చిత్రలిపి

నా హృదయమొక విహంగమై

-మన్నెం శారద

క్షణక్షణం రూపు మార్చుకుని 

 యిట్టె పరుగులెత్తే మబ్బు తునకల్ని 

అట్టే పట్టుకుని  అక్షరాలుగా మార్చి 

గుండెలోని ఊసుల్ని  

గాలిలోకి  సందేశాలు చేసి  పంపుతుంటాను 

రాత్రి కలలనిండా  దోబూచులాడి 

మురిపించి మరపించిన  ఊహల్ని 

పగలు రెక్కలు ఇచ్చి  

గగనవిహారానికి సాగనంపుతుంటాను 

మనసుకి గజ్జెలు కట్టి మయూరమై నర్తిస్తుంటాను 

నీటిని గుడ్డ లో మూట కట్టాలని చూస్తాను  నేను !

పిచ్చి అని నవ్వుతారు  కొందరు …

ప్రేమ అని భ్రమిస్తాను  నేను !

మనమే కట్టుకున్న కటకటాల మద్య 

దుఃఖాన్ని   మోస్తూ 

 అదే ధర్మం అనుకునే జీవులకి నేనేమీ చెప్పలేను 

కులమతాల కాలుష్యపు  

బొగ్గుపులుసు వాయువునుండి  కాసేపు 

అలా అలా  ఆకాశంలోకి ఎగసి  

ప్రాణవాయువు  పీల్చుకుని  తిరిగి వస్తుంటాను 

కాళ్ళిక్కడే ముళ్లపొదలతో చిక్కాడు వున్నాయి కదా మరి!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.