బహుళ-5

      బొమ్మహేమాదేవి కథ “ఏక్ స్కూటర్ కీ వాపసీ”

 – జ్వలిత

సాహిత్య చరిత్రలో తెలుగు కథకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులో తెలంగాణ కథ అస్తిత్వ పోరాటాలను ప్రతిబింబించేదిగా ఉంటుంది. తెలంగాణ నిజాం పాలనలో ఉన్నందున తెలంగాణ కథా సాహిత్యం పై మిగిలిన భాషా ఉద్యమాల ప్రభావం కొంత తక్కువ అని చెప్పవచ్చు. తెలంగాణ ప్రాంత కథకులు ఎక్కువగా రాసినప్పటికీ వాటికి రావలసినంత ప్రాచుర్యం రాలేదనవచ్చు. అందులో మహిళల స్థానం మరీ తక్కువ అనేది అంగీకరించవలసిన సత్యం.

తెలంగాణ నుంచి రాసిన తెలుగు కథలు మొదట్లో ఆంధ్ర ప్రాంతం నుండి వెలువడిన “హిందూ సుందరి”, “కృష్ణా పత్రిక”, “ఆంధ్రభారతి” పత్రికలలలో ప్రచురితమైనాయి. అయినప్పటికీ 1913లో మహబూబ్నగర్ నుంచి తొలి తెలంగాణ స్వతంత్ర పత్రిక “హిత బోధిని” పేరుతో వెలువడింది. ఆ విధంగా తెలంగాణ కథల ప్రచురణకు అది వేదిక అయింది. అప్పటి వరకు ఆంధ్ర ప్రాంతంలోని పత్రికలకు కథలు రాయని వారు కూడా తమ ప్రాంతం నుండి పత్రిక రావడంతో అనేకమంది కొత్త కథకులు రూపు దిద్దుకునే అవకాశం లభించింది. హిత బోధిని పత్రిక స్థాపకులు అయిన బండారు శ్రీనివాసరావు కథలు అందులో అచ్చయ్యాయి. ఆ తర్వాత 1921లో నీలగిరి పత్రిక ప్రారంభమైంది. తెలంగాణలో ప్రప్రథమంగా ప్రారంభమైన ప్రజా చైతన్య కార్యక్రమం గ్రంధాలయోద్యమం, గ్రంధమాలల స్థాపన. 1911 లోనే అయితరాజు జీడి కంటి రామారావు మొదటి కథ రాశారు. 1934 లో ఖమ్మం జిల్లాలో జరిగిన ఆంధ్ర మహాసభలో “గ్రంథాలయోద్యమం, నిర్బంధ ప్రారంభ విద్య తో పాటు మాతృభాషలో స్త్రీలకు ఉన్నత విద్య” అనేక తీర్మానాలు చేశారు. ఈ సభలో పలువురు ప్రముఖులతోపాటు శ్రీమతి లక్ష్మీబాయమ్మ, వరలక్ష్మమ్మ, భారతి రత్నాకరాంబ వంటి మహిళా మూర్తులు కూడా పాల్గొన్నారు.

అయితే తెలంగాణలో కథా రచయిత్రులు ఉన్నప్పటికీ అంతగా ప్రచారానికి నోచుకోలేదు. అటువంటి వారిలో తొలి తెలంగాణ బీసి కథా రచయిత్రి, తొలి నవలారచయిత్రి “బొమ్మ హేమాదేవి” గురించి కావలసినంత సమాచారం రికార్డ్ చేయబడలేదు. ఆ లోటును గ్రహించిన ప్రముఖ సాహిత్య పరిశోధకులు, సాహితీవేత్త సంగిశెట్టి శ్రీనివాస్ గారు బొమ్మ హేమ దేవి కథలను సేకరించారు. వారి సంపాదకత్వంలో “బొమ్మహేమాదేవి కథలు” అనే కథా సంకలనాన్ని 2017లో ప్రచురించారు.

బొమ్మహేమాదేవి 100కు పైగా కథలు 40నవలలు రాసినట్టు సంగిశెట్టి శ్రీనివాస్ తమ పరిశోధనల ఫలితంగా తెలిపారు.

ప్రస్తుత మన కథ 1975 సంవత్సరం మే నెల “తరుణి” అనే పత్రికలో ప్రచురించ బడింది.

నేటి కథ ” ఏక్ స్కూటర్ కీ వాపసీ” లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట కథ. విశ్వ అనే భర్త, శారద అనే భార్య. విశ్వకు హిందీ సినిమాలంటే ఇష్టం. శారదకు హిందీ అర్థం కాదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు, సర్దుకుపోవాల్సిన
సమయంలో అవసరం లేని కోపాలు అనవసర అహంభావాలు ఎలా నష్టపరుస్తాయో రచయిత్రి చాలా చతురంగ చెప్పారు. ఎక్కడ హాస్యోక్తులే కనపడవు కథలో. కానీ నీ కథ ముగింపు చదివిన తర్వాత మనకు తెలియకుండానే మన పెదవులు విచ్చుకుంటాయి, అంతేకాదు అయ్యో అనుకుంటాం రచయిత్రి అంత సరళంగా లౌక్యంగా కథారచన సాగించారు.

మనం రోజూ చూసే కుటుంబాలు వాటి వాతావరణమే హేమాదేవి కథల్లో మనం చూస్తాం. భర్త తరపు బంధువులు వస్తే భార్య, భార్య తరపు బంధువులు వస్తే భర్త వ్యవహరించే తీరులో తేడాలు, అతి మామూలు అతివృష్టి అనావృష్టి అంతే తప్ప అవసరమైన చిరుజల్లు గానీ వనరులు అందించే జడివాన గానీ మానవ సంబంధాలలో కనిపించవు. ఎక్కడ సమిష్టి బాధ్యత బంధము కనపడని మనుషుల తీరును వర్ణించారు. అంతేకాదు ఈ కథలో కనిపించని మూడు పాత్రలను ప్రస్తావించి అందులో ఎక్కువ లౌక్యం తెలిసిన అదృశ్య వ్యక్తిని పరిచయం చేశారు.

దంపతులైన శారదా విశ్వలు ఇద్దరు ఒకరి మీద కోపంతో ఒకరు ఇంట్లో సామాన్లన్నీ ఎంత ఇష్టం గా కొని తెచ్చుకున్నారు అంతకు మరిన్ని రెట్లు కోపంతో నేలకు విసిరి కొడుతూ పోటీపడుతూ ధ్వంసం చేసుకోవడం మన కళ్ళకు కట్టినట్టు చిత్రీకరిస్తూనే మీడియా ప్రభావం మనుషులపై ఎటువంటి అనర్ధాలకు దారితీస్తుందో అలవోకగా తెలిపారు. రేడియోలో ప్రసారం అయ్యే వ్యాఖ్యానాలు ఆ ఇంటి ఇల్లాలు పై ఏ విధంగా పనిచేసి ఆత్మహత్య ఆలోచన కలిగిస్తాయో ఎంతో చక్కగా చెప్పారు.

ప్రేమ పెళ్లిళ్లు విఫలమవడానికి కారణాలను కూడా అన్యాపదేశంగా ప్రస్తావించారు కథలో. ప్రేమించి పెళ్లాడారు కాబట్టి జీవితం స్వర్గ ప్రాయమని, మల్లెల పానుపని, పూల బాటని అనవసర ఆశలలో విహరించడం నాటి నుండి ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉంది. వివాహానంతరం ఒకరినొకరు గౌరవించు కోకుండా పరస్పర నమ్మకాలు లేక క్షణికావేశం లోనుకావడం ఎంత అవివేకమో తెలిపారు రచయిత్రి.
మొదటిలో ఉన్న ప్రేమ ఆకర్షణ వివాహానంతరం అంతే స్థాయిలో కొనసాగాలని అనుకోవడం అత్యాశే. సినిమాల్లో చూపించినట్టు నిజజీవితాలు ఉండవనే సత్యం గ్రహించలేక పోవడం కథలో మనకు కనపడుతుంది. ఏ జంటయినా పరస్పరానురాగంతో సర్దుకుపోతే కానీ భౌతిక ఆర్దిక అవసరాలయినా తీరగలవు. ఏమి సుఖం ఏమి ఉపయోగం అంటూ అనవసర ప్రశ్నలతో మనశ్శాంతి పోగొట్టుకొని, జీవితాలను నష్టపోతామన విషయాన్ని వివరిస్తూనే, పల్లె నుండి పట్నం చేరగానే ఆలోచనల్లో వేషధారణలో వచ్చే మార్పులను వివరించారు.

శారద పట్టుదలకు పోవడం, విశ్వ ఇంకా సమయం ఉందిలే అని నిర్లక్ష్యంగా రేడియో వింటూ కూర్చోవడం అనే సంఘటనను చెప్పుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి ఏమి ఆశిస్తున్నారో తెలిసి ఆ ఆశలు తీర్చడం తమ చేతిలో ఉన్నప్పటికీ ఉపేక్షించడం, ఆ విధంగా ఎదుటివారిని బాధించడమే కాక వారి అహాన్ని రెచ్చగొట్టడమేనని రచయిత్రి చాలా బాగా చెప్పారు.

అతి మామూలుగా స్త్రీలు కోరుకునేది ఆపేక్షను భర్త నుండి ప్రేమను. బుద్ధిపూర్వకంగా భార్యను ఉపేక్షిస్తున్నప్పుడు, ఒక స్త్రీ ప్రదర్శించే అసహనం కోపం వంటి భావోద్వేగాలను స్థాయిల వారీగా కథలో చక్కగా చెప్పారు. విసురుగా లోపలికి పోవడం, భర్తకు వినబడేటట్టు గొణగడం, ఆమె మాటలు వినపడకుండా విశ్వ రేడియో సౌండ్ పెంచు కోవడం, భార్య గది నుండి బయటికి వచ్చి మాటలు అరవడంలోకి రావడం, ఇద్దరి మధ్యలో మాటలు కుటుంబాలను దాటి వంశాల స్థాయికి పోవడం, ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకుంటూ ఇంట్లో సామాన్లు విసిరి కొట్టుకోవడం వంటి వివరిస్తూనే మనుషుల మానసిక ధోరణులను తెలిపేందుకు కొన్ని మాటలు రాశారు.
“ఆ ఇద్దరూ మనుషులు కోపాలతో ఉగ్రరూపాలు దాల్చి చూడడానికి ఎంతో భయంకరంగా కనిపిస్తూ, ఇంటి రూపాన్ని మార్చివేశారు.
చదువుకున్న వాళ్ళే, సంస్కారం ఉన్న వాళ్ళే, కానీ కోపం ఉద్రేకం వచ్చినప్పుడు ఎట్లా కంట్రోల్ చేయాలి తెలియనివాళ్లు” అంటారు రచయిత్రి.

రేడియోలో వచ్చే ఒక కార్యక్రమానికి సంబంధించిన వార్తలను ఆ కుటుంబ వాతావరణానికి రచయిత్రి సమన్వయం చేశారు. రేడియోలో “ప్రాణ నష్టం కూడా” అనే మాట శారదకు ఒక కొత్త ఆలోచనను కలిగిస్తుంది విశ్వ వెంటనే శారదలో మార్పును పసిగడతాడు. ఆమె ఆత్మహత్య ప్రయత్నాన్ని అడ్డుకుంటాడు. చివరికి చిన్న పిల్లలను బుజ్జగించి నట్టు బుజ్జిగిస్తాడు, “ఐలవ్యూ” అంటాడు, “నిన్ను పోగొట్టుకోవడానికి కాదు తెచ్చుకున్నది” అంటాడు.
అయితే మొదట్లో ఆ ఇల్లాలు కోరుకున్నది కూడా ఆ బుజ్జగింపులే కదా ! ఆ ప్రేమ వ్యక్తీకరణే కదా! అదే విషయాన్ని రచయిత్రి వివరించారు.

తమ వారిని తన సౌఖ్యాలను వదులుకొను వచ్చిన భార్య, తమ కుటుంబం కోసం సర్దుకు పోయింది. భర్తలు ఆ విషయం గ్రహిస్తే సంసారాలలో ఆనందం మిగులుతుంది.
అని చెప్తూనే ఎక్కడా స్త్రీ పక్షపాతం చూప లేదు రచయిత్రి. ఆవేశాలను నియంత్రించు కోవలసిన అవసరాన్ని చెప్పారు.

వీళ్ళ గోలలో వీళ్ళు ఉండగా స్కూటర్ కనిపించకుండా పోతుంది. ఇద్దరూ సర్దుకొని పోలీసులకు ఫిర్యాదు చేసి వచ్చేసరికి స్కూటర్ తో పాటు ఒక లేఖ, శారద కోరుకున్నట్టు రెండు సినిమా టిక్కెట్లు ఉంటాయి.
అల్లూరి సీతారామరాజు సినిమా చూడాలి అనుకున్న శారద టికెట్లు దొరికిన తరువాత తల నొప్పిగా ఉంది వద్దంటుంది. కానీ టికెట్లు వేష్టవుతాయని, విశ్వ ఆమెను బలవంతపెట్టి రెండో ఆట సినిమా తీసుకువెళతాడు.
అదే కోరిక మొదటి కోరింది. ఇంతటికీ కారణం అయినా ఆమె సినిమా కోరికను విశ్వ ముందు అంగీకరించలేదు. చివరికి సినిమా చూసి వచ్చే సరికి ఇంట్లో దొంగలుపడి దోచుకోవడం జరుగుతుంది. దోచుకున్న వారు ఒక లేఖను వదిలి వెడతారు.

ఆ లేఖే ఈ కథలో చెప్పిన పాఠం.
మీకు అవసరం లేని వస్తువులు మరొకరికి పనికివస్తాయని, మీకు డబ్బు ఉద్యోగాలు కూడా ఉన్నాయి, అవి లేని వారు ఆకలితో అలమటించే వారికి ఉపయోగపడతాయని. ఆ దొంగ వారికి పాఠం నేర్పుతాడు. దంపతులు ఉత్తరం చదవడంతో కథ ముగుస్తుంది.

బొమ్మ హేమాదేవి ఈ కథను చాలా చక్కగా ఆపకుండా చదివించే విధంగా 1975లో రాశారు.

………

బొమ్మ హేమాదేవి గురించి :
1931 సెప్టెంబర్ 14 వ తేదీన నిజామాబాదు లో గంగాదేవి రామా గౌడ్ దంపతులకు జన్మించిన బొమ్మ హేమ దేవి తల్లిదండ్రులు పెట్టిన అసలు పేరు యమున ఈమెను కరీంనగర్ మానకొండూర్ కు చెందిన బొమ్మ నారాయణ గౌడ్ ని వివాహమాడింది తరువాత రుక్మిణిగా పేరుపొందినది. 1973లో రాసిన “కుంకుమ పూలు” కథ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టినది. దేవి ప్రియ పేరుతో రచనలు మొదలుపెట్టిన ఆమె తరువాత తన కోడలు “హేమాదేవి” పేరుతో 40 నవలలు వందకు పైగా కథలు రాశారు.
తొలి తెలంగాణ బీసీ కథకురాలు, నవలాకారిణి.
మనసుకు హత్తుకొనే కథనం తెలంగాణ నుడికారంతో పాటు ఆంగ్లం, హిందీ, ఉర్దూ పదాలు అనేకం ఉంటాయి. అందుకు సాక్షాలు “ఏక్ స్కూటర్ కీ వాపసీ“, “మిస్టర్ అనంత్”, “ఇజాజత్ హై”, “ఫాల్స్ ఫ్రైడ్”, “ఛోటీ ఛోటీ బాతే” అనే ఆమె కథల పేర్లు.

 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.