హేళన తగదు

-ఆదూరి హైమావతి

అనగనగా ఒక అడవి. ఆ అడవిలో చిన్న చితకా జంతువులూ, పక్షులూ అన్నీ ఎవరి పాటికి అవి జీవిస్తున్నాయి.

ఆ అడవి గుండా ప్రవహించే గౌతమీ నదీపాయ వాటి దాహానికి ఆధారంగా ఉండేది. అన్నికాలాల్లో ఆ నదిలో నీరు పారుతుండటం వారి పాలిటి వరమైంది. 

 ఆ అడవి జీవులకు ఒక నియమం ఉంది.  ఎవ్వరూ ఎవ్వరి జోలికీ వెళ్ళ కుండా ఎవరిపని వారు చూసు కుంటూ హాయిగా జీవించేవి. ప్రతి పౌర్ణమి కీ  అవి సమావేశమై ఏవైనా ఇబ్బందులుంటే పరస్పరం చెప్పుకునేవి. వాటి నివారణకు ఒక ప్రణాళికవేసుకునేవి.

 అన్ని జంతువులూ, పక్షులూ వారి సమూహంతో కలసి సమావేశానికి హాజరయ్యేవి.

ఒక పౌర్ణమి  రోజున ఆ అడవిలో జంతువులన్నీ  ఒక పెద్ద మఱ్ఱి వృక్షం  క్రింద  సభ పెట్టు కున్నాయి.

 ఆ సభ జరగడంచూసి, ఆ అడవిలో కొత్తగా నివసించను కొద్దికాలం క్రితమే వచ్చిన  ఒక దోమ కూడా ఆ జంతువుల సభలో వెళ్ళికూర్చుంది. 

దాన్ని  చూసి జింతువులన్నీ పగలబడి నవ్వి, ఎగతాళి చేశాయి.

 “ఏంటీ నీవూ ఒక జంతువ్వే! ఏ ముఖం పెట్టుకుని మా సభకు వచ్చావ్? అసల నీవు ఒక

జంతువ్వని ఎలా అనుకుంటున్నావ్? ఎవరు ఆహ్వా నించారని వచ్చావ్? మా పరువు తీయను వచ్చావా? వెళ్ళు వెళ్ళు.పక్షుల సభకు వెళ్ళు. ఎగిరే వన్నీఅక్కడ సభ చేసుకుంటున్నాయ్!” అనివెక్కిరించాయి. వెళ్ళమని హేళనచేశాయి

 దోమ తలవంచుకుని ఎగురుకుంటూ వెతుక్కుంటూ వెళ్ళి అడవిలో ఒక పక్కన  ఉన్న మరో పెద్ద వట వృక్షం క్రింద జరుగుతున్న పక్షుల సభకు వెళ్ళి కూర్చుంది. పక్షులన్నీ దాన్ని చూసి పక పకా నవ్వాయి.

” ఏంటీ! నీవూ ఓ పక్షివే! మాతో సమానమే! కొత్తగా

వచ్చినట్లున్నావ్ ఇక్కడికి. నీవూ మాలా పక్షివని మా సభకు వచ్చావ నుకుంటాం! ఇక్కడ ఉండి మాకు అవమానం తేకు. కీటకాల సభకు వెళ్ళు .అడవిచివర జరుపు కుంటున్నాయి సభ.” అని గేలి చేశాయి. 

 పాపందోమ అవమాన భారంతో ఎగిరి వెళ్ళి అడవి చివర ఉన్న ఒక  ఊరి దగ్గరి చెట్టుక్రింద జరుగతున్న కీటకాల సభకు వెళ్ళింది. 

 కీటకాలన్నీ దోమను ఆహ్వానించి, ఉచితాసనం చూపాయి.

దోమ ” ఓ మిత్రులారా!నేను జంతువుల సభకు వెళితే వెళ్ళి పొమ్మన్నాయి. పక్షుల సభకు వెళితే అవమాన పరిచాయి, ఇక్కడికి వచ్చాను. మీరు ఆహ్వానించారు పెద్ద మనస్సుతో గౌరవిస్తున్నారు. ధన్యవాదాలు మిత్రు లారా!”అంది దోమ.

కీటకాల్లోకంతా పెద్దదైన  సీతాకోక చిలక ” మిత్రమా! ఎవరి జాతిలోనే వారికి గౌరవం. స్థలము, కాలము మారి తే ఎవరికైనా గౌరవం దక్కదు.’ మిత్రమా!నేను మానవు లు వేసి పెంచుకునే పూల మొక్కల వద్దకు  , కూర గాయలమొక్కల వద్దకు , పండ్లమొక్కలవద్దకూ  మకరందంకోసం  వెళుతుంటాను.అక్కడ వారిమాటల విని కొన్ని విషయాలు గుర్తుపెట్టుకుంటాను. ఒక మాట ఏమంటే ‘ పరవస్తుచిన్నయ సూరి అనే ఒక మహానుభావుడు తన ‘ నీతి చంద్రిక ‘లో ఇలా చెప్పాడుట. ‘నరుల నఖముల, కేశముల [మానవుల గోళ్ళు, తలవెంట్రుకలు] స్థాన భ్రంశమైతే  గౌరవం కోల్పోతాయని. ఇహ మనమెంత! కనుకమనం ఎల్లప్పుడూ మనతోటి వారితో మాత్రమే అంటే మన సమూహం వారితో మాత్రమే కలసి ఉండాలి.వియ్యానికైనా కయ్యానికైనా సమానత్వం ఉండాలట. పెద్దవారితో విరోధమూ, స్నేహమూరెండూ పనికిరావు మిత్రమా! అందువలన నీవు మాతోనే ఉండు. మనమంతా కీటకజాతి . మనం అంతా ఐకమత్యంగా ఉందాం.” అంది.

దానికి సమాధానంగా మిడత ” మిత్రులారా! మన అవసరం కూడా అందరికీ ఉంటుంది. ఐతే మన

దోమ తాను జంతువుల జాతికి ఏదైనా సాయం చేస్తే అవి దోమ గొప్పదనాన్ని  గుర్తిస్తాయి. అపుడు దోమకు జరిగిన అవమానం తీరుతుంది. ఆమె మనసు కుదుట బడుతుంది. మనసు శాంతిస్తుంది” అంది.

కీటకాలన్నీ అవునన్నట్లు తలలు ఊచాయి. తగిన అవకాశం కోసం ఎదురుచూస్తున్నాయి, ముఖ్యంగా దోమ కాచుకునుంది.

ఒక రోజున అడవిలోని ఒక పెద్దఏనుగు నిద్ర పోతుండగా ఒక వేటగాడు దూరం నుంచీ రావడం

చూసింది దోమ. వెంటనే తన సమూహాన్నంతా పిలిచింది. ఏనుగు చెవుల చుట్టూ చేరి , చెవిలోకి దూరి పెద్దగా రొద చేయసాగింది ఆ దోమల గుంపు.

 ఆ రొదకు  ఏనుక్కి  పిచ్చికోపం వచ్చింది. నిద్ర లేచింది. ఎదురుగా ఉన్న వేటగాడిని చూసింది.

తన తొండంతో వాటంగా పట్టుకుని ఎత్తి కొట్టింది. మరోమారు పట్టుకుని నేలకేసి కొట్టింది. ఆ దెబ్బకు వాడు ఎగిరి దూరంగా పడి ,కాళ్ళువిరిగి  ఎలాగో లేచి బ్రతుకు జీవుడా అని కుంటు కుంటూ అడవి

బయటికి వెళ్ళిపోయాడు. 

 తనను నిద్రనుంచి లేపి వేటగాని పాలపడకుండా కాపాడిన దోమలన్నింటికీ  కృతజ్ఞత చెప్పింది ఏనుగు నిండు మనస్సుతో.

  అప్పుడు  జంవుల కంతా తెలిసివచ్చింది.’ఎంత చిన్నవానితో నైనా ఎప్పుడో ఒకప్పుడు అవసరం పడుతుదని ఎంత చిన్న జీవైనా పెద్ద వాటికైనా సాయం చేయగలదనీనీ.’

 జంతువులన్నీ  దోమకు ధన్యవాదాలూ చెప్పి, దుడుకు గా మాట్లాడినందుకు క్షమాపణ కోరాయి. ఇహ మీద అడవిలో నివసించే జీవులన్నీ కలసి ఒకే ఒక సమావేశం ఏర్పాటుచేసుకుందామని నిర్ణయించాయి. కలసిముంటే కలదు సుఖం, వేరుపడటం వ్యధలకే. మంచిదికాదు. ఐకమత్యమే మహాబలం ‘ అని తెల్సుకున్నాయి. 

 చూశారా! ఎవరికైనా, ఎంతటి వారికైనా  ఏదోఒక సమయంలో ఎవరితో నైనా చిన్న వారు కావచ్చు, పెద్దవారు కావచ్చు ధనిక, పేద, ముసలీ, ముతక, ఆడమగ అనే విచక్షణ లేక అందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఇతరులతో అవసరం పడుతుందని విశ్వసించాలి.  ఎవ్వరినీ అవమానించడం, తిరస్కరించడం ఎన్నడూ చేయరాదు. హేళన చేయడం అసలేతగదు. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.