నడక దారిలో-55

-శీలా సుభద్రా దేవి

జరిగిన కథ:- (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. వీర్రాజుగారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,నేను ఎమ్మెస్సీ పూర్తిచేసాను. అమ్మ చనిపోవటం, పల్లవి వివాహం, నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్ జరగటం, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, ప్రమోషన్ ప్రహసనం. పాప రెండవ పుట్టినరోజు వేడుక , కొత్త ఇంటి గృహప్రవేశం తిరిగివెళ్ళిన రెండు నెలలకే అజయ్ చనిపోవడంతో ఆషీని తీసుకుని పల్లవి తిరిగి ఉద్యోగంలో చేరింది. నేను హెచ్చెమ్ గా అనుభవాలు, పదవీవిరమణ,పెద్దక్క మరణం, ప్రత్యేకతెలంగాణా ఉద్యమం ప్రారంభమైంది. ఇంటికి మిత్రులు రావటం తగ్గిపోవడం, ఆప్తమిత్రుడు మీనన్ చనిపోవడంతో వీర్రాజుగారు తన ఏకాగ్రత అంతా పెయింటింగ్స్ వేయటంపై పెట్టారు తర్వాత—)

***

          ఆప్తమిత్రుడు కె.కె.మీనన్ భౌతికంగా దూరం కావటం వీర్రాజుగారు చాలా దిగులు పడ్డారు. తాను పెయింటింగ్స్ వేయటమేకాక కవితా సంపుటి కూడా ప్రచురించు కోవాలనే వుద్దేశ్యంతో కవిత్వరచనలో పడి మిత్రుని మృతి వలన కలిగిన దుఃఖాన్ని అధిగమించడానికి ప్రయత్నించారు.
 
          మేముంటున్న ఇంటి పరిసరాలకు పల్లవి విసిగి పోవటంతో కొనటానికి ఇళ్ళకోసం గట్టిగానే ప్రయత్నం మొదలెట్టాము.
 
          మల్లయ్య శాస్త్రిగారికి మియాపూర్ లో ఇల్లు ఎలాట్ అయ్యిందట. ఆ పనిమీదనో మరెందుకో గుర్తులేదు.హైదరాబాద్ వచ్చి మా ఇంటికి వచ్చారు. భోజనం అయ్యాక వీర్రాజుగారితో చాలా సేపు కబుర్లు చెప్పి సాయంత్రానికి తిరిగి వెళ్ళారు. ఆయన వెళ్ళాక వీర్రాజుగారు నాతో చెప్పిన విషయం నన్ను అవాక్కు అయ్యేలా చేసింది.
 
          ” ఒంటరిగా వుండటం కష్టంగా వుంది వీర్రాజు గారూ. నేను వివాహం చేసు కుందామనుకుంటున్నాను. ఏమంటారు?” అన్నారట ఆయన డెభ్భై ఏళ్ళు దాటిన వ్యక్తి.
 
          ఆయన తాతో, ముత్తాతోగానీ బాలవితంతువైన తన కూతురికి పునర్వివాహం చేసారు. అన్ని కులాల వారితో పంక్తి భోజనం చేసిన బ్రహ్మ సమాజదీక్షగల మహనీయ వ్యక్తిగా ఆయనకి పేరు.
 
          అయితే అంత ఆశ్చర్యపడటానికేముంది? భరాగో,పెద్దిభొట్లవంటివారు కూడా ఆ వయసులో వివాహాలు చేసుకున్నారు కదా. పురుషులకు ఏ వయసులోనైనా పునర్వివాహం చేసుకునే జన్మహక్కు ఈ సమాజం ఇచ్చింది. అందుకే ఆశ్చర్యం అక్కర్లేదు.
 
          కానీ అకస్మాత్తుగా భర్త చనిపోవడంతో పాతికేళ్ళవయస్సులోనే ఇద్దరు పసి పిల్లలతో అసహాయంగా మిగిలిన తమ్ముడి భార్యని అత్తింటి వాళ్ళంతా దిక్కులేని దానిగా వదిలేసినప్పుడు ఆమె ఒంటరితనం ఆయనకి గుర్తు రాలేదా? అది గుర్తు వచ్చి నేను కొంత డిస్టర్బ్ అయ్యాను. 
 
          ఈ విషయం ఎవరితోనూ  చెప్పలేదు. కానీ ఆ తర్వాత గుండెల్లో గాయం అనే కథని రాసాను.
 
          మరిది కృష్ణ చిన్నకూతురు పెళ్ళి ఒరియా అబ్బాయితో పూరీలో నిశ్చయం అయ్యింది. ముగ్గురు అమ్మాయిలూ మూడుప్రాంతాల వారిని ఎంపిక చేసుకుని వివాహం చేసుకోవటం ఆశ్చర్యమే. కట్నాలబాధ అయితే తప్పిందనుకోవాలి. కృష్ణ మరణానంతరం ఆ కుటుంబ బాధ్యత మాదే అని భావించి రెండు పెళ్ళిళ్ళు జరిగాయి. ఈ పెళ్ళికి మాత్రం పెద్దమ్మాయి కవితే చెల్లెలి పెళ్ళికి ఎక్కువ బాధ్యత వహించింది.
 
          మా కుటుంబంతో పాటు చిన్నమరిది బయలుదేరాడు. వివాహం ఒరియా పద్ధతిలో జరిగిన ఈ వివాహానికి కూడా మేమే కన్యాదానం చేయటం జరిగింది. ఆ వివాహానంతరం భువనేశ్వర్ లో చూడవలసిన ప్రదేశాలు, కోణార్క్ సూర్య దేవాలయం ధవళగిరి మొదలైనవి చూసి తిరిగి హైదరాబాద్ వచ్చేసాం.
 
          కొనటానికి ఇండిపెండెంట్ ఇళ్ళు చాలా చూసాం. కానీ ఏవీ మాకు అందు బాటులో లేవు. ఒకరోజు సరూర్ నగర్లో వున్న మరిది నుండి పల్లవికి ఫోన్ వచ్చింది. “ఇక్కడ సరూర్ నగర్ మెయిన్ రోడ్డులో ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్  మొదలయ్యింది. కె.విశ్వనాధ్ ప్రారంభించారు. ఒకవేళ నచ్చుతుందేమో చూడు.” అని.
 
          నాలుగురోజులుగా సెలవులకని వచ్చిన చిన్నక్క కుటుంబానికి అదే రోజు తిరుగు ప్రయాణం. వాళ్ళు మమ్మల్ని స్టేషన్ కు రానక్కరలేదనీ సలీమ్ ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోతాం. మీరు వెళ్ళి ఇల్లు చూడండని అన్నారు. అంతే కాక ఇండిపెండెంట్ ఇల్లు కన్నా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అయితేనే భద్రత వుంటుంది. నచ్చితే తీసుకోవటం మంచిది అన్నారు.
 
          వీర్రాజుగారు కూడా తన తమ్ముడూ, చెల్లెల కుటుంబాలు దగ్గరగా వుంటాయి అని తీసుకుంటే బాగానే వుంటుందన్నారు.
 
          వీర్రాజుగారు తాను రాననీ చూడటానికి మా ఇద్దరినీ వెళ్ళమన్నారు. సరేనని వచ్చి SVRS వారి ఒక మోడల్ హౌస్ చూసాము. వాళ్ళు చెప్పినవన్ని నచ్చాయి. మా బడ్జెట్ లోనే త్రీబెడ్ రూమ్ ఇల్లు వస్తుంది. అయితే మళ్ళా అపార్ట్మెంటేనా అనిపిం చింది. ముందు రెండువేలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ముందు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి రెండున్నర లక్షలు ఖరీదు చేసే ఫర్నీచర్ , మాడర్న్ కిచెన్ ఉచితం అన్నారు.
 
          సరే ముందు కట్టేద్దాం. తర్వాత ఆలోచించుకుందాం అనుకున్నాం.
 
          మర్నాడు మళ్ళా వీర్రాజుగారితో కలిసి వచ్చి చూసాం. SVRS బృందావనం పేరిట మూడు బ్లాకులు కడుతున్నామని బిల్డర్స్ చెప్పారు. మొదటగా నారాయణాద్రి బ్లాక్ మొదలు పెడతామని చెప్పి అయిదు ఫ్లోర్ లు, ఒక్కోఫ్లోరులో పదహారు ఇళ్ళు వుంటాయని ఇళ్ళు ప్లానులు ఉన్న పేపరు ఇచ్చి ఎంపిక చేసుకోమని చెప్పి ఏ రకంగా ఎన్ని వాయిదాల్లో డబ్బు కట్టాలో, ఎప్పుడు నిర్మాణం మొదలెడతారో, ఎప్పుడు ఇల్లు ఇస్తారో వివరాలు చెప్పారు.
 
          ఇళ్ళ ప్లాను చూసి ఫస్ట్ ఫ్లోర్ వద్దనుకున్నాము. థర్డ్ ఫ్లోర్ లో ఇళ్ళు బుక్ అయి పోయాయి. కరెంటు పోతే కష్టం పైన రెండు ఫ్లోరులు వద్దని వీర్రాజుగారు అన్నారు. ఆఖరుకు రెండవ ఫ్లోరులో ఇల్లు సెలెక్ట్ చేసుకున్నాము. అప్పుడప్పుడు అటువైపు వెళ్ళి ఎంతవరకూ అయ్యిందో చూసుకునే వాళ్ళం.
 
          2010లో ఆధునిక తెలుగు కథ వచ్చి 100 ఏళ్ళు అయిన సందర్భంగా వేదగిరి రాంబాబుగారు కొందరు కథకులను తీసుకుని విజయనగరం ప్రయాణం కట్టారు. విజయనగరంలో ఆ సందర్భంగా గురజాడ ఇంటిలోనూ, గురజాడ వీధిలోనూ కథకుల పాదయాత్ర తలపెట్టారు.
 
          నేను విజయనగరంలో పుట్టిపెరిగిన దానిని. విజయనగరంలో సమావేశాలకు గానీ, సదస్సులకు గానీ ఎందుకు గుర్తు రానో మరి ఎప్పుడూ ఎవరూ ఆహ్వానించలేదు.  విజయనగరంలో ఒక సంస్థ అనేకమంది రచయిత్రులు పిలిచి పురస్కారాలు ఇవ్వటం కూడా తెలుసు. నన్ను పిలవాలని కాదు కానీ అక్కడే వున్న మా పెద్దక్కనీ గానీ, చిన్నన్నయ్యనీ గానీ ఏనాడూ ఏ సభలకూ ఆహ్వానించరు. ఇందులో కొంత వరకూ కుల రాజకీయాలు కూడా వున్నాయని మాకు చూచాయగా తెలుసు. అందుకనే మేము పట్టించుకోం. కానీ అప్పుడప్పుడు కొంత బాధ కలగటం సహజమే కదా.
 
          సరే. మళ్ళా వందేళ్ళ కథ దగ్గరకు వస్తే – విజయనగరం కథకులు బయలు దేరే రోజు వచ్చింది. మాకు తెలిసిన చాలా మంది వెళ్తున్నారనేది కూడా తెలిసింది. సాయంత్రం నాలుగు గంటలకు రాంబాబుగారు ఫోన్ చేసారు. ఆ సమయంలో వీర్రాజుగారు ఇంట్లో లేకపోవటంతో నేనే ఫోన్ తీసి మాట్లాడాను. ‘వందేళ్ళ కథోత్సవాలకు విజయనగరం వెళ్తున్నామని, మీరు విజయనగరం వారు కదా మీరు కూడా వస్తే బాగుంటుంది’ అన్నారు.
 
          ఎప్పుడు వెళ్తున్నారని అడుగుతే అదేరోజు ఆరుగంటల ట్రైనుకు వెళ్తున్నామని, ఆ మర్నాడే కార్యక్రమమని చెప్పారు. నాకు చాలా కోపం వచ్చింది. కాని చాలాతాపీగా ” ఇప్పటికిప్పుడు టిక్కెట్లు ఎలా అంటే “అది నేను చూసుకుంటాను” అన్నారు. బహుశా ఎవరో రావటం లేదేమో ఆ ఎవరో నా పేరు చెప్పి వుంటారు. ఆ టికెట్ లో నన్ను తీసుకెళ్దామని అడిగి వుంటారు అనిపించింది.
 
          వీర్రాజుగారు ఇంట్లో లేరని, ఇప్పటికిప్పుడు ఒక్క గంటలో నేను తయారై రాలేనని చెప్పేసాను.
 
          వీర్రాజుగారు వచ్చాక ఈ విషయం చెప్తే ” కులాలు, మతాలూ ప్రాంతాలుగా సాహిత్య రంగం గ్రూపులుగా విడిపోతోంది. ఇటువంటి ఏ గ్రూపులోనూ చేరకుండా మనమట్టుకు మనం రాసుకుంటూ వున్న వాళ్ళం అంతే అట్టడుగుకు వెళ్ళిపోతాం. అందుకే రాసినవన్నీ పుస్తకం రూపంలో లైబ్రరీలలో వుంటే ఎప్పటికైనా ఎవరో ఒకరు తీస్తే గుర్తింపులోకి వస్తాం. బండారు అచ్చమాంబ వంటి వారు అలాగే ఇన్నాళ్ళకు గుర్తింపులోకి వచ్చారు కదా” అన్నారు బహుశా చిన్నబుచ్చుకున్న నన్ను మరలించ టానికే కావచ్చు.       
 
          2010లో వందేళ్ళ కథాప్రస్థానం సందర్భంగా తెలుగు రాష్ట్రంలోనే కాక బయటున్న తెలుగు కథకులందరితో ఎన్నో సమావేశాలూ, ఎన్నో ఇంటర్వ్యూలూ, వ్యాసాలూ, అభిప్రాయాలు పత్రికల్లో వెలువడ్డాయి. మొదటి కథారచయిత్రిగా భండారు అచ్చమాంబను పేర్కొని, ఆపైన 1980 తర్వాత రాసిన రచయిత్రులనే అనేకమంది పేర్కొన్నారు. 
 
          హెచ్ఎంటీవీ తెలుగు టీవీ ఛానల్ వందేళ్ల కథ పేరిట కార్యక్రమంలో భాగంగా 2012 లో గొల్లపూడి మారుతీరావు “వందేళ్ల కథకు వందనాలు” అంటూ ఓ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. 118 మంది కథకుల కథలను పరిచయం చేసిన గొల్లపూడి మారుతీరావు కేవలం పన్నెండుమంది రచయిత్రుల కథలనే స్వీకరించటం కూడా గమనించాల్సిన విషయమే అనిపించింది.
 
          అవన్నీ గమనించిన తరువాత 1910కి-1980కి మధ్య ఒకరిద్దరు తప్ప కథా రచయిత్రులు లేరా అనే ఆశ్చర్యం కలిగింది. అరవయ్యో దశకంలో పత్రికలన్నింటిలో ప్రభంజనం సృష్టించిన రచయిత్రులంతా ఏమయ్యారు? వారు నవలలు తప్ప చెప్పుకోదగిన కథలేమీ రాయలేదా? రాసినా విమర్శకులు, చాలామంది పేర్కొన్నట్లు, ప్రేమలూ-పెళ్ళిళ్ళూ, కుటుంబాలూ, అపార్థాలూ, కలహాలతో నిండిన వంటింటి సాహిత్యమేనా? – ఇలా అనేక సందేహాలు నన్ను చుట్టుముట్టాయి.
 
          కాకతీయ విశ్వవిద్యాలయంలో “రచయిత్రుల వెనుకబాటు తనం ” గురించి ఒకసారి నేను సమర్పించిన ప్రసంగవ్యాసం, తర్వాత ప్రభుత్వ సాంస్కృతిక, భాషా సంస్థతో లేఖిని సంస్థ కలిసి నిర్వహించిన సదస్సులో రామలక్ష్మి కథల గురించి చేసిన ప్రసంగవ్యాసం గుర్తు వచ్చి 1950కి ముందు రచయిత్రులనీ, వారి కథల్నీ గురించి పరిశోధనాత్మక వ్యాసాలు రాయాలనే దృడమైన సంకల్పం కలిగింది.
 
          ముందుగా ఎవరెవరి గురించి రాయాలనేది ఒక జాబితా తయారు చేసుకుని ముందుగా రచయిత్రుల కథలసంపుటాల సేకరణ మొదలు పెట్టాను.
 
          కొన్న అపార్ట్మెంట్ పూర్తి అయ్యింది. అక్కడ ఒకరోజు పూజ చేయించేసి ఇంట్లో చేయించాల్సిన వుడ్ వర్క్ మొదలుపెట్టించాలని నిర్ణయించాము. పూజ చేసే పంతులుగారి నెంబర్ మరిది దగ్గర తీసుకుని తేదీ నిర్ణయించాము.
 
          ఫిబ్రవరి 13తేదీన సాయింత్రం ముహూర్తం నిర్ణయించారు. ముందు రెండు రోజులూ అవసరమైన వస్తువులు కొనటం ప్రారంభించాము. ఎవరినీ పిలవ దలచుకోలేదు. దగ్గరలోనే వుంటారు కనుక మా పెద్ద ఆడబడుచునీ, మా చిన్న మరిదినీ మాత్రమే పిలిచాము. పూర్తిగా ఇల్లు మారిన తర్వాత స్నేహితులనూ, బంధువులనూ పిలిచి పార్టీ ఇవ్వాలని మా వుద్దేశ్యం.
 
          13వతేదీ వుదయం దిల్ షుక్ నగర్ లో పళ్ళు మొదలైనవి కొంటున్నప్పుడు షాకింగ్ వార్తతో ఫోన్ వచ్చింది.
 
          కుందుర్తి సత్యమూర్తి మాసివ్ హార్ట్ ఎటాక్ తో చనిపోయారని  తెలిసింది. వీర్రాజుగారు విని ఎలా తట్టుకుంటారోనని భయం వేసింది. వెంటనే నాళేశ్వరం శంకరంగారికి ఫోన్ చేసి ఇలా ఆ రోజు రాత్రి గృహప్రవేశం పూజ పెట్టుకున్న విషయం కూడా చెప్పాను. వెంటనే మలక్ పేట ఇంటికి ఆయన బయలుదేరి వెళ్ళారు.
 
          మేము కొన్న వస్తువులను కొత్త ఇంట్లో పెట్టేసి మలక్ పేట వెళ్దామని సరూర్ నగర్ వచ్చాం. ఇంట్లోకి రాగానే అంతవరకూ దుఃఖాన్ని వుగ్గ బెట్టుకుందేమో పల్లవి ఒక్క సారిగా ఏడుపు మొదలుపెట్టింది.” పెట్టుకోక పెట్టుకోక ఒక శుభకార్యం తలపెడితే ఇలా జరిగిందేమిటి ” అని వెక్కిళ్లు పెట్టింది. ఆమెను సముదాయించటం నాకూ కష్టమే అయ్యింది. నాకూ మనసులో కొండంత భయం గూడు కట్టుకుంది. అయినా బయటకు బింకంగా వుండి ఓదార్చాను.
 
          ఫ్రీవర్స్ ఫ్రంట్ నిర్వహణ అనుబంధం వల్ల కుందుర్తిగారి మరణానంతరం సత్యమూర్తి కుటుంబం ఇంట్లో మనుషుల్లా మాకు చాలా దగ్గర అయ్యారు. ఇప్పుడు ఈ పూజ చేయించటమా మానటమా ఒక సందిగ్ధం అయింది.
 
          మలక్ పేట ఇంటికి వచ్చేక వీర్రాజు గారూ, శంకరంగారూ నేనూ కలిసి సత్యమూర్తి గారి ఇంటికి వెళ్ళాము.
 
          సింగపూర్ లో వున్న చిన్న కూతురు కవితకు ఉదయం ఎప్పటిలాగే కాల్ చేసి కట్ చేసారట సత్యమూర్తి. ఆ తర్వాత కవిత తిరిగి తానే కాల్ చేస్తే అప్పుడు మాట్లాడ టం ఆనవాయితీ అట. అదే విధంగా కాల్ కట్ చేసిన వెంటనే కుప్పకూలిపోవటం, ప్రాణం పోవటం నిముషాలమీద జరిగిందని తెలిసింది. కవిత చేసిన ఫోన్ ఎత్తడానికి ఆయన లేకుండా పోయారట. ఎంత విషాదం అనిపించింది. దగ్గరలో సత్యమూర్తి షష్ఠి పూర్తి చేయాలని సమత, కవిత అనుకున్నారు. ఈ లోపున ఇలా జరిగింది. కుందుర్తి గారు కూడా అలాగే షష్ఠి పూర్తి ఏర్పాట్లు జరుగుతుండగానే పోయారనేది గుర్తొచ్చింది.
 
          నేను కొంత సేపు కుందుర్తి శాంతతోనూ, సమతతోనూ మాట్లాడి ఇంటికి వచ్చేసాను. ” అక్కడి కార్యక్రమం పూర్తికాగానే వీర్రాజుగారిని తీసుకువచ్చే స్తాను. సాయంత్రం మీ కొత్త ఇంట్లో పూజ యథాతధంగా చేసుకోండి” అని శంకరం భరోసా ఇచ్చారు.
 
          సాయంత్రం సరూర్ నగర్ కొత్త ఇంట్లో కార్యక్రమం కోసం ఇంట్లోనే కొంచెం పులిహోర, దద్దోజనం చేసుకుని తీసుకొని వెళ్ళాం. ఆడబడుచు ఇంటినుండి పాలు పొంగించటానికి గాస్ సిలిండర్ తీసుకు వచ్చాము.
 
          పంతులుగారు సరియైన సమయానికే వచ్చి పూజ ప్రారంభించారు. హోమాలూ, వాస్తుపూజలవీ మాకు అక్కర్లేదు. సింపుల్గా వినాయక పూజ, వ్రతం  చేయమన్నాం. పల్లవీ, ఆషీ చేత పూజ చేయించమన్నాం. ఆయన అలాగే చేసారు. చిన్నమరిది దంపతులు, ఆడబడుచు దంపతులు వచ్చారు. వాళ్ళకి పల్లవి బట్టలు పెట్టింది.
పాలు పొంగించి చేసిన పరమాన్నం, మేము ఇంటి నుండి తెచ్చిన పులిహోర, దద్దోజనం అందరం తినేసి తిరిగి ఇంటికి వచ్చేసాం. మొత్తం మీద ఒక ప్రహసనం నిర్విఘ్నంగానే పూర్తి కావటంతో వూపిరి పీల్చుకున్నాము.
 
          ఒక వారం పదిరోజులు అయ్యాక కార్పెంటర్ ను వెతుకుదాములే అనుకున్నాము.
అనుకోకుండా కందుకూరి శ్రీరాములుగారు ఒక కార్పెంటర్ గురించి తెలియజేసారు. శంకరం, శ్రీరాములుగారూ కార్పెంటర్ చారిని తీసుకుని వచ్చారు. అందరూ కలిసి సరూర్ నగర్ ఇంటికి కార్పెంటర్ ను తీసుకుని వెళ్ళి ఇల్లు చూపించారు.
 
          కొన్ని ఫర్నీచర్ మోడల్స్ ఆల్బంలు కార్పెంటర్ చారి తీసుకొని వచ్చాక మార్పు చేర్పులుతో మనకు నచ్చే విధంగా చేయించుకోవచ్చు అనుకున్నాం. వార్డు రోబ్ లకు వేయాల్సిన డెకలమ్ డిజైన్లు పల్లవే ఎంపిక చేసుకుంటానంది. పూర్తి చేయటానికి మూడునెలలు పడుతుందని చారి చెప్పాడు. అదంతా అయ్యాకే ఆ ఇంట్లోకి మారుదామని మేము నిర్ణయించుకున్నాము. అప్పటికి ఆషీకి కూడా పరీక్షలు పూర్తయ్యాకే సెలవుల్లో మారవచ్చులే అనుకున్నాం.
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.