జ్ఞాపకాల ఊయలలో-1

-చాగంటి కృష్ణకుమారి

అవి  మారాజునాన్నకాల్చే సిగరెట్టుపెట్టెలలోని తెల్లని ముచ్చికాగితాలు అడిగి పుస్తకాలలో పదిలంగా దాచుకొనే రోజులు;చిన్నిరబ్బరుమూతతోవున్న ఖాళీఅయిన బుల్లిఇంజక్షన్  సీసా రాజునాన్నగారి మెడికల్ షాపు నుండి తెచ్చుకొని పలక తుడుచుకోవడానికి  నీటితో నింపుకొన్న రోజులు.పుస్తకాలలో నెమలి ఈకలను దాచి వాటిమీద మూడు,నాలుగు బియ్యపుగింజలువేసి అది పిల్లలు పెడుతుందని  మాటిమాటికీ  పేజీలు తిరగేసే రోజులు. రాజునాన్న మానాన్న చాగంటి సోమయాజులు( చాసో)కి తమ్ముడి వరస.అప్పుడు నేను చదువు తున్నది విజయనగరం చిన్నిపల్లి వీధిబడిలో ఒకటవ తరగతి.బడిమెట్లుఎక్కగానే ఎదురుగా నున్నగదిలో మద్యస్థంగావున్న బల్లకి అవతలవైపునున్న కుర్చీలో హెడ్ మాస్టర్ గారు కూర్చుని వుండేవారు. బల్లమీద నీలం సిరాబుడ్డీలో నీలంకలం, ఎర్ర సిరాబుడ్డీలో ఎర్రకలం వుండేవి. ఆయన పొడుగాటి గెడ్డంతో,మీసాలతో,నల్లగా చాలాభయంకరంగా వుండేవాడు.నన్ను ముద్దుగా చూసుకొనే మానాన్న,రాజునాన్న అలా  ఉండరుకదా మరి !  బడికి వెళ్ళనని మారాం, ఎందుకంటే  హెడ్ మాస్టర్ గారిని చూస్తే భయం! “ చూస్తే ఎందుకూ భయం?” అని నాన్న అడిగితే“ ఆయనికి అంతంతలేసి గెడ్డాలూ మీసాలూ వుంటాయ్  .. .. నాకు భయం “ – అన్నా. అంతే!  నాన్న ఆరోజు నాతో బడికివచ్చి “ ఏమిటయ్యా! ఆ గెడ్డాలు,మీసాలూ ? గెడ్డంగీసుకో!మాపిల్ల నిన్ను చూసి జడుసుకొంటోంది, బడికి వెళ్ళనంటోంది.” అని చెపుతూ నవ్వాడు మానాన్న. ఆయనా నవ్వాడుఅలా మొదలైంది నా పాఠశాల చదువు.(తన పిల్లలు తనని ఏకవచనంతో  పిలవాలని కోరుకొన్న మానాన్న మాకు చిన్నప్పటినుండీ  అలా అలవాటు చేసాడు).

రంగు రంగుల పలకపుల్లలంటె చాలా ఇష్టం . వాటితో బొమ్మలు గీసేదాన్ని. అన్నయ్య  బాపిరాజు  కాంపస్ బాక్సు లోని వృత లేఖినిని పట్టుకొని చుట్టూతిప్పుతూ బొమ్మలు గీయడానికి సరదా పడేదాన్ని. మాపెరట్లొ  కొబ్బరి, జామ, బొప్పాయి చెట్లుండేవి. బొప్పాయి  పచ్చిమట్టను విరిచి  గోలెం నీళ్లలో పెట్టి ఊదుతూ బుడగలు తెప్పించడం సరదా.బొప్పాయిగొట్టం నీటిలో వంగినట్టు కనిపిస్తూ  బైటకుతీస్తే మామూలుగానే వుండేది . అలా పలుమార్లు పెట్టిచూస్తూ, “ వంగలేదు అలాకనిపిస్తోంది,-  అంతే” – అయినా “ ఎందూకలా కనిపిస్తుంది?”   అని కూడా అనుకొనేదాన్ని.మా ఇళ్ళు సగభాగం మేడ కాగా, ఆమేడను కలుపుతూ డాబాలు, ఆడాబాలకింద పొడుగాటి వరండాలనానుకొని  పెంకుటిల్లువుండేది. పెంకుటింటి భాగంలోనే వంటిల్లు, భోజనాలగది, నట్టిళ్లు.  నట్టింట్లో  దేముని మంజరం, నాలుగు గొళుసులతో ఉయ్యాలాబల్ల  వుండేవి. భోజనాలగది పైన పెంకులమధ్య  రెండుచోట్ల  గాజుపలకలు చెక్కసున్నంతో  బిగించి వుండేవి. అపరాహ్నం వేళ  ఆగదిలో రెండు చోట్ల  సూర్యకాంతి ఆపలకలనుండీ వచ్చి నేలమీద ఏటవాలుగా,  నలుచదరంగా పడేది.ఆవెలుగు మార్గంలో  ఏవో చిన్నిచిన్ని రేణువులు మెరుస్తూ అటుఇటూ, ఎటుపడితే అటు  వేగంగా పరిగెడుతూ  చీకటిభాగంలోకి పోతూ మరిక కనిపించేవికావు .కాని వెలుగు పడుతున్న మేర ,  పడుతున్నసేపూ అటువంటి రేణువులు అడదిడ్దంగా పరుగులు పెడుతూ మెరిసిపోతూ వుండేవి. వాటివంక నేను ఆశ్చర్యంగాచూస్తూ వుండేదాన్ని. చీకటి భాగంలోకి వెళ్లినవి ఎటుపోయాయ్?అంటె ఈ గదినిండా అటువంటి రేణువులున్నాయన్న మాటేగా! నాచుట్టురావున్నాయాఅవి? నేను వాటిమధ్యన వున్నానా? అవి నన్ను తగులుతున్నాయా?అన్నీ ప్రశ్నలే! అవకాశంవున్నప్పుడల్లా ఆసమయానికి వాటిని చూస్తూవుండే దాన్ని. ఇలాంటి రేణువులు  నన్ను తరచూ విస్మయంలో పడేస్తూ వుడేవి . తూర్పువరండాకున్న కిటికీ నిలువు ఊచలనుండి ఉదయపు సూర్యకాంతి   దూరుతూ గదిలో వెలుగు రేఖలను ఏటవాలుగా  ఏర్పరచగా ఆ రేఖలలో పిచ్చిపట్టినట్టు ధూలిరేణువులు  అడ్డదిడ్డంగా పరుగులుపెడుతూ కనిపించేవి.కాంతి పడని  నలుపు భాగంలోకి వెళ్లీ  వేళ్లగానే  మరికనిపించేవి కావు.వరండాని ఆనుకొన్న పెరట్లో  మూడు రాళ్ల పొయ్యమీద   రాగి డెగిసా  పెట్టి  ఎండు కొబ్బరాకులూ మట్టలతో  స్నానాలకి  నీళ్ళు కాచేవారు. విసెన కఱ్ర తో విసరగా పొయ్యనుండి లేచిన పొగ వేవేగంగా  గదిలో పడ్ద కాంతి గీతలలోకి పరుగులు పెట్టేది.  అందులో కొన్ని రేణువులు మరీ ధగధగా మెరిసిపోతూ   చీకటి భాగంలోకి జొరబడుతూ అదృశ్యమయిపోయేవి. 

 సైన్స్ అంటే ప్రకృతిని తరచితరచి చూసి సత్యాన్ని తెలుసుకోవడం.తెలుసుకొన్నదాన్ని మానవ మనుగడకుపయోగపడే నూతన వస్తువులుగా, పరికరాలుగా మర్చగలగడం సంకేతిక పరిజ్ఞాణమవుతుంది.ప్రకృతిని అనుకరిస్తూ “బయో మిమిక్రీ” అనే   పరికల్పనతో బులెట్ ట్రైన్వంటి ఎన్నో ఆవిష్కరణలు జరిగాయి;జరుగుతున్నాయి. పరిశీలన, కుతూహలం , ప్రశ్నించే తత్వం,  ప్రతీ పసిపాపకూ వుంటాయి. అవే ఒకనాడు ఆ పాప లేదా పాపడిని  ఎదోఒకనాటికి “ బ్రేక్ త్రూ” పరిశోధకులుగా నిలబెట్ట వచ్చు .  ఎందుకు చెపుతున్నానంటే ఆనాటి నాలో వున్న ఆపాపాయికి కాలం కర్మ కలిసిరాకపోబట్టికానీ , కలిసొస్తే  ఏమో ఎవరికితెలుసు  మన దేశానికి నొబెల్ తెచ్చి పెట్టిన   తొలి భారతీయ వనిత   అయ్యేదేమో సుమండీ!  ప్చ్ !  ఏంచేస్తామ్   जो मिल गया उसी को मुकद्दर समझ लिया,जो मिल गया उसी को मुकद्दर समझ लिया मुकद्दर समझ लिया, मुकद्दर समझ लिया…… అని నేను సరిపెట్టుకోగలిగినా  మన  దేశపు ఆడపిల్ల అందునా తెలిగింటి ఆడపిల్ల  తెచ్చుకోవలసిన నోబెల్ ని తెచ్చుకొనే అవకాశం పోయిందే అని బాధపడుతున్నా . పర్వాలేదులెండి,  ఈనాటి తెలుగింటి ఆడపిల్లలు  అన్ని రంగాలలోనూ  చాకుల్లా తయారవుతున్నారు. వారుతెచ్చి పెట్టకపోతారా! అని ఆశతో ఎదురుచూస్తున్నాను . అన్నట్టు నన్ను యూనివర్సిటిలో   “చాకు “ అని  మొగపిల్లలు అనుకొనేవారట! ఈమాధ్యనే ఆసంగతి తెలిసిందిలెండి . నిఝంగా  చాకు కాదూ,   పేరులోని  అక్షారలతో తయారైన నిక్ నేమ్  అని  తెలిసిపోతూనే వుందిగా !   

  విజయనగరం  చిన్నిపల్లి వీధిలోని మాఇల్లు  నాబడికి చాలాదగ్గర. నేను ఆఇంట్లోనే పుట్టానుట.“ టఅని ఎందుకన్నానంటె  ఎవరో చెపితేనే కదా ఆసంగతి తెలిసేది.“ జేష్టమాసం – అమావాస్య వెళ్ళాక పున్నమి ముందు సప్తమినాడు పుట్టావు, నాన్నగదికి ఆనుకొనివున్న పంచపాలీలో  పుట్టావ్ ”  అని అత్తయ్య  చెపుతూ వుండేది.“మీరంతా అక్కడే  పుట్టారులే !ఒక్క అమ్మజీ తప్ప ! అమ్మజీ తొలి చూలు పిల్లకదూ !అందుకది  తాతగారింట్లో-  కడలిలో పుట్టింది” అనేది. అమ్మజీ నాకు పెద్దక్క. నాకంటే 14 ఏళ్లు పెద్దది , దాని తరువాత తులసి,బాపిరాజులు.బాపిరాజు తరువాత శ్రీనివాసు మూడేళ్ళ వయసులో జబ్బుచేసి చనిపోయాడట!ఆ శోకంలో- పసిపిల్ల ఇంట్లో  తిరుగాడాలని  కోరికోరి ఎదురుచూసి   అమ్మనాన్నలు  నన్ను కన్నారుట.నాకోసం  గర్భవతి అయిన మాఅమ్మ  భాగవతం చదివిందట!అందుకే నాకు శేషకృష్ణకుమారి అని పేరు పెట్టారుట! శేషమ్మగారు మా అమ్మమ్మ. బళ్లో చేర్చినపుడు“ శేష” ని  మానాన్న తొలగించాడుట. ఆనాటి ఉమ్మడి కుటుంబాలలో ఇటువంటి కబుర్లు  తరచుగా చెప్పుకొంటూవుండేవారు. అందువల్ల  నేను పెద్దాయ్యాక ఆ సంగతులు  నాచెవులో పడ్డాయి.అమ్మానాన్నలకి, నేను ‘ terribly wanted child’ని కదా అని నాకేదో తెలియని ఆనందం! 

 పెద్దక్క అమ్మజీ నాకు రెండు జడలు వేసి పువ్వులు పెట్టి స్కూలుకేకాదు,16 ఏళ్లు వచ్చినా  కాలేజీలో డిగ్రీ క్లాసుల వరకు పంపింది. ఒకసారి తను  ఊరెళ్ళినప్పుడు నాజడలు నేను వేసుకొన్నాను. తిరిగొచ్చి జడలు వేస్తూ “ నాచేతుళ్లో వున్నంత దాకా జుత్తుబాగుంది, జుత్తు అంతా పాడైపోయింది ఎంత వూడిపోయిందో !”  అం టూ వాపోయింది ! ఇప్పూడాసంగతి  గుర్తుకొచ్చి ఆకాసిన్ని రోజులలొ జుత్తులో వచ్చిన మార్పు ఆవిడకు కనిపించిందా! అని నవ్వుకొంటాను.అంత అపురూపంగానన్ను చూసుకొనేది.ఈమధ్య డిగ్రీ క్లాస్ మేట్ ప్రభావతిని కలిసి నపుడు  “ అమ్మాజీఅక్క నిన్ను ఎంత ప్రాణపదంగా చుసుకొనేదో కదా అంది!” నిజమే మరి!! అందుకే,  అనుక్షణం గుర్తుకొస్తూనే వుంటుంది. గౌనులనుండి,లంగావోణీల స్థాయిదాకా  ఇంట్లోనే  చేతి కుట్టుతోనే  గౌనులు, జాకట్లు   కుట్టేవారు. మాఅత్తయ్య  కత్తిరించి ఇస్తే అమ్మాజీ,   కుడుతూ వుండేది అమ్మాజీ నాకు అన్ని రకాల కుట్లూ – ఎంబ్రయిడరీ తోసహా నేర్పింది.  

  తను సంగీతం నేర్చుకొంది.అమ్మ పండగలకి  దేముని మడపందగ్గర పూజయ్యాక అమ్మజీని అమ్మవారిమీద కీర్తనలు పాడమని అడిగేది.‘ అంబవాణి నన్నాదరించవే …వంటి కీర్తనలు చాలా పాడేది. . చాగంటి గంగబాబు గారు మాఇంటికి వచ్చి తనకి సంగీతం నేర్పిస్తూవుండేవారు.  ఉయ్యాలలో నన్నువళ్లో కూర్చోపెట్టుకొని “ బంగారు పాపాయి బహుమతులు పొందాలి, మాపాప చదవాలి మామంచి చదువు “  అంటూ  పాడేది. నన్నుఇంట్లో  పాపాయి అని పిలుస్తారు.పసిపిల్లగా పాటవింటున్న నేను ఆపాపాయిని నేనే అనుకొనేదాన్ని.సాధారణంగా పెద్దవాళ్ళు  స్కూలు కెళుతున్నవయసులోనున్న పిల్లలకు “ఇంక పుస్తాకాలు తీసి చదువుకో” అని చెపుతూ వుంటారు కదా! మానాన్న ఒక సారి “ పాపాయికి ఎప్పుడూచదువుకో– అని చెప్పలేదు”  అన్నాడు.  నాచిన్నతనంలో  అమ్మాజీఅక్క పాడిన పాటల,కీర్తనల ప్రభావం నామీద చాలావుంది.  “ I am sixteen going  on seventeen”  అని నేను పాడుకొనే  వయసులో  తను చనిపోవడం నాకు తగిలిన అతిపెద్ద  దెబ్బ! అయితే, జీవితంలో దుఖ్ఖాలను దిగమింగుకోగల శక్తిని  తనసప్తస్వరాల శ్రావ్య కంఠస్వరం నుండే పొందాను.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.