అభేద్యారణ్యం 

కె.వరలక్ష్మి

ఇల్లు వదిలి
ఇంత దూరమొచ్చానా
ఏరు దాటి
కొండ ఎక్కి దిగి
ఆవలి వైపు
అక్కడా
వాగూ వంకా
ఎడ తెగని వాన
మనసు మబ్బుల్లో
కూరుకుపోయి
దుఃఖం కరిగి నీరై
కురుస్తున్న వాన
కీకారణ్యంలో
ఎన్నెన్నొ
మూగజీవులున్నై
పలకరించే పెదవి
ఒక్కటీ లేదు
బయలుదేరినప్పటి
ఉత్సాహం ఉద్వేగం
ఆవిరై పోయాయి
ఎక్కడ ఉన్నానో
ఎరుక లేనిచోట
ఒక్క పూపొదైనా
పరిమళించని చోట
జీవితం
శూన్యపుటంచుకి
చేరుకుంటోంది
బాల్యం నుంచి నేరుగా
వృద్ధాప్యం లోకి
పయనిస్తోంది
కాంక్రీటు అరణ్యం మీద
కోయిలకు బదులుగా
తీతువు కూస్తోంది
అప్పుడెప్పుడో నివసించిన
పిచ్చుకల గూళ్ళు
పావురాల ఆవాసాలు
కిచకిచల్ని
కువకువల్ని
శూన్యం తో నింపుకొని
మ్లాన మౌన మౌతున్నాయి
అసలేమిటీ నిశ్శబ్దం
ఎక్కడా మనిషి
జాడ కనపడదు
పిలుపు వినపడదు
ఎక్కడో నదులు పొంగుతున్నాయి
సముద్రం గర్జిస్తోంది
పచ్చని పొలాలమీద
సుడిగాలి చుట్టిచుట్టి
చెరువుల్లో నీళ్లను
మబ్బుల్లోకి విసిరేస్తోంది
ఇదేమి విలయతాండవం
ఇదేమి వింత తాండవం
వినిపించని విపత్తు
కనిపించడమూ లేదు
ఎక్కడినుంచొచ్చి
ఎక్కడ చిక్కుకుపోయాను
కన్ను తెరిస్తే
నా గూడు గుర్తుకొస్తోంది
నేను పెంచిన
వనం గుర్తుకొస్తోంది
మామిడిచెట్లు
కాయలు పళ్ళయి
నేల రాల్చి ఉంటాయి
నా కోసం చూసిచూసి
నారికేళాలు
కన్నీటి కాయల్ని
ఆగి ఆగి
భూమికి అర్పిస్తూ ఉంటాయి
ఉసిరి పనస
నిమ్మ నేరేడు
సపోటా నారింజ
మల్లె విరజాజి
మరువం సన్నజాజి
మాధవి మందారాలు
గన్నేరు దేవకాంచనం
పరిమళాల పారిజాతం
సంపెంగ గులాబి
బొడ్డుమల్లె బులుగుపూలు
మెట్టతామర చిట్టిచేమంతి
పేరు పేరునా
గుర్తుకొచ్చి
ప్రాణానికి గాలం వేసి
పిలుపుల శుభలేఖలు
పంపుతున్నాయి
వెనక్కి పోవాలని
వెను తిరిగానా
దారి మారిపోయింది
నదికీ నదికీ మధ్య
అందరాని
పర్వతముంది
అభేద్యాలైన
అడవులున్నాయి
నడక దారి మాయమైంది
నా మనసు దారి మాత్రమే
స్పష్టంగా కనపడుతోంది
అలసి సొలసిన
నిసర్గ స్థితిలో
ఆత్మాన్వేషణ లో
వ్యగ్రత నిండిన
శూన్య వ్యాకులత లో….

*****

ఆర్ట్: మన్నెం శారద

Please follow and like us:

4 thoughts on “అభేద్యారణ్యం (కవిత)”

  1. చివరకు మిగిలేది ఆత్మాన్వేషణని ఎంతందంగా..చెప్పారో మేడం గారు
    మీ కవిత లోని గాఢత మనసును పట్టి లాగేస్తోంది.

  2. మన్నెం శారద గారి ఆర్ట్ ఎంత బావుందో !

  3. ప్రతీకాత్మక పోయెం. బాగుంది మేడమ్ గారు

Leave a Reply

Your email address will not be published.