నా అంతరంగ తరంగాలు-26

-మన్నెం శారద

( మొన్నటి భీభత్స మయిన తుపాను చూసి ఇది రాస్తున్నాను )

కాళ రాత్రిలో మా ప్రయాణం!

1977నవంబర్ 19, శనివారం!

అంతకముందే హైదరాబాద్ వచ్చాం, పొట్ట, పెట్టె పట్టుకుని. ఉద్యోగం అంటే అంతేకదా!
ఉద్యోగికి దూరభూమి లేదన్నారు కదా! ఊరు కొత్త! భాష కొత్త! మనుషులూ కొత్త! ఆఫీస్ కి వెళ్లి రావడమేగానీ పెద్దగా స్నేహాలు లేవు. అందరూ ఉర్దూ నే మాట్లాడుతున్నారు.

డ్రైవర్ ఉధరో, రోఖోలు అర్థం కాక ఆఫీస్ నుండి ఇంటికి ఒకటే నడక! ఇంచుమించు పాకిస్థాన్ లో వున్న భావన! ఇద్దరం ఒకటికొకరం ఎదురెదురుగా కూర్చుని బోర్ కొట్టేసేది. నాకు కబుర్లు, జోక్స్ ఇష్టం.
చిన్నప్పుడు ఎక్కడయినా మా ఇంట్లో ఒకటేనవ్వులు, మాటలూ వినిపిస్తుంటే మా అమ్మగారు”అక్కడ శారద ఉందా, ఒకటే తవ్విపొస్తుంది కబుర్లు!”అనేవారు.

ఆయన అమిత మితబాసి. ఇద్దరకీ పెద్ద వయసేం కాదు…

ఒక్క రెండు గంటలు ఎదురుగా కూర్చుంటే తగాదా మొదలయ్యేది… నా వల్లే ఏం చేయాలో తోచక.. తిక్క పుట్టేది. సెలవొస్తే ఏం తోచక మరీ పిచ్చి పుట్టేది.

ఒకరోజు ఉన్నట్లుండి “నేను తెనాలి పోదామా? ” అనడిగాను. ఓకే అన్నారాయన హుషారుగా. మరి ఆయన ఊరుకదా!

ఎవరయినా పుట్టింటికి పోదాం అని కోరుకుంటారు. కానీ నేను అత్తగారిల్లు ఇష్టపడేదాన్ని. ఆఁ కల్చర్, బంధువుల ఆప్యాయతలు, వూరిలోని హరికథలు, సంగీత సాహితీ కార్య క్రమాలు, వూళ్ళో కాలువలు, మల్లెపూలు…ఒకటేమిటి… భలే సరదాగా ఉండేది. అదేకాక మా వారి బంధువులు నన్నొక హీరోయిన్ లా చూసేవారు.

పిల్ల ఇంజనీరు, కతలు రాసుద్దట.. అయినా కొంచెం కూడా గర్వం లేదని అంటుంటే మహా సంతోషంగా ఉండేది. అదో థ్రిల్ నాకు!

సరే అంటే సరే అనుకుని రెండు జతల బట్టలు సూట్ కేస్ లో పడేసుకుని గచ్చిబౌలి వెళ్లే బస్సేక్కి బస్ స్టాండ్ కి చేరుకున్నాం.

వెంటనే గుంటూరు వయా నాగార్జునసాగర్ వెళ్లే బస్సు వుంటే ఠక్కున ఎక్కి కూర్చున్నాం… మరేం ఆలోచించకుండా. నాకూ నేను తిరిగిన మాచర్ల, సాగర్ మళ్ళీ చూడాలన్న కోరిక! చంద్రుడు హాయిగా ఆకాశం లో వెలుగుతున్నాడు. నాకు జర్నీలో నిద్ర పట్టదు. అలా కిటికీ దగ్గర కూర్చుని బయటకి చూస్తున్నాను.

బస్సు సాగర్ చేరింది. పైలాన్ కాలనీ జేరగానే ఎన్నెన్నో జ్ఞాపకాలు!

రైట్ బ్యాంకు చేరాం. మళ్ళీ పాత జ్ఞాపకాల వెదుకులాట…మా నాన్న గారు పనిచేసిన పోస్టాఫీస్ , మా క్వార్టర్స్ కోసం….

అక్కడ మా చిన్ని తమ్ముడు కోసం రాళ్ళ మధ్యన dam కట్టి నీళ్ళు పోసి కాలువలు తీసి పారించడం, నాకు స్కూల్లో రాసిన డ్రామాకి బహుమతి రావడం, నా ఫ్రెండ్స్ లలిత, కమల, సుచరిత, సుబ్బులక్ష్మి, శారమ్మా… అందరూ గుర్తొచ్చి కళ్ళ నీళ్ళు తిరిగేయి.. నన్ను అమితంగా ప్రేమించిన శివశంకరం మాస్టర్ గారిని నేను ఎన్నడూ మరువలేను.

పుబ్బలో పుట్టి మఘలో మాయమయ్యే స్నేహాలు కావు మావి! ఇప్పుడెవరెక్కడున్నారో, ఎలా వున్నారో తెలియదు.

డ్రైవర్, కండక్టర్ ఏదో తర్జన భర్జన పడుతున్నారు…. ఎదురొక్క బస్సు కూడా రావడం లేదేమిటా అని!
నాకదంత సీరియస్ విషయంగా తోచలేదు. ఏదోలే అనుకున్నాను.

మాచర్ల వచ్చింది. మా పోస్టాఫీస్ దగ్గరే బస్ మలుపు తిరుగుతుంటే మళ్ళీ దానికోసం, ప్రత్యేకించి పున్నాగ చెట్టుకోసం వెదుకులాట!

బస్టాండ్ లో మళ్ళీ డ్రైవర్, కండక్టర్ అక్కడి వాళ్ళని అడగడం మొదలెట్టారు. అటు నుండి బస్సులు రావడం లేదేంటాని.

“అదే తెల్వటం లేదు గురూ, ఎందుకో మరి…” అని తర్జన భర్జన పడ్డారు. ఏదయినా ఆక్సిడెంట్ అయ్యుంటదా అని! ఎక్కడా ఒక్కచుక్క వర్షం లేదుమరి! ఎలా ఉప్పెన వచ్చిందనుకుంటాం?

మళ్ళీ బస్సు ముందుకే నడిచింది. తెల తెలవారుతుండగా పిడుగురాళ్ళ చేరాం. అక్కడ ఏరు పొంగిపొర్లి కదం తొక్కుతూ కనపడింది. అందరూ ఆందోళనగా బస్సులు నిలిపేశారు. మా ముందు కొన్ని లారీలు, వెనుక పదకొండు బస్సులు!

“తుపానంట.. చెట్లన్నీ కూలిపోయాయి, ముందు కెళ్ళలేరు ” అని స్థానికులు వచ్చి చెప్పడం మొదలు పెట్టారు.

ప్రయాణికుల్లో కలకలం మొదలయ్యింది. చివరకి అందరూ ముందుకే వెళ్లాలని నిర్ణయించారు.

టైం పగలు పదకొండు గంటలవుతుండగా లారీ డ్రైవర్ల తెగింపుతో మా బస్సులన్నీ ఏటికి ఎదురీదాయి. ఎక్కడ ఏరు లాగేస్తుందోనని బిక్కు బిక్కుమాంటూ కూర్చున్నాం. చివరకి ఎలాగోలా బయటపడి అవతలి గట్టెక్కాం.

ప్రొద్దునే గమ్యం చేరిపోతామని ప్రయాణికులు తెచ్చుకున్న తినుబండారాలు, పాలు అయిపోవడంతో పిల్లలు ఆకలితో ఒకటే ఏడ్పులు!

కొందరు మగవాళ్ళు వెళ్లి ఎలాగో ప్రయత్నించి కొన్నిబిస్కెట్టు పేకట్స్ పాలు తెచ్చుకున్నారు. మా వెనుక సీట్ లో ఒకామె చంటిపిల్లతో ఒక్కామే వస్తున్నారు. పాప ఆకలితో గుక్కపెట్టి ఏడుస్తున్నది. ఎంత సముదాయించినా ఏడుపు ఆపడం లేదు. ఎవరూ ఏమీ ఇవ్వడం లేదు. ఎరగనట్లు నటిస్తున్నారు.
చివరకి మా వారు, మరొకాయన వెళ్లి కష్టపడి కాసిని పాలు తెచ్చి ఆఁ తల్లికి ఇచ్చారు.

ఇలాంటి సమయాల్లోనే చాలామంది బుద్ధులు బయట పడతాయి కదా! బస్సులు కొంచెం ముందుకు కదలగానే అసలు కథ ప్రారంభమయ్యింది. ఏనాడు వేశారో పెద్ద పెద్ద వృక్షాలు వ్రేళ్లతో సహా పెకిలింపబడి రోడ్డుకడ్డంగా నేలకూలేయి. మళ్ళీ బస్సులన్నీ ఆగిపోయాయి. ఏం చేయాలో తెలియక డ్రైవర్లు, కండక్టర్లు గుమిగూడి కబుర్లు చెప్పుకుంటున్నారు.

పాపం వాళ్ళ ఇళ్ళు కూలి నీరూ నిప్పు లేక అవస్థ పడుతున్న స్థానికులు మాత్రం గొడ్డళ్ళు తెచ్చి క్రింద కొమ్మలు నరికి బస్సులు ఆ ట్రంక్స్ క్రింద నుండి వెళ్ళడానికి దారి చేశారు.

అలా ఎన్నో చెట్లు!

గ్రామస్థులకి నిజంగా చేతులెత్తి నమస్కరించాలి. నిస్వార్ధంగా సేవ చేసేది వాళ్ళే! ఇది ఎన్నోసార్లు నాకనుభవానికి వచ్చిన సంగతి! అలా మేము నానా అవస్థలు పడి ప్రొద్దున అయిదు గంటలకు చేరవలసిన వారం సాయంత్రం అయిదు గంటలకు గుంటూరు చేరుకున్నాం.

గుంటూరు పొలిమేరల్లోనే ప్రళయపు విలయ తాండవం కనపడటం మొదలయ్యింది. ఎక్కడ చూసిన కూలిపోయిన ఇళ్ళు, తలలో పెట్టుకునే క్లిప్పుల్లా మెలికలు తిరిగి ఒరిగిపోయిన ఎలక్ట్రికల్ పోల్స్, కూలి పోయిన చెట్లు, చనిపోయిన మనుషులు,పశువులు…. వళ్ళు జలదరించి పోయింది.

బస్సు స్టాండ్ లో బస్ దిగి తెనాలి బస్ కోసం చూసాం. బస్సుల కాన్సిల్ రూట్ లేనేలేదన్నారు.
గబగబా ఆటో ఎక్కి రైల్వే స్టేషన్ కి పరిగెత్తాం. రైళ్లన్నీ కాన్సిల్! ట్రాక్ మీద నీరు పారుతోంది, పట్టాలు మెలికలు తిరిగి వున్నాయి సిగ్నల్ పోల్స్ వంగిపోయాయి.

ప్లాట్ ఫార్మ్ మీద శవాలు!
ఏడుపొచ్చేసింది…

గుంటూరు తెలిసిన ఊరే… నాన్న బంధువులు, స్నేహితులు చాలా మందే వున్నారు. అయినా ఒకరింటికి వెళ్లే పరిస్థితులు కావప్పుడు. చెట్లు కూలి చాలా ఇంటికప్పులు కూలిపోయాయి. కరెంట్ లేదు, మంచి నీళ్ళు కూడలేవు. ఒకపక్క వెలుగు హరించుకు పోతున్నది. ఎక్కడన్నా ఉందామంటే హోటల్సన్నీ బంద్!

‘ఎలాగయినా తెనాలి వెళ్లిపోవాలి ‘అని ఆలోచిస్తున్న మా దగ్గరకు ఓ నడివయసు దంపతులు వచ్చి “ఎక్కడికెళ్ళాలమ్మా? ” అనడిగారు.

మేం చెప్పాం.

“మేమూ నందివెలుగు వెళ్లాలి, మా ఇల్లుకూలి మా అమ్మ చనిపోయింది, రండి, కలిసి వెల్దామన్నా డాయన. ఆటో అతను అడిగిందానికి ఒప్పుకుని నలుగురం ఆటో ఎక్కాం. కూడా సైకిల్ మీద వాళ్ళబ్బాయి ఫాలో అయ్యాడు. ఎలాగో గుంటూరుకి పది మైళ్ల దూరంలో వున్న ఉప్పలపాడు చేరింది మా అటో. అక్కడ దృశ్యం చూసేసరికి వెన్నులోంచి వణుకు వచ్చేసింది.

ఎటు చూసినా శవాలే!

రోడ్డు కిరువైపులా కొన్ని కిలోమీటర్లు శవాల్ని పడుకోబెట్టి చిన్న తెల్లటి గుడ్డలు కప్పి ఎగిరిపోకుండా నాల్గువైపులా రాళ్లు పెట్టారు. అందులో ముద్దులోలికే పసిపాపలు పెద్దలూ, వృద్ధులు కూడా వున్నారు.
అందరి మొహాలమీదా ఏవో సన్నటి చుక్కలు వున్నాయి. ఒక్క శవాన్ని చూస్తేనే ఆర్నెల్లు ఝడుసుకు చచ్చే నేను అన్ని వందల శవాలు చూసి ఏ మాత్రం భయపడలేదు. చెప్పలేని దుఃఖం మాత్రం తన్నుకొచ్చింది.
వెక్కెక్కి ఏడ్చాను. ఇంత దారుణమైన ఉప్పెన వచ్చిందని గ్రహించేసరికి పిచ్చెక్కి పోయింది.

ఆటో మరి కొంత ముందుకి నడిచేసరికి ఎదురుగా ఒక మహా సముద్రంలా నీరు! అటో అతను అలాగే కొంత దూరం నీటిలో నడిపాడు. సడెన్ గా బ్రేక్ వేసి “ఇంజన్ లోకి నీళ్ళు వస్తున్నాయమ్మా, బండి నడవదింక ” అనేసాడు.

మా గుండెల్లో బాంబు పేలినట్లయ్యింది. అందరం కలిసి చాలా బ్రతిమిలాడేం. ఇంకా ఎక్కువ డబ్బిస్తాం అన్నాం.

“ఏందమ్మా డబ్బుకోసమా.. బండి అగిపోయింది. నడవక పోతే నేనేం చెయ్యాలి!” అన్నాడు విసుగ్గా.
చేసేది లేక అందరం ఆటో దిగిపోయామ్.

అన్నివైపులా చీకటి మూసుకొస్తున్నది. ఎదురుగా మహా సముద్రంలా అవతల తీరం కనపడని అంతులేని నీరు! వెనక్కు దారి లేదు. కరెంట్ లేక చిట్టచీకటి! అంత కష్టంలోనూ ఒకటే మాకు దక్కిన అదృష్టం!

పుచ్చపువ్వులాంటి వెన్నెల! మాదగ్గర ఎలాంటి లైటూ లేదు. వెన్నెలే ఆధారం! ఆఁ ముందు రోజు మూడు తాడి చెట్ల ప్రమాణంలో మంటలతో ఎగసిపడి కేవలం రెండు గంటలలోనే సర్వ నాశనం చేసి కొన్ని లక్షలమందిని పొట్టన పెట్టుకున్న సముద్రం ఏమీ తెలియని నంగనాచిలా  విశ్రాంతి తీసుకుంటున్నది.

“మాకు వెళ్లక తప్పదు, మీరూ వస్తారా మరి? ” అని ఆఁ దంపతులడిగారు. మేం కూడా అంతకన్నా చేయగలిగింది ఏమీ లేదు. సరే అన్నాం. వాళ్ళబ్బాయి మా సూట్కేస్ తన కేరియర్ కు తగిలించుకున్నాడు.
పెద్దాయన,” అమ్మా మనకిక రోడ్డు ఆనవాలు తెలియదు. మనం పొలాల్లోకి పోతే దిగుడుబావులూంటాయి.
నేను కర్ర పోటేసి దారిజూపిస్తాను, మీరు చెయ్యి చేయీ పట్టుకుని నా ఎనకమాలే రండి ” అన్నారు.
అలాగే ఆయన వెంట నడిచాం.

నీళ్ళు మా పీకలదాకా వచ్చేశాయ్. చెప్పులు కొట్టుకు పోయాయి. బట్టలు వంటికి చుట్టుకు పోతున్నాయి.
మా ముందు నుండి పాములు, శవాలు, పశువుల మృతకళేబరాలూ విరిగిన కొమ్మలూ…. ఒకటేమిటి… నానా చెత్త ప్రవాహంలో కొట్టుకు వెళ్తున్నాయ్.

అక్కడక్కడా పూర్తిగా విరిగి పోయిన కల్వర్ట్ ల మీద, కూలి పోయిన చిన్న చిన్న బ్రిడ్జి ల మీదుగా మా నడక సాగింది.

అలా ఒకటీ రెండూ కాదు… పదహారు మైళ్ళు నడిచి చివరకు నందివెలుగు చేరుకున్నాం. దూరంగా అక్కడున్న కాలేజీ బిల్డింగ్ లో ఆశ్రయం పొందుతున్న మనుషుల కోలాహలం వినిపిస్తున్నది.

“వచ్చేసామమ్మా , ఇంకెంత తెనాలి వచ్చేసినట్లే..’అంటూ వాళ్ళే ఒక రిక్షా పిలిచి “పిలకాయలు హైదరాబాదు నుండి వస్తా ఉప్పెనలో ఇరుక్కుపోయారు. మారీస్ పేట, జాగ్రత్తగా తీసుకెళ్ళు “(పిలకాయలు, ఆలా వుండే వి మరి మా పెర్సనా లిటీస్ )రిక్షా అబ్బాయికి చెప్పి సెలవు తీసుకున్నారు.

వాళ్ళకెలా కృతజ్ఞతలు చెప్పాలో మాకు తెలియలేదు. వాళ్ళే లేకపోతే మాగతి ఏమయ్యేదో తలచు కుంటేనే ఇప్పటికీ వణుకొస్తుంది.

ఇన్నేళ్లయినా నాకు ఆఁ దంపతులు చేసిన మేలు గుర్థోచ్చినప్పుడల్లా కళ్ళు చెమరుస్తాయి. చేతులెత్తి దణ్ణం పెట్టుకుంటాను.

నిద్ర పట్టనప్పుడు నేను చేసే పని ఇదే! నా దగ్గర అలాంటి వారి లిస్ట్ చాలానే వుంది మరి! ప్రాణం ఉండగానే కృతజ్ఞత తెలుపుకోవాలి ‘అనేది నా సిద్దాంతం! ఈ పేరు ప్రతిష్టలు, డబ్బు, హోదాలు చాలా ఆశాశ్వతమైనవని ఆనాటి ఉప్పెన ఈనాటి కరోనా మనకు తెలియ జేస్తూనే వున్నాయి.

ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో ఇల్లు చేరి గేటు తెరుస్తుంటే ఆ చప్పుడికి మా మామగారు ‘ఎవరదీ ?’ అన్నారు.

“మేమే నాన్నా!”అన్నారీయన.

” ఏంట్రా, నాశ్వేర్రావూ, ఎలా వచ్చార్రా.. ఈ ఉప్పెనలో ” అని నిర్ఘాంత పోతూ మా అత్తగారు చిన్న బుడ్డి లాంతరు తీసుకుని హాల్లోకొచ్చారు.

“అవన్నీ తర్వాత చెబుతాం, ముందు వేడినీళ్ళుంటే పెట్టు, స్నానం చెయ్యాలి “అన్నారీయన.
పొయ్యి దగ్గర పొంతలో ఎప్పుడూ రాగి కాగులో నీళ్ళు కాగుతూ ఉంటాయి.

ఇద్దరం స్నానాలు చేసి వచ్చి జరిగిన సంగతులు చెబుతుంటే వాళ్ళు తెల్లబోయారు.

“అయ్యో శారదా, ఎంత కష్టపడ్డావమ్మా, “అంటూ మా అత్తగారు కళ్లనీళ్లు పెట్టుకున్నారు.

మా అత్తగారింటి డాబా పేరాపేట్ వాల్ కూలిపోయింది వడ్లు పొసే గాదె (సిమెంట్ కట్టడమే )కూడా విరిగి పోయింది.

నీళ్ళు, కరెంట్, లేకపోతే ఎంతనరకమో ప్రత్యక్షంగా చూసాం. రైళ్లు, బస్సులు లేక వారం రోజులు అక్కడే ఉండిపోయాం.

ఎన్నో రోజులు ఆఁ జ్ఞాపకాలు మనసులో అలజడి సృష్టిస్తూనే ఉండేవి.

కొందరు ఆఁ ఉప్పెనలో అందర్నీ పోగొట్టుకుని దిక్కులేక నిరాశ్రయంగా నిలబడిన ఆడపిల్లల్ని పెంచుకుంటామని తెచ్చి పని పిల్లలుగా వాడుకుని వాతలు పెట్టిన సంఘటనలు చూసి మనసు ద్రవించి నేను రాసిన ‘ఆడపిల్ల ‘ అన్నకథ ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమయ్యింది.

ఈ కాంక్రీట్ జంగిల్ లో అన్ని రకాల ప్రాణులూ ఉంటాయి కదా మరి!

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.