డార్క్ ఫాంటసీ కవితా సంపుటి పై సమీక్ష

-గిరి ప్రసాద్ చెలమల్లు

ప్రేమ కవితల సమాహారం అద్భుత ఊహల సామ్రాజ్య అక్షరీకరణలో ఫలవంతమైన రచయిత్రి గీతా వెల్లంకి గారి తొలి  డార్క్ ఫాంటసీ సంపుటికి ముందుమాట డాక్టర్ నాగసూరి వేణు గోపాల్ వ్రాస్తూ రచయిత్రి కున్న ప్రేమ శిల్పాన్ని వ్యక్తీకరిస్తూ ప్రేమ కవితల విందుని పంచారన్నారు. ఇది ఒక గొప్ప తెలుగు ప్రేమ సాహిత్యమని అభివర్ణించారు.
 శ్రీమతి శిలాలోహిత గారు తెరచిన కిటికీలోంచి చూస్తూ స్నేహ చెలమను గుండెల్లో దాచుకున్న సముద్రమామె అని కొనియాడారు.
 
 రచయిత్రి  నేనూ నా పావురం కోసం కవితలో ‘నీతో వున్న క్షణాలన్నీ నీ పరోక్షంలో అక్షరాలౌతాయని’ భావాన్ని ప్రస్ఫుటంగా పలికిస్తూ’ నిన్ను చూసిన క్షణాన అలసిన పావురానిక్కూడా కొత్త రెక్కలొస్తాయని’ మనసు సంకెళ్ళ ను తెంచుకున్న క్షణాలను అద్భుతంగా కవిత్వీకరించారు.
కాలం ఆగనీ కవితలో ‘గురుత్వాకర్షణ కన్నా నీ ఆకర్షణే ఎక్కువనిపిస్తుందని’ నీ తాకిడికి రాలి పడిన ఉల్కలాగా రాలిన శకలం లాగా నిశ్చేతనంగా ఉండిపోతాను’ లో ఉద్వేగంతో నిండిన అక్షరాలను వీక్షించవచ్చు.
 
వలసపిట్ట కవితలో ‘ఎక్కడి నుండో ఏదో ఒక ఋతువులో నువ్వు వలస పిట్టవై నా గుండె పంజరంలోకి వచ్చి కొంత కాలం సేదతీరి పోతుంటావని’ నిరీక్షణ లోని వేదనని విరహంలోని ఆవేదనని గుండెని పంజరం గా మార్చి బందీని చేసారు.
 
దగ్ద గీతం లో ‘ నీ వలపు తూటాలు తగిలి వర్షించడం మొదలెడతాను ‘ అంటూ ప్రేమ లో తుళ్ళిపడే మనసును ఆనందంలో ముంచారు. ‘ప్రతిసారీ నీ ఆగమనానికి ముందుగానే నేను వియోగానికి సిద్ధ మౌతుంటాను ‘ అని ప్రేమలోని ఆవశ్యకత ను వాస్తవికతను జీర్ణించుకోక తప్పదనే భావనను ఒలికించారు.
ప్రతి చలి సాయంత్రం నీ కాఫీ కప్పులో సిప్పు నై గొంతులోకి వెచ్చగా జారాలని ఫాంటసీ ని డార్క్ ఫాంటసీ గా చిత్రీకరించారు. ఇలాగే కొన్ని కవితల్లో ఇంగ్లీష్ పదాలు సాంకేతిక పదాల అల్లికలు కన్పించాయి. ప్రేమ పరిధి కవితలో ‘హృదయ కవాటాలు రుధిరాన్ని వడబోస్తే మిగిలిందంతా నువ్వే ‘ అని గుండెని జీవ శాస్త్రానికి ప్రేమకి అనుసంధానం చేసి నూతన ఒరవడిని కొనసాగించారు. మిణుగురు కలలు కవితలో ‘ నీకై వెలిగించిన రాత్రుళ్ళ నెగళ్ళు నిన్ను తెచ్చే పగల్లౌతాయి’ అని ఎదురుచూపుల్లోని తన్మయత్వాన్ని కళ్ళ ముందు సాక్షాత్కరించిన తీరు బావుంది.
 
నిషేధ రాత్రి కవితలో ‘ఈ నిరుత్తర నిరుపమ రాత్రిలో బహుశా నీ ప్రేమతో ఏ మద్యమూ ఇవ్వలేని నిషాను పొందాను’ అని ప్రేమలోని నిషాని మద్యం తో పోల్చటం త్రాసులో లోపం అనిపించింది.
 
వెతుకులాట కవిత లో ఎక్కడెక్కడో వెతికి వేసారి  ‘వెతకాల్సింది నీ కోసం కాదని తప్పిపోయింది నేనేనని నేను దొరికేది నీ హృదయం లోనేనని ఇప్పుడే తెలిసింది’ అంటూ తనలోని అంతర్మథనాన్ని బైట పెట్టారు. కలల రెక్కలు కవిత లో ‘ రెక్కలు విప్పిన జ్ఞాపకాల నగ్నత్వం భయపెడుతుందంటూ ఆలోచనల సైకత వేదికల్లో ఎక్కడో చిన్న రేణువులా కప్పబడి పోతానేమో ‘ననే సంశయాన్ని సంకోచం లేకుండా కలల నిగ్గుని తేల్చేసారు.
తెరతీయాలి కవితలో ‘నువ్వు వదిలి వెళ్ళిన నిశ్శబ్దాన్ని పొదివి పట్టుకొని ఒక మౌన శిలనై నిరీక్షి స్తుంటాను’ అని శిల్పి కోసం వేచి చూసే శిలలా శిల్పం లా మలచ బడుటకు సిద్దమనే భావనను నింపారు. దుఃఖం కవితలో ‘నిజానికి నాలో అంతా నది లాంటి దుఃఖమే! ఈ గడ్డ కట్టిన దుఃఖాన్ని కోసే దుఃఖపు కత్తి ఎక్కడైనా దొరుకుతుందేమో చూడాలి ‘ అని దుఃఖాన్ని హరింప చేయ తాపత్రయాన్ని వెలిబుచ్చారు.
 
నీ నీడగా కవితలో ‘నువ్వు ఆకాశం నేను భూమి అయితే నా అంచులో నీవు నీ చివరలో నేను వేలాడు తుంటామేమో ఒకరినొకరు ఒదలకుండా ‘ ప్రేమలోని విడదీయరాని బంధాన్ని సున్నితంగా విడమర్చి చెప్పారు.
ప్రతులకు : గీతా వెల్లంకి 9989708800
వెల: రూ.100/-
 
*****
Please follow and like us:

One thought on “డార్క్ ఫాంటసీ కవితా సంపుటి పై సమీక్ష (పుస్తక సమీక్ష)”

Leave a Reply

Your email address will not be published.