నా అంతరంగ తరంగాలు-29

-మన్నెం శారద

          శ్రీరామ పట్టాభిషేకం పిదప ఆంజనేయస్వామి అయోధ్యని వీడి వెళుతున్న తరుణం అది!

          సీతమ్మని వెదకడం మొదలు, రాములవారికి ఆఁ వార్త అందించి రావణ సంహారం వరకు శ్రీరామ చంద్రులవారిని ఆంటిపెట్టుకుని వుండడమే కాక స్వామి వారి పట్టాభిషేకం కనులరా వీక్షించి తరించారు ఆంజనేయ స్వామి!

          ఇక తాను కిష్కంద కు బయలు దేరే తరుణమాసన్నమయ్యింది అక్కడ తనకు ఎన్నో బాధ్యతలు!

          స్వయానా సుగ్రీవులవారికి అమాత్యులాయే!

          తన స్వామిని వీడి వెళ్లడమంటే చెప్పలేని దుఃఖంగా వుంది అంజనీ పుత్రుడికి.

          ఆఁ బాధతో ఆ రాత్రి చాలా సేపు రాజభవనపు ఉద్యానవనం వనంలో ఒంటరిగా కూర్చున్నారు స్వామి. ఏ జామయిందో తెలియదు

వసంతకాలం!
ప్రకృతి మనోహరంగా వుంది.
చెట్లన్ని ఆకుల్ని కూడా పూలగా మార్చుకుని నలుదిశాల సుగంధాలు  వెదజల్లు తున్నాయి.

          సన్నని నడుమున్న కన్నెపిల్లలు వేసుకున్న బరువైనపూల జడలా సున్నిత మైన తీవెలు పూల గుత్తులతో గాలికి సుతారంగా వూగుతున్నాయి.

          ‘బహుశా ఈ ప్రకృతి కూడా సీతారామచంద్రుల వారి పునర్దర్శనంతో పులకిస్తున్న దేమో!’

          హనుమంతులవారి పెదవులపై చిరు దరహాసం!

          పట్టాభిషేక సందోహం సద్దు మణిగి అందరూ విశ్రమిస్తున్న వేళ రాములవారు చుట్టూ పరికించి చూసారు. ఎక్కడా హనుమంతులవారి జాడలేదు.

          ఆయన చిన్నగా అందరిని తప్పించుకుని ఉద్యానవనంలో ఒంటరిగా కూర్చుని వున్న ఆంజనేయ స్వామిని సమీపించి ‘ఆంజనేయా!’ అంటూ మెల్లిగా పిలిచారు.

          రాములవారి రాకను గమనించని ఆంజనేయస్వామి ఉలికిపాటుగా లేచి నిలబడి నమస్కరించి “స్వామీ!” అన్నారు వినయంగా.

          “ఏం ఇలా ఒంటరిగా కూర్చున్నావ్? “అన్నారు మృదువుగా.

          “మరేం లేదు స్వామీ, ఉక్కపొతగా అనిపిస్తే ఇలా చల్లగాలికి వచ్చాను. ” అన్నారు వినయంగా హనుమ.

          “నన్నే గుండెలో దాచేసుకున్నావాడివి, నాకు తెలియదా నీ మనసు!?, నా ఎడబాటుని జీర్ణించుకోలేక నువ్వు పడుతున్న బాధ నాకర్ధమవుతున్నది. అదే బాధ నన్నూ వేధిస్తున్నది. కానీ మనం కర్మ బద్ధులం. దానికీ కట్టుబడి మనం ముందుకు సాగక తప్పదు.

          ఆంజనేయస్వామి తల దించుకుని చేతులు కట్టుకుని అవునన్నట్లుగా తల పంకించారు.

          ఆంజనేయస్వామి కళ్ళలో లీలగా మెదులుతున్న కన్నీరు రామచంద్రులవారి దృష్టిని దాటిపోలేదు.

          ఆయన అనునయంగా ఆంజనేయుస్వామి భుజాల్ని ప్రేమగా పట్టుకుని “ఎప్పుడు రావాలనుకున్నా నీకెప్పుడూ స్వాగతమే హనుమంతా, నీవు నాకు చేసిన మేలు నేను ఎన్నడూ విస్మరించను. నాకు ఇప్పటి నుండి నలుగురు సోదరులు!” అన్నారు అత్యంత లాలనగా.

          హనుమంతులవారు చేతులు జోడించారు భక్తిగా.

          ” ఈ వీడ్కోలు సమయంలో నీకేదయినా బహుమతి ఇవ్వాలని నా మనసు ఉవ్వి ళ్ళులూరుతున్నది. ఏమి కావాలో కోరుకో!” అన్నారు రామచంద్రులవారు లాలింపుగా.

          బదులుగా ఆంజనేయస్వామి మందహాసం చేసి “లోకోద్ధారకుడవైన నీకు సేవచేసే అవకాశం , ప్రేమ నాకు లభించేయి. అంతకు మించిన భాగ్యం  మరేముం టుంది స్వామీ! నాకిక యెలాంటి ఇచ్ఛలూ లేవు. ” అన్నారు కనులు మూసుకుని.

          ” అదెలానూ ఉంటుంది. నా సంతృప్తి కోసం ఏదయినా కోరుకో, కాదనకు. “

          రాములవారి కోరికను కాదనలేకపోయారు ఆంజనేయులవారు.

          “స్వామీ!”

          “వూ “

          “నాకొక చిన్న కోరిక ఉండిపోయింది!”అంటూ సందిగ్ధంగా చూసారు స్వామి.

          “సందేహించకు హనుమా, అడుగు!”

          ‘స్వామీ, తమరు తపోధనులయిన మునులు సహితం మోహించగల అత్యంత సుందరాకారులు! అటువంటి మిమ్మల్ని ఒకసారి కళ్యాణ రాముడిగా చూడాలని వుంది. మిమ్మల్ని ఆలా చూసే అదృష్టం నాకు దక్కలేదు. ఇప్పుడొకసారి పెండ్లి కుమారుడిగా కనిపించి నా జన్మ తరింప జేయండి. “అన్నారు చేతులు జోడించి.

          స్వామివారు చిరునవ్వు నవ్వి పెండ్లి కుమారుడిగా దర్శనమిచ్చి హనుమని సంతోషపెట్టి తరింపజేశారు

ఈ అపురూప ఘట్టం
కేవలం నా ఊహాజనితం.

          ఎన్నో మూల గ్రంధాలకు అనేకమంది కవులు అనేక ఉపకథలు జోడించారు కదా… అందుకే ఇలా సరదాగా నేను కూడ నా ఊహని అక్షరీకృతం చేసాను.
చిత్తగించండి

*****

(సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.