చిత్రలిపి

“పలు గాకుల గోల …!”

-మన్నెం శారద

అక్కడేమిటో   ఒకటే పాడు కాకుల గోల !

ప్రొద్దుటే వాటి సొమ్మేదో పోయినట్లు 

వెర్రి గొంతులేసుకుని వెధవ గోల ….

నాలుగు మెతుకులకోసం నానా అల్లరీ చేస్తున్నాయ్ …

ఏమిటని చూద్దునా .. 

గాయపడిన కాకొకటి  వాటినడిమధ్యన మూలుగుతున్నది 

దానికి సాయపడలేక 

చేసే చేతులు లేక …

అవి బొంగరం లా చుట్టూ తిరిగి 

అదేపనిగా ఏడుస్తున్నాయి …

సంగీతం తెలియని  గొంతులూ …

సాహిత్యం తెలియని  మనసులూ 

మాటలు రాని  నోళ్ళూ …

దేవుళ్ళని ..పూజల్నీ ఎరుగని   ప్రాణులు 

మనుషులచేసే కాలుష్యాన్ని  శుభ్రపరిచి 

రూపు గొంతూ లేదని హేళన కి 

గురయ్యే  పనికిమాలిన పక్షులు !

అంతే …అంతే …వాటి గోలంతే !

 

…ఇక్కడేమిటి అంతకు మించిన అరుపులు …కాకులు కావే మరి …

ముసలాయన చచ్చాడు  ,,,వృద్ధాశ్రమం లో …

 కొడుకులూ కూతుళ్ళూ దిగారు 

విదేశాలనుండి …విమానాల్లో …

ఆ నగ నాదని  …

ఈ నగ నాదనీ  కూతుళ్ళూ 

 పొలం పుట్రా , కొంపాగోడుకోసం  కొడుకులూ…. 

నిన్నటినుండి తన్నుకు చస్తున్నారు …

తెగడం లేదు రగడ 

..సంగీత సాహిత్యాలు తెలిసిన మేధావులు 

పాపపుణ్యాల గురించి అనర్గళం గా మాట్లాడగల  మనుషులు వాళ్ళు 

కాకులు కాదు కాదు వారు పాపం 

పలుగాకులు !!!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.