షర్మిలాం “తరంగం”

మార్పు మంచిదే !

-షర్మిల కోనేరు 

“కాలం మారిపోయిందండీ ఆ రోజుల్లో … అని గతంలోకి వెళ్ళి పోతారు.
కాలం ఎప్పుడూ మారదు కొత్త పోకడలు వస్తాయంతే .
కరెంటు తీగ సన్నగా కనపడ్డా  లావుగా కనబడ్డా లోపల కరెంట్ అలాగే వున్నట్టు లోపల ఒరిజినాలిటీ భద్రంగా వుంటుంది.
కాలమాన పరిస్థితులబట్టీ రూపం మారుతుందంతే.
“అమ్మో ! ఆ రోజుల్లో మీ మామగారంటే ఎంత భయమో అని మా అత్తగారంటే , ఎందుకూ భయం ! అనేదాన్ని.
కానీ రోజూ ఎన్నో సందర్భాల్లో మా ఆయనకి భయపడేదాన్ని.
ఆ రోజుల్లాగా వణికిపోక పోవచ్చు కానీ నేనెంత స్వేచ్చావాదినని చెప్పుకున్నా ఆయనకి భయపడ్డాననేది పచ్చి నిజం.
నేనే కాదు స్త్రీ స్వేచ్చ కోసం పోరాడే వాళ్ళు కూడా ఆయనలకి కోపం వస్తుందేమో అని ఆలోచించడం నాకు తెలుసు.
” అబ్బే ! నాకు భయం లేదు పరస్పరం గౌరవించుకోవడం అంతే !! అని నాలాంటి వారు సర్ది చెప్పుకుంటాం.
పరస్పరం అంటే ఆత్మ వంచనే !
అవతలి వాళ్ళు మనకి భయపడరు… కొన్ని సందర్భాల్లో అదీ వాళ్ళకీ  నచ్చితే తలాడిస్తారు.
ప్రతీదానికీ కొన్ని ఎక్సెప్షన్స్ ( మినహాయింపులు ) వున్నట్టే …
నూటికో కోటికో పరస్పరం ఆడమగ గౌరవం ఇచ్చిపుచ్చుకునే వాళ్ళుంటారు.
మా నాన్న గారితో సమానత్వం గురించి మాట్లాడితే ఒకే మాట అనే వారు ” ప్రకృతే అసమానతలని సృష్టించింది , దాన్ని ఏం చేస్తావ్ ! అనే వారు.
మగ ప్రాణులు శారీరికంగా బలంగా ఆడ ప్రాణులు బలహీనంగా సృష్టి సహజంగానే జరిగింది.
కానీ ఆడ ప్రాణులకి మాతృత్వం అనే బలహీనతో బలమో తెలియని బంధాన్ని ఇచ్చింది.
కోడిపెట్ట ఎగిరే గద్దలతో కూడా పోరాడి పిల్లల్ని రెక్కల కింద పొదుముకుంటుంది.
ఆడాళ్ళూ అంతే.
నా బుజ్జి మనవరాలు నాతో ఆటలాడినప్పుడు ” నువ్వు బేబీవి …నేను మామీ” అంటుంది.
నన్ను బజ్జో బెట్టి వెచ్చగా రగ్గు కప్పి నుదుటి మీద ముద్దాడుతుంది.
నాకు బువ్వ తినిపించి మూతి తుడుస్తుంది.
ఆ పసిదానికి ఆ ప్రేమ ఎవరు నేర్పారు ? తన బొమ్మను పొందికగా స్త్రాల్లర్ లో వేసి తిప్పుతుంది .
అదే వయసున్న నా మనవడు స్ట్రాలర్ లో బొమ్మని పడుకో బెట్టి జట్ స్పీడ్లో తొయ్యడమో తల్లకిందులు చెయ్యడమో చేస్తాడు.
ఎందుకంటే వాడు ఆడ పిల్ల కాదు కాబట్టి ఎందుకంటే వాడికి తల్లి మనసు లేదు కాబట్టి.
మా నాన్న అన్న మాటల్లో ఎంతో కొంత వాస్తవం వున్నట్టే తోస్తోంది.
సృష్టి ధర్మం ప్రకారమే మనుషుల ప్రవర్తన వుంటుంది.
ఈ మధ్య నన్ను ఒక అమ్మాయి ఎల్జీబీటీ (Lgbt) మీద మీ అభిప్రాయం ఏంటి అని .
నేను ఒకటే చెప్పాను ప్రకృతి సహజంగా ఆడమగ మధ్య ఆకర్షణ వుండడం సహజం మనిషీ జంతువే !
జంతువులన్నీ ప్రకృతి సహజంగా ప్రవర్తిస్తున్నాయి.
ప్రకృతికి అది భిన్నం కానీ మనిషికి బుర్ర వుంది.. అది ఎన్నో పుంతలు తొక్కుతుంది.
ప్రకృతి కి భిన్నమైన దారి వారు ఎంచుకున్నప్పుడు అది వారి ఇష్టం.
ఇంతకీ నేను చెప్పొచ్చేదేంటంటే మనిషి విషయంలో ఏదీ అసాధ్యం కాదు.
ప్రకృతి సహజంగా వుండే ప్రవర్తన సమాజంలో మార్పులకు అనుగుణంగా మార్చుకునే తెలివి మనిషికి వుంది.
మగవారు మాతృత్వపు మమకారాలు పంచొచ్చు … నేను మగాడ్ని అనే అహం వదిలి పరస్పర గౌరవాల్ని ఇచ్చి పుచ్చుకోవచ్చు .
ప్రకృతిని ధిక్కరించి ఆడమగా సమానంగా వుండొచ్చు.
ఎందుకంటే మనకి బుర్ర వుందిగా !

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.