ఇదీ  నా కవిత్వం

– వసుధారాణి

 

నీపై ప్రేమ ఎలాగో

ఈ కవిత్వమూ

అంతేలా ఉంది .

నా ప్రమేయం లేకుండా

నాలో నిండిపోయి

అక్షరాల్లో ఒలికిపోతోంది.

 

కవి అంటే  ఓ వాన చినుకు,

 ఓ మబ్బుతునక

మండేసూర్యగోళం

చల్లని శశికిరణం

కన్నీటికెరటం

ఉవ్వెత్తు ఉద్వేగం

పేదవాడికోపం

పిల్లలకేరింత

కన్నతల్లి లాలిత్యం

గడ్డిపూవు,గంగిగోవు

ఒకటేమిటి 

కానిదేమిటి

కవి అంటే విశ్వరూపం

వేయిసూర్య  ప్రభాతం.

 

గుండెకింద చెమ్మ,

కంటిలోన తడి

ఇవి లేకుండా 

కవిత్వం రాయలేవా ?

ఓ యదార్ధవాది ప్రశ్న.

కనపడని  ఆ నువ్వు

లేకుండా కవితే లేదా ?

ఓ తర్కవాది సణుగుడు.

మీకూ ,నాకూ 

మెదడూ,మనసంత

బేధం మరి .

ఇదే నా సమాధానం.

 

నేను నీ వెంట

అక్షరాలు నా వెంట

కవితల వెల్లువే తోవంతా .

 

నువ్వు  కవివా ?

అవును మహాప్రభో !

కవిత్వంకాక నీ అర్హత ఏమిటి?

“కవిత్వమే” నా అర్హత.

 

ఇప్పటి వరకు వెలగబెట్టింది 

ఏమైనా ఉందా?

ఓ పెద్దమనిషి చిన్న ప్రశ్న.

ప్చ్ ఏమీ లేదు ! నా సమాధానం

మరి ఏమి చేస్తున్నావు ?

పూటకో కవిత రాసుకుని

నా రోజుల్ని ఇలా వెలిగించుకుంటున్నా.

 

*****

 
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.