విషాద కామరూప         

-అనురాధ నాదెళ్ల

రచనః ఇందిరా గోస్వామి

అనువాదంః గంగిశెట్టి లక్ష్మీనారాయణ

                                     కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం లభించిన ‘’విషాద కామరూప’’ నవలా రచయిత్రి ఇందిరా గోస్వామి. నవలను కామరూప మాండలికంలో ‘’ఊనే ఖోవా హౌదా’’ పేరుతో రాయటం జరిగింది. అస్సామీ మాండలికం ఎక్కువ మందికి తెలియకపోవటం వలన రచయిత్రి స్వయంగా ‘’ సాగా ఆఫ్ సౌత్ కామరూపపేరుతో తన నవలను ఇంగ్లీషులోకి అనువదించారు. దానిని గంగిశెట్టి లక్ష్మీ నారాయణ గారు తెలుగులోకి తీసుకొచ్చారు. అనువాద పుస్తకాన్ని సాహిత్య అకాడెమీ వారు 2002 సంవత్సరంలో మొదటి ముద్రణ చేసారు.

                            ఇందిరా గోస్వామి ఆత్మకథ ‘’An unfinished autobiography’’ లో చెప్పినట్టుగా తన జీవితంతో వాస్తవంగా ముడివేసుకున్న ఒక సత్త్రా చరిత్రను, తన బంధువుల జీవితాల్లో జరిగిన సంఘటనలనే కాస్త అటూఇటూగా నవలలో చిత్రీకరించారు. ఒకప్పుడు సర్వకళలకూ, తంత్ర శాస్త్ర ఆధ్యయనానికి పుట్టినిల్లుగా ఉన్న అస్సాం భారతదేశానికి స్వాతంత్రం వచ్చేనాటికి ఏవిధంగా విషాద స్థితిలోకి జారిపోయిందో నవల విపులంగా చెబుతుంది. నవలలో అస్సాం ప్రాంతపు సాంస్కృతిక అంశాలనెన్నింటినో చెప్పటం జరిగింది. ఇక్కడి ప్రకృతి సిధ్ధమైన సౌందర్యాన్ని కళ్లకు కట్టినట్టుగా వర్ణించటంతో చదువుతున్న పాఠకులు మంత్రముగ్దులైపోతారు

సుమారు నూట పాతిక సంవత్సరాల పాటు అస్సాం లోని ఒక సత్త్రా, దానిచుట్టూ పెనవేసుకున్న గ్రామాలలోని ప్రజల జీవనాన్ని, ఆచారవ్యవహారాలను, సుఖదుఃఖాలను, కష్టనష్టాలను వివిధ పాత్రల నేపథ్యంగా చెప్పిన కథ.

                                సత్త్రా అనేది ఒక వైష్ణవమఠం. మఠాలపైన ఆధ్యాత్మికంగానూ, సామాజికంగానూ వంశపారంపర్య ఆధిపత్యాన్ని పొందేవారు గోసాయిలు లేదా గోస్వాములు. వారికి ఆయా సత్త్రాకు చెందిన  విస్తారమైన భూములపైన ఆధిపత్యం ఉంటుంది. సంస్థానాధీశుల్లా అధికారాన్ని, విలాసవంతమైన జీవన శైలిని అనుభవిస్తుంటారు. అస్సాంలో గోసాయులను  ఉన్నతమైన జాతికి చెందిన వారిగా చెబుతారు. వారికి మతాధిపత్యం తో పాటు తమ ప్రాంతంలోని ప్రజల పైన అన్ని విధాలైన అధికారం ఉండటంతో వారిని ‘’అధికార్’’ అని పిలుస్తారు. వీరిపట్ల మఠం భక్తులకు, శిష్యులకే కాక అన్ని స్థాయుల్లోనూ ఉన్న అన్ని మతాల ప్రజలకు భక్తి, గౌరవాలుంటాయి

                             సత్రాలకు సంబంధించిన భూములు ఎక్కువభాగం అస్సాంను పాలించిన అహోం మహా రాజులు దానంగా ఇచ్చినవి. బ్రిటీషుపాలకులు భూదానాలకు సంబంధించిన చట్టాలను తీసుకొచ్చి గోసాయిలకు భూముల మీద ఉన్న అధికారాలను క్రమంగా తగ్గిస్తూవచ్చారు. ఆపైన భారతదేశ స్వాతంత్రానంతరం వచ్చిన భూ సంస్కరణలు భూములపైన అధికారుల పెత్తనాన్ని, హక్కులను మరింతగా తగ్గించాయి

ఇదే సమయంలో కమ్యూనిస్టుల ప్రభావంతో కౌలు రైతులు భూమిని దున్నే తమకే భూమిపై హక్కులుండాలన్న విషయాన్ని చెబుతూ అధికారుల ఆధిపత్యాన్ని ప్రశ్నించటం మొదలుపెట్టారు. కౌలు కట్టే విషయాన్ని నిర్లక్ష్యంచేసి, అధికారులకు తాము ఎంతమాత్రం అణిగి ఉండవలసిన అవసరం లేదని ప్రకటిస్తూ వచ్చారు. దున్నేవారికే భూమిపైన అధికారం ఉందనీ, గోసాయిలు స్వయంగా వచ్చి పొలాల్లో వ్యవసాయం చేసి తమ భూములపై హక్కులను  పొందవచ్చని చెబుతారు.

                                    అస్సాంలోని కామరూప జిల్లాలోని ఒక సత్త్రాలో కథ మొదలయ్యేనాటికి (1948) తమ అధికారాన్ని ధిక్కరిస్తూండటాన్ని సహించలేని పెద్దగోసాయి తన కుమారుడు, భవిష్యత్తులో కాబోయే అదికారి ఐన ఇంద్రనాథ్ ను కౌలు రైతులతో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు బంగారా అనే ప్రాంతానికి పంపుతాడు. ఇంద్రనాథ్ నవలా నాయకుడు. అధికార్ ఇంటి వారసుడిగా అందరి గౌరవాన్ని అందుకుంటూ అందరి గురించి ఆలోచించే మంచి మనసున్న వాడు. అర్థంలేని పాత సంప్రదాయాల పట్ల విముఖతను చూబిస్తుంటాడు

                                  నవలలో ఆనాటి సమాజ తీరుతెన్నుల గురించిన విషయాలెన్నో ఉన్నాయి. ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలన్నింటినీ క్షుణ్ణంగా చర్చించటం జరిగింది. గోస్వామి కుటుంబాల్లో వితంతువులు అనేక సామాజిక నిర్బంధాల మధ్య నలిగిపోతూ జీవితాన్ని చివరివరకూ గడపవలసి ఉండేది. వ్యక్తురాలు కాకుండానే ఆడపిల్లకు వివాహం జరిపించటం సంప్రదాయంగా ఉండటంతో చాలామంది యుక్తవయస్కులయ్యేసరికి వితంతువులుగా పుట్టిల్లు చేరి దుర్భర జీవితాలను చూడవలసి వచ్చేది. పిల్లలు లేని వితంతువుల పట్ల అత్తింటివారి ప్రవర్తన మరింత లోకువగా ఉండేది. భర్తను పోగొట్టుకుని పుట్టింటికి చేరిన ఆడపిల్లను అత్తింటివారు తిరిగి తమ ఇంటికి తీసుకురావటం, కుటుంబంలో వ్యక్తిగా ఆదరించి, ఆమె జీవనానికి అవసరమైన ఆర్థికపరమైన సదుపాయాన్ని కలిగించటం సాధారణంగా కనిపించదు.

                                 కథ మొదలయ్యేనాటికే ఇంద్రనాథ్ మేనత్త దుర్గ ఇలాటి పరిస్థితిలో అన్న ఇంటికి చేరుతుంది. భర్త అస్థికలను పుణ్యతీర్థాల్లో కలపాలన్న ఆశతో ఉంటుంది. నోరుతెరిచి వదినగారిని (గోసాయినిని) తను పూరీ మొదలైన యాత్రలను చేసేందుకు తగిన ఆర్థిక వనరులను కల్పించమని అడుగుతుంది. ఆమె నిరాకరించటంతో తనకున్న కొద్ది నగలు, బట్టలు దాచుకున్న పెట్టెను తీసుకుని పక్కనే ఉన్న తన చిన్న వదినగారి (చిన్న గోసాయిని) ఇంటికి వెళ్తుంది. చిన్నగోసాయినీ దుర్గ బాధను అర్థం చేసుకుంటుంది కానీ, దుర్గ అలా రాకూడదని, వితంతువైన తాను ఆర్థికంగా ఆమెకు ఆశ్రయం ఇవ్వగలిగే స్థితిలో లేనని మృదువుగా చెప్పి ఇంద్రనాథ్ తో ఆమెను తిరిగి తన బావగారైన పెద్ద గోసాయి ఇంటికి పంపించివేస్తుంది. నగల పెట్టెను కూడా తీసుకుపొమ్మని చెబుతుంది. కానీ దుర్గ పెట్టెను చిన్న గోసాయిని ఇంట్లోనే వదిలి వెళుతుంది. ఆ తర్వాత ఆమె పెట్టెలోని నగలు దొంగతనానికి గురవుతాయి. దుర్గ దుఃఖానికి అంతులేకుండా పోతుంది. ఆమెను నైరాశ్యం కమ్ముకుంటుంది. చిన్నగోసాయినీకి దొంగతనం ఎలా జరిగిందో అర్థం కాదు. అసలు ఆ పెట్టెలో ఏముందో ఆమె ఎప్పుడూ చూడనేలేదు.

                                 పెద్ద గోసాయి తమ్ముడు చిన్న గోసాయి మరణంతో చిన్న గోసాయిని ఎవరి అండా లేకుండా స్వంతంగా ధైర్యంగా జీవించే ప్రయత్నం చేస్తుంటుంది. తనభర్త అధికారం కింద ఉన్న భూములనుంచి రైతులు ఆమెకు ఆదాయాన్ని అందించటం ఆపివేస్తారు. కానీ శిస్తును మాత్రం ఆమె కట్టవలసి వస్తుంటుంది. గోసాయి జీవించి ఉన్న కాలంలో అతని కుటుంబానికి అవసరమైన సేవను శిష్యులు అందించేవారు. అతని మరణం తరువాత మహీధర్ బాపూ అనే కూచ్ బెహార్ బ్రాహ్మణుడు చిన్న గోసాయినీ కౌలు వ్యవహారాలు చూసేందుకు స్వచ్ఛందంగా వచ్చి ఆమె ఇంట్లోనే ఒక గదిలో నివాసముంటుంటాడు. గోసాయిని పట్ల గౌరవంతో, ఆమెకు చెందిన వ్యవసాయ భూముల వివరాలను పట్టిక తయారుచేసి, వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆమె  భూములనుండి కౌలు వసూలుకు తిరుగుతుంటాడు. చిన్నగోసాయినీకి మహీధర్ పట్ల ఆమెకే అంతుచిక్కని ఒక ఆకర్షణ ఉంటుంది. అయితే తను మాత్రం ఎలాటి తప్పు చెయ్యదని, నిగ్రహం కలదని గాఢంగా నమ్ముతుంది. కౌలు వసూలుకు ఆమె అనుమతి ఇస్తున్నట్టుగా మహీధర్ ఆమెతో తెల్ల కాగితంపైన కొన్ని సంతకాలు తీసుకుంటాడు.   

                                       ఒకరోజు మధ్యాహ్నం మహీధర్ రాకకోసం ఎదురుచూస్తున్న చిన్న గోసాయినీ దగ్గరకు ఒక హోం గార్డ్, ఒక భగత్ ( సత్త్రాలోని వైష్ణవ భక్తుడు) వచ్చి ఆమె క్షేమ సమాచారాల గురించి అడిగి, పొలాలపై ఆమె బయానా తీసుకుంటోందన్న మాటను మహీధర్ రైతుల్లో ప్రచారం చేస్తున్నాడని, ఆమె అతన్ని అంతగా నమ్మి ఉండకూడదని చెబుతారు. చిన్నగోసాయినీ నిర్ఘాంతపోతుంది. వాళ్లు చెప్పేమాటల్లో నిజం లేదనే అనుకుంటుంది. వాళ్లు వెళ్లిన తరువాత మహీధర్ అటువంటి అన్యాయం చెయ్యడని, అతను తనకు జీవితాంతం తోడుగా ఉండాలని కోరుకుంటుందామె.  

                                     కానీ అదే రాత్రి ఆమెను నిద్రలేపి, ఇంటిముందు గుంపుగా చేరిన జనం అక్కడ నేలమీద వలతో కట్టివేయబడి గాయాలతో పడి ఉన్న మహీధర్ ను చూబిస్తారు. హోంగార్డ్ ఆమెకు వివరం చెబుతాడు. మహీధర్ ప్రవర్తనపై అనుమానంతో అతన్ని అనుసరిస్తున్నామని, ఇప్పుడు రైతుల దగ్గరనుంచి బయానాలు వసూలు చేసి ఆ సొమ్ముతో పారిపోబోతూ ఉండగా తాము పట్టుకున్నామని చెప్పి, అతని దగ్గర దొరికిన సొమ్మును చిన్నగోసాయినీ కి అందజేస్తారు. అందులో నుంచి నాణాలు, ఒక బంగారు నగ కూడా బయటపడుతుంది. దుర్గ ఆ ఇంట్లో దాచుకున్న నగలను అపహరించింది కూడా మహీధరేనని బయటపడుతుంది. ఊహించని ఈ సంఘటనతో చిన్నగోసాయినీ ప్రపంచంలోని ప్రేమ, ధర్మం, త్యాగం అన్నీ మాయమై ఆమెను నిస్సత్తువలో ముంచుతాయి. ఎలాటి వెనుకదన్ను లేని వితంతువుల జీవితాలు ఎంత చేదు అనుభవాల్ని పోగుచేసుకుంటున్నాయో పాఠకులకి అర్థమవుతుంది. 

                                     ఇంద్రనాథ్ చెల్లెలు గిరిబాల భర్త చనిపోయి పుట్టింటికి చేరుతుంది. ఆమెను బడిలో చేర్చి చదివించాలని ఇంద్రనాథ్ అనుకుంటాడు. కానీ దానికి తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పటంతో ఆమె జీవితం కాస్త అర్థవంతంగా గడిచేందుకు ఏమిచెయ్యాలా అని ఆలోచిస్తాడు. చిన్నగోసాయినీ లాగా, దుర్గత్త లాగా చెల్లెలు కూడా దీనంగా జీవితాన్ని గడపకూడదన్నది అతని ఉద్దేశ్యం

                                              సత్రా అధికారులు ఏనుగులను పోషించేవారు. అది తమ అంతస్తుకు, హోదాకు, సంపదకూ నిదర్శనంగా భావించేవారు. ఎక్కడైనా పెళ్లిళ్లైనపుడు ఏనుగుపై అందంగా అలంకరించిన అంబారీలపై అధికారులు వెళ్తుండేవారు. ఏనుగులతో వ్యాపారం కూడా చేస్తుండేవారు. అడవిలో ఏనుగులను పట్టుకుని, వాటికి అవసరమైన శిక్షణ ఇచ్చి, అమ్మటం కూడా చేస్తుండే వారు. ఇదంతా పెద్ద ఎత్తున జరిగే ఒక ఏనుగుల శిక్షణాకేంద్రం ‘’మహల్’’ అస్సాం దక్షిణప్రాంతంలోని రాణీలో ఉండేది. మచ్చిక చేసుకున్న ఏనుగుల సాయంతో ఏనుగుల వేట జరుపుతుండేవారు

                            ఈ కథలో ఏనుగు పాత్ర ముఖ్యమైనది. నవల మొదలు నుంచి చివరివరకూ దాదాపు అన్ని అధ్యాయాల్లోనూ, సన్నివేశాల్లోనూ గోసాయి దగ్గర ఎన్నో ఏళ్లుగా ఉన్న ఏనుగు జగన్నాథ్ ప్రస్తావన ఉంటుంది. అది పిచ్చిపట్టి విధ్వంసాన్ని చేస్తూ, మనుషులపై దాడికి తెగబడుతూ ప్రజలను భయకంపితులను చేస్తుంటుంది. ఇంద్రనాథ్, గిరిబాల చిన్నపిల్లలుగా ఏనుగు అంబారీ మీద తిరిగినవారే. ఏనుగుతో చిక్కని అనుబంధం వారికుంది.  

                                    గోసాయీల హోదాను తెలియజెప్పే ఏనుగు అంబారీని ఏర్పాటు చేసి దానిపై ఇంద్రనాథ్ కౌలు వసూళ్లకు వెళ్లాలన్నది పెద్ద గోసాయి కోరిక. హోదా, అధికార ప్రదర్శన చూసి వ్యవసాయ భూముల్లో ఎదురుతిరిగిన కౌలు రైతులు తమ పెత్తందారీతనానికి తలవంచుతారన్నది గోసాయి అభిప్రాయం. పేదవారి పట్ల దయ, రైతుల కష్టాల పట్ల సానుభూతి ఉన్న ఇంద్రనాథ్ ఏర్పాటుకు వ్యతిరేకి. అయినా తండ్రి మాటకు ఎదురుచెప్పలేక వెళ్లేందుకే సిధ్ధపడతాడు.

                                    ఆ ఏర్పాట్లకోసం అందమైన అంబారీ తయారీకి మనుషులను దూరప్రాంతాల నుంచి రప్పిస్తాడు పెద్ద గోసాయి. అది తయారయ్యే సమయంలో మతిస్థిమితం తప్పిన ఏనుగు దానిని ముక్కలుగా విరిచి దూరంగా విసిరేస్తుంది. ప్రజలంతా చెడు శకునంగా భావించి, సత్త్రాకు ఏదో ఆపద రాబోతోందని భయపడతారు. గోసాయి మరొకసారి అంబారీ తయారీకి ప్రయత్నాలు మొదలు పెడతాడు. ముక్కలైన అంబారీని పరిశీలించి, చూసిన ఇంద్రనాథ్ అది చెదలు పట్టినదని గ్రహిస్తాడు. సత్త్రా పూర్వపు వైభవం ఇకపైన కనిపించదని అతనికి అర్థమవుతుంది. రాబోయే మార్పులు అతని మనసుకు తోస్తాయి. మూల నవలపేరు ‘’ఊనే ఖోవా హౌదా’’ అంటే చెదలు పట్టిన అంబారీ అని అర్థం. ఒకప్పుడు పెత్తందారీ వ్యవస్థకు పట్టుకొమ్మైన ఆ సత్త్రా క్రమంగా ఎలా పతనమైందో ఈ శీర్షిక సూచిస్తుంది. 

                                   ఇంద్రనాథ్ తన చిన్ననాటి స్నేహితుడు బలరాం ఇంటికి రోజూ సాయంత్రం పూట పేకాట ఆడేందుకు వెళ్తుంటాడు. ఒక రోజు రాత్రి ఆట పూర్తై ఇంటికి బయలు దేరుతాడుజగాలియా నది దగ్గర కర్రవంతెన దాటే సమయంలో ఒక ముసలామె అతనిని ఆపి సంభాషణకు ఉపక్రమిస్తుంది. తాను ‘’ఇలిమన్’’ అనే బ్రాహ్మణ కన్యను పెంచే దాదిననీ, ఆ కన్య బహిన్ రాం భగవతి కూతురని, ఆమె వ్యక్తురాలయే లోపు వివాహం చేసే ఆర్థికస్థితి ఆమె తండ్రికి లేదని చెబుతుంది. కూచ్ బేహార్ నుంచి వచ్చి నల్లమందు వ్యాపారం చేసే బ్రాహ్మణుడొకడు భగవతికి నల్లమందును అలవాటు చేసి, అతన్ని సర్వనాశనం చేస్తున్నాడంటుంది. అంతేకాక భగవతి పరిస్థితిని ఆసరాగా తీసుకుని ‘’ఇలిమన్’’ను వివాహం చేసుకునేందుకు పథకం వేస్తున్నాడని, అతని ఉచ్చులో నుండి యోగ్యురాలైన ఆమెను కాపాడి, పెళ్ళిచేసు కొమ్మని చెబుతుంది. ఇంద్రనాథ్ మనసులో ఇలిమన్ ను చూసిన జ్ఞాపకం మెదులుతుంది. ఆమె పట్ల ఒక సున్నితమైన ప్రేమ చిగురిస్తుందిఒక సత్త్రాకి కాబోయే అధికారి ఒక పేద బ్రాహ్మణ పిల్లను పెళ్లి చేసుకున్న చరిత్ర ఏదన్నా ఉందా అన్న విషయాన్ని కూడా తరువాత అతను తమ ఇంటి పురోహితుడిని యథాలాపంగా అడిగినట్టు అడుగుతాడు

                                  సత్త్రాలో ఉన్నవారితోపాటు గ్రామమూ, చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ నల్లమందు వ్యసనానికి బలి కావటంతో అది అక్కడి ప్రజల జీవితాన్ని దారిద్ర్యంలోకి నెట్టేస్తుంది. ఆ ప్రాంత ప్రజల్లో ఉన్న నల్లమందు వ్యసనాన్ని మాన్పించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి నల్లమందు తినేవారి లెఖ్ఖలు సేకరిస్తూ ఉంటారు. ప్రజలకి వ్యసనం వల్ల కలిగే చెడు ఫలితాలను వివరంగా చెబుతూ, వారి సంక్షేమం, ఆరోగ్యం కోసం ప్రభుత్వం నడిపే పునరావాస శిబిరాలలో చేరమని కోరుతుంటారు. పురుషులతో పాటు ఆర్థిక బాధలు భరించలేని స్త్రీలు కూడా వ్యసనానికి అలవాటుపడతారు. వీరు ఆరోగ్యాలు, పనులు పోగొట్టుకుని కృశించిన శరీరాలతో దొంగతనాలకు, బిక్షాటనకు, దొమ్మీలకు పాల్పడుతుంటారు. వీరిని సన్మార్గంలో పెట్టేందుకు స్వచ్ఛంద కార్యకర్తలు పనిచేస్తుండటం ఇంద్రనాథ్ గమనిస్తాడు. అధికారుల లెక్కల్లో నల్లమందు అమ్మకాలు తగ్గాయని కనిపిస్తున్నప్పటికీ దానిని దొంగతనంగా రవాణా చేస్తున్నారన్నది అందరికీ తెల్సిన రహస్యమే అని ఇంద్రనాథ్ తెలుసుకుంటాడు. ప్రభుత్వ ఆదాయంలో రెండవ స్థానం నల్లమందు ద్వారా అందుతుండటంతో బ్రిటీషు ప్రభుత్వం నల్లమందు వ్యాపారాన్ని రద్దు చేయాలంటూ ప్రాంతీయ కౌన్సిళ్లు చేసిన ప్రతిపాదనలను తోసిపుచ్చటం కూడా చూస్తాడు.  

ఇప్పటి మన ప్రభుత్వాలకు కూడా మద్యం వంటి మత్తుపానీయాల అమ్మకంపైన వచ్చే రాబడి ప్రభుత్వాదాయంలో ప్రధాన వనరుగా ఉండటం గమనించదగ్గ అంశం

విదేశీయుడైన మార్క్ ప్రాచీన గ్రంథాలను సేకరించే పనిమీద ప్రాంతానికి వచ్చి సత్త్రా చరిత్ర రాయాలనుకుంటాడు. అతడు అస్సామీ భాషను చదవగలిగినా, తాళపత్రాల మీద రాతలను చదవలేక వేరొకరి సహాయాన్ని తీసుకుంటుంటాడు

‘’ఈసారి తాను ఎక్కువ రోజులు మకాం వెయ్యవలసి ఉంటుందని, ఏనుగులను కట్టివేసే మైదానంలో చిన్న గుడిసె వేసుకునేందుకు అనుమతి ఇమ్మని’’ పెద్ద గోసాయినిని అడుగుతాడు. ఆమె అంగీకరిస్తుంది. అప్పటికే పుట్టిల్లు చేరిన గిరిబాల మొదటిసారిగా మార్క్ ను చూస్తుంది. అతనిపట్ల మొదటిచూపులోనే ఒక ఆకర్షణ కలుగుతుంది. గిరిబాలను చూసిన మార్క్ కూడా ఆమె సౌందర్యాన్ని చూసి కళ్లు వాల్చుకుంటాడు

                                 ఇంద్రనాథ్ చెల్లెలి జీవితానికి కొంత అర్థం చేకూరుతుందని తలచి మార్క్ పరిశోధన పనిలో ఆమె అతనికి తోడుగా ఉంటుందని చెబుతాడు. ప్రాంతంలో ఎక్కడ పురాతన గ్రంథాలు లేదా పత్రాలు లభ్యమవుతాయని తెలిసినా మార్క్ తో పాటు గిరిబాల కూడా ప్రయాణమై వెళ్తుంటుంది. దానికి ఎవరూ ఎలాటి అభ్యంతరం చెప్పరు. గిరిబాల పట్ల మార్క్ కి సానుభూతి, అభిమానం కలుగుతాయి. మార్క్ తన మతం పట్ల, ధర్మం పట్ల అచంచలమైన విశ్వాసాన్ని కలిగినవాడు. సత్ప్రవర్తన కలిగినవాడు కూడా. పరిచయమైన కొత్తలోనే రాతప్రతుల కోసం జరిపిన శోధన సమయంలో గిరిబాలను నాగుపాము కాటు వేసినపుడు ఆమె ప్రాణాన్ని రక్షిస్తాడు మార్క్

                               దుర్గ క్షయవ్యాధికి గురవుతుంది. తన భర్త అస్తికలను పవిత్రనదుల్లో నిమజ్జనం చేయాలన్న ఆమె కోర్కె తీరదు. తన అత్తింటినుండి తనకు పిలుపు వస్తుందని ఆశతో ఎదురుచూస్తూనే ఉంటుంది. జబ్బు ముదురుతున్న కొద్దీ చుట్టుపక్కలవారంతా ఆమె మరణానికి దగ్గరవుతోందని అర్థం చేసుకుంటారు. అలాటి సమయంలో ఆమె అత్తింటికి వెళ్లి అక్కడ చనిపోవటమే ధర్మమని చెబుతారు. ఇంద్రనాథ్ దుర్గత్తకు వైద్యం చేయించేందుకు గౌహతీలోని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆమె నిరాకరిస్తుంది. తనంతతానుగా అత్తింటికి ప్రయాణమవుతుంది. ఊరుఊరంతా కన్నీటితో వీడ్కోలు చెబుతారు. ఆమె కష్టాలకు తాను కారణం కానని, సత్త్రా అంతా అల్లకల్లోలంగా ఉందని పెద్దగోసాయిని తనను తాను సమర్థించుకుంటుంది.

                               పిచ్చిపట్టిన ఏనుగు జగన్నాథ్ ను బంధించే ప్రయత్నంలో ఏనుగుల విషయాలన్నీ కరతలామలకమైన అనుభవజ్ఞుడైన జమాలుద్దీన్ రోజుల తరబడి మంచె మీద కాపు కాసి, చివరికి ఆ ఏనుగు చేతిలో మరణిస్తాడు. అతనిని చంపి, ఏనుగు అరణ్యంలోకి పారిపోతుంది. అది ఒక అశుభంగా తోస్తుంది సత్త్రాలోని ప్రజలందరికీ. కానీ ఏనుగు బాధ తప్పినట్టేనని అనుకుంటారు

                                గిరిబాల, మార్క్ గురించిన వదంతులు వ్యాపిస్తాయి. ఇంద్రనాథ్ వాటిని విని కూడా అందులో దోషమేదీ లేదని అనుకుంటాడు. గిరిబాలను తీసుకెళ్లేందుకు అత్తవారింటి నుంచి మనుషులొస్తారు. దానికి ఇష్టపడని గిరిబాల ఏదేమైనా మార్క్ పట్ల తన ప్రేమను వ్యక్తం చేసేందుకు అతని ఇంటికి వెళ్తుంది. అలా రావటాన్ని జీర్ణించుకోలేని మార్క్ ఆమె తన ఇంటి సంప్రదాయాన్ని అతిక్రమిస్తోందని, అది తగదని, తాను స్వయంగా ఆమెను ఇంటివద్ద దింపుతాననీ  ఆమెకు నచ్చజెప్పబోతాడు. కానీ తుఫాను రాత్రి వారి జీవితాలను మరొకవిధంగా రాసింది. గిరిబాల ఎవరేమనుకున్నా తాను అత్తవారింటికి వెళ్లననీ, తాను మార్క్ సమక్షంలో చనిపోయేందుకైనా సిధ్ధమేనని మొండిగా చెబుతుంది.  

                               నాలుగు గోడల మధ్య తమ జీవితాలను చాలిస్తున్నవారు, వీథి ముఖం కూడ ఎరుగని దురదృష్టవంతులు, మానసికంగా కృంగి, మంత్రతంత్రాలకు బలైపోతున్నవారు, చదువుకోవాలన్న తపన ఉండీ సామాజిక వెలికి భయపడి మరణిస్తున్నవారు గోసాయిల కుటుంబాలలోని వితంతువులు జగాలియా తీరంనిండా ఉన్నారన్న ఆలోచన కలిగి మార్క్ దుఃఖపడతాడు. అతనికి ఆ సత్త్రాతో ఉన్న పరిచయం అన్ని విషయాలూ ఆకళింపు కలిగేలా చేస్తుంది. ఒక స్త్రీ మర్యాదకు సంబంధించిన అన్ని హద్దులు దాటిపోయే పరిస్థితి ఎందుకు ఏర్పడింది అని వేదన పడతాడు. ఆమె తనను దగ్గరకు తీసుకొమ్మని ప్రార్థిస్తున్నా అతను శిలావిగ్రహంలా నిలబడిపోతాడు

                                అదే సమయంలో పెద్ద గోసాయిల ఇంటి పురోహితుడైన పురుషోత్తమ భగవతి, మరికొందరు మార్క్ ఇంటి తలుపులు పగలకొట్టి లోపలికి వస్తారు. అక్కడ ఒక అపవిత్రపు సంఘటన జరుగుతోందని ఆవేశపడతారు. మార్క్ ను బంధించి, గిరిబాలకు ప్రాయశ్చిత్తం చేసే ప్రయత్నంలో ఆమెను ఒక పూరిపాకలో పెట్టి దానికి నిప్పు పెట్టాలని, వెంటనే పాకనొకదానిని తయారుచేయమని మనుషులకు పురమాయిస్తారు.

ఇక్కడ ఒక విషయం చెప్పాలి,

జగాలియా నదీ తీరంలో ‘’మేషదాహ’’ అనే ఉత్సవం వసంతపూజలో ఒక భాగంగా జరుపుతారు. ఒకసారి శివసింఘ మహారాజు సత్త్రా అధికారిని చూసేందుకు వస్తాడు. అక్కడ ఘనంగా జరిగే వసంతోత్సవాలను చూడాలనుకుంటాడు. అది వసంత కాలం కాదు. అయినా రాజుగారి కోర్కె ప్రకారం సత్రా అధికారి వసంతోత్సవాలు ఏర్పాటు చేస్తాడు. ఒక పాక లో గొర్రెను (గొర్రెకు బదులుగా మేక ను సంప్రదాయంలో భాగంగా చేస్తారు.) లోపల పెట్టి పాకకు నిప్పంటించేవారు. మంత్రాలు చదువుతూ ప్రాణిని బలి ఇచ్చేవారు. కాలక్రమేణా ఆ ప్రాణి పట్ల కొంత సానుభూతితో పాకతడికెకు ఒక సందు పెట్టి, అది తప్పించుకుందుకు అవకాశం కల్పించేవారు. అరుదుగా మాత్రమే మేక తప్పించుకు బయటపడేది. దీనిని వసంతకాలానికే పరిమితం కాకుండా ఆనవాయితీని మార్చివేస్తారు. 

గిరిబాలను ఆ పాకలోకి వెళ్లి బయటకు రమ్మని, అపవిత్రమైన పాకకు నిప్పంటిస్తామని చెబుతాడు పూజారి. నిప్పంటించాక తాను బయటకు వస్తానని చెబుతుంది గిరిబాల. కానీ నిప్పంటించిన తరువాత బయటకొచ్చే ప్రయత్నమేదీ చేయక పాకలో ఆమె స్వచ్ఛందంగా సజీవదహనం అయిపోతుంది.  

                                చెల్లెలి మరణంతో ఇంద్రనాథ్ కృంగిపోతాడు. మార్క్ పాకను తెరిచి చూస్తాడు. పాకనిండా క్రీస్తు సూక్తులను అందంగా రాసి పెట్టి ఉంటాయి. మార్క్ సుగుణాలు, అతని తీరైన నడవడి తలుచుకుని దుఃఖపడతాడు ఇంద్రనాథ్. అతని ఆలోచనల మధ్య అప్పుడప్పుడు ఇలిమన్ జ్ఞాపకమొస్తుంటుంది. ఆమెను వివాహం చేసుకుని, ఆమె కష్టాలను దూరం చెయ్యాలని ఆలోచిస్తుంటాడు. 

                             తండ్రి ఆదేశం మేరకు తమ సత్త్రాలో మిగిలిఉన్న దంతాలులేని ముసలి ఏనుగుపైన ఏర్పాటుచేసిన అంబారీనెక్కి కౌలు వసూలుకు బయలుదేరతాడు. వెళ్లేముందు అతను తీవ్ర అశాంతికి గురవుతాడు. కౌలు రైతుల దుర్భర పరిస్థితులు పట్ల సానుభూతితో వారికి ఆయా భూములపై హక్కులను రాసివ్వాలన్న నిర్ణయానికి వస్తాడు. ఆ ఆలోచన తన మిత్రుడు బలా తో పంచుకుంటాడు. తండ్రికి గానీ, తల్లికి గానీ తన మనసు తెలియనీయడు. ఇంద్రనాథ్ కు తోడుగా బలా కూడా బయలుదేరతాడు. 

అట్టహాసంగా అంబారీ పైన వచ్చిన ఇంద్రనాథ్ కు వరికోతల సమయంలో వ్యతిరేకత కనిపించదు. చాలా ప్రశాంతంగా కోతలు పూర్తి కావొస్తుంటాయి. ఇంద్రనాథ్ రైతులందరినీ తన ముందుకొచ్చి సమావేశమవమని కబురంపుతాడు. భూములకు సంబంధించిన పట్టాలను తన చేతితో పంచాలన్న కోర్కెతో ఆత్రంగా ఎదురుచూస్తున్న ఇంద్రనాథ్ పైకి కొందరు దాడి చేసి హత్యచేయటంతో నవల ముగుస్తుంది. ఆ హత్య చేసిన వారిలో ప్రధాన తిరుగుబాటుదారుడు  పెద్దగోసాయి కి అక్రమ సంతానం, కింది కులంలోని స్త్రీకి పుట్టిన వాడు. దానివలన కూడా అతను ఆ కుటుంబం పట్ల కక్షతో ఉంటాడు. అతను కోరుకునేది అధికారుల పెత్తనాన్ని నిర్మూలనచేయటం, పేదల, రైతుల సంక్షేమం. ఇంద్రనాథ్ కూడా దానికోసమే పరితపిస్తున్న విషయం తెలియనివాడు.

                           వివాహమైన పురుషుడు మరొక స్త్రీతో సంబంధం పెట్టుకోవటం, భార్యను ఇంటినుంచి వెళ్లగొట్టటం వంటివి ఆ సమాజంలోనూ ఉన్నాయన్నది నవలలో చాలాచోట్ల చర్చించబడింది. వివాహం బయట సంబంధం పెట్టుకున్నవారు పెళ్లి ప్రస్తావన లేకుండా పెద్దమనుషుల సమక్షంలో భార్యాభర్తల తరహాలో జీవించే ఆచారం కూడా చూస్తాము. 

నవల ముగింపు పంతొమ్మిదివందల ఎనభై ఒకటిలో జరుగుతుంది. అంతకు ముందు కొన్ని దశాబ్దాల వెనుక నుంచి చెప్పుకొచ్చిన కథ మనకి మరీ పాతగా కనిపించదు. కారణం అప్పటి ఆనవాళ్లను ఇప్పుడు కూడా చూస్తుండటమే. నవలలో అనేక అంశాలు ఇప్పటి సమాజానికీ దర్పణం అన్నట్టు కనిపిస్తాయి. మానవ ప్రవృతిలో మంచీ, చెడు ఎప్పుడూ ఉంటాయనీ, కాలానికి పరిమితం కాదని అర్థమవుతుంది.

నవల ముగింపులో భూపరిమితి చట్టం రావటం, ఎందరో గోసాయిల పిల్లలు కోర్టుల చుట్టూ తిరగటం, భూమిని పోగొట్టుకుని చిన్నచిన్న అంగళ్లను పెట్టుకుని జీవికను వెతుక్కోవటం చూస్తాము. ఆ కాలానికే బీహారీ వ్యాపారులో, కాబూల్ నుంచి వచ్చే వ్యాపారులో సత్త్రా చుట్టూ తిరిగి ఆడపిల్లలను పెళ్లిపేరుతో తీసుకెళ్లటమో, పెళ్లిళ్లు చేసుకుని మరీ తీసుకెళ్లటమో చేసి చివరికి ఆ ఆడపిల్లల జీవితాలను నాశనం చేసి కండరాల వ్యాపారానికి దించటం కనిపిస్తుంది. ఉన్నత పాఠశాల చదువులు అభివృధ్ధి చెంది, ఆడపిల్లలు కూడా చదువుకుని మంచి ఉద్యోగాలకు వెళ్లటం వంటి మంచిమార్పును కూడా చూస్తాము. 

నవల ఆఖరు సన్నివేశంలో వృధ్ధుడైన బలా, దశాబ్దాల క్రితం ఇంద్రనాథ్ ను హత్య చేసి, జైలు కెళ్ళి బయటకొచ్చిన వ్యక్తి ఎదురుపడతారు. 

‘’నువ్వు మా ఇంద్రనాథ్ ను గొంతు కోసి హత్య చేసావు’’ అని బలా అన్నప్పుడు,

‘’రైతుల కడుపులు ఖాళీగా ఉన్నప్పుడు దర్జాగా అంబారీ ఎక్కి వచ్చాడు వరికోతలకు’’ అంటూ దురుసుగా అంటున్న ఆవ్యక్తి కి జవాబుగా బలా, 

ఆ అంబారీనీ తాను స్వయంగా కట్టేందుకు తోడ్పడ్డాననీ, అది చెదలు పట్టినదనీ చెబుతాడు. ఇంద్రనాథ్ రైతుల క్షేమంకోసమే అనుక్షణం దిగులు పడేవాడని కూడా చెబుతాడు. ఆవ్యక్తి నిర్ఘాంతపోతాడు. 

ఈ నవల పొడవునా ప్రకృతి సౌందర్య వర్ణన అద్భుతం అనిపిస్తుంది. ఉదాహరణకి,

‘’సాల్ చెట్ల వెనుక సూర్యుడు కుంగిపోతున్నాడు. మునిగిపోతున్న సూర్యుడి కిరణాలు, ఎండిన పచ్చటి ఆకుల మధ్యగా ప్రతిఫలిస్తూ సూర్యుని చుట్టూ ఓ బంగారు కిరీటాన్ని పెడుతున్నట్లున్నాయి. ఆ పచ్చటి వెలుతురు చారలు, అడివి కాంతిలో ఈదుతున్న బంగారు చేపపిల్లల్లాగున్నాయి. ఆ చేప పిల్లలన్నిటినీ తన వలలో బంధించి, సూర్యుడు తనతోపాటు తీసుకొని వెళ్లిపోతున్నట్లున్నాడు.”

ఈ పుస్తకంలోని చిక్కని కథ మనను ఒక మార్మిక ప్రపంచంలోకి లాక్కుపోతుంది. తప్పక చదివి అనుభంలోకి తెచ్చుకోవలసిన పుస్తకం.

*****
Please follow and like us:

One thought on “విషాద కామరూప”

  1. Life style and culture of north eastern states are different from those of other parts of India. Through the review, we get to know some of the very distinct living style of people like using elephant in their day today activities. Scenic beauty and lush greenery of the region is felt while reading. Over all there is clarity in the review and nudges the reader to read the original

Leave a Reply

Your email address will not be published.