ఇక్కడ– అక్కడ 

-కుందుర్తి కవిత

పెళ్ళైన కొన్నాళ్ళకే 

పుట్టింటి మీద బెంగొచ్చి వచ్చా

ఇక్కడ….

చిన్ననాటి స్నేహితురాళ్ళంతా

కలిసి చాన్నాళ్ళయిందని

వచ్చి చుట్టూ చేరారు …

రుసరుసలాడుతూ,

తమలోతాము

గుసగుసలు చెప్పుకుంటున్నారు

ఏదో నిర్ధారణకి వచ్చినట్టుగా

నాతో యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు గా

నా ఆత్మగౌరవం నన్ను నిలదీసింది

నీకసలు ఆత్మసాక్షి అంటూ ఉందా అని

చిన్నప్పటినుండీ వేలు వదలకుండా 

నీతోనే నడిచిన నీ చిరకాల స్నేహితురాలిని

ఈరోజు ఎవరెవరి కోసమో

వదిలెళ్ళిపోతావా అని

ఎవరో కాదు నా వాళ్ళే అని సంకోచంగానే

నాకు నేను సర్ది చెప్పుకున్నాను

కనీసం అప్పుడప్పుడైనా పలకరించవేమని

చిందులు తొక్కుతూ 

చటుక్కున చక్కా పోయిందది ,

నామీద కాసింతైనా 

మర్యాద లేకుండా !! 

అచ్చం అక్కడి గర్వం లాగే !!

నా ఆత్మ విశ్వాసం

నన్నూ నీతో తీసుకుపొమ్మంది

నీకక్కడ సరిపడినంత చోటు ఉండకపోవచ్చు అంటే…

ఈ ఇంటికంటే ఆ ఇల్లు పెద్దదికదా అని ప్రశ్నించింది

అవునో కాదో నాకే తెలీనట్టు తలూపాను

దాని అమాయకత్వానికి నాలో నేనే నవ్వుకున్నాను

ఇరుకు ఇంట్లో కాదు, 

మనుషుల మనసుల్లో అని 

నోటిదాకా వచ్చినా, చచ్చినా వద్దనుకొని

దాని నోరే, సులువు కదాని నొక్కేసాను

విశ్వాసం లేని చూపులు విసురుతూ 

విరవిరా వదిలి వెళ్ళిపోయింది !! 

అచ్చం అక్కడి స్వార్ధం లాగే!!

వెనుకనుంచి భుజంమీద తట్టి

నన్ను మర్చిపోయావా, అనింది

నా ఆత్మాభిమానం

నాకోసం కాసింతైనా పోరాడాలనిపించలేదా 

అని అడిగింది 

ఎంత ప్రేమించిన మనిషి కోసమైతే మాత్రం,

నిన్నెప్పుడూ ప్రేరేపించిన నన్ను

అలా నడిరోడ్డుమీద వదిలి పోతావా అని నిలదీసింది

ఎన్ని రోజుల సావాసం ఈ గుడ్డి నమ్మకమనింది, 

విద్రోహం జరిగితే, 

నిజం నిష్టూరమై బయటపడితే,

ఎప్పటికైనా నేనే దిక్కనింది …

కళ్ళు తెరుచుకున్న రోజు 

మళ్ళీ నన్నే వెతుక్కుంటూ వస్తావనీ,

నా విలువ తెలుసుకుంటావనీ 

అరుస్తూ, ఏమాత్రం అభిమానం లేనట్టు 

అమాంతం ఎగసిపడింది!!

అచ్చం అక్కడి అహం లాగే !!

అయినా, అవన్నీ విన్నా, అన్నీ తెలిసినా

ఓ వైరాగ్యపు నవ్వు నవ్వి ఊరుకున్నాను

‘సమ’సమాజంలో,

అక్కడి సభ్య సమాజంలో

ఇదంతా సామాన్యమని

తెలిసొచ్చిందిప్పుడు

నేనే ఇన్నాళ్ళూ, ఇన్నేళ్ళూ అసామాన్యమని

తేరుకున్నాను

ఆ ఇంటిల్లిపాదినీ తృప్తి పరిచే శిలువ నేనే 

తీసుకు మోస్తున్నాను 

అసమంజసంలో,  ఏదీ అర్ధంకాక

అక్కడందరూ సంతోషంగా ఉంటే చాలనుకున్నాను

నా ఆనందం అందులోనే కంటే మేలనుకున్నాను 

పిచ్చి మాలోకాల్లారా, పిచ్చి ప్రేమ విలువ మీకేం తెలుసని నవ్వుకున్నాను

మనసు లోతుల్లోంచి లీలగా వినపడిన

ఆత్మ ధ్వనిని, అంతర్గత స్వరం

అరుపుల్ని అణిచేసాను

బుద్ధి పొరలతో కప్పేసి దాన్ని పాతేసాను

హమ్మయ్యా ఎవరూ వినలేదు,

చూడలేదు అని చేతులు దులుపుకున్నాను !!

కానీ మది గది తలుపుల వెనుక

దాగున్న నా ఆ శ్రేయోభిలాషులు

నోర్లు నొక్కుకుని విస్తుపోయారు !!

వాళ్ళ పీకలు నొక్కేసినట్లు నిర్ఘాంతపోయారు!!

నిజమే

సగం జీవితం గడిచిపోయాక

ఈ రోజెందుకో అకస్మాత్తుగా 

నా ప్రేమ పాపం పండింది

అసలు కథ, వ్యథ బయటపడింది

సిసలు పిచ్చిమాలోకాన్ని నేనని తెలిసింది

అక్కడ

నా సహనానికి విలువ లేక

నా మానానికి ఉనికి లేక

నా అభిమానానికి ఆదరణ లేక

నా కన్నీటికి  నిలువ నీడ లేక

నా అస్తిత్వం కొన ఊపిరితో విలవిల్లాడుతుంటే

దానికి ఊపిరి పోసిందెవరో తెలుసా ??

నేను చేతులారా దహనం చేసిన 

నా అంతరంగ దాహం

నా ఆత్మధ్వనే !!

నాకు అణువంతైనా అనుమానం రాకుండా

నాలోపల శవాలై పడి ఉన్న 

విలువల కుప్పల్లోంచీ,

చావు బ్రతుకుల మధ్య ఊగుతున్న

ఆశల చివరి శయ్యమీంచీ

తుది శ్వాసలు తీసుకుంటున్న

నా ఆదర్శాల ఐ.సి.యూ నుంచీ

అశ్రువుల తో నిండుకున్న

అర్ధం పర్ధం లేని

పాడు పద్ధతుల, మూఢ నమ్మకాల 

సమాధుల నుంచీ

నెమ్మదిగా చడీ చప్పుడూ లేకుండా

ఎప్పుడు తప్పించుకు

లేచొచ్చిందో తెలీదు కానీ..

నా ఆత్మవిశ్వాసం ……

అసలు సిసలైన నన్ను,

నేను మరిచిపోయిన నన్ను,

నాకే కనుమరుగైన నన్ను,

కాపాడి, కన్నీరు తుడిచి

నిద్ర లేపి, మళ్ళీ నాకు పరిచయం చేసి

బ్రతికించి, భ్రాంతులు తొలగించి, భయం పోగొట్టి

బాదరా బందీ లేకుండా, భారాలు దించి

కవిత్వపు బతుకు బాట చూపించింది !!

నా ఆత్మగౌరవం, ఆత్మాభిమానం 

ఇవే కదా నా బంధువులు

నా ఆప్త మిత్రులు

ఆనాడు లెక్కచేయలేదనీ

నాతో అక్కడికి తీసుకు పోలేదనీ

వాటికోసం పోరాడలేదనీ

కోపంతో వదిలెళ్ళిపోకుండా,

ఓపిగకగా, ఒద్దికగా, ఓర్పు తో

నా లోలోపలే వేచున్నందుకు

ఈనాడు నావెంటున్నందుకూ 

ఎలా కృతజ్ఞతలు చెప్పుకోగలను ?!

నా కోపం కట్టెలు తెంచుకు పారే పగటి కోసం

నరనరాల్లో రక్తం రగిలే నడిరేయి కోసం

నా ఉక్రోషం ఉరకలు వేసే ఉదయం కోసం

ఉద్వేగం ఉరుములై కురిసే కాళరాత్రి కోసం

నా కన్నీటి ధారలు ఎండి విప్లవ చిగుళ్ళు పూచే చైత్రం కోసం

కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసి

వళ్ళు ఖడ్గమయ్యేలా పదును చేసి

పోరాటానికి సిద్ధం కమ్మని చేయి చాచి

నేనోడిపోకముందే

నన్ను నేను ఆడిపోసుకోకముందే

సరైన సమయానికి

నన్నీ ఊబిలోంచి బయటికి లాగిన

నా ఆత్మధైర్యానికీ,

ఆత్మస్థైర్యానికీ,

నా విలువలకీ,

ఆదర్శాలకీ

నా సహనానికీ

నే పెరిగిన 

ఇక్కడి’ 

స్వచ్ఛ, స్వేచ్ఛ వాతావరణానికి..

ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను ??

ఈ కవిత రూపం లో  

నా కన్నీటి అభిషేకం తప్ప !!!

*****

Please follow and like us:

4 thoughts on “ఇక్కడ- అక్కడ (కవిత)”

  1. ఎవరికివారు ఆత్మపరిశీలన చేసుకుంటే చాలు దిశానిర్దేశం కలుగుతుందన్న ఆలోచన బహుబాగుంది.

  2. ఇన్నేళ్ళూ నిద్రాణంగా ఉన్న కవిత్వం ఝరి ఇప్పుడు ఇలా కవితా రంగంలోకి పరుగులు పెడుతూ రావటం చాలా ఆనందంగా ఉంది.ఇక ఆపకుండా తాతగారి సాహిత్య వారసత్వాన్ని అంది పుచ్చుకోవాలని ఆశిస్తున్నాను.శుభాకాంక్షలు కవితా

Leave a Reply

Your email address will not be published.