైటీకి తెప్పించి చూసాం. నారదాసు లక్ష్మన్ రావు, పెండ్యాల సంతోష్ కుమార్, చారి, అల్లం నారాయణ ఇట్లా అనేక మందిమి ఆ సినిమా పైన చాలా మాట్లాడుకున్నాం. అదే సినిమాను ‘బెనిఫిట్ షో’ గా వేసి సమకూరిన డబ్బుతో ప్రొజెక్టర్ లు కొన్నట్టు గుర్తు.

          ఇదిట్లా ఉండగానే జేవగడ్డలో అందరి ముందూ నేనే ఓ ప్రస్తావన తెచ్చాను. కేరళ లో సినిమా నిర్మాణానికి సంబంధించి జరిగిన రెండు గొప్ప ప్రయత్నాలని వివరించాను. ఒకటి అదూర్ గోపాలక్రిష్ణన్ చేసింది. అదూర్ ఫిలిం ఇన్స్టిట్యూట్ నుంచి పట్టా పుచ్చుకుని వచ్చాక కేరళలో చిత్రలేఖ ఫిలిం కో ఆపరేటివ్ సంస్థను ఏర్పాటు చేసారు. సహకార పద్దతిలో పెట్టుబడి సమకూర్చుకుని తన మొదటి సినిమా ‘స్వయంవరం’ రూపొందించాడు. అది ఆ ఏటి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డుతో పాటు ప్రపంచ వ్యాప్త ఖ్యాతిని గడించింది. ఇక నేను చెప్పిన రెండవ విషయం “ఒడిస్సీ ఉద్యమం”. జాన్ అబ్రహం తన ‘అగ్రహారంలో గాడిద’ సినిమా తర్వాత కేరళలో ఊరూరా తిరిగి 16ఎంఎం లో సినిమాలు ప్రదర్శించి చందాలు వసూలు చేసాడు అట్లా సమకూరిన డబ్బుతో ‘అమ్మా అరియన్’ సినిమా తీసాడు అని చెప్పాను. మనమూ అలాంటి ప్రయత్నం చేయొచ్చు కదా అన్నాను. నేనట్లా మాట ముగించానో లేదో నారదాసు లక్ష్మన్ రావు, నరెడ్ల శ్రీనివాస్, డి.నరసింహా రావు, గోపు లింగా రెడ్డి, దామోదర్ రెడ్డి తదితరులు చేద్దాం పదండి అన్నారు. మనమనుకుంటే అదెంత అన్నారు. నారదాసు లక్ష్మన్ రావుకు అప్పటికే ‘విముక్తికోసం’ సినిమా తీసిన అనుభవం వుంది అది చాలు అనుకున్నాము. మిత్రులందరితో రెండు మూడు మీటింగులు అయ్యాయి. ఏ పేరు పెడదామన్న ప్రశ్న వచ్చింది. ఎవరో అన్నారు ‘ కరీంనగర్ ఫిలిం క్రియేటర్స్’. అంతా చప్పట్లు కొట్టాము. లక్ష్మన్ రావు ముందు పడ్డాడు. తనకు అప్పటికే మంచి పరిచయం ఒకింత స్నేహం వున్న అనుభవజ్ఞుడు శ్రీ హరి పురుషోత్తం రావుని సంప్రదించాడు. తనని కరీంనగర్ కు ఆహ్వానించి నెహ్రు యువక కేంద్ర హాలులో సమావేశం ఏర్పాటు చేసాం. శ్రీనివాస్ అధ్యక్షతన సమావేషం జరిగింది. సినిమా నిర్మాణం, సాధక బాధకాలు తదితర అనేక అంశాల పైన హరి గారు మంచి  ఉపన్యాసం చేసారు. ఆలోచన ఆరంభం అదిరి పోయినప్పటికీ ఎందుకో ‘ కరీంనగర్ ఫిలిం క్రియేటర్స్’ ముందుకు సాగలేదు. ఆగి పోయింది. ఎక్కడ, ఏమి ఆటంకం వచ్చిందో నాకిప్పటికీ అర్థం కాలేదు కానీ మా మిత్ర బృందం ఆలోచనల్లోంచి, చేతుల్లోంచి ఓ ప్రయోగాత్మక కృషి చేజారి పోయింది.  

          ఇదిట్లా వుంటే ఆ కాలంలోనే కరీంనగర్ లో మా ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ గా పని చేసిన శ్రీ వెల్చాల కొండల్ రావు గారి చొరవతో శాతవాహన పీజీ సెంటర్ ఏర్పాటయింది. మొదట కానిచీట్ దగ్గర ఏర్పాటయింది. తర్వాత మానేర్ డాం పక్కన క్వార్టర్లలోకి మార్చారు. ఒక ఉన్నత సంస్థ రావడంతో ఆ ప్రాంతంలో దాని ప్రభావం తప్పకుండా వుంటుంది. అదే క్రమంలో శాతవాహన పీజీ సెంటర్కు  పలువురు ప్రొఫెసర్లు వచ్చారు. వార్లో మా మిత్రుడు ధిల్లీలో చదువుకుని వచ్చిన జే.మనోహర్ రావుతో పాటు సుధాకర్, విద్యాధర్ రెడ్డి, ఓం ప్రకాష్ లాంటి అనేక మంది రావడం కరీంనగర్ విద్యా రంగంలో ఒక మార్పే. దానికి తోడు పీజీ సెంటర్ లైబ్రరీ లో లైబ్రేరియన్ గా మా క్లాస్మేట్ శ్రీ నరసింగరావు చేరాడు. జూనియర్ కాలేజీలో వచ్చిన ఉద్యోగం మానేసి ప్రైవేటు కాలేజీ అయినా తను చేరిపోయాడు. పీజీ సెంటర్ లో శ్రీ రమేష్ రావుతో పాటు అనేక మంది మిత్రులు వుండడంతో అక్కడికి వెళ్తూ వుండేవాళ్ళం. ఆ పీజీ సెంటరే తర్వాత కాకతీయ విశ్వవిద్యాలయ అనుబందంగా మారి ఇప్పుడు శాతవాహన విశ్వవిద్యాలయంగా రూపొందింది. 

          పీజీ సెంటర్ స్నేహాల్లో మనోహర్ది  ప్రత్యేకం. తను మా అందరిలో పూర్తిగా కలిసి పోయాడు. భావ చైతన్యంలోనూ స్నేహ భావనలోనూ తను మాతో చిన్నప్పటి మిత్రుడిలా కలిసిపోయాడు.

          “ఆనాటి స్నేహ మానంద గీతం. ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం “ అన్నాడో సినీ కవి నిజమే. ఒకవైపు జీవగడ్డ, మరో వైపు ఫిలిం సొసైటీ, మరో వైపు సాహిత్యం దానికి తోడు జర్నలిజం ఇట్లా అనేక రంగాలు అనేక స్నేహాలు. గొప్ప ఆత్మీయ, ఆలోచనాత్మక, నిబద్ద కాలమది. ప్రతి రోజూ కలిసే వాళ్ళం కదా. ఒక రోజు ఎవరయినా రాక పోతే.. ఎదో మిస్ అయినట్టు ఫీలింగ్.. మర్నాడు నిన్న ఎవరెవరు వచ్చారు.. ఏమేమి మాట్లాడారు అంటూ మొత్తం రిప్లే చేయించే వాళ్ళు. అందులో నారదాసు లక్ష్మణ్ రావు మరీ పర్టిక్యులర్. పెద్దగా ఏమీ మాట్లాడ లేదు అంటే కూడా వినే వాడు కాదు. ఇక కేవలం వాదాలూ చర్చలే కాదు పండగలూ ఉత్సవాలూ అంతే సరదాగా గడిపిన కాలమది. హోలీ పండగయితే రంగులతో హంగామా సాగేది. ప్రతి వాళ్ళ ఇల్లూ తిరిగి రోడ్డుమీదికి గుంజుకొచ్చి రంగుల్లో ముంచేసే వాళ్ళం. దానికి మాకు చాలా పెద్ద వాళ్ళు చిన్న వాళ్ళు అన్న తేడా వుండేది కాదు. సీనియర్ లెక్చరర్ డి.నరసింహా రావు దగ్గర నుండి, రేణికుంట రాములు సార్ దాకా అందరూ హోలీ ఆడాల్సిందే. తిరిగి తిరిగి గడియారం కాడ గుంపుగా కలవాల్సిందే. ఆ టీంలో పెండ్యాల సంతోష్, నారదాసు, దామోదర్, గోపు లింగా రెడ్డి, కే.విజయ నరసింహారావు, గులాబీల మల్లారెడ్డి, కే.నరసింహా రెడ్డి, సుధాకర్, పుల్లయ్య సార్ ఇట్లా ఒకరని లేదు అంతా హోలీ రే హోలిరే అంటూ ఆడాల్సిందే. భలే వుండేది ఆ కాలం.

          ఇక దీపావళి వచ్చిందంటే చాలు గొప్ప ఉత్సవం. పఠాకలు కాల్చేది కాదు. కానీ షాపుల్లో దీపావళి నోములు పూజలూ ఉండేవి. దీపాలు వెలిగించాక గడియారం చుట్టూ మార్కెట్ చుట్టూ వున్న మిత్రులవీ, తెలిసినవాల్లవీ అన్ని దుకాణాలన్నీ తిరిగేవాళ్ళం. మా గుంపులో ఏ ఒక్కరికి తెలిసన వాడి షాపయినా సరే దర్శించాల్సిందే. లడ్డూ మిఠాయిలు తినాల్సిందే. అందులో ఆత్మీయ స్నేహమూ, అనిర్వచనీయమయిన సామూహికత్వమూ వుండేది.   

          అప్పుడే మా గుంపులోకి కొందరు డాక్టర్లు చేరారు. డాక్టర్ సత్య సాగర్ రావు, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ ప్రమీల…. 

***

నది ఒడ్డున సాయంకాలం నడక

వేడిని వదిలేసిన గాలేదో చుట్టుకుంటోంది

అలసట కాదు అజ్ఞానమేదో ఆవిరవుతున్నది

        సరిగ్గా నదిలాగే ‘జీవగడ్డ’లో మిత్రుల్ని కలిసిన ప్రతి సాయంత్రం ఇదే జరిగేది. ఎదో కొత్త విషయం కొత్త సంఘటన దాని లోతు పాతుల మీద చర్చ జరిగేది. ఎవరికి వాళ్ళు వారి ఉద్యోగాలూ పనుల్లో రోజంతా బిజీగా ఉన్నప్పటికీ ఆ నాడు అందరికీ ఒక సామాజిక అవగాహన సోయి వుండేది. దాన్ని మరింత విస్తారం చేసుకోవాలనే తపనా వుండేది. కానీ ఆనాడు ఇవ్వాల్టిలాగా అవార్డుల గోల పురస్కారాల సందడి కనిపించేది కాదు బహుశ   

“కిరీటాలూ బుజకీర్తులూ

కఠోర శబ్దాలు చేస్తాయి తప్ప

శ్రావ్య సంగీతాన్ని వినిపించవు” 

          అన్న భావన ఆ రోజుల్లోనే మా అందరిలో అంతర్లీనంగా వుండేదేమో. ఎవరికీ డైలీ పేపర్లో పేరు రావాలనే తపనా వుండేది కాదు. రాస్తే కవితలో కథలో వ్యాసాలో రాయాలనే తపన వుండేది. ఆత్మీయ మిత్రుడు ఒక్క గోపు లింగా రెడ్డికి మాత్రం పత్రికలలో కనబడా లానే కోరిక వుండేది. అంతకు మించి పెద్ద స్వార్థం లేదాయనకు..పెద్దగా బావుకున్నదీ లేదు. అన్నింటినీ మించి ఎవరు ఏమన్నా, అనుకున్నా అన్నింటినీ మర్చిపోయి వాటిని వదలేసి స్నేహం కొనసాగించిన మంచి వ్యక్తిత్వం లింగారెడ్డిది.

          ఆ క్రమంలో జీవగడ్డతో ప్రయాణం సాగుతూ ఉండగానే మరో వైపు ఫిలిం సొసైటీ కార్యక్రామాలూ ఉధృతంగా నిర్వహించాం. ఇంకో వైపు నెహ్రు యువ కేంద్రం కూడా మా కార్యక్రామాలకు వేదికగా నిల్చింది.

          అప్పుడే ప్రముఖ వైద్యుడు ప్రగతిశీల భావాలతో వున్న డాక్టర్ కే.సత్యసాగర్ రావుతో పరిచయం ఏర్పడింది. చాలా గొప్ప వైద్యుడే కాదు అంతకంటే గొప్ప మనిషి ఆయన. మెడికల్ కాలేజీలో వున్నప్పుడు ఉద్యమ చైతన్యంతో వున్నవాడాయన. కరీంనగర్ లో ప్రముఖ సర్జన్ డాక్టర్ భూమ్ రెడ్డి గారి ఆసుపత్రిలో పని చేసేవాడు. ప్రతి సర్జరీలో సాగర్ రావు ప్రమేయం వుండేది. ‘సాగర్ రావు సార్ పొద్దున్న 7 గంటలకు ప్రశాంత్ నగర్ లో బయలేల్లి మూల మీద పాన్ షాప్ లో ఓ జర్దా పాన్ కట్టించుకుని దవడకు పెట్టి దావఖాన్ల కు పోతే చాలు ఇక కోసుడే కోసుడు వేరే ఏ ముచ్చటా పట్టదు’ అనేవాడు మా దామోదర్. అంతటి దీక్ష గల వైద్యుడు ఆయన. ఆయన పరిచయం మాకు స్నేహంగా మారింది. అప్పుడు మా అమ్మకు, తర్వాతి కాలంలో మా కూతురు రేలకు ఆరోగ్య సమస్య వచ్చి నప్పుడు సాగర్ అందించిన సహకారం ధైర్యం ఎప్పుడూ మరిచిపోలేను. ఇప్పుడు ఆయన మామధ్య లేక పోవడం పెద్ద వెలితి.

          ఇక ఆ కాలంలో మాకు సన్నిహితంగా వచ్చిన వైద్యులు మరో ఇద్దరు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ ప్రమీల. నిజామాబాద్ నుంచి కరీంనగర్ వచ్చి ‘సుజాతా నర్సింగ్ హోమ్’ ప్రారంభించారు. అప్పటికే వారిద్దరూ నారదాసు లక్ష్మన్ రావుకు, పెండ్యాల సంతోష్ కూ, మనోహర్, విజ్జన్న ఇట్లా అందరికీ పరిచయస్తులే. వారి ఆసుపత్రి పేదల కోసం చాలా చేసింది. డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ ప్రమీలలు ఇద్దరూ అందరితో స్నేహంగా వుండే వాళ్ళు. కే.ఎన్.చారి కూతురు అక్కడే పుట్టింది. చారీకి నాకూ చాలా ఇష్టమయిన పేరు “రేల” అందుకే తన కూతురు పేరు రేల అని మొదట పెట్టాడు. తర్వాత మా కూతురుకూ మేము రేల అనే పేరు పెట్టుకున్నాం. పెద్ద రేల చిన్న రేల. పెద్ద రేల పుట్టినప్పుడు మా పాత మిత్రుడు ప్రముఖ కవీ గుడిహాళం రఘునాధం, జర్నలిస్ట్ శ్రీ కే.శ్రీనివాస్ (ప్రస్తుత ఆంధ్ర జ్యోతి సంపాదకుడు) చూడ్డానికి వచ్చారు. గుడిహాళంతో నాకు స్నేహం ఉస్మానియా నుండే. కవిగా తను బాగా ఇష్టం.

***

          తేదీలు చెప్పలేను కానీ దాదాపుగా అప్పుడే జిల్లాలో రెండు ప్రధాన సంఘటనలు జరిగాయి. వాటితో మొత్తం జిల్లాలో పరిస్థితే మారిపోయింది. అప్పుడు నేను గోదావరిఖని కాలేజీలో పని చేస్తున్నాను. పెద్దపల్లిలో డీఎస్పీ బుచ్చిరెడ్డిని ఒక రాత్రి కాల్చేశారు. దాంతో మొత్తం పోలీసు అధికార వ్యవస్థ షేక్ అయిపొయింది. ఇక ఏముంది దాని ప్రతిగా కరీంనగర్లో గుర్తు తెలీని వ్యక్తులు రాత్రంతా పౌర హక్కుల గురించి మాట్లాడే న్యాయ వాదుల ఇండ్ల చుట్టూ తిరిగారు. తర్వాత ఏ ఆర్ద రాత్రో కరీంనగర్ మానేర్ కు అవతల వున్న అలుగునూరులోని జాప లక్ష్మా రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆయన్ను బయటకు పిల్చిన ఆ గుర్తు తెలీని వ్యక్తులు దారుణంగా కాల్చేశారు. ఇదంతా మా అందరికీ మర్నాడు తెలిసింది. దిన పత్రికల్లో స్పష్టమయిన అనేక వార్తలు, ఖండనలూ వచ్చాయి. అంతటా తీవ్ర ఉద్రిక్తత. తర్వాత ఏవో విచారణలూ అవీ అన్నారు. క్రమంగా పరిస్థితి మామూలుగా మారింది. స్పష్టాస్పష్ట మయిన ఉద్రిక్తత ఉద్వేగం కరీంనగర్ గాల్లో తిరుగాడింది.

***

          ఇక కరీంనగర్ ఫిలిం సొసైటీ పక్షాన పోరండ్లలో గ్రామీణ చలన చిత్రోత్సవం తర్వాత అప్పటి కలెక్టర్ పరమహంస గారికి మా డీ.ఎన్.నరసింహా రావు గారికి సాన్నిహిత్యం పెరిగింది. ఆ ఏడు నరసింహారావు, గోపు లింగారెడ్డిలు కఫిసో అధ్యక్ష కార్యదర్శులు. ఇక జిల్లా పరిషద్ చైర్మన్ కేతిరి సాయిరెడ్డి గారితో శ్రీనివాస్ కు మంచి సాన్నిహిత్యం వుండేది. అప్పుడే ఒక ఆలోచన పుట్టింది. కే.ఎస్.శర్మ కలెక్టర్ గా వున్నప్పుడు కరీంనగర్ వావిలాల పల్లిలో హాలు నిర్మాణం కోసం స్థలం ఇచ్చారు. కానీ అప్పటికి అది ఊరుకు చాలా దూరం. కలెక్టరేట్ కు దగ్గరలో స్థలం ఇస్తే చిన్న హాలు కట్టవచ్చని అనుకున్నాం. ఆ విషయాన్ని పరమహంస గారితో చెప్పగానే మీరు పాత స్థలం సరెండర్ చేస్తే కొత్తది ఇస్తామన్నారు. అట్లా ఇచ్చిన స్థలంలో భవనం కోసం 1986 మొదట్లోనే శంకుస్థాపన కూడా వేసాము. అప్పుడే భవన నిర్మాణం అయ్యేదే కానీ సుతారీ కంట్రాక్టర్ ల విషయంలో వివాదమొచ్చి ఆలస్యమయింది. ఇంతలో ఆ స్థలం ఎప్పుడో ‘ఏక్ సాల్’ పట్టా కింద తమకు ఇచ్చారని కళారావు అనే ఒకడు అభ్యంతరం పెట్టాడు. అప్పుడు నారదాసు లక్ష్మన రావు వాడితో తీవ్ర వాదానికి ఒక రకంగా యుద్ధానికీ దిగాడు. అక్కడి నుంచి ఉరికించినంత పని చేసాడు. తను న్యాయవాదిగా జీవితం ఆరంభిస్తున్న కాలమది ఇంకేముంది కోర్టులో చూసుకుందాం అనే దాకా వచ్చింది. కళారావు జిల్లా యంత్రాంగం మీద కేసు వేసాడు. సివిల్ కేసు ఇంకేముంది ఫిలిం సొసైటీ భవనంతో పాటు అక్కడ నిర్మించ తలపెట్టిన అన్ని పనులూ నిలిచి పోయాయి.

***

          అదట్లా వుంటే కఫిసోకు నెహ్రు యువక కేంద్రకు వున్న అనుబందం గురించి చెప్పుకోవాలి. అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. యువజన సర్వీసుల శాఖ కింద పని చేసేది. కరీంనగర్ లో యువక కేంద్ర సమన్వయ కర్తగా (కో ఆర్డినేటర్) శ్రీ వి.రామారావు పని చేసేవారు. చాలా మంచి మనిషి. నిజాయితీ గల వాడు. దీక్షతో యువతకు ఏదో   చేయాల నే తపనతో ఉండేవాడు. మేము డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే బుధవారం క్లబ్ (వెడ్నెస్ డే క్లబ్) అని యువకులకు ఒక క్లబ్ ను ఏర్పాటు చేసి ఉపన్యాస వ్యాసరచన, వర్తమాన అంశాల మీద చర్చలు పోటీలు పెట్టేవాడు. రామారావు గారికి జిల్లాదికారిగా కలెక్టర్లతో మంచి సాన్నిహిత్యం వుండేది . కలెక్టర్లు మా కఫిసోకు గౌరవ అధ్యక్షులుగా వుండేవాళ్ళు కనుక రామారావు కూడా కఫిసో అన్ని కార్యక్రమాలకూ గొప్ప సహకారం అందించేవాడు. జిల్లా యంత్రాంగంలో ఆయన మాకో పెద్ద అండ. ఆయన ప్రేరణతో జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో యువజన సంఘాలు ఏర్పాటయ్యాయి. అందులో పూడూరులో రాంరెడ్డిగారి లాంటి వాళ్ళ కృషి చాలా ప్రశంసనీయమయింది. అదే ఉత్సాహంతో మా దామోదర్ రెడ్డి కూడా చొరవ చూపించి స్వచ్చందంగా పోరండ్ల దగ్గర ౩ కిలోమీటర్ల రోడ్డు వేసారు. అప్పుడు యువక కేంద్ర లో శ్రీ టీ.వీ.విద్యాసాగర్ రావు, చీటీ జగన్ రావులు మాకు అందించిన సహకారం ఎనలేనిది. తర్వాతి కాలంలో టీ.వీ.విద్యాసాగర్ రావు కో-ఆర్డినేటర్ అయ్యారు. జగన్ రావు గంగాధర మండల అధ్యక్షుడు అయ్యారు.    

          అంతే కాదు బస్ స్టాండ్ కు ఎదురుగా వున్న నెహ్రు యువక కేంద్ర హాలు కఫిసో సమావేశాలకూ, సేమినార్లకూ, తర్వాత సాహిత్య సంస్థలకు వేదికగా నిలిచింది. అప్పుడే కఫిసో ‘న్యూ ఇండియన్ సినిమా’ అంశం మీద నిర్వహించిన సెమినార్ లో అప్పటికే ‘రంగుల కల’ తదితర సినిమాలతో సమాంతర తెలుగు సినిమాకు చిరునామాగా వున్న శ్రీ బి.నరసింగ రావు ప్రధాన అతిథిగా వచ్చారు. అప్పటికి ‘భారతీయ నవ్య సినిమా’ స్థితి స్థాయిలను భావ స్పోరకంగా చెప్పారు. It was a thought provoking session. తర్వాత కఫిసో నిర్వహించిన జాతీయ సమగ్రతా చలన చిత్రోత్సవం, సెమినార్ లో ప్రముఖ సినీ విమర్శకుడు గుడిపూడి శ్రీహరి పాల్గొన్నారు. తర్వాత సినిమాల్లో కళాదర్శకత్వం (‘ఆర్ట్ డైరెక్షన్’) అన్న అంశం మీద నిర్వహించిన సెమినార్ లో చంద్ర పాల్గొన్నారు. నేనేమీ మాట్లాడను అంటూనే సినిమా కళ అన్న అంశం మీద భిన్నమయిన కోణంలో మాట్లాడా రు. నిజమే ఆయనది ప్రసంగం కాదు ఆత్మీయ సంభాషనే. తర్వాత నెహ్రు యువక కేంద్ర సహకారంతో నిర్వహించిన యూత్ ఫిలిం ఫెస్టివల్ లో దేవిప్రియ ప్రధాన ప్రసంగం చేసారు. ఇట్లా మొత్తం మీద కఫిసో సినిమాకు సంబంధించి అనేక అంశాల మీద ఫిలిం ఫెస్టివల్స్, సేమినార్స్ నిర్వహిస్తూ వచ్చింది.

***

అప్పుడు నా వ్యక్తిగత జీవితంలో అమ్మ అనారోగ్యం తీవ్రంగా ప్రభావితం చేసింది. అంతు పట్టని స్థితి. డాక్టర్ లక్ష్మినారాయణ గారి చికిత్సతో ఒక రోజు మెరుగు, మరో రోజు కష్టం అన్నట్టుగా సాగిందా కాలం. ఇంకో వైపు నేను రోజూ గోదావరిఖని కాలేజీకి వెళ్ళి రావడం. అమ్మకు బాగా లేదు కనుక పెళ్ళి చేసుకొమ్మని వొత్తిడి పెరిగింది. వీటన్నింటి నడుమా ఊపిరాడని స్థితి.

***

          ఇంతలో కొంచెం ముందూ వెనకా మా సమూహం భిన్న పాయల వైపు మరలడం ఆరంభమయింది. నరెడ్ల శ్రీనివాస్ కు బాంకులో ప్రమోషన్ వచ్చి గుజరాత్ కు బదిలీ అయింది. పెండ్యాల సంతోష్ కుమార్ కు రెసిడెన్సియల్ స్కూలులో పీజీ టీచర్ గా వుద్యోగం వచ్చింది. లక్ష్మన్ రావు దామోదర్ లు న్యాయవాద పట్టా పుచ్చుకుని భూ సేకరణ కేసులు, కోర్టులూ అంటూ బిజీ అయిపోయారు. తర్వాత కొంత కాలానికి మనోహర్ తన పీ హెచ్ డీ కోసం డిల్లీ జవహార్ లాల్ నెహ్రు విశ్వవిద్యాలయం వెళ్ళిపోయాడు.

***

‘కలవడం విడిపోవడం అదో క్షణం ఇదో క్షణం

కలిసిన సంతోషం వీడిన దుఖం, కానీ

జ్ఞాపకమే వెన్నంటి వుండే నీడ’

          అలా మదిలో మిగిలిపోయిన జ్ఞాపకాల్ని తడుముతూ ముందుకు మునుముందుకు  సాగుతున్నా— ఒక్కో జ్ఞాపకమూ జీవితంలోని ఒక్కో పొరనూ తొలగిస్తున్నది. ఒక్కో అనుభవమూ కంటి ముందు సజీవంగా కదలాడుతున్నది.

“చల్ల చిలికినట్టు బతుకును చిలుకుతూ వుంటే

శకలాలు శకలాలుగా అనుభవాలు తేలుతున్నాయి

ఘనీభవిస్తున్న ‘వెన్న’ గొప్ప తాత్వికతను సూచిస్తున్నది” …

          కేవలం దశాబ్దాల నా జీవిత కాలమే ఇంతలా వుంటే లక్షల సంవత్సరాల మానవ జీవపరిణామంలో ఎన్ని ఉత్తాన పతనాలో కదా.

***

          కరీంనగర్ ఫిలిం సొసైటీ కేవలం ఒక సంస్థ గానో ఒక వేదికగానో కాకుండా నా జీవితంలో ఒక భాగమయి సృజనాత్మక రెక్కలు విచ్చుకుని ఎగిరేలా చేసింది. అప్పటికి కవిత్వం కథలూ మొత్తంగా సాహిత్యం నన్ను అల్లుకునే వుంది. ‘ లయ ’ కవితా సంకలనంలో భాగం కావడమే కాకుండా అప్పటికి కొన్ని కథలూ రాసాను. అలిశెట్టి ప్రభాకర్ నుంచి మొదలు అనేక మంది కవులూ రచయితలూ నా చుట్టూరా వున్నారు. జీవగడ్డ గొప్ప సామాజిక అవగాహనను కల్పించింది. వారానందం ‘కాలం’, సినిమాల పైనా కొంత రాయించింది. కానీ దృశ్య శ్రవణ మాధ్యమమయిన సినిమా అన్ని కళలనీ తనలో ఇముడ్చుకుందనే ఆలోచన ఫిలిం సొసైటీలో నన్ను ఇమిడిపోయేలా చేసింది. అప్పటికే వేములవాడ ఫిలిం సొసైటీ స్థాపన మిగతా జిల్లా క్లబ్స్ తో కలిసి పని చేసిన అనుభవం వుంది. కరీంనగర్ ఫిలిం సొసైటీ లో 1985లో మొట్టమొదటి సారిగా కార్యవర్గ సభ్యుడిగా చేరాను. అప్పటి నుండి దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు ఆ సంస్థతో కలిసే వున్నాను. కలివిడిగా వున్నాను. మిత్రులు నన్ను ముందుండి నడిపించారు. వెంట నడి చారు. ముందుకు తోసారు. ఎన్ని అర్థవంతమయిన సినిమాలు. ఎన్ని ఫిలిం ఫెస్టివల్స్. ఎంత మంది సినీదర్శకులు కళాకారులతో పరిచయాలు, సభలు, చర్చలు. అన్నీ సదా నన్ను సృజనాత్మక మెలకువలో ఉండేలా చేసాయి.

          మొదటి రెండేళ్ళలోనే (85-86) కథా సంగమ (కన్నడ), అరవింద్ దేశాయి కి అజీబ్ దాస్తాన్, విజేత, గోట్ హార్న్, నయిఫ్ ఇన్ ద వాటర్, కాడు, బైసికిల్ థీవ్స్, కోషిష్, క్రేమర్ వర్సెస్ క్రెమర్, అందీ గలీ, చాప్లిన్ సినిమాలూ ఇట్లా అనేక సినిమాలు చూసాను. ప్రతి ఆదివారం 35 ఎం ఎం సినిమా అయితే సినిమా హాలులో, 16 ఎం ఎం అయితే కళాభారతి లేదా యువక కేంద్ర. ఆ రెండేళ్ళూ కార్యవర్గంలో అధ్యక్షుడిగా డి.నరసింహా రావు, కార్యదర్శులుగా డాక్టర్ గోపు లింగా రెడ్డి, ఆర్ సుధాకర్ లు వున్నారు. కార్యవర్గమంతా ఆక్టివ్ గా వుండేవాళ్ళు ప్రధాన భాధ్యులకి కొంచెం బరువెక్కువ. అప్పటిదాకా కార్యవర్గ సమావేశాలు ఆర్ట్స్ కాలేజీలో యువ కేంద్రలో జరిగేవి. దాదాపు అప్పుడే ఈసీ సమావేశాలు సభ్యుల ఇండ్లల్లో జరపాలని అనుకుని మొదలు పెట్టారు. దాంతో అందరిలో ఉత్సాహం మరింతగా  పెరిగింది.

ఇక కఫిసో సమాచార వాహకంగా మాస పత్రిక “ఉత్తమ చిత్ర” వెలువరించేవాళ్ళం. ఆ పత్రికకు ఆ పేరు పెట్టింది కఫిసో తొలి అధ్యక్షుడు ఆంపశయ్య నవీన్. తొలి సంచిక 1980లో వెలువడింది. కఫిసోకు లోగో ఉత్తమ చిత్ర టైటిల్ ను నవీన్ గారి కోరిక మేరకు ప్రముఖ కవీ చిత్రకారుడూ శీలావీర్రాజు రూపొందించారు. 

80 నుంచి ప్రతి నెలా క్రమం తప్పకుండా ఉత్తమ చిత్ర వెలువరించాం. దానికి అప్పటికే RNI REGISTRATION, POSTAL REGISTRATION లు వున్నాయి. కఫిసో కార్యవర్గంలో చేరే నాటికీ ఆ తర్వాత కొంత కాలందాక కూడా సభా వేదికలకు దూరంగా వుండేవాన్ని. ఒక రకంగా అంతర్ముఖు డిగానే వుండేవాన్ని. వేదిక బాధ్యత మీది, దానికి ముందూ వెనకా బాధ్యతలు ‘నేను’ అనేవాన్ని. శ్రీనివాస్, గోపు లింగా రెడ్డి, నరసింహా రావు, రాములు, నారదాసు ఇట్లా పలువురు వేదికల బాధ్యతలని తీసుకునే వాళ్ళు. ఉత్తమ చిత్ర విషయానికి వచ్చేసరికి అందులో కేవలం సమాచారమే కాకుండా మంచివి చిన్న చిన్న వ్యాసాలూ, సినిమా కొటేషన్స్ వేద్దామన్నాను. బాగానే ఉంటుందన్నారు. ప్రతి నెలా ఉత్తమచిత్ర ప్రింట్ అయి రాగానే రాములు గారు అర్దరాత్రి దాకా కూర్చుని సభ్యుల అడ్రెస్ లు రాసి పోస్టల్ స్టాంపులు అంటించే వారు. ఇక postal RMS department లో కఫిసోలో మొదటి నుంచీ పలు ప్రధాన బాధ్యతల్ని నిర్వహించిన ఉప్పల రామేశం పని చేసేవారు. తనతో పాటు మోహన్ రావు కూడా అందులోనే వుండేవారు. కరీంనగర్ బస్ స్టాండ్ మొదటి అంతస్తులో వున్న postal RMS కి వెళ్ళి ఉత్తమచిత్ర కాపీలని అందజేసి సార్టింగ్ చేయించే వాళ్ళం. మర్నాడుదయానికి అవి సభ్యులకు చేరేవి. ఉత్తమ చిత్రలో సభ్యులను కూడా భాగస్వాములను చేద్దామన్నాను. ఎట్లా అన్నారు. ఫిలిం క్విజ్ నిర్వహిద్దామన్నాను. మొదలు పెట్టు అన్నారు. క్కిజ్ లో సినిమా సంబధిత ప్రశ్నలను ఇచ్చి జవాబులు రాయమనేవాడిని. తర్వాతి సంచికలోపు సభ్యుల నుంచి జవాబులు వచ్చేవి. సరిగ్గా రాసిన వారి పేర్లు సమాధానాలు ప్రచురించేవాళ్ళం. మంచి ప్రతి స్పందన వచ్చింది. అప్పుడు ఉత్తమ చిత్రను మా సభ్యులతో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాల సినిమా అభిమానులకు ప్రముఖులకు, వివిద పత్రికల సినిమా పేజీలకు పంపించే వాళ్ళం. క్విజ్ మొదలయిన కొంత కాలానికి ఆంధ్రప్రభలో సిన్మా సప్లిమెంట్ ‘చిత్ర ప్రభ’ నిర్వహించే సినీ జర్నలిస్టు శ్రీ పీ.ఎస్.ఆర్.ఆంజనేయ శాస్త్రి గారు లెటర్ రాసారు. ఇలాంటి ఫిలిం క్విజ్ మాకు నిర్వహించగలరా అని. ఏముంది ఎగిరి గంతేసి అనేక వారాలు అక్కడా ఇక్కడా వేర్వేరుగా నిర్వహించాను. ప్రశ్నలు సులభంగా వున్నప్పుడు కట్టలు కట్టలు ఉత్తరాలు వచ్చేవి. ‘చిత్ర ప్రభ’ లో పీ.ఎస్.ఆర్.ఆంజనేయ శాస్త్రి గారి ప్రోత్సాహంతో అనేక వ్యాసాలూ, ఇంటర్వ్యూ లూ రాసాను. సీరియస్ సినిమా గురించి రాయమని ఆయనే నన్ను ఉత్సాహపరిచారు. గిరీష్ కాసరవెల్లి, గిరీష్ కర్నాడ్, బి.ఎస్.నారాయణ లాంటి వాళ్ళతో ఇంటర్ వ్యూలు కూడా రాసాను. అదో అనుభవం. అదే సమయంలో సంపాద కులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వర్ రావు గారితో, శ్రీ కల్లూరి భాస్కరం గారితో పరిచయం ఏర్పడింది. ఆఫీసుకు వెళ్ళినప్పుడల్లా కలిసి పది నిముషాలు మాట్లాడి వచ్చేవాన్ని.

అప్పుడే మద్రాస్ లో FEDERATION OF FILM SOCITIES OF INDIA BRGM పెట్టారు. అనుబంధంగా వున్నా సొసైటీల నుంచి ఒక ప్రతినిధి ఒక డెలిగేట్ రావచ్చునని సూచించారు. కఫిసో నుంచి డి.నరసింహా రావు, ఆర్. సుధాకర్లు, గోదావరిఖని ఫిలిం క్లబ్ పేరు మీద జగన్ మోహన్ రావు నేనూ బయలుదేరాం.

ఆ రోజు మద్రాస్ సభలో నరసింహా రావు మాట్లాడారు. అనేక సూచనలు చేసారు. అంతే కాదు FEDERATION OF FILM SOCITIES OF INDIA సభ్య సంస్థలకు సినిమాలను పంపిణీ చేసేటప్పుడు ఆయా సంస్థల జియా గ్రాఫికల్ లోకేషన్స్ ను గమనించాలని సూచించారు. సభలో నాకు గుర్తున్నంత వరకు కళ్యాణ రామన్, వీ టీ ఎస్., తంగరాజ్, తదితరులు పాల్గొన్నారు. ఫిలిప్ మాత్రం జియా గ్రాఫికల్ లోకేషన్స్ ను చూడాలి అన్న డీ ఎన్ మాట తనను బాధించింది అని నాతో అన్నాడు. మొత్తం మీద కఫిసో తన ఉనికిని దక్షిణ భారత సమావేశంలో చాటుకుంది. తర్వాత మిగతా మిత్రులు వచ్చేసినప్పటికీ నేను మద్రాస్ లో వుండి పోయాను. అప్పుడక్కడ AMIE చదవడం కోసం మిత్రుడు కొడం పవన్ కుమార్ వున్నాడు. నేనతని రూముకు వెళ్ళి తనతో మద్రాస్ అంతా చూసి రావాలని అనుకున్నా ను. పవన్ నన్ను వెంటబెట్టుకుని తిప్పిచూపించాడు. బీచ్, వీజీస్.మహాబలిపురం కూడా వెళ్ళామని గుర్తు. ఇంకా ఆరుద్ర గారింటికి వెళ్ళాం. కే.రామ లక్ష్మి గారు ఆప్యాయంగా పలకరించి మాట్లాడారు. తిరుగు ప్రయాణంలో పవన్ నేను తిరుపతి వెళ్ళాం. తర్వాతి రోజు విజయవాడలో బ్రేక్ జర్నీ చేసాం. ఆంద్రజ్యోతి ఆఫీసుకు వెళ్ళి ఎడిటర్ శ్రీ పురాణం గారిని కలిసాం. తర్వాత శ్రీ వేగుంట మోహన ప్రసాద్ దగ్గరికి వెళ్ళాం. ఏమయ్యా పగలు వచ్చారు. సాయంత్రం వుండండి మాట్లాడుదం అన్నారు. మాకు రైలు వుంది వెళ్తాం అన్నాం. అట్లా మా ప్రయాణం ట్రైన్ లో వరంగల్ మీదుగా కరీంనగర్ వచ్చేసాం.

***

          ఇదంతా ఇట్లా సాగుతూ ఉండగానే ఇంట్లో పెళ్ళి అంటూ వొత్తిడి పెరిగింది. నలుగురు అమ్మాయిలను పెళ్ళి చూపులంటూ చూడడం కుదరదన్నాను. మీకు అన్ని విధాల ఇష్టం వున్న అమ్మాయి గురించి చెప్పండి ఫార్మల్ చూసి వస్తాను. తతంగం వద్దు అన్నాను. మా బంధువులకు సంబంధించిన అమ్మాయి గురించి చెప్పారు. నేనూ నాతో మొదటి నుంచీ చనువుగానూ సప్పోర్ట్ గానూ వుండే మా అమ్మ చిన్న చెల్లెలు గుణక్క కలిసి  మామూలుగా వరంగల్ వెళ్ళాం. ఎం జీ ఎం పక్కనే వున్న ఉప్పుల ఎతిరాజులు గారి అమ్మాయి ఇందిరను చూసాం. వస్తూ వుంటే ఆయన అడిగారు అమ్మాయి నచ్చిందా అని. మా నాన్న గారు మాట్లాడతారు అని వచ్చేసాను. దారిలో గుణక్క అడిగింది ఏమంటావురా అని నువ్వేమంటావు అన్నాను. నాకయితే ఒకే అంది నేనూ నవ్వేసాను. ఇంకే ముంది కరీంనగర్ రాగానే తానే నచ్చేసింది అని చెప్పింది. మర్నాడు ఉదయం దామోదర్ ఇంటికి వచ్చాడు. ఇద్దరమూ గదిలో కూర్చుని ఎదో మాట్లాడుకుంటున్నాం. ఇంతలో మా అమ్మ తమ్ముడు మా ఇంటికి వచ్చాడు. జగిత్యాలలో మంచి సంబంధం వుంది, మంచి కట్నం ఇస్తారు బాగుంటుంది అన్నాడు. వీళ్ళు మాటిచ్చారు కదా అని నాన్న అన్నాడు. ఆ ఏముంది మంచి సంబంధ వస్తే వదిలేస్తామా అన్నాడు ఆయన. నేను మెల్లిగా బయటకు వచ్చి తర్వాత ఇంకో మంచి సంబంధం వస్తే జగిత్యాలది వదిలేద్దామా అన్నాను. ఆయనకు కోపం వచ్చి విసురుగా వెళ్ళిపోయాడు. దామోదర్ బాగా చెప్పావని నన్ను సపోర్ట్ చేసాడు. కానీ ఆ సంఘటనే తర్వాతి కాలంలో మా కుటుంబం పై ఎంతగానో ప్రభావం చూపింది. అతలాకుతలం చేసింది.

మిగతా వివరాలతో మళ్ళీ వారం కలుస్తాను…

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.