“నెచ్చెలి”మాట 

2020 నేర్పిన పాఠం

-డా|| కె.గీత 

వచ్చినంత వేగంగానూ వెళ్లిపోయే వాటిల్లో మొట్టమొదటిది సంవత్సరం!

కానీ వెళ్ళిపోతూ చేదు జ్ఞాపకాల్ని మాత్రమే మిగిల్చేవి కొన్ని మాత్రమే-

అందులో  మొట్టమొదటిది 2020 వ సంవత్సరం!

చేదు జ్ఞాపకాలు ఎవరో ఒకరిద్దరికి కాదండోయ్ 

భూమ్మీద అందరికీ సమానంగా పంచడంలోనూ 

మొట్టమొదటిది 2020 వ సంవత్సరం!

అందమైన సంఖ్య-

ఆనందదాయకమైన రోజులు-

ఎన్నో గొప్ప  కొత్త ఉత్సాహాలు- 

అంటూ  ప్రారంభమైన  జనవరి 1, 2020 నాడు 

ఎవరమైనా  కలనైనా ఊహించామా?

అసలు ఈ ఏడాది ఇలా జరుగుతుందని?

అసలు ఇటువంటిదొక సంవత్సరం ఉంటుందని?

ఎన్ని మరణాలు… 

ఎన్ని ఆసుపత్రి బాధలు…. 

ఎన్నెన్ని దుఃఖాలు…..  

అయినా బాధ వద్దు-

ఉద్యోగాల్లేవు 

వ్యాపారాల్లేవు 

అయినా నిరాశపడొద్దు-

కనీ వినీ ఎరగని వరదలు

కమ్ముకున్న కార్చిచ్చులు

పగిలిన బతుకు పాదాల వలస వెతలు

రగిలిన నల్లగుండెల నినాదాలు

ఎన్ని దుఃఖాలు.… 

ఎన్ని వేదనలు…. 

ఎన్నెన్ని ఘోరాలు….  

కొన్నిసార్లు జీవితం కఠినాతికఠినమైన కాలాన్ని చవిచూపిస్తుంది 

కొన్నిసార్లు జీవితమే తల్లక్రిందులవుతుంది 

అయినా ఓడిపోవద్దు-

ఎందుకంటే 

కొందరు అదృష్టవంతులు కూడా ఉన్నారండోయ్!

భవిష్యత్తరాలు కథలుగా చెప్పుకునే 2020లో  

కరోనా బారిన పడకుండా 

జనవరి1, 2021ని సజీవంగా చూసే వారంతా అదృష్టవంతులే!

ప్రాణాలతో ఉండడమే ఇప్పటి ధ్యేయం!

అన్నివిధాలా 

జాగ్రత్తగా మసలుకోవడమే 

ఈ సంవత్సరం నేర్పిన పాఠం!

*****

Please follow and like us:

2 thoughts on “సంపాదకీయం- డిసెంబర్, 2020”

Leave a Reply

Your email address will not be published.