బహుళ-7

చీకటి ఒప్పు (అంగలూరి అంజనాదేవి కథ)

 – జ్వలిత

మోసపోయే అమాయకత్వం చుట్టబెట్టుకుని ఉన్నప్పుడు. మోసగించే వాళ్ళు కోకొల్లలుగా మన చుట్టూ ఉంటారు.

ఒక మహిళ  కరోనా సమయంలో చిన్న విషయానికే భర్తమీద అలిగి, ఇద్దరు పిల్లలను తీసుకొని ఊరు నుండి హైదరాబాద్ కు వచ్చింది. ఆమెను మరో మహిళా ఆదుకొని పని చూపిస్తానని, నమ్మించి ముంబై తీసుకెళ్ళి ఒక వ్యక్తికి లక్ష రూపాయలకు అమ్మేసింది. ఆమెను కొన్న వాడికి ముగ్గురు భార్యలు ఉన్నా, ఈ మహిళను కూడా కోరుకున్నాడు, వెంటపడ్డాడు వినక పోతే, పిల్లలను చంపుతానని, బెదిరిస్తూ మూడు నెలలు ఒక ఇంట్లో బంధించాడు. చివరికి పొరుగు వారు గమనించి పోలీసులకు చెప్పడంతో కథ సుఖాంతమైంది. ఇటువంటి అతి తెగువ కొత్త కష్టాలను తెచ్చి పెడుతున్నాయి కొందరు మహిళలకి.

అయితే ప్రతి ఐదు నిమిషాలకు ఒక మహిళ గృహహింసకు, లైంగిక వేధింపులకు గురవుతున్నట్టు,  అనేక సర్వేలు చెబుతున్నాయి. స్త్రీలను వేధింపులకు లైంగిక హింసలకు గురి చేస్తున్న వారిలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు 50 శాతం కంటే ఎక్కువే అని మరి కొన్ని పచ్చి నిజాలు చెప్తున్నాయి.

ఇటువంటి నిజాలను వింటున్నప్పుడు, ఒక కథ గురించి రాయాలనిపిస్తోంది. ఆ కథ పేరు “చీకటి ఒప్పు”, అంగలూరు అంజనీదేవి రాసిన ఈ కథ 1988 లో మే నెల 18వ తేదీ నాటి “ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక”లో ప్రచురింపబడింది. ఆనాటి కథలు సేకరించి భద్రపరిచిన “కథానిలయం” వారికి ధన్యవాదాలు.

   కథలోకి వస్తే వీణ అనే యువతికి మేనమామ బాధ్యతగా వివాహం చేస్తాడు. వీణ భర్త పేరు గణేష్.  ఆమె తల్లిదండ్రుల ప్రస్తావన కథలో ఎక్కడ లేదు. అయితే వీణ అందమైన శరీరం మీద మేనమామకు కోరిక. ఆమె భర్త లేనప్పుడు, ఉన్నప్పుడు కూడా రావడం, భర్త చూడకుండా ఆమెను తన కోరిక తీర్చమని వేధించడం చేస్తూంటాడు.

 ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టలేడన్న సామెత మనకు తెలిసిందే కదా !

 మేనమామ వేధింపులు భరించలేక వీణ అనుభవిస్తున్న నరకాన్ని భర్త గమనిస్తాడు.

 ఒకరోజు ముగ్గురు భోజనం చేస్తుండగా భర్త ఉండగానే, మేనమామ మితిమీరిన ప్రవర్తనతో వీణను కాలితో గీరుతాడు. ఏమి జరిగిందో తెలియక భయంతో కేక వేస్తుంది. ఆమె భర్త టేబుల్ కిందికి వంగి చూస్తాడు. ఏమీ కనిపించకపోయినా, విషయం అర్థం చేసుకుంటాడు. భార్య భయానికి కారణాన్ని ఊహిస్తాడు. అయినా ఆమెను అనుమానించాడు. గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేయడు.

కథలో వీణ భర్త గణేష్ పాత్రను రచయిత్రి చాలా ఉదాత్తంగా చిత్రీకరించారు. భయపడుతున్న భార్యతో అతడు అన్న మాటలే అందుకు ఉదాహరణ.

” ఈమధ్య నువ్వు అదోలా ఉంటున్నావు. కారణం చెప్పమని అడగను. కానీ నువ్వు అలా ఉంటే, నాకు ఏదోగా ఉంటుంది” అంటాడు.

 ఇంకా “వీణా !  మనిషి జీవితంలో అప్పుడప్పుడు అనుకోని పరిణామాలు ఎదురవుతాయి. అవి లేనిపోని భయాలను సృష్టించి జీవితం మీద విరక్తిని కూడా కలిగించే ప్రమాదం ఉంది. ప్రమాదాన్ని తప్పించుకుని ధైర్యాన్ని సంపాదించుకోవాలి, కొన్ని సందర్భాలలో ఎవరి సమస్యను వాళ్లే పరిష్కరించుకునే ధైర్యాన్ని కూడతీసుకోవాలి. అంతేకానీ ఎప్పుడో, ఎక్కడో బాంబు పేలబోతోందని భయపడుతూ కూర్చుంటే. ఆ బాంబే ఏదో నీ గుండెలోని పేలుతుందన్నట్లుగా, కొన్ని పరిస్థితులు విషమిస్తుంటాయి. అర్థమైందా!” అంటాడు.

ఆ మాటలతో కొంత ధైర్యాన్ని కూడగట్టుకొంది వీణ. కానీ వాస్తవ పరిస్థితుల్లో అటువంటి భర్తలు చాలా తక్కువ.

వీణకు ఎదురైన సమస్య చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్నదే. అయితే అందరికీ ఆమెకు దొరికినట్టు సాయం చేసే స్నేహితురాలు లభించరు. వీణ భయస్తురాలు. పైగా మేనమామ  పైశాచిక ఆకాంక్ష ఆమెను ఒత్తిడికి గురిచేస్తుంది. విషయాన్ని భర్తకు చెప్పలేదు. ధైర్యంగా ఎదుర్కోలేదు. ఏమిచేయాలో తెలియక విలవిలలాడుతోంది.

తన పశువాంఛ వ్యక్తపరుస్తున్న మేనమామతో “మామయ్యా! తెలివుండే మాట్లాడుతున్నావా! మనిద్దరం ఇప్పుడు పెళ్లి అయిన వాళ్ళం కదా! పెళ్లికాకముందు ఈ మనసు, ఈ ఆశలు ఏమయ్యాయి ? నన్నే పెళ్లి చేసుకుంటే సరిపోయేదిగా ! ” అని అడుగుతుంది.

 దానికి సమాధానంగా “నిన్ను పెళ్లి చేసుకుంటే నా అత్త వారిచ్చిన ప్లైవుడ్ సెంటర్ ఉండేది కాదు. నా సర్టిఫికెట్లు పాత కంపుకొట్టే వరకు ఉద్యోగం కోసం రోడ్లమీద తిరిగాలిసి వచ్చేది. నీ అందం ఆకలితో కాలుతున్న కడుపులను చల్లార్చేది కాదు. చేతగానితనంతో నువ్వు కార్చే కన్నీళ్లు మన దాహం తీర్చేవి కావు” అంటాడు వెటకారంగా.

బయటికి పెద్దరికాన్ని ప్రదర్శిస్తూ, రక్షణ నివ్వాలిసిన రక్తసంబంధీకులే ఎటువంటి ధారుణాలకు వడికడతారో రచయత్రి మూడుదశాబ్దాల క్రితమే తన రచనలో వివరించారు.

 పెద్దరికం ప్రదర్శించి పెళ్లి చేసిన మేనమామ బ్లాక్ మెయిల్ చేస్తున్నప్పుడు.

 “మనకు పెళ్లికి ముందు నుంచే సంబంధం ఉందని నీ మొగుడికి చెప్పి నీ బతుకుకు 

ఫుల్ స్టాప్ పెట్టేస్తా” అంటూ భయ పెడతాడు. 

కానీ భర్త మాటలతో ధైర్యాన్ని తెచ్చుకొని పరిష్కరించుకుంటుంది.

వీణ భర్త ఉద్యోగం పని మీద వేరే ఊరు వెళ్ళగానే.

ఇంటికి తాళం వేసి స్నేహితురాలి వద్దకు వెళుతుంది.

” అపర్ణా! మా వారు ఊరు వెళ్ళాడు. నాకేదో భయంగా ఉంది. ఏదో జరగబోతోంది. నువ్వు నాతో మా ఇంటికి రావాలి” అంటూ తొందర పెడుతుంది.

 అప్పుడు అపర్ణ, వీణతో “నీ అమాయకత్వం, నీ భయం చూస్తుంటే నాకు నవ్వొస్తోంది. నీ భర్త లేనప్పుడు ఏ వెధవో నిన్ను వేధిస్తున్నాడనుకుంటా. వాడికి పాఠం చెప్పడం, నీ వల్ల కాదు లే నేను వస్తాను పదా” అంటూ వీణతో బయలుదేరుతుంది.

ఇద్దరూ ఇంటికి వచ్చిన తర్వాత అసలు విషయం చెప్తుంది వీణ.

” అపర్ణ నన్ను చూస్తేనే చాలు మామయ్య పట్టినట్టు ప్రవర్తిస్తున్నాడు న తిరస్కారాన్ని నా మాటలను లెక్కచేయకుండా అమ్మవారు లేని సమయాల్లో నా వెంట తిరుగుతున్నాడు నాకిదో జీవన్మరణ సమస్య అయింది ఏ క్షణాన ఆహుతి అవుతాను అర్ధం కాకుండా ఉంది అంటుంది భయపడకు వీణ నేను ఉన్నాను గా అని మాత్రం అంటుంది అపర్ణ దూరం నుంచి వీణ మేనమామ రావడం ఇద్దరు చూస్తారు సమయం అయ్యింది.

ఆ రాత్రి తిరిగి రాడని తెలిసి ఆరు గంటలకి దుకాణం కట్టేసి వీళ్ళ దగ్గరికి వస్తాడు ఆమె మేనమామ. అప్పడి వరకూ వెలుగుతున్న లైట్స్. అతడు ఇంట్లో అడుగు పెట్టగానే ఆరిపోతాయి. గాజుల శబ్దం విని గదిలో ప్రవేశిస్తాడతడు. ఎటువంటీ ప్రతిఘటన లేకుండా లొంగిపోయిన శరీరాన్ని అనుభవిస్తూ ఇంతమాత్రానికే ఎంత బెట్టు చేసింది అనుకుంటాడు.

ఇంతలో టక్కున శబ్దంతో లైట్లు వెలుగతాయి. మేనకోడలిని వేధించిన కామాంధుని కళ్ళు తెరుచుకుంటాయి. అతనితో పాటు పడక మీద అతని భార్యను చూసి కరెంట్ షాక్ కొట్టినంత పనవుతుందతనికి.

“వీణ మంచిదండీ తెలివిగా చీకటి తప్పు జరగకుండా ఒక భార్యను అతని భర్త వద్దకు పంపింది” అంటుంది అపర్ణ. తేలు కుట్టిన దొంగలా మిన్నకుంటాడతడు.

కథ ముగింపు కూడా చాలా అద్భుతంగా చిత్రించారు రచయిత్రి పాఠకుడు ఊహించని తీరులో కథను మలుపు తిప్పారు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు ఇద్దరు తెలివైన మహిళలు ఒకరినొకరు అర్థం చేసుకుని సహకరించు కొని మూర్ఖంగా కోపాలకు, ఈగోలకు పోకుండా సమస్యను పరిష్కరించుకునే తీరు, రెండు జీవితాలను కాపాడుకున్న తీరు ఆదర్శప్రాయంగా ఉంది.

అయితే ఇందులో వీణ మేనమామ భార్య సమయస్ఫూర్తి వీణను ఆపద నుండి కాపాడ గలిగింది.

మొత్తానికి కథ బాగుంది. పాఠకులను ఆగకుండా చదివించే గుణం కథాకథనంలో ఉన్నది. చైతన్య వంతమైన ముగిఃపుతో అందరూ చదవతగిన రచన “చీకటి ఒప్పు” అనే కథ.

     *****   

అంగలూరి అంజనాదేవి గురించి.

అంగలూరి అంజనాదేవి

జననం – ఏప్రిల్ 19, 1963

తల్లి – వెంకట సుబ్బమ్మ ,

తండ్రి – మామిడాల రాఘవయ్య ,

భర్త  – అంగలూరు ఆంజనేయులు ,

పుట్టిన ప్రాంతం –  వరంగల్ జిల్లా హన్మకొండ,

పదవ తరగతి నుండే కథా రచన ప్రారంభించారు.

తొలి నవల – మధురిమ ఇంటర్మీడియట్లో రాశారు.

 మొత్తం పదహారు నవలలు, 25 కథలు, “జీవితం అంటే కథ కాదు” కథాసంపుటి,  “గుండెల్లోంచి అరుణోదయం” కవితాసంపుటి రాశారు.

తెలుగు సాహిత్యంలో బి.ఎ. చేశారు.

  *****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.