నువ్వేంటి…నా లోకి…(కవిత)

-ఝాన్సీ కొప్పిశెట్టి

నువ్వేంటి

ఇలా లోలోకి..

నాకే తెలియని నాలోకి…

నేనేమిటో

నా పుట్టుక పరమార్ధమేమిటో

ఏ పుట్టగతులనాశించి పుట్టానో

అసలెందుకు పుట్టానోనన్న అన్వేషణలో నేను…

గాలివాటుతో ఊగిసలాడే నా చంచల చిత్తం

సత్యాసత్యాల చిక్కుముడిలో చిక్కడిన

నా అంతరంగం

వాటిపై జరిగే అనేకానేక దురాక్రమణలు

నా ఉనికితనపుటంచుల్లో భయాందోళనలు

నా తెలిసీ తెలియనితనపు తప్పటడుగులు…

నా మకిలంటిన మనసుకి విహ్వలించిన నేను

నన్నథిక్షేపించే నాపై నేనే ప్రకటించుకునే యుద్దాలు

నాలో నేనే సాగించే శాంతియాత్రలు..

అయినా చేయువాడు చేయించెడివాడు

సర్వం వాడేనని

చేసిన తప్పిదాలన్నీ వాడి చిట్టాలో కెక్కించి

దారి చూపే కాపరిదే తప్పు కాని

గుడ్డిగా సాగే నా గొర్రెతనానిది కాదని

నేను నిమిత్తమాత్రురాలినని బుకాయించుకునే నేను

ప్రమాణపూర్తిగా…

అసలు నేను ఏమిటన్న శోధనలో 

మిధ్యానిజాల మధ్య జ్వలిస్తున్న 

నాలోకి…

నువ్వేంటి

ఇలా లోలోకి

నాలోకి….

*****

ఆర్ట్: మన్నెం శారద

Please follow and like us:

20 thoughts on “నువ్వేంటి…నా లోకి…(కవిత)”

  1. నెచ్చెలి సంపాదకులు Dr గీతా మాధవిగారికి కవితకనుగుణంగా చిత్రాన్ని సమకూర్చిన మన్నెం శారద అక్కయ్యకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు

  2. నెచ్చెలి సంపాదకులకు కవితకనుగుణంగా చిత్రాన్ని సమకూర్చిన మన్నెం శారద అక్కయ్యకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు

  3. ఝాన్షి గారు చాలా బాగా రాసారు మీకు అభినందనలు … 🙏

  4. నాలోకి.. నువ్వు.. చాలా బాగుంది.. మేడమ్.. నాలోకి..నా అంతరంగం లోకి…తద్వారా జీవితంలోకి.. ఎవరోయి..నువ్వు

Leave a Reply

Your email address will not be published.