కొత్త అడుగులు – 15

ఆధునిక స్త్రీవాది విప్లవశ్రీ

– శిలాలోలిత

విప్లవశ్రీ కలంపేరుతో శ్రీనిధి కవిత్వం రాస్తోంది. నిండా పందొనిమిది ఏళ్ళు కూడా లేవు. డిగ్రీ సెకండ్ ఇయర్ సిటీకాలేజ్ హైదరాబాద్ లో చదువుతుంది. 2019 లో రాలిన చుక్కలు– అనే కవితా సంపుటిని తీసుకొనివచ్చింది. తనతల్లి ఆడుకోమని అంటే శ్రీనిధికి ఎంత ప్రాణమో చాలా కవితల్లో చెప్పింది. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో అనర్గళంగా ఉపన్యాసించగల మంచి వక్తగా పేరుతెచ్చుకుంది. సన్నగా, చిన్నగా, నవ్వుమొహంతో కన్పించే శ్రీనిధి మాట్లాడటం మొదలుపెట్టిందంటే ఒక నిప్పులవాన మనపై కురిసినట్లే.

మహబూబ్ నగర్, వీరన్నపేటకు చెందిన ఈ చిచ్చరపిడుగు ముందు ముందు ఒక బలమైన శక్తిగా, కవయిత్రిగా మరింత ఎదుగుతుందనే నమ్మకం నాకుంది.

ఎందుకంటే ఆమె కవిత్వంలోకి ప్రవేశించినవాళ్ళందరూ ఇంచుమించుగా అదే భావనకు గురవుతారు. తానెందుకు కవిత్వం రాస్తుందో ముందుమాటలో చక్కగా రాసుకుంది. స్పష్టత, గమ్యము ఉన్నాయి. ముందుగా ఆమె వాక్యాల్లోకి తొంగిచూద్దాం.

కవిత్వపు బాటసారినై సాగుతూ…

అందరూ ఏవేవో మోసుకెళ్తూ ఉంటారు జీవితం మొత్తం అలా నాక్కూడా ఆలోచనలనూ మోస్తూ సాగిపోయే అలవాటుంది. బుడిబుడి నడకల ప్రాయంలోనే అక్షరాలతో ఆలోచనలకు రూపం ఇచ్చేదాన్ని కాస్త ఎదుగుతూ ఇదిగో ఇలా 18వ ఏటికొచ్చేసరికి కవిత్వంతో కలిసి నడుస్తున్నాను.

అక్కడక్కడా జరిగే వక్తృత్వ పోటీలు, వ్యాసరచనల్లో చిన్న చిన్న బహుమతులు పొందడం మంచి కవిసమ్మేళనాల్లో పాల్గొనేదాకా నా ప్రయాణం ఏమీ ఆశించని పిచ్చిదానిలాగా  సాగిపోయింది…. ఆ తరువాతే నా కవిత్వానికి సామాజిక శ్రేయస్సును స్వార్థంగా అంటగట్టి సమస్యలనే సింహభాగాన చర్చించాలనుకున్నాను. ఇదే నా జీవితపు పెద్ద మలుపు… అందరికి పరిచయం చేసింది. ఇలా మీ ముందుకు నా రాలిన చుక్కలు తెస్తున్నానంటే నా తాతయ్య, మాతృమూర్తి, అమ్మమ్మ కవిగురువుల ప్రోత్సాహం ఎంతగానో ఉంది.

కుటుంబ పరిస్థితులు, నేను పెరిగిన పరిసర సామాజిక పరిస్థితులు, నా చుట్టు కమ్ముకున్న సామాజిక సమస్యలు, ఇవన్నీ నా ఆలోచనా వస్తువులుగా నిరంతరం నా మస్తిష్మంతో యుద్ధం చేసేవి. కుటుంబంలో కల్లోలాలు నా ఆరోగ్యాన్ని మానసికంగా క్షీణింపజేస్తుంటే బడికి మెడికల్ లీవ్లు పెట్టి 5 సంవత్సరాల పాటు గ్రంథాలయంలో పుస్తకాలతో సాంగత్యం. బహుశా నా కవితా పదాలు అన్ని అప్పట్లో చదివినవే కావచ్చు. 7వ తరగతిన కవిత్వపు జాడ నా జీవితంలో బయటపడింది. ఇప్పటికి ఇలా మీ ముందుకు వచ్చేలా చేసింది.

ఎంత గొప్ప మేధావి అయినా, కళాకారుడు అయినా అతని పనితనం ఒక్కోసారి అద్భుతంగా ఉంటుంది. ఒక్కోసారి మరీ అధ్వాన్నంగాను వస్తుంది. అలాగే నా కవితలు కొన్ని బాగాను, కొన్ని ఏదో అలా అన్నట్లు గాను వచ్చాయి. ఏదేమైనా నా జీవితపు చివరి మజిలీ చేరేదాకా కవిత్వాన్ని వదిలే ప్రసక్తే లేదని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. అందరూ నా కవిత్వాన్ని ఎంతగా మెచ్చుకున్నప్పటికీ చాలా మంది ఒక ప్రశ్న నాపై సందిస్తారు. ‘‘ఇంత చిన్న వయసులో స్త్రీవాదంలో అంత పచ్చిగా రాయడం అవసరమా, అనుభవించిన దానిలా రాస్తున్నావు ముసలిదానివా’’ అన్నారు…. వారికి నేను చెప్పేదేంటంటే నా పల్లెటూరి బాల్యంలో ఎంతో మంది అక్కలు లైంగిక వేధింపులకు గురవుతుంటే కళ్లారా చూసి ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నాను. కాబట్టే అలా రాస్తున్నాను.  ఇంకొక విషయం చెప్పనా స్వయంగా నేనే అసభ్య చర్యకు లోనవబోతూ తప్పించుకున్నాను క్షేమంగా. సమాజానికి ఏమీ ఇవ్వకపోయినా పరవాలేదు, కానీ రేపటి తరానికి ఒక అమ్మను మాత్రం దూరం చేయకూడదు కదా అన్నది నా ఉద్దేశం.

చిన్నచిన్న అడుగులు వేస్తూ సాహిత్య లోకాన నాదైన ముద్ర వేసుకునే ప్రయత్నంలో ఉన్నాను. ఒక నడివయస్కురాలు కాల్ చేసి నీ కవిత్వం నా జీవితాన్ని మార్చింది అని చెమ్మగిల్లిన కంటితో చెప్పినప్పుడు స్త్రీవాదం ఆవశ్యకత తెలిసింది.  ఇంకొక అమ్మ నాతో ఘొల్లున ఏడ్చి స్త్రీల ఆవేదనను వ్యక్తపరచినప్పుడు స్త్రీవాదాన్ని నేనెందుకు రాయకూడదు అనిపించింది. ఎప్పటికైనా నా కవిత్వం చరిత్రలో సువర్ణాక్షరాలుగా లిఖించకపోయినా పరవాలేదు కానీ, కనీసం ఒక్క స్త్రీ జీవితంలో అయినా కష్టాలను దూరం చేస్తే, ఒక్క మగమనిషిని ‘‘మనిషిగా’’ మారిస్తే అదే ఈజన్మకి తృప్తి నాకు.

తాతయ్య ఆశలను గురువుగారి ఆశయాలను నెరవేర్చేందుకు నాకు లభించిన అదృష్టపు అవకాశమే ఈ కవిత్వం. మళ్ళీ వీలుపడితే మరికొన్ని చుక్కలను రాల్చి మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ రాలిన చుక్తలను ఆదరిస్తారని ఆశిస్తూ…

          శ్రీనిధి

నందిని సిద్ధారెడ్డిగారు ప్రాయం కన్నా పదును కవిత్వం – అని అభిప్రాయ పడ్డారు. గాలిలో గిలిఅన్న కవిత శ్రీనిధి ఊహాశక్తికి, నిర్మాణ ఆసక్తికి ప్రతీక. గాలి నాతో ఊసులాడుతుందిఅని మొదలై గాలిని వర్షిస్తూ ఐదు దశలుగా గాలి స్వభావాన్ని వివరిస్తుంది. ఒకరకంగా వర్తమాన కవుల స్థితిని చూసినప్పుడు ఇది నివ్వెరపరిచే నిర్మాణం.

సంక్రాంతి గిలి పటాల లేవు

ఎందుకంటే వాళ్ళేకదా

తెగిన గాలిపటాలు (చిన్ని పాపాయిలు)

వ్యధా కవిత శైశవాన్ని చెప్పటానికి, భంగపడిన బాధిత బాల్యాన్ని వర్ణించటానికి ఇంతకుమించి వ్యక్తీకరణ వుండదు. గాలిపటాలుధ్వని గర్భితం చేయడానికి శ్రీనిధి ఎంచుకున్న శల్పం ఆకర్షిస్తోంది. అని ముచ్చట పడ్డారు.

అలాగే దాస్యం సేనాధిపతి గారు ఆమె కవిత్వంలో అడుగడుగునా సామాజిక చైతన్యం కోసం ఆరాటపడే అక్షరాలు తారసపడతాయి అన్నారు. వాడికి సమర్పణమయ్యే’, ‘వేశ్య’, ‘మనోనేత్రం మూసుకుపోయింది…’, ‘కనిపిస్తాడో లేదో’, ‘ఎరుపు, దివిటీ పట్టుకురండివంటి కవితల్లో ఆమె ప్రకటించిన భావాలు ఆమె సాహసానికి అద్దం పడతాయి. ఈ కవితల్ని పునరాలోచించుకొమ్మని నేను కోరినప్పుడు ససేమిరా అంది. బాగా ఆలోచించి, గమనించి, లోకంలో జరుగుతున్న ఘటనలనే ఆవిష్కరించానని తన దృఢ నిశ్చయాన్ని ప్రకటించింది. ఈ చిట్టి కవయిత్రికే తన పట్ల తనకున్న స్థిరమైన అభిప్రాయాలు ఎదుటవారు సైతం అంగీకరించేట్లుగా వుంటాయి.

విఠలాపురం పుష్పలతగారు ఇలా అభిప్రాయపడ్డం లోకం చుట్టూ అమానుషంగా మానవత్వం దహనమై, వ్యవస్థ స్త్రీజాతిని తొక్కి వేస్తుంది. అక్షరాలలో శ్రీనిధి ఇలా మాట్లాడింది.

మనోనేత్రం మూసుకుపోయింది వెధవని

స్త్రీలు కనబడితే సొల్లు కారుస్తున్నాడు

నా బొడ్డుతాడు తెంచుకుని బయటకొచ్చిన

బ్రతుకు వాడిదని మరిచాడు పాపం

వాడి ఉనికికే ప్రమాదం తెచ్చుకుంటున్నాడు.

బోల యాదయ్యగారి మాటల్లో –

శ్రీనిధి తన కలం నిండా అభాగ్యురాళ్ళ కన్నీళ్ళు. నిర్భయలాంటి వాళ్ళ ఆక్రందనలు, ఆవేదనలు నింపుకొని రాలిన చుక్కలు– కవితా సంపుటితో వచ్చింది. కవిత్వం ఒక కళ. కవిత్వం అందరికీ అబ్బదు. కన్నీళ్ళకు కళ్ళు తోవ్వనిచ్చినప్పుడల్లా మనసు సరస్సు నుండి అక్షరాలు పారుతాయి.

వాడికి సమర్పణమయ్యకవితలో స్త్రీజీవితం నాశనం చేసిన వాడితో సమాజం కలిసి బతకమంటుంది. అంటూ వంత పాడిన వారిని నిలదీస్తూ, నిందిస్తూ రాసిన కవిత.

కడుపు నింపుకునేందుకు

కాయం అమ్ముకుంటాను 

కామపు రాజులకు

ఒక్కోరోజు రాణిని అవుతాను

కంపుతో వచ్చేవాడికోసం

కొత్తపెళ్ళికూతురిలా ముస్తాబవుతాను

నేనొక వేశ్యను

చిరిగిన విస్తరినైనా

వాడికోసం మళ్ళీ మళ్ళీ

నన్ను నేను కుట్టుకుంటాను.

ఆమెపట్ల గౌరవం వుండాలికానీ, చీదరింపులు కాదు. వారికి పునరావాసం కల్పించి ఆదుకోవాలి కానీ అవమానించకూడదు. నిత్యం చిరిగిపోయే తన బ్రతుకు విస్తరిని మళ్ళీ మళ్ళీ కుట్టుకుంటూ బ్రతుకుతున్న బ్రతుకులకు భరోసా ఇవ్వాలని చెప్పిన కవిత.

శ్రీనిధి స్త్రీని తలపోస్తూ ఇలా అంటుంది. ‘‘ఆమె చెంపలు ఎప్పుడూ తడారని పచ్చిబండలు’’ నిజమే స్త్రీచెంపలపై ఎన్ని చీకటి రాత్రులు కనిపించని పాయలు పారుతున్నాయో, వినిపించని ఆర్తనాదాలై ధ్వనిస్తున్నాయో, శ్రీనిధి కవితలో ఎక్కువమటుకు స్త్రీవాద కవితలున్నా, మనిషి తత్వాన్ని గురించి, మానవత్వం గురించి, తల్లిప్రేమ గురించి, విప్లవం గురించి తన అంతరంగంలో పొడిసిన ప్రతి అక్షరం ఒక వేడి కణంలా రాలిన చుక్కలుఈ పుస్తకంలో వున్నాయన్నారు. అవి ముట్టుకుంటే వెచ్చని స్పర్శయై తడుముతాయి. చెమటకు తడిసిన శరీరాలపై సుగంధ పరిమళమై వీస్తాయి. ఎక్కడ అవమానం ఎదుర్కొన్నారో, అక్కడే నిలదొక్కుకునేందుకు, ఎక్కడైతే కష్టాలకు తలొంచెనో అక్కడే సర్వం సాధించేందుకు మళ్ళీ నేనొస్తా అంటూ తన ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తూ, స్త్రీ కోల్పోయిన చోటనే తిరిగి అన్నీ పొందేలా స్ఫూర్తి నిస్తుంది అన్నారు.

ఇంచుమించుగా ప్రతి కవితా ఎంతో ఆర్తితో, ఆవేదనతో, ఆగ్రహంతో జలపాతంలా దూకుతునే వుంటాయి. వస్తు విస్తృతి ఎక్కువ. మానవులంతా ఎక్కువ తక్కువలు లేకుండా, కలిసి బతకాలనే ఆకాంక్ష, అన్యాయాలకు చరమగీతాలు పాడాలనే దృఢసంకల్పం అంతటా కన్పించే సాధారణాంశం.  మీకు నచ్చుతుందనే భావిస్తున్నాను. ఈ చిన్నారి మొలక దగ్గరనుంచి సాహిత్య లోకంలో మహావృక్షమంత ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.