కనక నారాయణీయం -13

పుట్టపర్తి నాగపద్మిని

  కనకవల్లి తళిహిల్లు (వంటిల్లు) సర్దుకుంటూఉండగా, పుట్టపర్తి, రేపు పొద్దున్న మొదటి బస్సుకే తిరుపతికి పోవాలన్న ఆలోచనల్లో మునిగిపోయారు- ఎవరి ఊహల్లో వారు!!
     అప్పట్లో ప్రొద్దుటూరినుండి, తిరుపతికి వెళ్ళాలంటే, ఎర్రగుంట్ల వెళ్ళి రైలు పట్టుకోవలసిందే!! తెల్లవారుఝామునే బయలుదేరి ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ చేరుకుని,రైల్లో  మూడవ తరగతి డబ్బాలో ఏదో తోపులాటల్లో కాస్త చోటు సంపాదించుకుని కూర్చునేందుకు ఎంతో శ్రమపడవలసి వచ్చింది పుట్టపర్తికి !! జీవన సంఘర్షణ కూడా ఇంతే కదా!! కూర్చోవడానికి చోటు వలెనే జీవితంలో గుర్తింపు కూడా!! ఎంతో కొంత శ్రమపడితే తప్ప ఇక్కడ రైల్లో కూర్చునేందుకు చోటు సంపాదించుకోగలం. అటు సాహిత్య జీవితంలోనైనా కేవలం వ్రాసి కూర్చుంటే కాదు, దాన్న్ని తన గుర్తింపుకు సాధనంగా కూడా మలచుకోవలసిన మార్గాన్ని కూడా అనుసరించవలసిందేనా?? ఏమో..మరి!! ఈ ఆలోచన రాగానే పుట్టపర్తి పెదవులపై సన్నని నవ్వు విచ్చుకుంది. పుట్టపర్తి ఆలోచనల వలెనే, రైలు కొన్ని స్టేషన్ లలో ఆగుతూ, మళ్ళి బయలుదేరుతూ, తిరుపతి వైపు దూసుకెళ్తున్నది.
  బీడి వెలిగించారు పుట్టపర్తి.’ఈ  విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడైతే తప్ప జీతం పెంపుదల సాధ్యం కాదని తెలిసింది. జీవితం మొదటి మెట్టుమీదే ఉన్న తనకు, ముందు ముందు సంసారం పెరగటం, కుటుంబ పరంగా నిలదొక్కుకోవటం, అటు ఉద్యోగ జీవితంలోనూ ముందుకు వెళ్ళగల్గటం కూడా యిలా ఉద్యోగంలో మెట్లెక్కటం అవసరమా?? ఏమిటీ జీవితం?? కవి సామర్థ్యాన్ని బట్టి కాకుండా అతనికున్న డిగ్రీలనుబట్టి అర్హత నిర్ణయించటం సమంజసమేనా??
  తన ఆలోచనలకు తనకే నవ్వొచ్చింది పుట్టపర్తి కి!! ఈ ఆలోచనల్లో ఉండగానే, రైల్లో అందరూ, తోసుకుంటూ బైటికెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉండటం వల్ల తిరుపతి వచ్చినట్టు తెలిసింది.
    పుట్టపర్తి కూడ రైలు దిగి బైటికి దారితీశారు. బైటికి వెళ్ళి, గూడు రిక్షా లో ప్రాచ్య కళాశాలకు చేరుకున్నారు. ఇంతసేపూ తన మనసులో మెదిలిన భవాల పరిణామం ఎలా ఉంటుందో కొన్ని నిముషాల్లో తేలబోతున్నది. కార్యాలయం వైపు దారి తోశారు. అక్కడ సంబంధిత క్లర్క్ ఎవరో తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. తన నెంబర్ చెప్పమన్నాడతను!! పరీక్ష వ్రాసిన తరువాత దానితో మరి పనేముంటుందనుకున్నాడు తాను!! కానీ ఇప్పుడు, ఫలితాలు తెలుసుకోవాలంటే నంబర్ చెప్పాలి కదా!! మనిషిని సంఖ్యగా మార్చే  ఇటువంటి సందర్భాలను సృష్టించిన జీవితానికి ప్రణతులు!! పెదవులపై మళ్ళీ నవ్వు !!
    ‘ఏంది సామీ??  నంబర్ చెప్పమంటే నీళ్ళు నములుతావేంది??’ అటువైపు ఆ వ్యక్తి గదమాయిస్తుంటే, మళ్ళీ పుట్టపర్తి గుర్తు చేసుకుని చెప్పారు. ఆ క్లర్క్ పరీక్ష ఫలితాల జాబితా బైటికి తీశాడు. తానేదో గొప్ప పని చేస్తున్నట్టు, చాలా సీరియస్ గా ఆ ఫలితాల చిట్టా చదువుతూనే వున్నాడు. పైనుండీ కిందకూ కిందనుండీ పైకీ రెండుసార్లు చూశాడు. అంతసేపూ పుట్టపర్తి నిశ్చలంగా నిలబడే ఉన్నారు.
   పుట్టపర్తి కాస్త విచలితులయ్యారు. అదేమిటి?? తన నంబర్ లేకపోవటమా?? అంటే తాను విద్వాన్ ఫైలయ్యాడా?? ఏమీ తోచక ఇంకా అక్కడే నిలబడి ఉన్న పుట్టపర్తిని చూసి జాలైందేమో..ఆ క్లర్క్ కు!! మళ్ళీ ఒకసారి ఆ నంబర్ కోసం చూసి, తేల్చి చెప్పేశాడు. నంవర్ లేదని!!
    పుట్టపర్తిపెదవులమీద మళ్ళీ అదే లేత నవ్వు!!
  తాను అనుత్తీర్ణుడయ్యాడన్న వార్త వినికూడా, నవ్వుతున్న ఆ విద్యార్థిని చూసి ఆ క్లర్క్ బిత్తరపోయాడు. పరీక్ష ఫైలయ్యానన్న బాధే లేదే ఇతనిలో!! ఇదేం మనిషబ్బా?? అనుకుంటూ, పుట్టపర్తి వైపు అతగాడె విచిత్రంగా చూస్తుండగానే పుట్టపర్తి కళాశాల నుంచీ బైటికి వచ్చేశారు. బైటికొచ్చి నిలబడి జేబులోనుంచీ బీడీ తీసి వెలిగించారు.బీడీ పొగల మధ్య నుంచీ రోడ్డుకేసి చూస్తుంటే, గుర్తొచ్చిందతనికి..’ఐనా తను ఐదు ప్రశ్నలకు సమాధానాలు వ్రాయవలసి ఉండగా, ఒకే దానికేగా వ్రాసింది?? కారణం?? తాను వ్రాసిన రచన  నుండీ తానే సమాధానాలు వ్రాయవలసి వచ్చే సంఘటన ఎవరి జీవితంలోనైనా జరిగే అవకాశం ఉంటుందా అసలు??అంతటి అరుదైన సన్నివేశం తనకెదురైంది. మూడు గంటలూ కూర్చుని,ఒకే ప్రశ్నకు సమాధానం వ్రాశాడు తను!! పేపర్లు దిద్దే పండితుడెవరికైనా తాను వ్రాసిన ఆ సమాధానం, తనేమిటో చెప్పేలా ఉంది. కానీ, అటువైపు పేపర్ దిద్దేవారు, తమ నియమాల ప్రకారం యాంత్రికంగా, ఆ ప్రశ్నకివ్వవలసిన మార్కులిచ్చి, చేతులు దులిపేసుకుని ఉంటారంతే!! ఐనా ఒకే ఒక్క ప్రశ్నకు అన్ని పెజీల సమాధానం వ్రాసిన విద్యార్థి ప్రతిభను గుర్తించవలసిన అవసరం, పేపర్లు దిద్దేవారికి ఉండనవసరం లేదా?? అంత తీరికా, ఓపికా ఎవరికీ ఉండవన్నమాట!! గుడ్డెద్దు చేలో పడ్డట్టు, కళ్ళు మూసుకుని విద్యార్థులు భట్టీయం వేసిన సమాధానాలు వ్రాసేయటం, అదే విధంగా దిద్దేవారూ, ఆ సమాధానాలను బట్టి మార్కులు వేయటం..అంతే!! నిజమైన ప్రతిభను గుర్తించే విధానం యీ వ్యవస్థలో ఎప్పటికొస్తుంది?? ఈ ప్రశ్నలూ, సమాధానాలూ నిర్ధారిత సమయంలో ముక్కున పట్టించుకున్న విధంగా వ్రాసిన వారిని ఉత్తీర్ణులుగా ప్రకటించటం, నిజమైన ప్రతిభను గుర్తించి గౌరవించే వ్యవస్థ ఎప్పుడొస్తుందబ్బా??’ ఈ ఆలోచనలతో పుట్టపర్తి బుర్ర వేడేక్కి పోయింది. ఆవేశం కట్టలు తెంచుకుంటున్నది. ఐనా యేమీ చేయలేని నిస్సహయత!!
  ఈ ఊగిసలాటలోనే ఎలాగో ప్రొద్దుటూరు చేరి, ఇంటికొచ్చారు వారు. ఎంతో ఆశగా మంచి వార్త మోసుకొస్తారు భర్త అని ఎదురు చూస్తున్న కనకవల్లికి ఇంటికొచ్చిన భర్త, సమాధానమేమీ చెప్పకుండా, నీళ్ళు తాగి పుస్తకాల గదిలోకి వెళ్ళిపోవటం చూసి చాలా బాధయింది.
      ఎలాగో తెల్లవారింది. దంతధావనం చేసి పుట్టపర్తి చాలా గంభీరంగా మళ్ళీ పుస్తకాల మధ్యే కూర్చుని ఉన్నారు. కాఫీ చేసి రెండు చిన్న స్టీల్ గ్లాసుల్లో పోసి తీసుకెళ్ళింది శ్రీమతి. వారికి కాఫీ అంటే  చాలా ఇష్టం. ఒకటిన్నర గ్లాసుల కాఫీ తాగుతారు ఉదయం కాఫీ!!
  కాఫీ గ్లాసు అక్కడ పెట్టి కదలకుండ నించుందామె, అప్పుడైనా ఏమైనా చెబుతారేమోనని!!
  పుట్టపర్తి అన్యమనస్కంగానే కాఫీ గ్లాసు చేతుల్లోకి తీసుకున్నారు.
  కనకవల్లి వారి నిర్లిప్తత చూసి వెనక్కి వచ్చేసింది.
  వంటింట్లో కొలువుతీరివున్న పూజామందిరం దగ్గరికి వెళ్ళీ చేతులు జోడించి, మనసులోనే ప్రార్థించుకుందామె..’రామచంద్రా!! వారు పరీక్ష పాసయ్యాననే చెప్పేలా చెయ్యి..’ అని!!
   మళ్ళీ పదిహేను నిముషాల తరువాత, గదిలోకి వెళ్ళింది- గ్లాసులు తీసుకుని వెళ్ళేందుకు వచ్చ్చినట్టుగా!!
  పక్కనుంచిన గ్లాసులను చేతిలోకి తీసుకుంటూ  ధైర్యం చేసి నెమ్మదిగా అందామె.. ‘పరీక్ష??’
   నిర్లిప్తంగా ఎటో చూస్తూ  అన్నారాయన..’పోయింది..’ అని నెమ్మదిగా!!
   ఆ మాట వినగానే, ఆమె చేతిలోని గ్లాసులు కింద పడిపోయాయి. తత్తరపాటుతో, కింద పడిన గ్లాసులను తీస్తున్న ఆమె మనసులో ఎన్నో సందేహాలు!!  
  అంటే?? తాను వ్రాసిన కావ్యం తనకే పాఠ్యాంశం కాగా, పండిత సమూహం ప్రశంసలనందుకుంటున్న తన భర్త, అదే పరీక్షలో ఫైలవటమా?? ఇదెలా ??  ఆ దిద్దే పండితుడికి బుద్ధి   పొలాల్లో గడ్డి మేసేందుకు పోయి ఉంటుందా ఏమిటి?? ఇంత విద్వత్తున్న తన భర్తే పరీక్షలో అనుత్తీర్ణుడయ్యాడంటే, అదెంత గొప్ప పరీక్షో, ఆ దిద్దిన పండితులెంత గొప్పవారో??    
      కిందపడిన గ్లాసులు తీసుకుని అక్కడే నిలబడిందామె..’మీరు వ్రాసిన కావ్యం, మీకే పాఠ్యాంశం, ఈ పరీక్షలో మీరే ఫైలవటమా?? ఏమో.. అతనెవరో సరిగా చూసి ఉంటాడో లేదో?? మళ్ళీ ఒకసారి..’ ఆగిందామె!!
  ‘ఆ..ఆ…ఒకటికి రెండు సార్లు చూసినాడులే!! అక్కడ నంబర్ లేకపోతే అతనేమి చేస్తాడు పాపం??’
  నెమ్మదిగా గదిలోంచీ బైటికి వచ్చి, వెంటింట్లో దేవుని ముందు నిల్చుంది కనకవల్లి, ముకుళిత హస్తాలతో, కంట నీటితో!!
  మధ్యాహ్నం కొప్పరపు సుబ్బారావుగారి దగ్గరికి వెళ్ళారు పుట్టపర్తి.
  అతణ్ణి చూడగానే కొప్పరపు వారు, ‘రావయ్యా రా పుట్టపర్తీ!! పోయెచ్చినావా తిర్పతికీ??’
 అడిగారు.
  ‘నిన్ననే పోయి వచ్చినానయ్యా!!’
  ‘ఇంతకూ ఏమైంది నీ పరీక్ష??’
  నిశ్శబ్దంగా నిల్చునే ఉన్నారు పుట్టపర్తి.
  ‘ముందుగా అనుకున్నదే కదా..పాసై ఉంటావులే!!’
  సంతోషంగా అందుకున్నరాయన.
  పుట్టపర్తినుంచీ సమాధానం లేదు.
  ‘ఏందయ్యా..ఉలకవూ పలకవూ?? ఇంతకూ పరీక్ష పాసైనావా లేదా??’
  తల అడ్డంగా ఊపారు పుట్టపర్తి.
  ‘ఏందీ??’
  మౌనమే సమాధానం.
  ‘ఫైలైనవా??’  
  పుట్టపర్తి తలాడించారు ఔనని..అంటే తాను పాసవలేదని అర్థం వచ్చేలా!!
  ‘నీ పాసుగూలా..నువ్వు ఫైలవడమేందయ్యా నాయనా?? నువ్వు రాసిన పుస్తకం నువ్వే చదివినావు. ఎవరికైనా ఇట్టాంటి అదృష్టం ఇప్పటివరకూ నేను ఇణ్ణే లేదే?? నేనెంతో గొప్పగా చెప్పుతుంటా అందరికీ..నీ గురించి..ఇట్టా మా ఆచార్లంటే ఏమనుకున్నావ్?? తానెప్పుడో పన్నెండేళ్ళకు రాసిన పుస్తకం తనకే టెక్స్ట్ పుస్తకం విద్వాన్ పరీక్షలో అని!! అట్టాంటిది..నువ్వు పరీక్ష ఫైలవడమేందీ??’ కొప్పరపు గారు ఆశ్చర్యం నుంచీ తేరుకోలేకుండా గొంతు పెంచి మరీ  ఆవేశంగా మాట్లాడుతుంటే, అక్కడికి చేరుకున్న పది పదిహేనుమందీ  ఈ మాటలు వింటూ, ముక్కున వేలేసుకున్నారు.
    కొప్పరపు వారు పుట్టపర్తి నుంచీ వివరాలు తెలుసుకుంటుంటే, వింటున్న వారిలో అప్పటికే కొంతమంది చెవులు కొరుక్కుంటుంటే మరికొంత మంది, వెటకారంగా నవ్వుకుంటున్నారు. కారణం, పుట్టపర్తంటే, కొప్పరపు వారు చూపించే అవ్యాజమైన ఆదరాభిమానాలు, వారికి కంటకింపుగా ఉన్నాయి మరి!!
    ఈ విషయం పుట్టపర్తి దృష్టిని దాటి పోలేదు. మనసు రగిలిపోతున్నది.
  కానీ ఇప్పుడది అప్రస్తుతం.  
  కొప్పరపువారు పరీక్ష వివరాలన్నీ కనుక్కున్నారు.
  వారి ఆప్యాయత చూసి పుట్టపర్తి చెప్పారు, తాను ఒకే ప్రశ్న మూడు గంటలూ వ్రాసినట్టు!!
  ఆశ్చర్యపోవటం కొప్పరపు వారి వంతైంది.
  ‘ఏందీ?? మూడూ గంటలూ కూచుని ఒకే ప్రశ్నకు జవాబు రాసినావా??’

(సశేషం)

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.