యదార్థ గాథలు

-దామరాజు నాగలక్ష్మి

కష్టాలకు కళ్ళెం

విరిత, వాళ్ళన్న శేఖర్ ఎప్పుడూ ఒక్కక్షణం కూడా విడిచి వుండేవారు కాదు. బి.టెక్. చదువుతున్న విరితకి ఏ సందేహం వచ్చినా శేఖర్ చిటికలో దాన్ని తీర్చేవాడు. ఇద్దరికీ ఒకళ్ళంటే ఒకరికి చాలా ప్రాణం.  అన్నా నేను చదువయ్యాక మంచి ఉద్యోగం చేస్తాను. బాగా సెటిల్ అయ్యాక పెళ్ళి చేసుకుంటాను అంది. 

దానికి శేఖర్ ఎందుకమ్మా… నీకు ఉద్యోగం చెయ్యాల్సిన  అవసరం ఏముంది…? చక్కగా చదువయ్యాక కొన్నాళ్ళు ఎంజాయ్ చెయ్యి అన్నాడు.  స్నేహితులకి ఫోన్లు చేసుకుంటూ… సంతోషంగా గడిపేది. 

బి.టెక్. చదివిందన్నమాటే కానీ విరితకి అసలు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. తెలుగు కూడా ఊళ్ళోవాళ్ళు మాట్లాడినట్లే మాట్లాడేది. ఒకరోజు వాళ్ళింటికి వాళ్ళ మామయ్య వచ్చాడు. ఆ మాటా ఈ మాటా మాట్లాడుకున్నాక – అమ్మా… విరితా… నీకు ఒక మంచి సంబంధం వచ్చిందమ్మా… అబ్బాయి సునీల్ చాలా మంచివాడు. ఆస్ట్రేలియాలో మంచి జాబ్ చేస్తున్నాడు. సిటిజన్  కూడా అన్నాడు.  అంత మంచి సంబంధం అని చెప్పినా విరితకి ఇష్టం లేకపోయింది.  కానీ పెద్దవాళ్ళు అన్నీ వివరంగా మాట్లాడి నచ్చచెప్పాక, సునీల్ తో తను కూడా మాట్లాడింది. అన్నీ నచ్చాయి. పెళ్ళయిపోయింది. ఆస్ట్రేలియా వెళ్ళేటప్పుడు చాలా భయపడుతూ వెళ్ళింది. 

అక్కడికి వెళ్ళాక సునీల్, విరితా చాలా ఆనందంగా వుండేవాళ్ళు. వాళ్ళకి ఒక పాప పుట్టింది. పాపకి మూడేళ్ళు వచ్చాయి. ఒకరోజు సునీల్ ఎంతకీ ఆఫీస్ నుంచి రాలేదు. ఏమయ్యిందో అర్థం కాలేదు. పాపని పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ వుంది. ఆఫీస్ వాళ్ళు హాస్పటల్ కి టెస్ట్ లకి పంపించామని చెప్పారు. ఏం టెస్టులో తెలియదు. నిద్ర పట్టట్లేదు. తెల్లారగట్ల 3.30కి సునీల్ దగ్గరనుంచి ఫోన్ వచ్చింది. మా ఆఫీస్ వాళ్ళకి ఏదో డౌట్ వచ్చి టెస్ట్ చేయించుకోమన్నారు. నన్ను అబ్జర్వేషన్ లో వుండమన్నారు. నేను పొద్దున్న పది గంటలకి ఇంటికి వచ్చేస్తాను. పాప జాగర్త కంగారు పడకు అనిచెప్పాడు. విరిత లేని ధైర్యం తెచ్చుకుంది. ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూసింది. 

పొద్దున్న పది గంటలకి సునీల్ వచ్చాడు. బాగా అలసటగా వున్నాడు. రెండు రోజుల తర్వాత రిపోర్టులు వస్తాయన్నాడు. అనుకున్న రోజు రానే వచ్చింది. రిపోర్టులు తీసుకున్న ఇద్దరికీ నోట మాటరాలేదు. సునీల్ కి బ్లడ్ కాన్సర్. ఇంకా ఫస్ట్ స్టేజ్ లోనే వుంది. విరితకి ఒక్కసారి భూమి గిర్రున తిరిగినట్లయింది. కానీ ఇప్పుడు తను బాధపడుతూ కూచుంటే సునీల్ ఇంకా దిగజారిపోతాడని నిర్ణయించుకుంది. మనసుని గట్టి చేసుకుంది. 

సునీల్  ఆఫీసు మానెయ్యాల్సి వచ్చింది. అప్పటికే తను ఒక ఆఫీసులో పనిచేస్తుండడంతో కొంత ధైర్యంగా వుంది. విరిత కానీ సునీల్ కానీ వాళ్ళ అమ్మా నాన్నలకి,  బంధువులకి ఈ విషయం అసలు చెప్పలేదు. 

రోజూ సునీల్ కి, పాపకి  కావలసినట్లు వంట చేసి పెట్టి ఆఫీసుకి వెళ్ళి వచ్చేది. ఆఫీస్ కొలీగ్స్, స్నేహితులు చాలా ధైర్యం చెప్పి, ఏదైనా అవసరమయితే సాయం చేస్తుండేవాళ్ళు.

ఆ పరిస్థితుల్లో పాపని డే కేర్ లో పెట్టడం కూడా కష్టమే అనుకున్నారు. సునీలే చూసుకునేవాడు. సిటీకి దూరంగా తక్కువ రెంట్ లో ఇల్లు మారారు. ఆఫీసు దూరమయినా ట్రెయిన్ వెళ్ళి వస్తుండేది. అవసరమయితే వుంటుందని కారు డ్రైవింగ్ నేర్చుకుంది. ఎక్కడికి వెళ్ళినా తనే డ్రైవ్ చేసేది. 

మధ్యమధ్యలో ట్రీట్ మెంట్ కోసం హాస్పిటల్ కి వెళ్ళేవారు. ఆ పరిస్థితుల్లో ఎన్నో విషయాల్లో అనుభవం సంపాదించింది.  అనుభవాలే జీవిత పాఠాలు అన్నట్టు అయ్యింది. ఇంగ్లీషు బాగా నేర్చుకుంది. ఇంటికి సంబంధించిన పనులన్నీ తనే చూసుకునేది. మానసికంగా, శారీకంగా బాగా అలిసిపోయినా ముఖంలో మాత్రం చిరునవ్వు తాండవించేది. అదే సునీల్ కి  వైద్యమయ్యింది.

సునీల్ కి మందులన్నీ టైముకి అందివ్వడం జీవిత కార్యక్రమాల్లో ఒక భాగమైపోయింది. మెల్లమెల్లగా సునీల్ కి తగ్గుముఖం పట్టింది.  మెల్లమెల్లగా కొంచెం ధైర్యం తెచ్చుకున్నాడు. చివరికి టెస్టుల్లో బ్లడ్ కాన్సర్ ని జయించినట్లు తెలిసింది.  క్రమ క్రమంగా వాళ్ళ జీవితం మామూలు పరిస్థితుల్లోకి వచ్చింది.  

సునీల్ మళ్ళీ కొన్ని గంటలు ఆఫీసులో చెయ్యడానికి ఒప్పుకున్నారు. కానీ ఇంకా ఎక్కువ శ్రమ చెయ్యలేకపోతున్నాడు. ప్రస్తుతం ఎంతో కొంత జీతం రావడంతో పరిస్థితులు సద్దుకున్నాయి. విరిత మరో మంచి ఉద్యోగంలో చేరింది. పాప పెద్దదవుతోంది. అన్నీ అర్థం చేసుకుంటోంది. స్కూలుకి వెడుతోంది. 

సునీల్, విరితా షాపింగులకి, పార్కులకి పాపతో ఆనందంగా తిరగగలుగుతున్నారు. మెల్లిగా విరితా వాళ్ళ, సునీల్ వాళ్ళ అమ్మానాన్నలకి ఈ విషయం తెలియజేశారు. కష్టాలకి కళ్ళెం వేసిన కూతురి ధైర్యానికి ఆనందించారు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.