ఎముకలు విరిగిన నీడ 

-డాక్టర్ నాళేశ్వరం శంకరం

ఆమె భర్త గుహను ధ్వంసం చేసే లోపునే 

ఇనుప చువ్వల చూపుల్ని నాటే 

ప్రేమ చక్షువులు కూడా 

మృగ పాదాల్ని మోపి తొలగిపోయాయి 

ఆమె ఇప్పుడు కాలం గడియారం మీద 

కొట్టుకునే ముల్లు మాత్రమే 

గతించిన దృశ్యాలు 

బింబాలు బింబాలై ద్రవించి నప్పుడల్లా 

గాయాలు జీర్ణమై

గుండెబండై

కళ్ళు గోలి బిళ్ళలై

చిట్లిన పత్తిమొగ్గ అవుతోందప్పుడప్పుడు పుట్టిల్లు 

ముక్కుకు చెవులకు సౌందర్య తూట్లు పొడిపించినట్లే మెట్టిల్లూ,

ఆనవాళ్లే లేని గాయాలతో వొదిలేసింది

గూడొదిలి గూట్లోని గువ్వల్నొదిలిన ఏకాకిప్పుడు ఆమె

ఎదిగీ ఎదగని మొక్కమీద 

రేకులు విరిగిన స్వప్నపుష్పం

పూసీ పూయని వయస్సులోనే

భూమ్యాకాశాల గర్భిణీ

తడికంటిలో ఇంకిపోతున్న ఆమెకు కుడీయెడమల్లేవు

ఇప్పుడు వ్యర్థంగా ‘మోరీ’ పాలైన

బియ్యపు గింజల గంజిలా ఆమె

మొగుడి దిశమొలకింద ఎన్ని గువ్వలు నలిగినా

ఒక్క పంచాయతీ జరుగలేదు కానీ

శిలువైన ఏసుగా ఆమెను మలిచేందుకు

లేచిపోయిందని నేరారోపణ!

పార్లమెంట్ సమస్య కన్నా 

ఆమె సమస్యే జఠిలమైంది 

సీతను కాపాడిన ఒక్కగానొక్క 

వాల్మీకి కూడా ఆమెకు లేడిప్పుడు 

అగ్నిరేఖ మీద నిల్చోబెట్టిన 

రామ రావణులు ఆమెకొద్దిప్పుడు 

వలయాలు వలయాలు వలయాలైన 

ఇంటి సరిహద్దుల్ని దాటి 

అసంఖ్యాక లక్ష్మణరేఖల్ని గీస్తున్న 

దేశ సరిహద్దుల్ని దాటి 

బతుక్కోసం పునీత మవుతున్న సునీత, సీత ఆమె 

అవమానాల  క్షితిజరేఖపై

నిరాయుధంగా రోదించే ఆమెకన్నా

మొగుడి బాధనే బాధన్నంతగా

ఊరు ఊరంతా బాధపడి పోతిందిప్పుడు

ఆమెను ఎత్తుకుపోయి 

ఏట్లోకి తోసిన ఆధునిక కీచకుడు

దిసమొల పాపాల్ని

ఏకాంత జపంతో కడిగేసుకుంటున్నాడు

ఆమె ఇప్పుడు

మౌనాశ్రువుల ఎండలో

ఎముకలు విరిగిన నీడ మాత్రమే !

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.