అనుసృజన

నిర్మల

(భాగం-9)

అనుసృజన:ఆర్. శాంతసుందరి 

హిందీ మూలం: ప్రేమ్ చంద్

[మన్సారామ్ కి వైద్యం చేసిన డాక్టర్ కుటుంబంతో తోతారామ్ కీ నిర్మలకీ మంచి స్నేహం ఏర్పడింది. ఇళ్ళకి రాకపోకలూ, తరచ్ కలవటం జరుగుతూ ఉండేది. నిర్మల డాక్టర్ భార్య సుధతో  తను కడుపుతో ఉన్నానని చెప్పింది. విషయం తనకి ఏమాత్రం సంతోషాన్నివ్వటం లేదని కూడా అంది.తన తండ్రి హఠాత్తుగా హత్యకు గురికావటం వల్ల తనకి వచ్చిన ఒక మంచి సంబంధం ఎలా తప్పిపోయిందో, డబ్బులేని తనని తండ్రి వయసువాడైన తోతారామ్ కి ఎలా కట్టబెట్టారో చెప్పింది. మాటల్లో సుధ భర్త, డాక్టర్ సిన్హా సంబంధమే తనకి తప్పిపోయిన సంబంధమని తెలిసింది నిర్మలకి. సంగతి సుధకి కూడా అర్థమై భర్తని నిలదీసి కడిగేసింది.అతను ఏవేవో సాకులు చెప్పి తప్పించుకోజూశాడు కానీ తన భార్య దృష్టిలో తానెంత దిగజారిపోయాడో బాగా అర్థమైందతనికి.]

***

నిర్మల జీవితంలో మూడు ముఖ్యమైన సంఘటనలు ఒకేసారి జరిగాయి.నిర్మలకి ఆడపిల్ల పుట్టింది.ఆమె చెల్లెలు కృష్ణ కి పెళ్ళి కుదిరింది.తోతారామ్ ఇల్లు వేలం వెయ్యబడింది.పిల్లని కనటం నిర్మలకి వ్యక్తిగతంగా తన జీవితంలో జరిగిన అతి ముఖ్యమైన సంఘటన అయినప్పటికీ మామూలుగా పెళ్ళైన ఆడవాళ్ళకి జరిగేదే.కానీ మిగతా రెండూ అసామాన్యమైన సంఘటనలు.కృష్ణ పెళ్ళి అంత ధనవంతుల అబ్బాయితో ఎలా కుదిరిందో?తల్లి దగ్గర చిల్లి గవ్వ లేదు.అబ్బాయి తండ్రి పరమ లోభి అని పేరు పడ్డాడు.మరి ఎలా ఒప్పుకున్నాడు? ఎవరూ నమ్మలేకపోయారు.

అంతకన్నా ఆశ్చర్యకరమైన సంఘటన తోతారామ్ ఇల్లు వేలం వెయ్యబడటం.అందరూ ఆయన గురించి లక్షాధికారి అనుకోకపోయినా బాగా ఉన్నవాడే అనుకుంటున్నారు.అసలు సంగతి ఏమిటంటే ఆయన ఒక గ్రామాన్ని తనకి తాకట్టు పెట్టుకుని ,షావుకారు దగ్గర అప్పు తీసుకుని ఊరి జమీందారుకి ఇచ్చాడు. ఊరి జమీందారు అసలూ, వడ్డీ ఎప్పటికీ తీర్చలేడనీ,ఒక ఐదారేళ్ళలో దాన్ని సొంతం చేసుకోవచ్చనీ అనుకున్నాడు.పెద్ద గ్రామం, తనకి బాగా లాభం వస్తుందని ఆశపడ్డాడు.కానీ అది తీరలేదు.కొడుకు చనిపోవటం, ఆశ అడుగంటటం వల్ల ఆయన బాగా కుంగిపోయాడు.షావుకారు దగ్గర తీసుకున్న అప్పు తీర్చలేకపోయాడు.ఇల్లు వేలం వెయ్యాల్సి వచ్చింది.

ఉన్న సమస్యలు చాలనట్టు నిర్మల ఆడపిల్లని కనటం ఆయన్ని ఇంకా కుంగదీసింది.మరింత బాధ్యత పెరిగిందనిపించింది.

కానీ నిర్మలకి అదేం పట్టలేదు.తన పసిపిల్లని చూసుకుని తెగ మురిసిపోసాగింది.అది పెద్ద పెద్ద కళ్ళతో తనకేసే చూస్తూ ఉంటే ఆమె లోకాన్నే మరిచిపోయేది. పన్నెండు రోజుల తరవాత పాపని ఎత్తుకుని భర్త దగ్గరకి వెళ్ళింది నిర్మల.మాతృత్వపు గర్వం, ఆనందం అనుభవిస్తూ తన కష్టాలన్నిటినీ మరిచిపోయింది.తోతారామ్ పసిపిల్లని చూసి సంతోషించలేదు పైగా బెదిరిపోయినట్టు కనిపించాడు.ఒక్కసారి దాని మొహం వైపు చూసి తల దించుకున్నాడు.పిల్ల అచ్చం మన్సారామ్ పోలికలో ఉంది.

నిర్మల మనసు దెబ్బతింది. ‘ మీకు దీని మీద ప్రేమ లేకపోతే పోనివ్వండి.మీ నీడ కూడా పాఅ మీద పడనివ్వను.ఇలా ప్రవర్తించి నన్ను అవమానించటం ఏమైనా బావుందా?’ అన్న భావం మొహంలో ప్రకటిస్తూ ఆమె విసురుగా అక్కణ్ణించి వెళ్ళిపోయింది.తన గదిలోకి వెళ్ళగానే ఆమె దుఃఖం కట్టలు తెంచుకుంది.కానీ నిర్మల భర్త అలా ఉదాసీనంగా ఉండటాన్ని సరిగా అర్థం చేసుకోలేదు . అసలే చితికిపోయిన ఆయనకి పిల్ల అదనపు బాధ్యతా, భారమూ అవుతుందన్న ఆలోచనే ఆమెకి రాలేదు.వచ్చి ఉంటే అంత కోపమూ,బాధా కలిగేవి కావు.

తోతారామ్ కూడా తన తప్పుని వెంటనే గ్రహించాడు.తల్లి మనసు నొప్పించాననీ, మొదటి సంతానం కలిగిన తల్లికి ఇంకే కష్టాలూ గుర్తుండవనీ మరిచిపోయాడు.వెంటనే నిర్మల దగ్గరకి పరిగెత్తుకెళ్ళి పాపని ప్రేమగా ఎత్తుకున్నాడు.”పుట్టినప్పుడు మన్సా కూడా సరిగ్గా ఇదే పోలికలో ఉండేవాడు,నాకు బాగా గుర్తుంది,” అన్నాడు ఆనందంగా.

అవునండీ, వదినగారు కూడా ఆమాటే అన్నారు,” అంది నిర్మల.

అవే పెద్ద పెద్ద కళ్ళు, అదే ముక్కు, నోరు,నుదురు.దేవుడు మళ్ళీ నా మన్సా ని బుజ్జి పిల్ల రూపంలో పంపించినట్టున్నాడు కదూ? చూడు నావైపే ఎలా చూస్తోందో!”

మరుక్షణం ఆయన మళ్ళీ ఏవేవో గాలి మేడలు నిర్మించటం మొదలెట్టాడు.జీవితం మీద మళ్ళీ మమకారం తలెత్తింది.మనిషి జీవితం ఎంత క్షణికమైనప్పటికీ ఊహలు మాత్రం దీర్ఘాయువులే ! జీవితం మీద విరక్తి పెంచుకుని ఇరవైనాలుగ్గంటలూ మృత్యువు కోసం ఎదురుచూసిన అదే వ్యక్తి గడ్డిపోచ సాయంతో తీరం చేరేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నాడు.

కానీ ఎవరైనా గడ్డిపోచని పట్టుకుని ఈది తీరం చేరుకోగలిగారా?

*****

(ఇంకాఉంది) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.