ఒకానొక బంధిత గేయం! (కవిత)

-డి.నాగజ్యోతిశేఖర్

నెత్తుటి వాగొకటి  హృదయసంచిని చీల్చుకొని పోటెత్తింది!

కొంచెం కొంచెంగా ఘనీభవిస్తున్న స్వప్న దేహాలు

మౌనంగా రోదిస్తున్నాయి!

పురాతన గోడల్లో చిక్కుకున్న

ఉనికివిత్తు ఊపిరాడక కొట్టుకుంటుంది!

బొట్టు బొట్టుగా విరుగుతున్న ప్రాణధారలు గాజుద్వీపంలో

ఆఖరి పాటను లిఖిస్తున్నాయి!

ఎక్కడో గుండెలోయల్లో వెలిగించుకున్న ఆశలదీపంపై

రాబందు రెక్కల నీడ పరుచుకుంది!

శూన్యాకాశపు అంచుల్లో  చీకట్లు వాటేసుకుని

మనస్సు మబ్బులు మసకబారుతున్నాయి!

నిన్ననే వచ్చిన వసంతం

వేసంగి సెగ తగిలి

కన్నీటి కొవ్వొత్తై కరుగుతున్నది!

ఒంటరి వెతల మన్నులో కూరుకున్న ఉదయాలు

వేదన సమాధుల్ని తవ్వుతున్నాయి!

ఎక్కడైనా ఇంత చోటుందా…?

దేహపుష్పాన్ని

వెన్నెలమాటున దాయడానికి!

కాస్త నవ్వుల పుప్పొడిని పూయడానికి!

వెతకగలవా…

భయంతో పరిగెత్తుతున్న

ఆ చిగురుపాదముద్రల్ని!

శకలాలౌతున్న వ్యధాబతుకు

కన్నీటి జాడల్ని!

నీకేమైనా కనిపిస్తే …

కాస్త ఆర్ద్రత

చేతులకు పూసుకుని ఆ నెత్తుటి వాక్యాలను ఎత్తుకోగలవా??!

రాత్రి నన్ను మింగేసింది!

దుఃఖ వస్త్రంలో చుట్టేసింది!

విడిపించుకోలేకున్నా!

ఒక నిండు పున్నమిని

ఒకే ఒక్కసారి నీ గుండెకు పూసుకుని

ఈ అమావాసలను

చెదరగొట్టవా!

నలిగిన ఆత్మ ఆకుపచ్చ వాక్యమై మొలకెత్తడం చూస్తావు!

నువ్వు మరిచిన మానవత్వం నిలువెత్తు

కెరటమై నిన్ను తనలోకి లాక్కోవడం అనుభూతి చెందుతావు!

విముక్త గీతమై జనిస్తావు!

అమ్మతనాన్ని పీల్చే రుధిరముళ్లను విరిచి

నువ్వొచ్చిన గర్భాలయం

ఎదుట ఒక చిన్ని సంస్కార దీపం వెలిగించు చాలు!

*****

ఆర్ట్: మన్నెం శారద

Please follow and like us:

3 thoughts on “ఒకానొక బంధిత గేయం!(కవిత)”

  1. ఉనికి విత్తు ఊపిరాడక కొట్టుకుంటోంది, నాగజ్యోతి గారు అస్తిత్వ పోరాటాన్ని ఇంకెవరయినా ఇంతకన్న బాగా చెప్పగలరా అని సందేహం.. అత్యద్భుతంగా ఉంది మీ కవిత

Leave a Reply

Your email address will not be published.