అనాఘ్రాత (కవిత)

-జయశ్రీ మువ్వా

ఊరికి చివరన
చితికిన వర్ణం విరగపూసింది
సింధూరం దిద్దుకున్న రేరాణి
ఇక్కడ పతిత  
పాపాల పావని
 
నిదురనెపుడో 
రేయంచుకు విసిరేసి
నలుపు రంగు సలపరించే యామిని
 
గంటలెక్కన 
ఇక్కడ 
గాయాల గుమ్మాలు 
ఎప్పుడూ తెరిచే వుంటాయి
ఉమ్ముతో 
మలాము అద్దుకోడం
అలవాటు పడిన అద్వంద్వ
 
ఆకలి మంటని 
ఆర్పుకోలేక
కన్నీటి కాష్టాన్ని
కైపుగా రాజేసుకునే 
నెరజాణ
 
ఇంత బతుకులో 
వేల నిశ్శబ్ధ యుద్ధాల
భేరిని
మునిపంట  మ్రోగించే
మంజరి
 
గుప్పెడు పొట్టకి 
బతుకుని వెక్కిరించే ఆకలెందుకో
 వెకిలి సైగల వెనక 
వెతల కుంపటి ఒకటుంది
కోర్కెల కోరల విషం మింగిన 
దిగంబరి
 
తనది కాని నిదురలో 
తానో స్వాప్నిక
 
వీర్యాన్ని ఓపలేని వాడు 
వీరుడిక్కడ
తనని తానే ఆడి ఓడే
ఆమె 
 ఓ 
అనాఘ్రాత

*****

ఆర్ట్: మన్నెం శారద

Please follow and like us:

One thought on “అనాఘ్రాత (కవిత)”

  1. వీర్యం ఓపలేనివాడు వీరుడిక్కడ..
    ప్రతీ స్టాంజా ఆమెకు అద్దంపడుతోంది
    చాలా బావుంది జయగారు

Leave a Reply

Your email address will not be published.