జానకి జలధితరంగం-11

-జానకి చామర్తి

బొమ్మల కొలువు

లోకాలను సృజించే శక్తి  విధాతకే ఉండవచ్చు గాక , కాని సృజనాత్మకత స్త్రీల సొత్తు.

ఆషామాషీగా , అలవోకగా తలచుకున్నంతలో తలపుల కలబోతగా , మమతల అల్లికగా , పొంగిన పాలవెల్లిలా, అమ్మతనపు కమ్మని కలగా , వేళ్ళతో మీటిన వీణానాదంలా, నైపుణ్యపు గణి గా , ఒడి నిండిన అమృతఫలం లా ..

కేవలం సున్నిపిండి నలుగుతో స్నానాలగదిలో పార్వతమ్మ చేతిలో రూపుదిద్దుకున్న బాలుని బొమ్మ  కన్నా స్త్రీ సృజనాత్మక శక్తికి వేరే నిదర్శనం ఏంకావాలి.

పరిగెత్తుకెళ్ళాడుట బుజ్జి దేముడు , బుంగమూతి పెట్టుకుని అమ్మ దగ్గర నిలుచున్నాడుట. 

ఏమంది గౌరి, బాబు కిష్టమని కుడుములు చేస్తోంది.. 

“నేను నీ పిల్లాడిని కానా అమ్మా..! “ అడిగాడు, 

గుండె ఝల్లన్నా.. చల్లగా నవ్వి అడిగింది తల్లి .. “ఎందుకడుగుతున్నావు తండ్రీ”.. అని,. చెప్పాడు,

 “నేను సున్నిపిండి ముద్దను కదా, అద్దంలో చూసుకున్నా .. నాకు నీ పోలికే ఎక్కడా లేదేమిటమ్మా.. , అందరూ నను చూసి నవ్వుతున్నారు.. ఆటలకు ఎవరూ నాతో రావడం లేదు , నా మొహం చూసి వారందరకూ ఎంత ఎగతాళో నమ్మా.. , నాన్నకు కూడా నామీద కోపమా చెప్పమ్మా, అన్నతోటే చదువు గురించి చర్చలు, నే వెళ్ళి నిలుచుంటే వెలగపళ్ళు చేతిలో పెట్టి ఆడుకో పో అంటాడు , ఎత్తుకోనే ఎత్తుకోడు, నేనేం తిండి పోతునా నాకు బొజ్జ ఉంటే  .. అమ్మా! నాకు తినాలనిపిస్తుంది తింటా మరి నాకు ఇష్టమని ..తింటా, నే పోను ఆటలకు పరిగెత్తలేను వేగంగా , సరే నాకు సాయం ఎలక ఇంకా నెమ్మది. తల్లీ !  నేనీతోనే ఆడుకుంటా… ఎక్కడకూ పోనే పోను..”

జగన్మాత కరగిపోయింది, ముద్దుల తనయుడిని ఒడిలోకి తీసుకుంది. 

“ అవును నువ్వు నా దేహంలో భాగానివి, 

నా ప్రాణంలో ప్రాణానివి, నా ఆలోచనల ప్రతిరూపానివి, నిన్ను పొంది నేను శాంతిని పొందాను, నీకెన్ని వంకలున్నా ఏమి నువు నా చందమామవి , ఇష్టమైనవి నీకు చేసిపెడితే , నువుతింటే, అది జగత్తుకే శ్రీరామరక్ష.

నాకు ముందు నీవే ఉంటావు ..అన్నిటికీ ముందుండేది నీవే ఎపుడూ..నిను తలచాను నేను,నను అమ్మా అని పిలచావు, ఎవరేమన్నా నువు అమ్మ కొడుకువి, నా ఆనందానివి “ అంటూ ముద్దుకొడుకును తాను పుట్టించిన  తీరు జ్ఞప్తికి తెచ్చుకుంది.

పార్వతీదేవి చాలారోజులకు ఇంటికి తిరిగివస్తున్న పతిదేవుని పరమశివుని ఆగమనానికి సిద్ధపరచుకుంటోంది తనువునూ మనసునూ .  కచ్చూరాలు వట్టివేళ్ళు వేసిన సున్నిపిండితో వడలంతా నలుచుకుంటోంది . తనని తాను అందంగా ఆహ్లాదంగా మలచుకుంటోంది. తనలోంచి తొలచుకు వస్తున్న మధురోహలూ పెదవుల మీద చిరునవ్వు దొంతరలు అవుతున్నాయి ఆమెకు . ప్రతి స్త్రీ లోనూ అంతర్లీనంగా ఉండే మాతృత్వపు మమకారము ఆమెలో మొలకలు వేస్తోంది.  లోకాలను సృజించే శక్తి  విధాతకే ఉండవచ్చు గాక , కాని సృజనాత్మకత స్త్రీల సొత్తు. సున్నిపిండి నలుగు ఆమె ఆలోచనలకు తగినట్టుగానే రూపు దిద్దుకుంది అందమైన బాలుని బొమ్మగా . ఆమె దేహంలో భాగముగా,  ప్రాణంలో ప్రాణంగా,  ఆలోచనల ప్రతిరూపంగా.  సజీవమూర్తిగా మారి ఎట్టఎదుట నిలుచున్నాడు. 

కంగారు శివుని ఆగ్రహానికి గురి అయినా, అమ్మ దయవలన  కమనీయమైన ప్రసన్న వదనుడైనాడు.  గజాననుడిగా గర్వంగా నిలచాడు దేవగణాధిపతిగా  .  విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా మన ఇష్ట దైవంగా.

తల్లి ,..తప్పులు వంకలు ఎంచని తల్లి, 

పిల్లలు ఏమన్నా ఎలా ఉన్నా పరవశించి నవ్వే తల్లి, పిల్లల చిన్నమెత్తు బాధకు కూడా కంపించిపోయే తల్లి, అడగకుండానే అన్నం పెట్టి, చెప్పకుండానే బాధను గ్రహించి గుండెలకు హత్తుకునే తల్లి, తల్లితనానికి ప్రతిరూపం, ఆ జగజ్జనని కి ప్రణామము.

ప్రస్తుత కాలపు మహిళ కూడా సృజనాత్మకతకు అందెవేసినచేయే. తమ ఊహలతో చేతలతో చేతులతో ఎన్నో కళా రూపాలను సాకారం చేస్తున్నారు. సృజనాత్మకంగా హంగులు  ఆకారాలు ఏర్పరుస్తున్నారు . అవి బొమ్మలూ  , రంగుల చిత్రాలూ అవచ్చు  , ధరించే వస్త్రాలు  , పెట్టుకునే ఆభరణాలు కావచ్చు , వేసుకునే పాదరక్షలూ , రోజువారీ ఉపయోగించే వస్తువులూ ఏదైనా కావచ్చు . గృహాలంకరణ ( ఇంటీరియరి డిజైన్) ,  వివిధరకాలైన శిరోజాలక రణ ( మేకప్ )  పెళ్ళిళ్ళు పందిళ్ళ అలంకరణ .. ఏదైనా వారి సృజనాత్మకత కు అంతే లేదు . హస్తకళలు , చిత్రలేఖనము, శిల్పము , చలనచిత్రము ,పాక శాస్త్రం, దృశ్య మాధ్యమము , సాహిత్యమూ సంగీతము , నటనా, నాట్యమూ అన్నిరంగాలలోనూ వారి కృషి అసక్తి వెల్లి విరిస్తోంది.  స్త్రీసృజనాత్మక శక్తి కి హద్దులు ఎల్లలూ లేవిపుడు. అంతే కాకుండా  వాటిని వారు తమ వృత్తులగా కూడా మలుచుకుని , ఎంతో ఎత్తులకు ఎదుగుతున్నారు

దసరా విజయదశమి రోజులలో ఆడపిల్లలు మన ఇళ్ళల్లో  బొమ్మలకొలువు పెట్టుకోవడం ఎప్పటినుండో ఉన్న సంప్రదాయం.   వారి ఆసక్తి ప్రతిభ ప్రతిబింబించి , ఆ అలంకరణలో వారి సృజనాత్మకత కూడా కొలువు తీరుతుంది.  

విజయదశమి ఆ పార్వతి దేవి కీర్తికి శక్తికి గుర్తుగా కొనియాడే పండుగ . ఆదిశక్తిని కొలవడంతో పాటు , సజీవమైన బొమ్మను చేసిన  ఆ ‘అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ  ‘ గుర్తుగా  మనం పెట్టే బొమ్మల కొలువు ,

 ఈ జగత్తునూ  సృష్టినీ  బొమ్మల రూపంలో కనుల ముందు చూపే సృజన కదా! 

 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.