నా జీవన యానంలో- (రెండవభాగం)- 2

-కె.వరలక్ష్మి 

మా మామగారికి అనకాపల్లి దగ్గర అడ్డు రోడ్డు కొరుప్రోలు ట్రాన్స్ ఫర్ అయ్యిందట. అక్కడి నుంచే మా అత్త గారొక సారి, మామగారొకసారి వచ్చి వెళ్లే వారు.  ఆ సంవత్సరం సెలవుల్లో మేం పిల్లల్ని తీసుకుని కొరుప్రోలు వెళ్లేం. రెండు గదుల డిపార్టుమెంట్ క్వార్టర్స్. పెద్ద కాంపౌండు లోపల చెట్లు , ఆఫీసు. పక్కనే రోడ్డు కవతల సంత. పెద్ద సైజు టేబులంతేసి పై డిప్పలున్న తాబేళ్లని నేనక్కడే చూసేను. చాలా మంది తాబేళ్ల మాంసం కొనుక్కెళ్లేవారు. కొరుప్రోలు నుంచి ముందుకెళ్తే చేపలు పట్టే జాలర్ల పల్లె, వాళ్ల పూరి గుడిసెల ముందు ఆరబెట్టిన చేపలు, సర్వీ చెట్ల వరసల కవతల పెద్ద పెద్ద కెరటాల హోరెత్తే సముద్రం, పక్కనే చిన్న కొండమీద గుడి – అద్భుతమైన దృశ్యం ఇప్పటికీ మనసులో హత్తుకుపోయింది. పిల్లలు ముగ్గురూ చెయ్యి వదిల్తే చాలు కెరటాల వైపు పరుగు తీసేవాళ్లు. వాళ్లతో సమంగా పరుగులు తీయడం, ఉన్న వారం రోజుల్లోనూ రెండు సార్లు వెళ్లేం.

మా అత్త గారి పెద్ద చెల్లిలికి ఆరోగ్యం బాగాలేక వైజాగ్ కె .జి .హెచ్ లో ఉంటే ఆమెను చూసుకుంటూ ఈవిడ అక్కడున్నారట. ఇంట్లో ఆఖరు పిల్లలు శాంత, రుక్మిణి మాత్రమే ఉన్నారు. వాళ్లే వాళ్ల నాన్నగారికి వండి పెడుతున్నారు. మోహన్ మమ్మల్ని దించేసి కోనసీమలో ఏదో సినిమా షూటింగ్ అవుతుందంటే వెళ్లేడు. మాతో మా పెద్ద తమ్ముడు, హాస్పిటల్లో ఉన్న ఆంటీ చిన్న కూతురు కూడా వచ్చేరు. టీనేజ్ లో ఉన్న వాళ్లిద్దరూ చెట్లంట పుట్టలంట పరుగులు తీస్తూ బాగా ఎంజాయ్ చేసే వాళ్లు.

క్వార్టర్స్ వెనకాల పలుగు, పారల్లాంటి డిపార్టుమెంటు సామాన్లు బోలెడన్ని ఉండేవి. వాటిల్లోంచి చిన్న సైజు గునపం ఒకటి, తవ్వుగోల ఒకటి పట్టుకెళ్లనా అని అడిగితే శాంత చక్కగా పేక్ చేసి సంచిలో పెట్టి మరీ ఇచ్చింది. మా పిల్లల కోరిక మేరకు తాబేలు డిప్పను కూడా తెచ్చుకున్నాం. మేమున్న ఇంటి కాంపౌండు లోపల పెద్ద ఖాళీ స్థలం ఉండేది. వచ్చిన మర్నాడు తవ్వు గోల తీసి గడ్డి మొక్కల్ని శుభ్రం చెయ్యడం మొదలు పెట్టేనో లేదో మామామగారు వచ్చేసారు. డిపార్టుమెంటు సామాన్లు అలా తెచ్చుకోకూడదంట. సంచిలో వేసుకుని పట్టుకెళ్లిపోయారు. ఇప్పుడంటే అలాంటివన్నీ షాపుల్లో దొరుకుతున్నాయి కాని అప్పటికి జగ్గంపేటలో అలాంటివేవన్నా కావాలంటే కమ్మరిని ఆశ్రయించాల్సిందే. మంచి పూల తోట పెంచేద్దామనుకున్న నా కల అలా ఆగిపోయింది అప్పటికి. మేం తెచ్చిన తాబేలు డిప్ప వీధిలో పిల్లలందరికీ గొప్ప ఆకర్షణ అయిపోయింది. స్కూలు పిల్లలు కూడా లీజరు టైంలో దాని పైకెక్కి దుమికి ఆడుతూండే వాళ్లు.

మా మామగారి తాగుడు అలవాటు ఆయన ఆరోగ్యం మీద ప్రభావం చూపించ సాగింది. ఆయన తిరిగి రాజమండ్రికి బదిలీ చేయించుకుని వచ్చేసారట. మా అత్త గారు మాత్రం చెల్లెలికి సేవలు చేస్తూ ఉండిపోయారు.

ఒకసారి వచ్చినప్పుడు మా మామగారు మోహన్ దేనికో బైటికెళ్లడం చూసి “అమ్మాయ్ , ఇలా రా అమ్మా “ అని పిలిచేరు. నేను ఆశ్చర్యపోతూ వెళ్లి ఎప్పట్లాగే నేల వైపు చూస్తూ నిలబడ్డాను.

“వరసగా నువ్వు పరీక్షలు పేసవడం చూస్తుంటేనే నువ్వెంత తెలివైనదానివో అర్ధమౌతుంది. మా ఎదవ నాలుగో సారిగాని ఇంటరు పేసవ్వలేదు. మీ అత్తగారు, ఈనా కొడుకూ ఒకే లాంటి తెలివి తక్కువోళ్లు. నువ్వు సంసారాన్ని దిద్దుకునే పద్ధతీ , పిల్లల్ని పెంచుతున్న పద్దతీ చూస్తుంటే ముచ్చటేస్తంది. నేను సంపాదించింది వెనకేసింది ఒక్క పైసా లేదు. ఇంకా ఇద్దరాడ పిల్లలు పెళ్లికెదిగి ఉన్నారు. ఆళ్లనీ , మీ అత్తగార్నీ నువ్వే చూసుకోవాలమ్మా” అన్నారు .

నేను ఆశ్చర్యపోయి ఆయన వేపు చూసేను.

అప్పటికే ఆయన ముఖం పీక్కుపోయి ఏదో మార్పు కనపడుతోంది. చటుక్కున నాకు కళ్లల్లో నీళ్లు తిరిగేయి.

“తప్పకుండా మావయ్య గారూ ! అయినా, మీకేం కాదు” అన్నాను .

ఆయన ఒక నీరసపు నవ్వు నవ్వి “ఎళ్లమ్మా, పని చూసుకో” అన్నారు. అదే ఆయన చివరిసారి జగ్గంపేట రావడం. 

ఆ కాస్త పలకరింపుతో నాకాయన పట్ల ఒక పాజిటివ్ దృక్పథం ఏర్పడిపోయింది.

ఆయన స్థానంలో నన్నూహించుకుంటూ “త్రాగాను మధువు తలపులన్ని మరచుటకు” – అంటూ ఓ కవిత రాసాను. 

అప్పటికి నా కవిత్వం ఇంకా ప్రేమ పరిధిని దాటలేదు. ఓ పొడవు నోట్ బుక్ లో రాయాలన్పించినప్పుడల్లా ఓ కవిత రాసేస్తూ  ఉండేదాన్ని. వాటినిప్పుడు చదివితే “ఇది కవిత్వమా ?” అని నవ్వొస్తుంది. 

ఆ కవితల పుస్తకం నాస్కూల్ టేబుల్ మీద ఉండేది. వచ్చిన వాళ్లల్లో కొందరైనా అవి చదివి నేను కవిత్వం రాస్తానని అనుకోవాలని నాకు లోలోపల ఉండేది.

అలాగే కొందరు చదివి ‘అబ్బా మీరు రాస్తారా’ అంటూండే వాళ్లు. ఈ మధువు కవిత చదివేక అందరూ నన్ను అనుమానంగా చూడ్డం మొదలెట్టేరు. దెబ్బకి నా కవితల పుస్తకం ఇంట్లో అలమారలోకి  వెళ్లిపోయింది. 

ఓరోజు మాకు దగ్గర్లో మునసబు గారి వీధిలో ఉన్న పోస్టాఫీసు నుంచి బంట్రోతు వచ్చి మాకు రాజమండ్రి నుంచి ఫోనొచ్చింది అని చెప్పేడు. అప్పటికే మోహన్ తన స్కూలుకెళ్లి పోయేడు. నేను వెళ్లేను పోస్టాఫీసుకి, అవతలి నుంచి మా చిన్న మామగారు మా మామగారు కాలం చేసేరని చెప్పేరు. నాకు గాభారాతో నోట మాట రాలేదు. చేతిలో ఫోను మొయ్యలేనంత బరువెక్కి పోయినట్టన్పించింది. ఆ తర్వాత చాలా ఏళ్లకి మేం లేండ్ లైన్ ఫోన్ వేయించుకున్నాక కూడా ఫోన్ రింగైతే గుండె దడదడా కొట్టుకునేది. ఎందుకో కొన్ని భయాలు అలా ఉండిపోతాయి.

అక్కడి కార్యక్రమాలన్నీ ముగిసేక మా అత్తగారు, శాంత, రుక్కు జగ్గంపేట వచ్చేసారు. 

ఒక గోనె సంచిలో వంట సామాగ్రి, రెండు సంచుల్లో బట్టలు పట్టుకుని. ఇల్లు పెద్దది కావడం వల్ల ఇబ్బందేం లేదు కాని ఇంట్లో మా అమ్మా వాళ్లు ఇచ్చిన నవారు మంచం తప్ప మరో మంచం లేదు. ఒక మడత మంచం ఉండేది కాని అదీ శిధిలావస్థ కొచ్చేసింది. ఇంట్లో ఒక ఫేను కూడా లేదు. అత్తయ్య గారికి నవారు మంచం ఇచ్చేసి మేమంతా గచ్చు మీద పడుకునే వాళ్లం. కోనేరు పేటలో ఉండే ఇనప మంచం – అచ్చు హాస్పిటల్స్ మంచం లాంటిది – వాళ్ల అమ్మమ్మగారింట్లో విప్పి పెట్టి ఉంటే మోహన్ వెళ్లి దాన్ని పట్టుకొచ్చేడు. కొత్తగా పెట్టిన ఇనప బీరువాల కొట్లో మొదటి వాయిదా కట్టేసి ఒక బీరువా తెచ్చేడు. ఇప్పట్లాగా ఇంటి కోసం ఫర్నిచర్లు కొనుక్కోవాలనే కాంక్ష ఉండేది కాదు, ఉన్నా డబ్బు ఎక్కడిది ? ఇక వంటింటికి కావాల్సిన కొద్దిపాటి గిన్నెలు తప్ప సెట్లు సెట్లు కొని పెట్టుకోవడం నాకు ఇష్టముండదు, ఎలాగూ అందరం కలిసే ఉంటాం కాబట్టి అత్తయ్య గారు తెచ్చిన సంచి విప్పి ఆ గిన్నెలు కూడా వాడడం మొదలు పెట్టేం.

శాంత, మా చిన్న చెల్లెలు కుమారి మంచి పనిమంతులు. వాళ్లిద్దరూ మంచి స్నేహితులు కూడా. వంటతో సహా ఇంటి పనంతా చక్క బెట్టేసే వాళ్లు. నాకు చదువుకోవడానికి కొంత తీరిక దొరికేది. మా అత్తగారు ఉదయం లేస్తూనే బైబిల్ చదువుతూ కూర్చునేవారు.  టిఫిను, భోజనం అన్నీ ఆవిడ కూర్చున్న చోటికే అందేవి. ఒక వారం తర్వాత అలా ఒక్కరే చదువుకోవడం విసుగన్పించినట్టుంది. చుట్టుపక్కల ఇళ్ళకి వెళ్లి సువార్త విన్పించబోయేవారట. ఆవీధి మొత్తం బ్రాహ్మలు, కోమట్లు . ఎవరూ వినేవారు కాదట. దూరంగా ఉన్న దళిత పేటను వెతుక్కుంటూ వెళ్లేవారు. అప్పటికి దళితుల్లో కూడా క్రిస్టియానిటీ తీసుకున్న వాళ్లు చాలా తక్కువ మంది ఉండేవాళ్లు. రాజమండ్రి లాంటి బస్తీలో పుట్టి పెరిగిన ఆవిడకి జగ్గంపేట లాంటి పల్లెలో ఉండడం కష్టమైపోయేది కాబోలు, తరచుగా రాజమండ్రి వెళ్ళిపోయే వారు.

మా అమ్మ బియ్యం బస్తా విప్పిన వెంటనే, వంటకు బియ్యం తీసుకున్న తర్వాత నా చేత బియ్యంలో “శ్రీ “ అని రాయించేది. ఆ అలవాటు ఉండిపోయి నేనూ అలాగే చేసేదాన్ని. ముత్తా గొల్ల అనే రైతు ఆయన్ని నేను బాబాయ్ అని పిలిచే దాన్ని. తన ఇద్దరు మనవరాళ్ల స్కూల్ ఫీజు కి బదులు కిచిడీ బియ్యం బస్తాలు వేసే వాడు. అప్పటికి కిచిడీ లంటే ఒకటో రకం సన్న బియ్యమన్న మాట. అన్నం చాలా రుచిగా ఉండేది. ఎక్కువ రోజుల పంట, మంచి బలవర్ధకం అని చెప్పుకొనేవారు.

ఇలా బియ్యంలో శ్రీకారం రాసే నా అలవాటు మా అత్తింటి వాళ్లకి వేరే అర్ధంలో కన్పించింది. కోనేరు పేటలో మా అత్త వారింట్లో కూడా నేనలాగే రాసేదాన్ననే విషయం మరచిపోయారు. నేను స్కూల్లో బిజీ అయిపోయి వాళ్లు వండి పెట్టడమే మహద్భాగ్యం అనుకునే దాన్ని. నాకెప్పుడూ ఊహలోకి కూడారాని విషయం వాళ్లకి తట్టింది. వాళ్లు బియ్యం తీసి అమ్మేసుకుంటారని నేనలా రాస్తున్నానని అందరితో చెప్పడం మొదలు పెట్టేరు.

అలాగే చిట్టబ్బాయిరెడ్డి గారింట్లోంచి, రామబ్బాయి రెడ్డి గారింట్లోంచి చిక్కటి గేదెపాలు ఉదయం, సాయంత్రం వచ్చేవి. బొగ్గుల కుంపటి మీద మరిగి మందంగా మీగడ కట్టేది. ఇంట్లో పాలు, పెరుగు పుష్కలంగా ఉండేవి. మీగడ పెరుగును పిల్లలు చాలా ఇష్టంగా తినేవాళ్ళు. అలా తినని రోజు మజ్జిగ చిలికితే వెలక్కాయంత వెన్న ముద్ద వచ్చేది. ఇంట్లో కాచిన కమ్మని నెయ్యి భోజనాల దగ్గర తప్పని సరిగా ఉండేది. హార్లిక్స్ సీసాలో ఉన్న నెయ్యిలో వేసిన చెంచాకి కూడా వాళ్లు విపరీతార్ధం తీసారు. చెంచా ఎక్కడి వరకూ ములిగిందో నేను కొల్చుకుంటానని అన్నారు.

నిజానికి నా ఆలోచనలెప్పుడూ ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద ఉండేవి కాదు. స్కూలు డెవలప్ చెయ్యడం మీద, నా చదువు మీద ఉండేది. ఇలాంటి విషయాలకి నాలో నేనే ఏడ్చుకుని కన్నీళ్లు తుడుచుకునే దాన్ని. 

అప్పటికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంటు ఉద్యోగులకి పెన్షన్లు ఉండేవి కావట. ఆ సంవత్సరం నుంచి ఇవ్వచ్చు అనుకున్నారట. మోహన్ ఆపని మీద తరచుగా హైదరాబాద్ వెళ్లి వచ్చేవాడు. వాళ్లమ్మ గారికి ఫేమిలీ పెన్షన్ తెప్పించడానికి, అసలే ఖర్చు మనిషేమో ఆ వంకతో ఎడాపెడా అప్పులు చేసేసేవాడు. మొత్తానికి పెన్షను సేంక్షనై  ఎరియర్స్ ఏవో వచ్చినట్టున్నాయి. ఆ వారంలో వెళ్ళిన మా అత్తగారు అక్కడే ఉండిపోయారు. వీకెండ్ కి మోహన్ వెళ్లినప్పుడు తల్లీ కొడుకూ గొడవ పడ్డారట. అంతే, ఆవిడ అక్కడే ఉండిపోయింది. ఆకబురెలా అందిందో తెలీదు – నేను స్కూలు నుంచి లోపలికి వెళ్లే సరికి శాంత, రుక్కు బట్టలు, గిన్నెలు సర్దేసుకున్నారు. నేను తెల్ల బోయి చూస్తూ ఉండగానే చార్జీలకు డబ్బులు అడిగి తీసుకుని వెళ్ళిపోయేరు. ఏడాదిగా అలవాటు పడిన ఇల్లు చిన్నబోయింది.

మోహన్ కి జీతమెంతో తెలీదు. ఆవిడకు పెన్షను ఎంతో తెలీదు. గవర్నమెంటు సర్వీసులకి పెన్షనొస్తుందని కూడా నాకు తెలీని అజ్ఞానం అప్పటికి.

ఆ కొద్ది కాలంలోనూ రుక్కు వల్ల నేను చాలా భయస్తురాలినైపోయేను. ఎదిగిన పిల్ల – రెండు మూడు సార్లు రాజమండ్రి, ఒకసారి సామర్లకోట పారిపోయింది. మోహన్ వెతికి వెతికి తీసుకురావడం. ఆ తప్పు నాదేనని మా అత్తగారు తిట్టడం. దీపావళి రోజు కొత్త టెర్లిన్ వోణీ వేసుకుని మా చిన్నమ్మాయిని చంకనేసుకుని ప్రమిదల పక్కనే నిలబడి మతాబు కాలుస్తోంది. ప్రమిద దీపం వోణీకి అంటుకుని ఒక్కసారిగా మంట ఎగసింది. వాకిట్లో దీపాలు పెడుతున్న నేను ముందు పాపాయిని లాక్కుని, తర్వాత ఓణీ లాగి పడేసాను. అప్పుడు కూడా మా అత్తగారు బాగా తిట్టేరు. “నా కూతురు కన్నా నీ కూతురు ఎక్కువైపోయిందా” అంటూ. ఆవిడలా మాట్లాడ్డం వల్ల రుక్కు చాలా పెంకితనం నేర్చుకుని చేతికందకుండా పోయింది. మరో పక్క ఉత్త అమాయకత్వం.

మొత్తానికి ఏమైతేనేం శాంతకీ, రుక్కుకి కొరుప్రోలు అబ్బాయిల్తో పెళ్లిళ్లు అయ్యేయి.

*****

(ఇంకా ఉంది )

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.