కొండ మేక-గద్ద

-కందేపి రాణి ప్రసాద్

అదొక పర్వత ప్రాంతం. చుట్టూ ఎటు చూసినా ఎత్తుగా కొండలే కనిపిస్తున్నాయి. ఈ కొండలు నున్నగా ననుపుదేలి ఉన్నాయి. ఈ పర్వతాలపై ఎక్కడా గడ్డి కూడా మొలవదు. అన్నీ బండరాళ్ళే. వందల అడుగుల ఎత్తు పెరిగాయి. సాధారణంగా కొండలు ఏటవాలుగా ఎక్కేందుకు వీలుగా ఉంటాయి. కానీ ఈ కొండలు అలా కాదు. స్కేలులో గీత కొట్టినట్లుగా నిలువుగా వంగకుండా పెరిగాయి. కొండల మీద అక్కడక్కడా బెత్తెడు వెడల్పుతో చెక్కినట్లుగా ఉన్నాయి.

కొండల మీద అక్కడక్కడా మంచు పేరుకున్నట్లు అనిపిస్తుంది కానీ అది మంచు కాదు. ఆ కొండల మీద అరచేయి వెడల్పుతో ఉప్పు పేరుకుంటుంది. అందుకని కొండల మధ్యలో చిరు మొలకల బదులు ఉప్పు మరకలు తెల్లగా కనిపిస్తాయి. కొండల పైభాగాన మాత్రమే మంచు నిలబడుతుంది. అన్ని పర్వతాలు మంచు టోపీలు పెట్టుకుంటాయి. చెట్టు చేమలు కాదు కదా చిరు మొలకలు, పిలకలు కూడా కన్పించని అరుదైన కొండలివి.

చెట్టూ చేమ లేని ఈ కొండల మధ్య జంతు జాతి ఉంటుందని అనుకుంటామా! కానీ మనం ఆశ్చర్య పోయేలాగా అక్కడ కొండ మేకలు, కొండ గొర్రెలు నివసిస్తుంటాయి. ఇవి ఆహారం ఎలా తింటాయో ఏమి తింటాయో అర్థం కాదనిపిస్తుంది. కానీ అక్కడి వారు చెప్పిన విషయం ఏమిటంటే ఆ కొండ మేకలు పర్వతాల కంటుకున్న ఉప్పును తింటాయి అని. సరే ఈ కొండ మేకల కథ చూద్దాం.

***

కొండ మేకలు తమ కుటుంబాలలో పర్వతాలలో నివసిస్తాయి. ఒక కొండ మేక తన పిల్లతో సహా కాపురం ఉంటోంది. ఈ కొండ మేకలు నిట్టనిలువుగా పైకి ఎక్కగలుగుతాయి. కొండలలో నివసించే వాటికి ఈ లక్షణం ఉండటం ఉపయోగం అంతే కాకుండా ఒక కొండ మీద నుంచి మరొక కొండ మీదకు దూకగలుగుతాయి. ఇక్కడ పులులు కూడా ఉంటాయి. అవి కూడా కొండల మీద నుంచి కొండల మీదకు దూకుతాయి.

ఒక రోజు కొండమేక కొండకోన నుంచి మరొక కొండ మీదకు దూక బోయింది. దాని వెనకే నిలబడ్డ దాని పిల్ల దూకదానికి భయపడి వెనక్కు వెళ్ళింది. అది చూసిన కొండమేక తన వీపు మీద ఎక్కమని పిల్లతో చెప్పింది. పిల్ల తల్లి వీపుమీద ఎక్కింది. కొండ మీద నుంచి కొండకు దూకటానికి దురం అంచనా వేస్తున్నది.

కొండ మేక తన పిల్లతో సహా రెండో కొండు మీదకు దూకింది. ఆ దూకడంలో బండరాయి దొర్లి కిందకు జారింది. కొండమేక దాని పిల్ల చెరో వైపుకు పడ్డాయి. ఆ సమయంలో పిల్ల పడిపోయింది. తల్లి మాత్రం కొండ మీదకు చేరింది. పిల్ల భయంతో పెద్దగా అరిచింది.

కొండ మేకకు ఏం చేయాలో అర్ధం కాలేదు. అది కూడా కాపాడమని అరిచింది. అప్పుడే ఆకాశంలో గద్ద ఎగురుతూ పోతున్నది. సాధారణంగా ఈ కొండ ప్రాంతాలలో మేకలకు గద్దలు శత్రువులు. కానీ ఈ గద్ద కరుణ కలిగినటువంటిది పిల్ల లొయలోకి పడుతూ ఉండటాన్ని గద్ద చూసింది. వెంటనే గద్ద ఎగురుకుంటూ వెళ్ళి పిల్ల మేకను పట్టున్నది. కాళ్ళ మధ్య ఇరికించుకుని తెచ్చిన గద్ద ఆ మేకను తల్లి దగ్గరకు చేర్చింది. తల్లి మేక చాలా సంతోష పడింది. గద్ధకు కృతజ్ఞతలు చెప్పింది.

నా పిల్లను కాపాడినందుకు నీకు వేల వేల కృతజ్ఞతలు. మాకు శతృవులైనప్పటికీ కాపాడావు మిత్రమా. నీ మేలు ఈ జన్మలో మరిచిపోను నేస్తమా అని కళ్ళనీళ్ళు కారుతుండగా కొండ మేక రెండు చేతులతో నమస్కరిస్తూ చెప్పింది.

దానికి గద్ద సమాధానంగా మిత్రమా! “మనం శత్రు జాతులం కావచ్చు. కానీ ఆకలి లేక పోయినా దాడి చేసే మనుష్యులం కాదు కదా! ప్రమాదకరమైన పర్వతాలు లోయల మధ్య మనం నిత్యం సంచరిస్తుంటాం. ఎప్పుడే ఆపద వస్తుందో తెలియదు కాబట్టి సహాయం చేసుకోవటంలో తప్పులేదు. అందుకే మీ పిల్లను కాపాడి తీసుకువచ్చాను” అన్నది.

గద్ద సమాధానం విన్న కొండమేక చాలా సంతోపపడింది. దాని మాటలకు దయా హృదయానికి అబ్బుర పడింది సరే మిత్రమా! మరోసారి ధన్యవాదాలు అంటూ కొండమేక చెప్పి పిల్లను తీసుకుని వెళ్లిపోయింది.

గద్ద కూడా మంచు పర్వతాల మీద నుంచి ఎగిరి వెళ్ళిపోయింది.

కొండమేకలు బెత్తెడు స్థలమున్నా దాని మీద గిట్టలు నిలుపుతూ నడుస్తుంటాయి. అన్నీ వరుసగా కుటుంబాలన్నీ కలసి మెలిసి వెళ్తూ ఉంటాయి. పిల్లలున్న తల్లులు మాత్రం పిల్లల్ని వీపుమీద ఎక్కించుకుని వెళుతూ ఉంటాయి. మామూలు జంతువుల్లో ఈ విషయం ఎక్కడా గమనించం. కేవలం కొండ జీవుల్లో మాత్రమే పిల్లల్ని ఎక్కించుకుని నడవడం, దూకడం గమనిస్తాం. కొండల మీద బారులుగా ఈ కొండమేకలు నడుస్తుంటే చూడ ముచ్చటగా ఉంటుంది.

ఒక రోజు కొండ మేకలు పర్వతాల మీదున్న ఉప్పును నాక్కుంటూ తింటూ నడుస్తున్నాయి. పిల్లలేమో బండరాళ్ళను నెడుతూ అవి కింద లోయలో పడుతుంటే చప్పట్లు కొడుతూ అనందిస్తున్నాయి.

అలా కొండ మేకలు కొండల మీద నుంచి నడుచుకుంటూ వస్తున్నాయి. దూరంగా ఒక గద్ద పిల్ల ఆర్తనాదం వినిపించింది. ‘ఏమైందా’ అనుకుంటూ కొండమేకలు దగ్గరకు వెళ్ళి చూశాయి. అక్కడొక గద్ద పిల్ల కనిపించింది. ‘ఏమైంది’ అని అడిగాయి.

గద్ద పిల్ల తన రెక్కను చూపించింది. ఒక రెక్క పెద్ద బండరాయి కింద ఇరుక్కుపోయి ఉన్నది. రెండవ రెక్కతో అటూ ఇటూ కొట్టుకుంటూ ఏడుస్తున్నది. “నీ రెక్క ఎలా ఇరుక్కు పోయింది” అని కొండ మేక అడిగింది.

“నేను ఇక్కడ ఆగాను. ఆకాశం వంక చూస్తూ ఉండగా కొండ మీద నుంచి వచ్చిన బండ రాయి నా రెక్క మీద పడింది. నేను పక్కకు తప్పుకున్నాను కానీ లేకుంటే నేను ఆ బండ కిందపడి నలిగి పోయేదాన్ని” అని ఏడుస్తూ గద్ద పిల్ల చెప్పింది.

‘అయ్యో పాపం ! ఎంత కష్టం వచ్చింది’ అని కొండమేక అంటుంటే మిగతా కొండ మేకలు “ఎందుకు శత్రువును పాపం అని దయ తలుస్తున్నావు” అన్నారు. ‘మనకెందుకు మనం వెళ్ళిపోదాం’ అన్నాయి మిగిలిన కొండ మేకలు.

కానీ మొదటి కొండ మేక ఒప్పుకోలేదు. “ఆపదలో ఉన్నపుడు మిత్రుడైనా శత్రువైనా కాపాడటమే మానవత్వం అనిపిచుకుంటుంది. మొన్నొక రోజు ఒక గద్ద నా పిల్లను కాపాడింది. ఇది కూడా చిన్నపిల్ల కాపాడాల్సిందే” అని అన్నది.

మిగిలిన కొండమేకలు చిన్నపిల్ల అని అలోచించాయి. “సరే కాపాడుకుందాం” అని అన్నీ అనుకున్నాయి. ఆ బండరాయిని తొయ్యటం మొదలు పెట్టాయి. కొద్ది కొద్దిగా రాయి కదులుతున్నది. గద్ద పిల్ల ఏడుపులు బాధగా అనిపిస్తున్నాయి. “ఒక్క క్షణం ఓర్చుకో మెల్లగా రాయిని తొలగిస్తాం అని కొండ మేకలు ధైర్యం చెప్పాయి.

కొద్ది సేపటికి కొండమేకలు రాయిని తొలగించాయి. గద్ద పిల్ల రెక్క బయటకు వచ్చింది. కానీ నొప్పితో అల్లాడుతున్నది. దీని ఏడుపులు విని తల్లి గద్ద కాసేపటికి వచ్చింది. కొండమేక గద్దను గుర్తు పట్టింది.

మిత్రమా బాగున్నావా అని అడిగింది. గద్ద తన పిల్లను చూసుకుని ‘ఏమైందమ్మా’ అని అడిగింది. కొండ మేకకు అర్థమైంది. తను కాపాడిన గద్ద పిల్ల తన విత్రురాలైన గద్ద యొక్క పిల్లనే అని దాని మనసు సంతోషంతో పొంగిపోయింది.

గద్ధ పిల్ల చెప్పిన విషయాలు విన్న గద్దకు జరిగిన సంగతి తెలిసింది. తన బిడ్డను కొండ మేకలు కాపాడాయి అని తెలుసుకున్నది. గద్ద ఏడుస్తూ కొండ మేకలకు నమస్కారం చేసింది. తన బిడ్డను కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పింది.

జంతువైన, శత్రువైనా పిల్లలు ఆపదలో ఉన్నపుడు కాపాడటం మానవత్వమని అవి చాటి చెప్పాయి. మానవులు ఆలోచించాలి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.