గజల్

-జ్యోతిర్మయి మళ్ళ

కనిపిస్తూనే ఎంతగ బాధిస్తున్నావో తెలియదు నీకూ
ప్రేమిస్తూనే ఎంతగ వేధిస్తున్నావో తెలియదు నీకూ

శరీరమంతా నువ్వే నరనరాన చొరవగ చొరబడిపోయీ
నివసిస్తూనే ఎంతగ ప్రవహిస్తున్నావో తెలియదు నీకూ

రవంత అలికిడి విన్నా అది నువ్వేనేమో అని పొరబడితే
ఊరిస్తూనే ఎంతగ ఉడికిస్తున్నావో తెలియదు నీకూ

కోపము తాపము మాయం నవ్వే కళ్ళతొ నువు కనపడగానే
సాధిస్తూనే ఎంతగ శోధిస్తున్నావో తెలియదు నీకూ

గిరగిర తిరుగుతు నామది విహంగమయ్యెను నువు గీచిన గిరిలో
విడిపిస్తూనే ఎంతగ బంధిస్తున్నావో తెలియదు నీకూ

రేయిపగలు ఒకవింతే నిను తలవని క్షణమొకటి ఉందంటే
కవ్విస్తూనే ఎంతగ కలహిస్తున్నావో తెలియదు నీకూ

ప్రపంచమంతా నాదని నే సంబరపడుతూ నీతో ఉండగ
గెలిపిస్తూనే ఎంతగ ఓడిస్తున్నావో తెలియదు నీకూ  

***** 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.