అనుసృజన

నిర్మల

(భాగం-8)

అనుసృజన:ఆర్. శాంతసుందరి 

హిందీ మూలం: ప్రేమ్ చంద్

మూడు రోజులు గడిచినా తోతారామ్ ఇంటికి రాలేదు.రుక్మిణి రెండు పూటలా ఆస్పత్రికి వెళ్ళి మన్సారామ్ ని చూసి వస్తోంది.పిల్లలిద్దరూ అప్పుడప్పుడూ వెళ్తున్నారు,కానీ నిర్మల ముందరి కాళ్ళకి కనిపించని బంధం! ఆడబడుచుని అడిగితే ఎత్తిపొడుస్తూ ఏదో ఒకటి అంటుంది.పిల్లలు సరిగ్గా చెప్పలేకపోతున్నారు.

ఒకరోజు జియారామ్ రాగానే అతన్ని మన్సారామ్ పరిస్థితి ఎలా ఉందని అడిగింది.మొహం వేలాడేసుకుని,” ఇద్దరు ముగ్గురు డాక్టర్లు వచ్చారు.ఏం చెయ్యాలని సంప్రదింపులు జరిగాయి.ఒక డాక్టర్ అన్నయ్యకి రక్తం ఎక్కించాలని అనటం విన్నాను.నాన్నగారు తన రక్తమ్ తీసుకోమన్నారు,కానీ డాక్టర్ నవ్వి,మీది పనికిరాదు.యుక్తవయసున్న వాళ్ళ రక్తం కావాలని అన్నాడు. నాలుగంగుళాలు పొడుగున్న సూదితో అన్నయ్య జబ్బలోకి ఏదో మందు ఎక్కించారు.నాకు కళ్ళు తిరిగాయే కాని అన్నయ్య కిక్కురుమనలేదు,” అన్నాడు.

అతి ముఖ్యమైన నిర్ణయాలు ఆవేశం లోనుంచే పుడతాయి.ఇప్పటివరకూ ఆస్పత్రిలో అడుగుపెట్టేందుకే భయపడుతున్న నిర్మల మొహంలో గట్టి నిర్ణయం కనిపించింది.మన్సారామ్ కి తన రక్తం ఇవ్వాలని నిశ్చయించుకుంది.అతని ప్రాణాలు రక్షించేందుకు తన చివరి రక్తం బొట్టు దాకా సంతోషంగా ఇచ్చెయ్యగలనని అనుకుందామె.ఇక ఎవరేమనుకున్నా లెక్క చెయ్యదల్చుకోలేదు.వెంటనే ఇక్కా(ఒంటి గుర్రబ్బండి) పిలిపించుకుని ఆస్పత్రికి వెళ్ళేందుకు సిద్ధమైంది.

ఆమె ఆస్పత్రికి చేరుకునే సరికి దీపాలు పెట్టే వేళయింది.డాక్టర్లు ఆసారికి వెళ్ళిపోయారు.మన్సారామ్ జ్వరం కాస్త తగ్గుముఖమ్ పట్టింది.అతను పడుకుని గుమ్మం వైపు కన్నార్పకుండా చూస్తున్నాడు.ఇంకా ఒంటిమీద స్పృహ పూర్తిగా లేదు తను ఎక్కడున్నాడో,ఎలా ఉన్నాడో కూడా తెలీని పరిస్థితి.

హఠాత్తుగా నిర్మల కనిపించేసరికి ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు.సమాధి స్థితి నుంచి బైట పడ్డవాడిలా పాలిపోయిన అతని మొహంలో కాంతి కనిపించింది.కళ్ళు విప్పార్చి ఆమెకేసి చూసి మరుక్షణం మొహం తిప్పేసుకున్నాడు.

నువ్విక్కడికెందుకొచ్చావు?” అన్నాడు తోతారామ్ కర్కశంగా.

నిర్మల అవాక్కయింది.ఏం చెప్పాలో తెలీలేదు.అంత సరళమైన ప్రశ్నకి కూడా ఆమె దగ్గర జవాబు లేకపోయింది.అసలు ప్రశ్నకి అర్థం ఏమిటి? సొంత మనిషి జబ్బు చేసి ఆస్పత్రిలో ఉంటే చూసేందుకు వచ్చిందని అడక్కుండానే అర్థం చేసుకోవాలి కదా? ఆమె మ్రాన్పడిపోయినట్టు నిలబడింది.పిల్లలు తండ్రి విపరీతంగా బాధపడి కన్నీరు మున్నీరవుతున్నాడని చెపితే ఆయన మనసు ఇప్పుడు నిర్మలంగా ఉండి ఉంటుందనుకుంది.అపోహలు తుడిచిపెట్టుకు పోయుంటాయని ఆశించింది.కానీ అది తన భ్రమ అని ఇప్పుడు తెలిసింది.కన్నీళ్ళ వర్షం అనుమానమనే జ్వాలని ఆర్పలేకపోయిందని తెలిస్తే అసలు తను వచ్చేదే కాదు.ఇంట్లోనే కుళ్ళి కుళ్ళి బాధపడేది.

తోతారామ్ మళ్ళీ రెట్టిస్తూ,” ఎందుకొచ్చావిక్కడికి?” అన్నాడు.

మీరిక్కడికి ఏం చెయ్యాలని వచ్చారు?” అంది తొణక్కుండా.

ఆయన ముక్కుపుటాలు కోపంతో పెద్దవయాయి.మంచం మీంచి లేచి నిర్మల చెయ్యి పట్టుకుని కటువుగా,” నువ్విక్కడికి రావటం అనవసరం. నేను పిలిచినప్పుడు వద్దువు గాని, అర్థమైందా?” అన్నాడు.

అంతవరకూ మంచం మీదనుంచి లేచేందుకు కూడా ఓపిక లేనట్టు పడుకుని ఉన్న మన్సారామ్ ఒక్క ఉదుటున లేచి నిర్మల కాళ్ళమీద పడి వెక్కి వెక్కి ఏడవసాగాడు.అలా ఏడుస్తూనే,”అమ్మా, దౌర్భాగ్యుడి వల్ల మీరు పడరాని పాట్లు పడ్డారు.మీరు నా మీద చూపించిన స్నేహాన్ని ఎప్పటికీ మరిచిపోలేను.దేవుణ్ణి ఒకటే వేడుకుంటున్నాను.మరో జన్మంటూ ఉంటే మీ కడుపునే పుట్టించమని దేవుణ్ణి వేడుకుంటున్నాను. రకంగా మీ రుణం తీర్చుకోగలుగుతాను.నేనెప్పుడూ మిమ్మల్ని సవతి తల్లిగా భావించలేదు.మీరు నా కన్నతల్లే అనుకున్నానుఅమ్మా , ఇక మాట్లాడే ఓపిక లేదు.ఇదే మనం ఆఖరి సారి కలుసుకోవటం అనుకుంటున్నానమ్మా !నన్ను మన్నించండి…” అన్నాడు మన్సారామ్.

నిర్మల ధారాపాతంగా కారుతున్న కన్నీళ్ళని ఆపుకోవాలని ప్రయత్నిస్తూ ,”ఎందుకిలాంటి మాటలు మాట్లాడుతున్నావు? నాలుగు రోజుల్లో నయమై ఇంటికి వచ్చేస్తావు,” అంది.

ఇక నాకు బతకాలని లేదు.మాట్లాడే శక్తి కూడా క్షీణించింది…  “అంటూ మన్సారామ్ అక్కడే నేలమీద వెల్లికిలా పడుకున్నాడు.

నిర్మల ఏమాత్రం బెదరకుండా భర్తని చూస్తూ,” డాక్టర్లు ఏమన్నారు?” అని అడిగింది.

అందరూ నల్లమందు తిన్నట్టున్నారు.రక్తం ఎక్కించాలని అంటున్నారు,” అన్నాడాయన.

అంటే రక్తం ఎక్కిస్తే బతుకుతాడన్నారా?”

తోతారామ్ నిర్మలకేసి కళ్ళెర్రజేసి చూస్తూ,” నేనేం దేవుణ్ణి కాను.డాక్టర్లు కూడా దేవుళ్ళని అనుకోను,”అన్నాడు.

రక్తం దొరకటం అంత కష్టమేమీ కాదు. నేనిస్తాను రక్తండాక్టర్లని పిలవండి.”

నువ్వా?” అన్నాడు తోతారామ్ ఆశ్చర్యంగా.

అవును,ఏం నా రక్తం పనికిరాదా?”

నువ్వేం ఇవ్వక్కర్లేదు.ప్రాణం పోయే ప్రమాదం ఉంది.”

నా ప్రాణం ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఉపయోగపడుతుంది?”

తోతారామ్ కళ్ళు చెమర్చాయి,” లేదు నిర్మలా,నా కళ్లలో నీ విలువ ఎన్నో రెట్లు పెరిగిపోయింది.ఇన్నాళ్ళూ నువ్వు నా కోరిక తీర్చే దానివనుకున్నాను,ఇప్పుడు నీ మీద భక్తిభావం కలుగుతోంది.నేను నీ పట్ల చాలా అన్యాయంగా ప్రవర్తించాను, నన్ను క్షమించు!” అన్నాడు.

జరగవలసింది జరిగిపోయింది.డాక్టర్లు నిర్మల రక్తం పరీక్షించి, పనికొస్తుందని తీసుకుంటూ ఉండగానే మన్సారామ్ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు.బహుశా ఇంతకాలం నిర్మల కోసమే అతని ప్రాణం పోకుండా ఉన్నదేమో.ఆమె తప్పు చెయ్యలేదని నిరూపించందే అతను ప్రాణం ఎలా విడుస్తాడు? అతని కోరిక నెరవేరింది.తోతారామ్ మనసులోని అనుమానం తీరి ఆయనకి భార్య మీద పూర్తి నమ్మకం ఏర్పడింది.కానీ అదెప్పుడు జరిగింది? వింటిని వదిలి బాణం దూసుకెళ్ళాక.ప్రయాణీకుడు గుర్రమెక్కి వెళ్ళిపోయాక.

***

పుత్రశోకం తో తోతారామ్ జీవితం దుర్భరమైపోయింది. రోజు తరవాత ఆయన నవ్వటం ఎవరూ చూడలేదు.జీవితం వ్యర్థమనిపించటం ,పని మీద దృష్టి నిలవకపోవటం చేత ఆయన కేసులేవీ తీసుకోటం లేదు.కాస్త మార్పు కోసమే కోర్టు కెళ్ళి వస్తున్నాడు.

భోజనానికి కూర్చుంటే ముద్ద గొంతు దిగటం లేదు.మన్సారామ్ గదివైపు చూస్తే చాలు గుండె చెరువైపోతోంది. చిన్నవాళ్ళైనా, ముసలివాళ్ళైనా ఎవరికెప్పుడు మరణం వస్తుందో ఎవరూ చెప్పలేరు.కానీ  తనవల్లే కొడుకు ప్రాణాలు పోయాయన్న బాధ ఆయన్ని తినేస్తోంది. సంఘటన గుర్తొస్తే చాలు గుండె పగిలిపోయేంత బాధ కలుగుతుంది.

నిర్మల భర్త బాధ చూసి పాత రోజుల ప్రస్తావనే తీసుకురాకండా జాగ్రత్త పడుతోంది.ఆమెకి ఆయన్ని చూస్తే జాలేస్తోంది.నిర్మల దగ్గర మన్సారామ్ జ్ఞాపకాలని నెమరు వేసుకునేందుకు ఆయనకి మొహం చెల్లటం లేదు.లోలోపలే అలా కుమిలిపోతూ, తన మన్సులోని బాధని పంచుకునేవాళ్ళు కరువై తోతారామ్ ఆరోగ్యం రోజు రోజుకీ క్షీణించటం మొదలుపెట్టింది.

*****

(ఇంకాఉంది) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.