ఇట్లు మీ వసుధారాణి

ఉత్తరాల వేళ-2

-వసుధారాణి 

ఉత్తరం అన్ని హంగులతో పూర్తి చేసి మా అక్కయ్యా వాళ్ళింటి పక్కన పెట్టిన తపాలా డబ్బాలో వేసేసాం.ఇక మేము అనుకున్న వారికి అది చేరటం , మేము అందులో  పొందుపరిచిన విషయం వారి మీద చూపబోయే ప్రభావం గురించి ఊహల్లోకి వెళ్లిపోయాం. ఇంతలోకి మా కిషోర్ బాబు అసలు విషయం చెప్పాడు.వాడికి ఓ అలవాటు ఉంది ఏది వద్దు అంటే అది చేయటం.ఆ విషయంలో వాడి మాట వాడే వినలేడు.రాణి పిన్నీ ఉత్తరంలో నేను మీరు చూడకుండా సంతకం పెట్టాను చివరలో అని.ఇంక చూసుకోండి మా పైప్రాణాలు పైనే పోయాయి.ఎక్కడా మేము రాసాము అన్న విషయం బయటపడకుండా మేము తీసుకోవాలన్న జాగర్తలు అన్నీమా కిషోర్ సంతకం వల్ల తలకిందులు అయ్యాయి.నేనూ,మా చిన్నారి వాడి తలమీద కోపంతో మొట్టికాయలు వేశాం. ఎందుకు చేసావిలా అని.మీరు జాగర్తగా ఉండాలి అన్నారు కదా అందుకని చేతులు జిల పుట్టి సంతకం పెట్టా అన్నాడు వాడు ఏడుపుమొఖంతో .సరే ఏమి చేస్తాం వాడి తయారీలోనే భగవంతుడు అలా చేసాడు అనుకున్నాం.

ఇప్పుడు ఉత్తరం వారికి చేరకుండా ఆపటం ఎలా అన్నదాన్ని గురించి ఆలోచించాలి అనుకుని మాకు తెలిసిన మార్గాలు ఒకటొకటిగా ఆలోచించాము. పోస్ట్ మ్యాన్  ఉత్తరం ఇచ్చే వేళకు అక్కడ ఉండి ఉత్తరం మేమే తీసుకోవటం.చాలా సులువుగా అనిపించినా అంత వీజీ కాదు పోస్టుమ్యాన్ మీకెందుకు అనొచ్చు,ఉత్తరం వచ్చిన వారికే ఇస్తాను అనొచ్చు,అసలు మాకు తెలియకుండా బయట ఎక్కడైనా కనిపిస్తే వారికి ఉత్తరం ఇచ్చేయవచ్చు.ఎందుకంటే మా ఉత్తరాలు ఒక్కోసారి బయట మేము కనపడితే మాకు ఇచ్చేసేవాడు ఇంటిదాకా రాకుండా.

ఇంకో ఐడియా పోస్ట్ ఆఫీసుకు వెళ్లి సార్టింగ్ అయ్యేవేళ అడిగి తెచ్చుకోవడం.ప్చ్ ఇదీ కొంచెం కష్టం అనే అనిపించింది ఆలోచిస్తే .మా బావగారి పాత స్టూడెంట్లు ఇద్దరు ముగ్గురు వున్నారు పోస్టాఫీసు లో వాళ్ళు మళ్ళీ మా బాగారికి విషయం చెప్పేస్తే అని అదో భయం.

ఒకసారి ఉత్తరం తపాలా డబ్బాలో పడ్డాక ఆ తోకలేని పిట్టని ఇంక పట్టలేమా అన్న భయం పట్టుకుంది మాకు.ఇంతలో నా బుర్రలో ఓ అవిడియా మెరిసింది.ఒరే కిషోర్ పోస్ట్ డబ్బాలో నుంచి ఉత్తరం ఎప్పుడు తీస్తాడో చూసి అప్పుడు ఏదో తప్పు రాశాము లేదా మర్చిపోయాము మళ్ళీ సరిగ్గా రాసి పోస్ట్ చేస్తాం అని వెనక్కి తీసుకుందాం అని అన్నాను మా కిషోర్ తో.

ఇక చూసుకోండి మా తెలివి తేటలు మొదటగా టపాడబ్బాలు ఏ ఏ సమయాల్లో తెరిచి ఉత్తరాలు తీస్తారో చూసుకోవాలి.మా బావగారు నేర్పిన పాఠం ఇక్కడ వాడాము. మా అక్కయ్యా వాళ్ళు ఇంటి దగ్గర తపాలాడబ్బా మీద ఉదయం 7 ,మధ్యాన్నం 11 సాయంత్రం 4 ,సాయంత్రం 6.30 రాసి ఉంటాయి చిన్న అక్షరాలలో .అవి ఏమిటి అని అడిగితే మా బావగారు చుట్టుపక్కల ఉన్న రెండు మూడు తపాలా డబ్బాల దగ్గరికి తీసుకువెళ్ళి , వాటిమీద కూడా మా యింటిదగ్గర   తపాలాడబ్బాకి పది పది నిమిషాల తేడాతో రాసి ఉన్న సమయాలను చూపారు.

పోస్ట్ చేసిన ఉత్తరాలు తీసే వేళలు అవి.మా ఇంటి దగ్గర మేము పోస్ట్ చేసిన తరువాత 4 గంటలకి ఉత్తరం తీసేవేళకి కాపలా కాసి అతన్ని పట్టుకుని ఉత్తరం తీసుకోవటం.ఆ రోజులాంటి ఉత్కంఠ దినం మా జీవితంలో మరోసారి ఏరూపంలోనూ రాలేదు.మేము ఉత్తరం అడగగానే మా ముఖాలు చూసి ఏమీ ప్రశ్నలు అడగకుండా ఉత్తరం వెనక్కి ఇచ్చేసిన ఆ తపాలా ఉద్యోగిని కులదైవంగా భావించుకున్నాం మేముగ్గురం చాలా రోజుల పాటు.

అలా మేము పోస్ట్ చేసిన ఉత్తరం గండం నుంచి బయటపడ్డాము కానీ.మనకి వచ్చే ఉత్తరాలు కూడా ప్రమాదం తెస్తాయని నాకు కొద్ది రోజుల్లోనే అర్ధం అయింది. మా బావగారి పాఠాల్లో భాగంగా మా ముగ్గురి చేత కిడ్డీబ్యాంక్ ఎక్కౌంట్లు తలా పాతికరూపాయల రొక్కంతో ఓపెన్ చేయించారు.మేమే బ్యాంకుకు వెళ్లి డబ్బులు దాచుకోవటం అవీ నేర్చుకోవాలని.

నేను కొంచెం ఎక్కువ నేర్చుకున్నానేమో విత్ డ్రా ఫార్మ్ కూడా నింపేసి ఎంచక్కా డబ్బులు రెండు సార్లు పదేసి రూపాయలు  డ్రా చేసుకున్నా.బ్యాంకు వారు ఎక్కౌంట్ లో మినిమం డబ్బుకూడా లేదు అంటూ , మా కిడ్డీబ్యాంక్ ఎక్కౌంట్ గార్డియన్  అదేనండీ మా బావగారికి ఉత్తరం రాశారు.ఇంకేముంది అంతే సంగతులు చిత్తగించవలెను.

ఇట్లు మీ వసుధారాణి.

మరో ముచ్చటతో మళ్ళీ మీ ముందుంటాను.

 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.