కరోనా ఆంటీ (కథ)

-లక్ష్మీ కందిమళ్ల 

మా కిటికీకి చేతులు వచ్చాయి
అవునండీ బాబు 
ఈమధ్య మా హాల్లో కిటికీకి చేతులు వచ్చాయి. 
నిజంగా..నిజం.. 
మా అపార్ట్మెంట్ లో, ప్లోరుకు ఐదు ఇల్లు ఉంటాయి. 
అందునా మా ఇల్లు  ఫస్ట్ ప్లోర్ లో ..  అటు రెండు ఇల్లు, ఇటు రెండు ఇల్లు మధ్యలో మా ఇల్లు. కారిడార్ వైపు హాల్ కిటికీ వుంటుంది. ఆ కిటికీకి  అద్దాలున్న రెక్కలు బయటికి వుంటాయి. ఇంకో జత రెక్కలు మెష్ ఉన్నవి లోపలికి వుంటాయి.” అందునా అటు ఇటు ఇల్లమధ్యలో కాబట్టి  కాస్త గాలి, వెలుగు తక్కువే వుంటుంది. అన్ని తలుపులు మూసుకుంటే ఊపిరాడనట్టుగా వుంటుంది. అందుకే ఈ ఇంట్లోకి వచ్చినప్పుటి నుండి ఆ కిటికీ తెరచి వుంచటం అలవాటైంది. 
ఇప్పటికి ఈ ఇంట్లోకి వచ్చి ఏడు సంవత్సరాలుపైనే అయ్యింది. 
ఎప్పుడూ కిటికీ తెరిచే వుంటుంది.  కానీ ఈమధ్య  కిటికీ మూసుకుంటోంది. నేను  తెరుస్తానా అది మూసుకుంటుంది ఉదయం నిద్ర లేచే సరికి.. కిటికీకి మెష్  ఉండటం వల్ల పగలు కర్టెన్ వేయను వెలుగు కోసం. రాత్రి మాత్రం కర్టెన్ వేస్తుంటాను. రాత్రి పనంతా పూర్తి చేసుకొని నేను పడుకునేదాకా ఆకిటికీ తెరచుకొనే వుంటుంది. నేను ఉదయం లేచే సరికి  మూసుకొని వుంటుంది. ఇదేం చిత్రంరాబాబూ అని ఆశ్చర్యం నాకు. ఏమైనా ఇంట్లో వాళ్ళు మూస్తున్నారా అని అనుమానంతో మా వారిని, పిల్లలను అడిగాను. లేదు మేము ముయ్యలేదు అన్నారు. 
ఇంట్లో వున్నది నేను, మావారు, ఇద్దరు పిల్లలు. ఆ పని చేస్తున్నది ఇంట్లో ఎవరు కాదు. 
మరి ఎలా మూసుకుంటోందబ్బా అనుకున్నాను. 
అక్కడికి వాచ్ మాన్ కారిడార్ ఊడువను వచ్చినప్పుడు ఏమైనా అడ్డమై మూస్తున్నాడేమోనని ‘వాచ్ మాన్’ ను అడిగాను. లేదమ్మా నేను చెత్త ఊడవను వచ్చేసరికే మూసుకొని వుంటోందని అన్నాడు. మరి ఎలా మూసుకుంటోంది. గాలికి ఏమైనా మూసుకుంటోందా అనుకొని. కార్పెంటర్ ను పిలిచి కొక్కీలు పెట్టించాను. అయినా యదా మామూలుగా మూసుకుంటోంది  కొక్కీలు తొలగించి. నాకు మరింత ఆశ్చర్యం కొక్కీలు తీసి మరీ ఎలా మూసుకుంటోంది.  కిటికీకి చేతులు ఏమైనా వచ్చయా..లేక దొంగ లేమైనా ఈ పని చేస్తున్నారా? హమ్మ్..  దయ్యాలు ఏమైనా తిరుగుతున్నాయా?
అనే ఆలోచనలతో నవ్వుకున్నాను  అలాగే ఆందోళన ఎక్కువైంది. 
 
ఏంటి ఈ ఇంట్లోకి వచ్చి ఇన్ని రోజులైంది. ఎన్నడూ లేనిది ఈమధ్య ఈ వింతచర్య అని..కాస్త భయము కల్గింది. అలాగే రోజూ నేను తెరవను అది మూసుకోను.. ఈ పని చేస్తున్న దొంగ ఎవరో తెలుసుకోవాలనే కుతూహలం కూడా లోలోపల”..
***
“పైన ప్లోర్ లో వుండే చైత్ర అప్పుడప్పుడు  ఇంటికి వస్తూ వుంటుంది. ఆ అమ్మాయి చాలా కలివిడిగా, ఆత్మీయంగా,  వుంటుంది.మా అపార్ట్మెంట్ లో అందరితోనూ.. నన్ను అక్కా అంటూ చాలా గోముగా ప్రేమగా మాట్లాడిస్తుంది. తనంటే నాకు అభిమానమే.. అలాగే ఒకరోజు ఇంటికి వచ్చింది. 
 
ఇద్దరం  ఆమాట, ఈమాట చెప్పుకుంటూ.. ఆ మాటల మధ్యలో కిటికీ విషయం వచ్చింది. తను ఆ విషయం విని ఆశ్చర్యపోయింది.. అలా ఎలా అని..తర్వాత మళ్ళీ ఇద్దరం నవ్వుకున్నాము.  కిటికీకి చేతులు వచ్చాయెమోనని.. 
 
***
“ఈ విషయం  ఆ అమ్మాయి అపార్ట్మెంట్ లో మిగతా వాళ్ళతో కూడా అంది. 
విన్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు.. ఇదేం విచిత్రం అనుకొని..
అలాగే మా ప్లోర్ లో మా ఎదురింట్లో వుండే ‘మంధర’ ఆంటి వెళ్ళినప్పుడు ఆవిడతో కూడా అందంట చైత్ర.. ఆంటి మీకు ఇది తెలుసా ‘మనస్విని’ అక్కా వాళ్ళ కిటికీ తెరిస్తే మూసుకుంటుందంట ఉదయానికంతా.. ఎవరు మూయకున్నా అదే మూసుకుంటోంది అని ఆందోళన పడుతున్నారు అంది. 
అప్పుడు ‘మంధర’ ఆంటి అంది. నేనే మూస్తున్నాను నాకు తిరగను ఇబ్బందిగా ఉంది అందంట.. 
ఆ మాట వినగానే ఆ అమ్మాయికి ఆశ్చర్యంతో పాటు కోపమూ వచ్చింది. 
అలా ఎలా మూస్తారు ఇంకొకరి ఇంటి కిటికీని.. 
ఇది సభ్యత అనిపించుకోదు కదా .. 
అయినా మీ ఇంటి కిటికీని ఎవరైనా మూస్తే ఎలా వుంటుంది?
ఇంకొకరు అలా చేస్తే మీరైతే ఊరుకుంటారా? 
వాళ్ళ ఇంటి కిటికీ తెరుచుకోను వాళ్ళిష్టం. 
అయినా కిటికీ వుండేది తెరుచుకోవటానికేగా ఆంటీ..
మరి మీరెందుకు మీ కిటికీలు తెరుచుకున్నారు? మీరు కూడా మూసుకోవాలి కదా? మీ ఎదురింట్లో వాళ్ళకు ఇబ్బంది అవదు? 
అయినా మీరు ఇలా చేయడం ఏమీ బాగాలేదు.
అదీ కాక మీరు చెప్పిన సాకు ఎవరు నమ్మకపోగా మీ ఓర్వలేనితనమే కనిపిస్తుంది.
మనస్విని అక్కకు ఎవరిమీద అనుమానం లేదు. అదీకాక దేనికీ తొందరపడదు కాబట్టే  ఇంకా ఎవరో ఏమిటో ఇలా ఎందుకు జరుగుతుందో అని అనుకుంటూ ఓపికతో, ఓర్పుతో వుంది. 
అదే నేనయితే అపార్ట్మెంట్ అంతా ఈపాటికి  గోల గోల చేసేదాన్ని.
ఈ వయసులో మీకు ఈ పనులేందుకు ఆంటీ? 
అలా ఒకరిని ఇబ్బంది పెట్టి బాధపెట్టటమెందుకు? ఇదేం బాలేదు  అంది చైత్ర.
 
ఆ అమ్మాయికి ఏదైనా ముఖం మీదే చెప్పటం అలవాటు. మనసులో దాచుకోలేదు.ఆ స్థానంలో  నేనున్నా నన్ను కూడా అలాగే అంటుంది.
 
చైత్ర తన వైపే మాట్లాడుతుందనుకొని ఆంటి గబాల్న అనేసింది నేనేనని.అదేదో గొప్ప పనైనట్టు . 
అక్కడ చైత్ర మాటలు తనకు అనుకూలంగా లేకపోయేసరికి ఇక ముఖం ముడుచుకొని గమ్మున తన ఇంటికి తను వెళ్ళిపోయింది.”
 
***
“ఆతర్వాత చైత్ర నన్ను కలిసినప్పుడు నాతో చెప్పింది. 
నాకు చాలా  ఆశ్చర్యంగానూ, బాధగానూ అనిపించింది. ఆవిడ మా కంటే చాలా పెద్దది. కూతుర్లకు పెళ్ళిళ్ళు కూడా చేసింది. 
మనవలు, మనవరాళ్లూ కూడా వున్నారు. ఆవిడ ఇలా చేయడమేంటో?ఆవిడ కూతుర్లతో పాటు నేను కూతురు లాంటిదాన్నే కదా! 
అయినా ఎందుకో మంధర ఆంటి ప్రవర్తన  ముందు నుండి సరిగా ఉండదు. ఒకలా ప్రవహిస్తుంది.  నేను ఎంతో విలువ ఇచ్చి చూశాను. అమ్మ వయసులో ఉందని.అయినా మనిషికి మనిషి విలువ ఇచ్చుకోకుంటే ఎలా అని.. ఆంటీని నేను ఎప్పుడూ గౌరవంగానే చూశాను. కానీ ఆవిడ ఎప్పుడూ ఆ విలువను నిలబెట్టుకోలేదు. ఈ ఇంట్లోకి వచ్చిన కొత్తల్లో తక్కువ భావంతో అర్థం లేని మాటలతో మనసుకు చాలా బాధ కలిగించేది. అలా ఎందుకు మాట్లాడి బాధ పెడుతుందో నాకు అర్ధం అయ్యేది కాదు. ఇదేంటి ఇంట్లో అత్త, ఆడపడుచుల ఆరళ్ళు లేకున్నా ఈవిడ పోరేంటో అనిపించేది. తను ఏపనిచెబితే అది చెయ్యాలి. ఎదుటి వాళ్ళు తన ఆధీనంలో ఉండాలి అనుకుంటుంది. ఇంట్లో వాళ్ళ దగ్గర తన మాట చెల్లదని. బయటి వాళ్ళ దగ్గర తన ప్రతాపం చూపిస్తూ ఉంటుంది.  నాకేమో అలాంటివి నచ్చవు. 
స్నేహంగా.. మంచి చెడుకైతే పరవాలేదు కానీ.. 
ఇలా అనవసర పెత్తనం చేసే వారంటేనే నాకు చాలా చిరాకు. అదీకాక  కులాలను ఎత్తి చూపుతూ హీనంగా  చూస్తుంది. ఆంటీకి ఎదుటి వాళ్ళు సంతోషంగా వుంటే ఓర్చుకోలేదు. ఓర్పు తక్కువే.”
 
***
“ఒకసారి మా ప్లోర్ లో ఉండే  వాసంతి అక్కకూడా అంది ఏదో విషయంగా ఆంటి మాట వచ్చినప్పుడు ఆంటితో చాలా జాగ్రత్తగా ఉండాలి.. వీలైనంత దూరంగా ఉండటం మంచిది ఆవిడతో అంది. 
 
అప్పుడు  నేను అన్నాను అవును అక్కా ఆంటి ఎందుకు అలా ప్రవర్తిస్తారని.. 
 
అవును  ఆవిడ నైజం అలాంటిది.. మేము ఆంటి వాళ్ళు ఒకేసారి వచ్చాము ఇక్కడికి  ఈ ఇంట్లోకిచేరిన కొత్తలో నన్ను చాలా బాధపెట్టారు. అది చేయమంటూ ఇది చేయమంటూ.. ఇంకా తనకు రొట్టె,చెపాతీ చేయను ఓపిక లేక  ప్రతి రోజూ నేను చేసి ఇవ్వాలని నియమం పెట్టారు. నేను పిచ్చిదాన్ని తన నటనను ప్రేమ అభిమానం అనుకొని, రోజూ చేసిచ్చేదాన్ని తన ఇంటికి వెళ్ళి.. ఒకరోజు వంట గది గోడ మోచేతికి తగిలి విపరీతంగా నొప్పి చాలా రోజులవరకు తగ్గలేదు.. అలాంటి పరిస్థితిలో కూడా నన్ను బాగా సతాయించింది రొట్టె చేయాల్సిందే అంటూ అప్పుడే నాకు  అర్థం అయ్యింది తను. ఆతర్వాతే తనకు వీలైనంత దూరంగా  ఉంటున్నాను. తనను దూరంగా ఉంచాకే నేను మనశ్శాంతిగా ఉన్నాను అని అన్నారు అక్క.”
 
***
“అక్క మాటలు విన్నాక 
ఆవిడంటే ఏంటో మరింత  అర్థం అయ్యింది. మావారు కూడా చెప్పారు నా బాధ చూసి..  నువ్వు  ఆవిడను ఎంత దూరంగా వుంచగలిగితే అంత సంతోషంగా వుండగలవు అని. నాకు అదే మంచిదనిపించింది.ఆవిడ మాటలకు  నాకు చాలా  బాధ కలిగి కళ్ళల్లో నీళ్ళు వచ్చేవి చాలా సార్లు. 
 
అందుకే  అంతిమ నిష్టూరం కన్నా, ఆది నిష్టూరం మేలనుకొని.. ఆవిడతో దూరాన్ని పెంచుకున్నాను. 
అయినా ఆవిడ మాటలను తూటాల్లా వదిలేది. 
నేను కనిపించే లోగా.. ఏదైనా  అవసరంకొద్దీ బయటికి వెళ్ళినా అవకాశం తీసుకునేది. ఏదో రకంగా నన్ను బాధ పెట్టాలని.  నేను ఇక ఇలా కాదని తనతో మాట్లాడటమే మానేశాను.తను పలకరించినా పలకేదాన్ని కాదు. మౌనంగా ఇంట్లోకి వచ్చేదాన్ని. 
ఆ తర్వాత కూడా ఆవిడకు ఇంట్లోకి వచ్చి మాట్లాడే అవకాశం ఇచ్చేదాన్ని కాదు.అయినా ఆవిడ నన్ను బాధపెట్టను మార్గాలు వెతుక్కుంటూనే ఉండేది. 
 
అందువల్లే ఆ కసి అంతా ఇలా కిటికీలపై చూపిస్తోందని అర్థం అయ్యింది నాకు. 
 
చైత్ర చెప్పగానే..
ఆవిడను ఈ విషయంగా నిలదీయడము ఎంతో సేపు పట్టదు. కానీ అందువల్ల ఆమెలో ఏమార్పు ఉండదు. ఆ సమస్యను ఇంకాస్త పెంచుకోవటమేతప్ప ఒరిగేదేమీఉండదు. నాకు అప్పుడు  అనిపించింది కరోనాలా  నన్ను నా ఇంటిని ఈ ఆంటీ ఇలా  పట్టుకోందేంటిరా బాబు అని. అదే అన్నాను చైత్రతో నవ్వుతూ.. చైత్ర కూడా నా మాటకు నవ్వుతూ ఇంటికి వెళ్ళిపోయింది.”
 
***
 
ఆతర్వాత మావారు వచ్చాక చెప్పాను. ఇన్ని రోజులు ఆ కిటికీ ఎలా మూసుకుంటుందని కంగారుపడ్డాముగా.. ఇప్పుడు అస్సలు దొంగ దొరికారు.. కాదు కాదు దొరికింది అన్నా నవ్వుతూ.. 
 
మావారు అది విని ఆశ్చర్యంగా, కుతూహలంగా అడిగారు ఎవరు ఎవరు అని.. 
 
ఇంకెవరో కాదండీ ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ నన్ను ఇబ్బంది పెట్టే ఆ ఎదురింటి మంధర ఆంటీనే.. 
 
చైత్ర వాళ్ళ ఇంటికి  ఆవిడ వెళ్ళినప్పుడు చైత్ర అందంట  మన కిటికీ విషయం.. అప్పుడు ఆవిడే చెప్పిందంట నేనేనని. 
 
నేను చెప్పిందంతా విని ఆయన నవ్వారు.. నిజమే నువ్వన్నట్లుగా  ప్రపంచమంతా  కరోనా బయపెడుతుంటే.. ఇన్ని రోజులు మనను ఈ ఆంటీ బయపెట్టారు కదూ అని. 
 
అవునండీ ఆ కరోనాను ఎవరు ఎలా నిర్మూలిస్తారో కానీ.. ఈ కరోనాను మనమే నిర్మూలించుకోవాలి. 
 
ఆ కరోనా మనిషిని చంపుతుంది. 
 
ఈ కరోనా మనసును చంపుతుంది.
 
అందుకే ఈ ‘కరోనా ఆంటీ’  వైరస్  మనవైపు రాకుండా ఉండాలంటే మనం తక్షణం ఆ కిటికీ మూసేయాలి. అంటూ ఆ కిటికీని మూసేశాను. గుండె నిండా ఊపిరి తీసుకుంటూ ప్రశాంతంగా……

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి
Please follow and like us:

11 thoughts on “కరోనా ఆంటీ (కథ)”

  1. చివరి వరకు ఏక బిగిని చదివింపచేసే చక్కని కథనం
    _డా. పిబిడివి ప్రసాద్

  2. కథ బాగుంది.
    కొందరి మనస్తత్వాలను బట్టబయలు చేస్తూ, కొంత చమత్కారంతో.

Leave a Reply

Your email address will not be published.