నువ్వు లేని ఇల్లు

-డా|| కె.గీత

నువ్వు లేని ఇల్లు సాయంత్రానికే డీలా పడిపోయింది

రోజూ ఆఫీసు నుంచి నువ్వెప్పుడొస్తావా

గరాజు ఎప్పుడు తెరుచుకుంటుందా అని

రిక్కించుకుని ఉండే చెవులు

కళ్లని ఓదార్చే పనిలో పడ్డాయి

పగలంతా ఏదో హడావిడిగా గడిచిపోయినా

సాయంత్రం గూటికి చేరే వేళ

నువ్వు కనబడని ప్రతి గదీ

కాంతివిహీనమై పోయింది

నువ్వు వినబడని ప్రతీ గోడా

స్తబ్దమై వెలవెలబోయింది

నీతో తాగని ఈవెనింగ్ కాఫీ

ఖాళీ కప్పై సొరుగులో బోర్లా పడుకుంది  

నీతో సాగని సాయంత్రపు నడక

వెయ్యని బూటై జోళ్ల బల్ల కింద కుక్కపిల్లలా ముడుచుకుంది

ఐదింటికే అతి వేగంగా తరుముకొచ్చిన

శీతాకాలపు చలి చీకటి రాత్రి

నా వెనకే తలుపుల్ని తోసుకుంటూ

ఇంటినాక్రమించి

హృదయమంతా దిగులుగా పరుచుకుంది

గట్టు మీద పూల కూజాలో

వాడిన లతల్లా వేలాడిన తలల్తో

బడి నుంచి ఇంటికొచ్చిన పిల్లలు

సాయంత్రపు బరువు బాధ్యతల్ని  

మోస్తున్న నా భుజాలకి  

చెరో వైపూ జేరబడ్డారు

రోజూ సగానికి మించిన

భారం పంచుకునే  

నీ ఆధారం లేక

సోఫాలో ఇరుక్కుని

చిక్కి సగమయ్యింది నా శరీరం

ఆఫీసు మీటింగులంటూ

ఇంటికొచ్చినా పరుగులెత్తే

నీ అల్లారం టకటకలు లేక

శబ్దం నిశ్శబ్దంగా ఒళ్లు విరుచుకుంది

కంప్యూటరు బల్ల

మాస్టర్ ఈజ్ అవుటాఫ్ స్టేషన్

అని తెలిసినట్టు

సెలవు చీటీని

పేపరు వెయిట్ కింద

మౌనంగా పెట్టింది  

పొయ్యిలో లేవని పిల్లి

ఫ్రిజ్లో పాత కూరల్ని మూచూసి

ముణగదీసుకుంది

మెట్లన్నీ

ఏదో త్వరితంగా

పాదముద్రల్ని పోగేసుకుని  

చెయ్యని వేక్యూమ్ వెనుక

బద్ధకంగా నిద్రకుపక్రమించేయి

క్లాజెట్ సొరుగుల్లోని

నీ వస్తువులన్నీ

ఎన్నాళ్ల నుంచో నిద్రలేనట్టు

ఎక్కడివక్కడే పడి గుర్రుపెడుతున్నాయి

అనుక్షణం నిన్నంటి పెట్టుకుని తిరిగే దేహం

స్పర్శరాహిత్యపు యుగాల  

లెక్కల్లో తలమునకలయ్యింది

దుప్పట్ల మీద దుప్పట్లు కప్పుకున్నా

నీ వెచ్చని కౌగిలి లేక

రాత్రంతా చలి ఎముకల్ని

పరపరా నములుతూనే ఉంది

నువ్వు లేని ఇంట్లో-

దుఃఖం ఒక్కటే

విరహ గీతాన్ని

ఆలపిస్తూ

నా మెడ చుట్టూ

చెయ్యివేసి

దగ్గరకు లాక్కుంది

*****

(ఆర్ట్: శుచి క్రిషన్)

Please follow and like us:

2 thoughts on “నువ్వు లేని ఇల్లు (కవిత)”

Leave a Reply

Your email address will not be published.