జాబిల్లి ఎప్పుడూ ఆడ నే!

మూలం: మార్గె పియర్సీ
      అనువాదం: ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ

జాబిల్లి ఎప్పుడూ ఆడ నే!

ఈ రేజర్ బ్లేడ్ల నడుమ లోయలో

నా ఆడతనాన్ని

అలానే దుస్తుల్లా మార్చుకొంటూండాలని ఉంది…

ఏం, ఎందుక్కూడదు?

మగాళ్ళెప్పుడూ తమ మగతనాన్ని తొడుక్కొనే ఉంటారా?

ఆ ఫాదరీ, ఆ డాక్టరు, ఆ మాష్టారు

అందరూ విలింగతటస్థభావంలో నత్తగుల్లల్లా తమ వృత్తులకు హాజరవుతున్నామంటారా?

నిజానికి నేను పనిలో ఉన్నప్పుడు

ఏంజిల్ టైగర్ లా స్వచ్ఛంగా ఉంటాను

చూపు స్పష్టంగా ఉంటుంది

మెదడు వేడెక్కి పనిచేస్తుంటుంది

పిచ్చిపిచ్చిగా గురగురలాడే ఆకలిపంది కూనలు నిశ్శబ్దమై పోతాయి

…….

…..జాబిల్లి ఎప్పుడూ స్త్రీనే!

సూర్యమే!? హాయైన ఎండలో ఆడవాళ్లు

గంతులేస్తూ ఎక్కివెళ్ళే సీమల్లో మాత్రమే  స్త్రీ!…

ఓ స్త్రీ అరుస్తోంది, వింటున్నా…

ఓ స్త్రీ రక్తమోడుస్తోంది, చూస్తున్నా…

నోటినుంచి, లోగర్భం లోంచి, ఎద రొమ్ముల్లోంచి

దైన్య దైనందిక దుఃఖశోష నల్లరక్తపు మడుగు

బలవంతుల రుచులకలవాటైన నీరవ నిశ్శక్తత

రక్తమోడుస్తోంది…

అది సాధారణదృశ్యమై పోయింది…

వంటింటి రొట్టె మా కండరాల మీద కాలాలి

కింద, తెరుచుకొని రోదించే ఈ క్షీరమాంస జంతువుల ఎముకలపై కుంపట్లు వెలగాలి

మా తల్లుల పేర్లు చెప్పాలనుంది

నేనెక్కుతూ వెళ్లే ఈ రాతి బాటపై

పొగమంచుకు జారే రాళ్లలాటి 

తల్లుల పేర్లు చెప్పాలని ఉంది….

….

కత్తి మొనను కంఠంపై మోపినా

నేనెప్పుడూ మగాణ్ణి కావాలనుకోలేదు,

అనుకోను కూడా!…

నేను నేను గానే, స్వేచ్ఛగా ఉండాలనుంది.

……

జాబిల్లి రాకకోసం ఎదురుచూస్తున్నా

ఊరూ వాడా ఉక్కుకార్ఖానాలతో

బొగ్గు గనుల్తో, బందిఖానాలతో……

గడ్డికోత కొడవళ్ళ ధ్వనితో

నా వెనకే, ఊపిరాడక కొట్టుకొంటున్నా,

నేనిక్కడే బాసింపట్టు వేసుకు వేచిఉన్నా..

(అమెరికా ఫెమినిస్టు రచయిత్రి, కవయిత్రి  మార్గె పియర్సీ ప్రచురించిన The Moon is Always Female కవితా సంపుటిలో ఆ పేరే శీర్షికగా గల ఈ కవిత 103 పంక్తులు ఉంటుంది. అందులోని తొలి భాగం నుంచి సంక్షిప్త అనువాదం-)

*****

ఆర్ట్: మన్నెం శారద

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.