“పరివ్యాప్త” స్త్రీవాద కవితా సంకలనం

గణేశ్వరావుగారి వ్యాఖ్య & చేకూరిరామారావు గారి ముందుమాట

-జ్వలిత

 

‘నీలి మేఘాలు’ తర్వాత  జ్వలిత సంపాదకత్వం వహించిన ‘పరివ్యాప్త’ వచ్చి దశాబ్దం అవుతోంది.  ఆ స్థాయిలో, అంత విస్తృతంగా వున్నా మరో కవిత సంకలనం వచ్చినట్లు లేదు. 110 మంది కవులు, ప్రధానంగా స్త్రీల సమస్యలున్నా, స్త్రీలే కాకుండా పురుషులు రాసిన కవితలు, ప్రసిద్ధులతో పాటు అప్రసిద్ధులు, పాత కొత్తల మేలు కలయిక, సంప్రదాయత తొ పాటు నవ్యత, మెరుపుల్లాంటి వస్తువు తో పాటు అద్భుతమైన నిర్వహణ, అందమైన కవితా వస్తువు తో పాటు ఆధునిక సాంకేతిక పదాలు … ఇలా ఎన్నో విశిష్టత లు కలిగి వున్న ఈ  సంకలాన్ని  – ఎక్కడెక్కడి నుంచో ఎన్నో  స్త్రీల సమస్యలపై రాసిన కవితలను  ఏర్చి కూర్చడం అంత సులభం కాదు. అత్యంత శ్రమతో కూడిన సాహసోపేతమైన కార్యం!  తాను  స్త్రీ వాదిని కానని, మానవతా వాదిని అంటూ – మహిళా సమస్యలకు మూలాలు పై చర్చకు ఆహ్వానించారు, తన లక్ష్యం – మనిషిని మనిషిగా (స్త్రీ-పురుష తేడాలు లేకుండా) కేవలం మనిషిగా ప్రేమించడం అని  స్పష్టం చేసారు.( అబ్బూరి చాయాదేవి, ఇంద్రగంటి జానకి బాల ఈ దృక్పథంతో తమ రచనలు చేసారు. ) జ్వలిత తన కవిత ‘కార్పోరేట్ దాంపత్యం’ లో ఆధునిక సాంకేతిక శాస్త్ర పదాలను వాడుతూ ప్రపంచీకరణ ప్రభావం వలన నేటి దాంపత్యం లో చోటు చేసుకున్న పరిణామాలను కవితాత్మకంగా చెబుతారు:

“న్యూక్లియర్ కుటుంబాలకు అవార్డ్లు” /” డేటింగ్ అలవెన్స్ “తొ వ్యభిచారానికి రివార్డ్లు / ‘కాల్ సెంటర్’ ఉద్యోగంలో కాలం, విలువలతో పని ఏమిటి?

సూర్య చంద్రుల కాపురం – రాత్రిoబవల్ల స్నేహం / నాకు సూర్యోదయంతో బతుకు తెరువు / నీకు చంద్రోదయంతో సుఖం కరువు / 

దాంపత్యానుబంధం అమావాస్య కారు చీకటి / కోరికలను కంట్రోల్ చేసే రిమోట్ ఐదంకెల వేతనం .’

కాల్ సెంటర్లలో పని చేసే భార్యభర్తలది – ‘సూర్య చంద్రుల కాపురం ‘ ! అంత అద్భుతమైన పోలిక! అందుకే ఈ లైన్లు oft quoted లైన్లు అయాయి.

-గణేశ్వరావు

 

సరికొత్త కవితాసంపుటి “పరివ్యాప్త”

                                     -చేకూరి రామారావు

       దాదాపు ప్రపంచ భాషలన్నింటిలోనూ కవితా సంకలనాలు ఉన్నాయి. ఏదో ఒక రకం సాతూన్యాశం ఉన్న వివిధ కవుల రచనలను ఒక సంపుటిగా కూరిస్తే దానిని సంకలనం అంటారు.మనకు అతి ప్రాచీనమైన “గాథాసప్తశతి” అనే ప్రాకృత భాషా సంకలనం అటువంటిదే. “గాహో” ప్రాకృత చందస్సులో కూర్చబడిన గొప్ప కవితా సంకలనం ఇది. దీనిని శాలివాహనుడు కూర్చాడు అంటారు. అనేకులు ఇందులోని పద్యాలను గొప్ప కవితాంశ ఉన్నవిగా గుర్తించి, చాలాచోట్ల ఉదహరిస్తూ ఉంటారు. ఆధునికాంధ్రంలో “వైతాళికులు” అనే భావ కవితా సంకలనం, “కల్పన” అనే  అభ్యుదయ కవితా సంకలనం ప్రసిద్ధమైనవి. ఇప్పుడు జ్వలిత “పరివ్యాప్త” అనే పేరుతో సరికొత్త కవితా సంకలనాన్ని కూరుస్తున్నారు. అత్యాధునికమైన వందమంది కవుల సంకలనం ఇది. దీని పేరు కూడా చాలా ఆలోచించి పెట్టినట్లు ఉన్నది. కవులను బట్టి చూసినా, కవితలను బట్టి చూసినా‌, ఇది అత్యంత విస్తృతి కలిగింది. అందుకే ఇది పరివ్యాప్త. స్త్రీ అనేది సాతూన్యాంశంగా సంకలనకర్త ఉద్దేశించినట్లు కనిపిస్తూంది.

     ఇందులో కవులు కొందరు ప్రసిద్ధులు, లబ్దప్రతిష్టులు, మరికొందరు అంత ప్రసిద్ధులు కారు. ఇందులో స్త్రీ పురుషులు సమ సంఖ్యలో ఉన్నట్టున్నారు. ఇందులో కవితలు చాలా కాలం నుండి వివిధ పత్రికల నుండి సేకరించినట్టున్నారు. కవితల క్వాలిటీ కూడా అంతా ఒక లాగే లేదు. కొన్ని చెణుకుల్లాంటి వాక్యాలతో ఊహలతో మనసును ఆకట్టుకునేట్టుగా ఉన్నాయి. మరికొన్ని పేలవంగా ఉన్నాయి. శిలాలోలిత అనే కవయత్రో రాసిన “అనగనగా ఒక ఇల్లు” అనే కవితలో వాక్యాలు చూడండి, ఎంత కొత్తగా ఉన్నాయో,

” అతడు ప్యాంటు చొక్కా తొడుక్కుని వెళ్తాడు, ఆమె ఇంటిని కూడా తొడుక్కుని వెళుతుంది”.

 చిమ్మపూడి శ్రీరామమూర్తి రాసిన “నువ్విప్పుడు పుట్టొద్దు” అనే కవితలో “ఉద్యోగికి పనిగంటలు ఉంటాయి – పని తప్ప గంటలు లేని దానివి”

 ఇట్లా కొత్తదనాన్ని విరజిమ్మే చెణుకుల్లాంటి వాక్యాలు, చాలా తరచుగా చాలామంది కవితల్లో కనిపిస్తాయి. పాత కొత్త తేడా లేకుండా చాలా మంది తమ కవితల్లో వస్తు నవ్యత చూపించారు.

 సత్య శ్రీనివాస్ “ఎరుపెక్కిన మనసు” అనే కవితలో “ఆమె భర్త ఉన్నప్పుడు దేవతలా పూజించిన వారే, విధి వంచితై పెళ్ళినాడే భర్తను పోగొట్టుకున్న ఆమెను దెప్పపొడుస్తుంది లోకం, మాట వరసకైనా ఆమెకు ఎదురైన ప్రమాదంపై నోరు మెదపలేదు”.

గన్ను కృష్ణమూర్తి ఆకలి ప్రేగు ల్ని కత్తిరిస్తోంది అనే కవితలో దర్జీ స్త్రీని గురించి “ఆమె పిల్లలపై మమకారంతో బ్రతుకును చించుకుంటూ కుట్టుకుంటూ నేర్చుకుంటూ వస్తోంది 

ప్రజలకు తానిచ్చేది స్వేదసిక్త వస్త్రాలు 

అయితే ఆమెకు మిగిలేది 

చింపిముక్కలే బ్రతుకు ముక్కలే”.

ప్రజల కోసం అడవికి వెళ్ళిన కొడుకును ఉద్దేశించి తల్లి వేదన రోదన కౌముది రాసిన “పడిగాపులు” కవితలో కనిపిస్తుంది, 

“బతికి ఉంటే మాత్రం యాది పెట్టుకో

 కాన్రాని కొడుకు కోసం 

కండ్లల్ల ఊపిరి పోసుకొని 

ఈ అవ్వ ఎదురు చూస్తోందని”.

 కే గీత రాసిన “జ్వలన సరోవరం”లో 

“అతనికి కావలసినది పడక శృంగారం

 కాదు నెట్ వ్యబిచారం” అంటుంది.

 జ్వలిత  రాసిన  “కార్పొరేట్ దాంపత్యం”లో కూడా కొత్త టెక్నాలజీ, ముఖ్యంగా వెబ్సైట్, ప్రపంచీకరణ ప్రభావం ఆలోచనల్లోనూ, దాంపత్యంలోనూ మార్పులను కవితాత్మకంగా చెప్పించారు చూడండి. “న్యూక్లియర్ కుటుంబాలకు అవార్డులు 

డేటింగ్ అలవెన్స్ లతో వ్యభిచారానికి రివార్డులు గ్లోబలైజేషన్ విలాసాల ప్రలోభం 

బహుభార్యత్వం బహు భర్తుత్వం కానీ 

మనసుకు ముసుగేసిన శరీరాల స్నేహం 

కోరికలను కంట్రోల్ చేసే రిమోట్ ఐదంకెల వేతనం”.

 కోడూరి విజయకుమార్ రాసిన “కొందరు నాన్నల కోసం” అనే కవితలో పాత సమస్య అయినా కొత్త కోణంలో చిత్రించాడు.

సత్య భాస్కర్ రాసిన “శవసంభోగం”, 

ఉదయమిత్ర పెళ్లిచూపులు పై రాసిన “దానికేం కోరికలు ఉంటాయమ్మా” అనేవి.

మొత్తం మీద “పరివ్యాప్త” విలువైన సంకలనమే, అనేక స్త్రీ సమస్యలను చిత్రించిన సంపుటి ఇది. స్త్రీల గురించి రాసిన కవిత లన్నిటిని చేర్చడం దీని ప్రత్యేకత. విలువైన కవితా సంకలనాన్ని అందించిన జ్వలితకు అభినందనలు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.