మిణుగురులు

-శ్రీసుధ మోదుగు

సాయంత్రం బుగ్గ వాగు  దగ్గరికి నడుస్తున్నారు ఇద్దరూ, దూరంగా చిన్న కొండలు వర్షాకాలంలో ఆకుపచ్చగా, ఎండాకాలంలో పసుపచ్చగా మారిపోతాయి. ఎలా చూసినా అందంగానే ఉంటాయి.

“బుగ్గ వాగులో నీళ్లు లోతు లేనట్లు కనిపిస్తాయ్, కానీ లోతెక్కువ. ఎప్పుడూ వాగులో దిగకు. శివా! వింటున్నావా?”

“ఆ … కాక.”  

“శివ! మీ అమ్మ వచ్చి పిలిస్తే వెళ్ళిపోతావా?” 

“కాక! అమ్మ మంచిది కాదా?” 

“మంచిది శివ.” 

“పున్నమ్మ చెప్పింది అమ్మ మంచిది కాదు, వచ్చి పిలిస్తే ఎల్లమాకని. మంచి అంటే ఏంటి కాకా.” 

“నాకు తెలీదు శివ.” 

“కాక! నాకు ఈత నేర్పవా? ఈత వస్తే నీళ్లు ఎంత లోతున్నా ఏమి కాదు. అప్పుడు బుగ్గ వాగులో, కృష్ణాలో, సముద్రంలో కూడా ఈత కొట్టచ్చుకదా!” 

లక్ష్మయ్య శివ వైపు ప్రేమగా చూసాడు. వాడి చేతివేళ్లు పొడుగ్గా సన్నగా ఉన్నాయి. 

“బహుశా చిత్రకారులకు ఇలా ఉంటాయేమో!  రవికి ఇలానే ఉండి ఉంటాయా?  అతను ఎంత చిత్రంగా ఉంటాడు. ఆమె అతన్ని ఎందుకు ఎంచుకుందో? నిర్మలంగా నవ్వుతుంది. అభిమానంగా చూస్తుంది. పెదవుల చివర వంపు తిరిగినట్లు ఉండి ఎప్పుడూ నవ్వు ముఖంతో కనిపిస్తుంది. ఆ కళ్ళలో కాంతి. వాటికి రంగులు కావాలి. ఆగి ఆగి ప్రవహించే ప్రవాహం ఆమె.” 

“ఇక్కడ బావుందా?” అని అడిగిన ప్రశ్నకి ఆమె చెప్పే సమాధానం “తెలీదు.”  

“ఎన్ని తెలీదులు ఆమె సమాధానంలో.”

**

“శాంతను చూస్తే మొఘల్ రాజ్యం నుంచి వచ్చిన హమీదాబేగంలా ఉండేది. కనుబొమ్మలు కలుసుకొని ప్రశ్నిస్తున్నట్టుగా ఉంటుంది. హమీదా, హుమయూన్ని ఇష్టంలేకుండా చేసుకుంది కదా! అందుకే ఆమె చిత్రాల్లో ఎదో విషాదం. తనలో అంతకు ముందున్న శూన్యమంతా శాంత మౌనంతో నిండిపోయింది. తను అక్కడ ఘనీభవించిన రాజకుమార్తెలా ఉండేది. 

కానీ కాఫీ ఇచ్చే చేతిని తాకినప్పుడు ఆమె ఎలా చూసింది? కళ్ళతో కాటేస్తున్నట్లు.  

నేనేం రాముడిలా పచ్చి తాగుబోతుని, తిరుగుబోతుని కాదు కదా! అయినా వాడిని చూస్తే ఆమె కళ్లెందుకు వెలుగుతాయి? భర్త కాబట్టా? లేకా నిజంగానే రాముడంటే ఇష్టమా? అంత ఇష్టముంటే  రాముడు పోయాక చిత్రకారుడితో ఎలా వెళ్లిపోయింది? ఇంతకీ రాముడు ఎలా చనిపోయాడు?  కారణం పామా లేమా ఆమెనా? 

ఆమె నన్నెందుకు అర్థం చేసుకోలేదు? అట్లా కాదులే నాలోనే ఎదో నలుపు.”

**

“కాక! ఇంటికెల్దామా?”  

వాళ్ళ అడుగులు ముందుకు పడుతున్నాయి. గాలిలో లేచిన దుమ్ము నీరెండలో ఆరంజ్ రంగులో మెరుస్తుంది. వాళ్లప్పుడు యుద్ధంనుంచి వస్తున్న యోధుల్లా ఉన్నారు. 

ఊర్లోకి రాగానే శివ చేయి విడిపించుకొని, “వెంకటేశ్వర్ల దగ్గరికెళ్ళొస్తా కాకా” అంటూ పక్కనే ఉన్న గొల్లోళ్ల  గొందిలోకి పరిగెత్తాడు. 

“విడిపించుకున్నాక కూడా వాడి చేతి తడి తెలుస్తుంది. ఎంత మృదువుగా ఉంటాయి ఆ చేతులు. ఎంత ఆర్ద్రంగా, ఆపేక్షగా ఉంటాడు. చిన్నపిల్లల్లో ఉన్నయోగి వీడు. శివ మనసునిండా ప్రేమే ఉంది. ప్రేమ తప్ప ఏమీలేదు, వాళ్ళమ్మలాగనేమో! శాంత వచ్చి ఇమ్మంటే పంపించాలి. శివని ఉంచుకోవడానికి తనకు ఏమి అధికారముంది. తల్లి నుంచి బిడ్డని విడతీసి మేము ఇచ్చేందేంటి? శాంత మీద కోపంతో శివమీద అమ్మ తూలే మాటలు తప్ప. ఎప్పుడో వస్తుంది బిడ్డ కోసం, ఇవ్వక తప్పదు. రాకపోతే బావుండు.” 

ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే పున్నమ్మ ఎత్తుకుంది. ముక్కు ఎగబీలుస్తూ ఏడుస్తుంది. “ఆ బొమ్మలేసుకొనే వాడు పట్నంలో కనిపించాడంట. వాళ్ళు బాగుపడతారా” అంటూ మట్టి పిడికిళ్ళల్లో తీసుకొని పోస్తుంది.  “పాము కాదురా, ఇదే మందుపెట్టి చంపింది నా కొడుకును. దీన్ని కాటేయని పాము వాడినెట్టా కాటేస్తదిరా! వాడు పోయినప్పుడు దాని కళ్ళల్లో ఒక్క చుక్క నీరు లేదు. బిడ్డనిడిచి పోయిన తల్లిని దీన్నేచూసిన. దీని నోట్లో మన్నుబడ.”

“ఎన్నిరోజులు ఇట్లా తిడతావ్” విసుక్కున్నాడు లక్ష్మయ్య.

ఏడిచే ఏడుపు టక్కున ఆపి, “ఎడిరా శివ” అంది. 

దొర్లి దొర్లి ఏడ్చే అమ్మఏడుపు అట్లా కీ ఇచ్చినట్లు ఎట్లా ఆగుతుందో ఎప్పుడూ అర్థంకాదు లక్ష్మయ్యకి.

“లేచిన దగ్గర్నుంచి ఆళ్ళ ఇళ్ల చుట్టూ తిరుగుతడేంది. యాడకి పోతాయి బుద్ధులు. వాడికి నీ గారాబం ఎక్కువైంది లచ్చా. వాడిని బడికి తోలకుండా, నీతో పాటు బుగ్గవాగు వైపు తిప్పమాకు. అప్పాలు చేసిన, ఎడాడు.”

“అమ్మా! నువ్వు తిడుతుంటావ్. ప్రేమ చూపుతుంటావ్. కోపం ఎవరిమీదమ్మా? అట్లాంటి మాటలు వాడి ముందనకు. చిన్న మనసు అర్థమయితే తట్టుకోలేదు.”  

“నేనేమన్నారా, ప్రతి దానికి వాడ్ని ఎనకేసుకొస్తావ్, దానిని ఇట్లనే ఎనుకేసుకొచ్చినవ్, అది…” అని మాటలు మిగింది. 

శివ పరిగెట్టుకుంటా వచ్చాడు. “నాయనమ్మ” అనుకుంటా. 

“కాళ్ళుసేతులు కడుక్కొని రాపో అట్లా.”  

పున్నమ్మ చేతిలో అప్ప లాక్కొని లోపలికి పరిగెత్తాడు. 

రుసరుస చూసింది.

లక్ష్మయ్య నవ్వుతా చూస్తున్నాడు . 

“ఈ రోజు సుబ్బడు మంచె దగ్గరికి పొవట్లేదంట. ఈ పూటకి పోతావా లచ్చా, ఇంకో వారమన్నా పట్టుద్ది మొక్కజొన్న కోతలకి.” 

“రొట్టెలు కట్టివ్వు. శివని కూడా తీసుకుపోతా.”

“వాడేందుకురా? పురుగుపుట్రా ఉంటాయి. వాడికి కాలు ఒక్కచోట నిలవదు.”

“ఊరుకోడులేమ్మా, వస్తానని వెంటపడతాడు.” 

“వాడు లేంది నీకు తోచదని చెప్పరాదురా. ఎందుకురా ఆ పిల్లోడి మీద అంత పెంచుకుంటావ్. రేపు ఆ ముదరష్టపది వచ్చిందంటే దాని కొడుకుని అది తీసుకుపోతది. అది ఆ పని చేసిన  మనం ఇంకా బతికున్నాం, చీమునెత్తురులేనోళ్ళం” అంటూ మళ్ళీ  మొదలు పెట్టింది. 

“అమ్మా! ఆపిక.”  లేచెళ్లిపోయాడు లక్ష్మయ్య.

**

మంచె పైన ఉత్సాహంగా కూర్చున్నాడు శివ. 

“కాక! పాములు మంచె పైకి వస్తాయా?” సందేహంగా అడిగాడు శివ. 

 “రావు కన్నా” అన్నాడు ప్రేమగా. 

లక్ష్మయ్యకి బాగా ప్రేమ ఎక్కువైతే అట్లా పిలుస్తాడు. 

“కాక! మిణుగురుపురుగుల్లో అట్లా వెలుగు ఎందుకు వస్తుంది? ఆకుపచ్చగా పసుపచ్చగా ఎట్లా మెరుస్తుంది? 

“వాటిలో లూసిఫెర్న్ అనే కెమికల్ ఉంటుంది. అందుకే అలా మెరుస్తాయవి.” 

“అదికాదు కాకా, ఏ పురుగూ మెరవట్లేదు కదా! ఒక్క మిణుగురుపురుగే ఎందుకు మెరుస్తుంది కాక.” 

లక్ష్మయ్య నవ్వాడు. 

“ప్రతి పురుగుకి ఒక్కో ప్రత్యేకలక్షణం ఉంటుంది, పురుగులకేంటి అందరికీ. కొన్ని లక్షణాలు ప్రత్యేకంగా గుర్తించబడేట్లు కనిపిస్తాయి. కొన్ని మనకి  కనపడవు అంతే, మిణుగురు పురుగు కాంతినిస్తుంది కాబట్టి మనకి తెలుస్తుంది.” 

“కాక! ఈ నక్షత్రాలన్నీ మనల్ని చూస్తాయట తెలుసా? మనం నిద్రపోయేప్పుడు మనకి కాపలా కాస్తయంట అమ్మ చెప్పింది.” 

“ఇంకా ఏం చెప్పింది?” 

“పక్షికథ చెప్పేది. చెప్పమంటావా కాకా?” 

చెప్పు అనకముందే మొదలుపెట్టాడు శివ.

“ఒక పక్షి పిల్ల పాటలు పాడేది, మాట్లాడేది, డాన్స్ చేసేది, కోపమొస్తే కొట్లాడేది, ఏడుపొస్తే ఏడ్చేది, నవ్వొస్తే  నవ్వేది. బాగా అల్లరిచేసేది. అందరి మీద రెట్టలు వేస్తుందని దేవుడు ఆ పక్షిపిల్లను మనిషిగా మార్చేశాడంట” అని ఆగాడు. 

“మార్చాక ఏమైంది?” 

కాకా అడగడంతో ఉత్సాహంగా చెప్పాడు, “ఆ పక్షిపిల్ల మనిషిగా మారాక ఎవరికీ కనబడకుండా దాచుకున్న ఈకల్ని మనుషులు పీకుతున్నారంట. అది ఎగరలేక ఏడుస్తుంటే ఆకాశంనుంచి ఓ పక్షి కిందకి దిగి వచ్చి   ఎగరడం నేర్పాక అది మళ్ళీ పక్షై ఎగరిపోయిందంట సంతోషంగా.” 

“నీకు నచ్చిందా కథ.” 

“నచ్చింది కాక, మళ్ళీ పక్షైంది కదా!” 

కీచురాళ్లు రొద చేస్తున్నాయ్.  

“అవెందుకు అట్లా శబ్దం చేస్తున్నాయి కాక.  అది వాటి ప్రత్యేక లక్షణమా” అన్నాడు శివ, కాక చెప్పినదాన్ని గుర్తుచేసుకొంటూ. 

“అవును, ఇక పడుకో కన్నా కాసేపు.” 

**

శివకి ఏడు నిండాయి. శాంత వెళ్లి రేపటికి సంవత్సరం. అమ్మ చేసిన గొడవకి పిల్లోడిని ఇవ్వనన్నా వెళ్ళిపోయింది. అందరిముందు ఏమీ మాట్లాడకుండా. అమ్మ తిట్లను పట్టించుకోకుండా. 

వెళ్లేముందు తలెత్తి ముఖంలోకి నిరసనగా చూసి, “శివ జాగ్రత్త” అని వెళ్ళిపోయింది. 

“తన బిడ్డని తనకి ఇవ్వకుండా కట్టడి చేసి పంపించాం, ఎంత దుర్మార్గులం. అతను అంత బాగా కూడా ఉండడు. ఎందుకు వెళ్లిందో, ఎప్పుడు పరిచయమో? కొన్ని రోజులు ఉంటే నేనే …” ఆ ఆలోచనకి తల విదిలించుకున్నాడు లక్ష్మయ్య.

“శాంత మీద కోపంగాని ద్వేషంగాని కలగట్లేదు. అతను మోసం చేస్తే శాంత బతుకు ఏమవుతుంది? చేస్తే బావుంటుందా? మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తుందా? నాపట్ల తనకెందుకంత నిరసన, నా కళ్ళ వెనుక దాగున్నది ఏదైనా కనిపించి ఉంటుందా? శాంత అంటే నాకు ఇంత ప్రేమ ఎందుకు? ఎంత చిన్నపిల్ల తను.”

“రాముడిని పాము కరిచిందన్నారు. ఇదే చేలో కదా! పాము కోసం చేనంతా జల్లెడపట్టారు. అది కనపడలేదు. శివని కడుపులో మోస్తున్న శాంతలో ఒక్క కన్నీటి చుక్క లేదు. ఏడ్చింది లేదు. మాట్లాడింది లేదు. తలెత్తి రాముడు వైపు చూసింది ఒకసారి అంతే.” 

“పాము కరిచిందంటే ఎవరూ నమ్మలేదు. ఊరంతా శాంత మందుపెట్టింది అన్నారు. శాంత గురించే మందు తాగాడు అన్నారు కొంతమంది. శాంత పెద్దగా మాట్లాడేది వినలేదు. ఏదీ కావాలని అడగదు. నవ్వుతూ ఉన్నట్లే ఉంటుంది. కళ్ళ వెనుక లీలగా దుఃఖమో! అసంతృప్తో!” 

“శాంతనే కారణమా రాముడి చావుకి?” 

**

చల్లని రాత్రి వెచ్చగా అనిపించింది, చుక్కలు కాపలా కాస్తున్నట్టు నిశ్శబ్దంగా పరికించి చూస్తున్నట్లున్నాయి.  మిణుగురులు మెరుస్తున్న చుక్కల్లా గాలిలో ఎగురుతున్నాయి. కీచురాళ్ళ చప్పుడు ఆగిపోయింది.  గాఢమైన నిశ్శబ్దం. చీకటి. 

పొలంలో ఎదో అలజడి. ఎవరో పరిగెడుతున్న అలికిడి. మనుషులో, అడవి పందో తెలీట్లేదు. లక్ష్మయ్య లేచి చూసాడు. 

గోధుమ రంగు తాచు, గట్టు పక్కన మెరుస్తుంది. లక్ష్మయ్య శివని గుండెకు దగ్గరగా హత్తుకున్నాడు. 

“శాంత కొడుక్కి శివ అని ఎందుకు పేరు పెట్టుకుందో.”

ఆలోచిస్తూ ఎప్పుడు నిద్రపోయాడో, కలలో రక్తం, కన్నీళ్లు, రంగులు. శివ లేడు. అక్కడ తనే ఉన్నాడు. శాంత  కాళ్ళ దగ్గర చిన్నపిల్లోడిలా తనే ఏడుస్తున్నాడు. 

పక్షుల కూతలు. లేత ఎండ. కల చెదిరిపోయింది. 

లచ్చన్న కళ్ళు తెరిచేసరికి శివ పక్కన లేడు. కాలువ దగ్గర నీళ్ల శబ్దం వినపడుతుంది. అదిరిపడి లేచి కిందకి దిగాడు “శివా” అంటూ. 

శివ పరిగెత్తుకుంటా వచ్చి చుట్టుకున్నాడు.  

“అట్లా ఒక్కడివే వెళ్తావా కాకని లేపకుండా” 

**

ఇంటికొచ్చేసరికి జనం గుమిగూడి ఉన్నారు. పున్నమ్మ తిట్లు గట్టిగా వినపడుతున్నాయి. “ముండమోపిదానా! ఇప్పుడెందుకొచ్చినావే మళ్ళీ” అని.

శివ “అమ్మా” అని శాంతని కౌగలించుకున్నాడు. 

శివని గట్టిగా హత్తుకుంది ఆమె.  

“శాంత అలానే ఉందా? లేదు, ఇంకోలా ఉంది. కానీ శాంతనే” అనుకున్నాడు లక్ష్మయ్య.

“నా మనవడిని నేను ఇవ్వను, నా బొందిలో ప్రాణం ఉండగా దాన్ని తీసుకుపోనీయను.” ఊగిపోతూ శోకాలు పెడుతుంది పున్నమ్మ. 

లక్ష్మయ్య వెళ్లి పున్నమ్మని పట్టుకున్నాడు. అందర్ని పంపించాడు.

 శివ ఆనందంగా ఉన్నాడు. 

“కాకా! నేను వెంకటేశ్వర్లకి చెప్పొస్తా అమ్మొచ్చిందని” అని పరిగెత్తాడు శివ.

**

“శివని ఇక్కడే ఉంచుతావా? చిత్రకారుడు నీతోనే ఉన్నాడా? పెదాలు కమిలిపోయి ఎందుకున్నాయి? ఇక్కడే ఉంటావా నేను నిన్ను…! ఎందుకు నల్లగా అయ్యావ్? ఏమైంది నీలో హమీదా బేగం? శివ అని పేరు ఎందుకు పెట్టావ్ వాడికి?” 

ఇవన్నీ అడగాలనుకున్నాడు. పెదవి విచ్చుకోవడం కష్టమైంది. పెదవి వెనుక ఉన్న ఆశను చూసి భయపడ్డాడు. గట్టుపక్కన గోధుమ రంగు తాచు గుర్తొచ్చింది. 

“ఎక్కడుంటున్నారు ఇప్పుడు? అంతాబాగానే ఉందా?” గొంతుపెగల్చుకొని అడిగాడు.  

“కృష్ణ ఒడ్డున ఆంజనేయపురంలో, బాగానే ఉంది.” 

“అదేంటి, పట్నంలో కాదా? అతను లేడా?” అని అడగాలనుకున్నాడు. 

ఆమె కళ్ళల్లో కనపడని బేలతనం.

“మధ్యాన్నం మూడింటి బండికి వెళతాం బావ” అంది శాంత అతని కళ్లలోకి సూటిగా చూస్తూ. 

ఆమె చేతిపైన కమిలిన గుర్తు వైపు చూస్తూ, ఆ… అన్నాడు లక్ష్మయ్య తలదించుకుంటూ.

 

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.