కరోనా విరహం- భరోసా వరం 

టి.వి.ఎస్.రామానుజ రావు 

సెల్ ఫోను మోత వినగానే, “అమ్మలూ, బావ అనుకుంటా చూడు! ఆ వంకాయలు నేను తరుక్కుంటానులే. నువ్వు పోయి మాట్లాడు.” ముసిముసి నవ్వులు నవ్వుతూ చెప్పింది తల్లి సావిత్రి.   

తల్లి వంక ఒకసారి కోపంగా చూసి వంటింటిలోంచి తన గదిలోకి పరిగెత్తింది వినతి. గది తలుపు గడియ పెట్టి, ఫోను తీసింది. “హలో, ఇంతసేపూ ఏం చేస్తున్నావోయ్?” చిరుకోపంతో అడిగాడు చంద్ర.

“వంటింట్లో కూరలు తరుగుతున్నాను, స్వామీ! ఏదో  పని చెయ్యాలిగా” నవ్వుతూ చెప్పింది.

“ఎందుకూ నవ్వుతున్నావు?” చిరాకు పడ్డాడు.

“ఏం లేదు. అమ్మ ఫోను మోగటం వినగానే, మీ దగ్గరనుంచే అని గ్రహించింది. ‘కూర తరగటం ఆపేసి, ఫోనులో  మాట్లాడు పొమ్మని’ ఒకటే ముసి ముసి నవ్వులు. ఏం చెయ్యాలో తెలియక కోపం నటించి, పరిగెత్తుకు వచ్చి ఫోను తీశాను బాబూ.”     

“అసలు నిన్ను వంటింట్లో పనెవ్వడు చెయ్యమన్నాడు?  అక్కడ నువ్వు గుత్తి వంకాయ కూరోయి బావా, కోరి వండినానోయి బావా! అంటూ కత్తితో నా గుండెలు కోసేస్తున్నావు. ఇక్కడ నేనేమో ‘రాగమయీ రావే’ అని పాడుతూ ఎదురు చూస్తుంటాను.”

“నేను మటుకు ఏం చెయ్యను బావా. ఈ దిక్కు మాలిన లాక్ డౌను ఎప్పుడెత్తాస్తారో, ఏమో? “జాలి గుండెల మేఘమాలా, బావతో మరువలేనని చెప్పి పోవా” అంటూ నేను కూడా పాడదామంటే ఒక్క మేఘం కనబడదయ్యే! వేసవికాలం కదా, మబ్బులకూ సెలవులిచ్చినట్లున్నారు. లేకపోతే, కరోన వైరస్ చూసి ఝాడుసుకుని పారిపోయాయో ఏమో” నవ్వుతూ చెప్పింది.  

“ఛీ, ఈ కరోన తగలెయ్య! నా దుంప దెంచుతోంది” చిరాకు పడ్డాడు చంద్ర.

“అమ్మో, తిట్టబోకు బావా, అమ్మవారని చెప్పింది బామ్మ. కోపం వచ్చిందంటే ఇలాగే జనాలను బాధిస్తుందట.”

“చాల్లే, అమ్మవారట. అదొక వైరస్” చిరాకుపడ్డాడు.

“బామ్మ అదే చెబుతోంది. మనం అమ్మవారంటే, పాశ్చాత్య దేశాలలో  వైరస్ అంటారట.”  

“బామ్మ ఖబుర్లూ, అమ్మమ్మ ఖబుర్లూ చెప్పటానికి వచ్చావా? అట్లాయితే ఫోన్ పెట్టేయ్” కోపంగా ఫోను కట్ చేశాడు. 

చిన్నబోయిన  మొహంతో వంటింట్లోకి వచ్చిన వినతిని చూసి, “ఏమైందమ్మా, బావ ఏమైనా అన్నాడా?” అనునయంగా అడిగింది తల్లి.  

“అబ్బే, ఏం లేదమ్మా. ఎన్నాళ్ళిలా, తనక్కడా, నేనిక్కడా? విసుగ్గా ఉందమ్మా!”

“ఇన్ని రోజులు ఓపిక పట్టావు, మరికొద్ది రోజులు కాస్త ఓపిక పట్టమ్మా!  ఆ కాస్త లాక్ డౌను ఎత్తేసాక, బావ దగ్గరికి  వెడుదువు గాని.  అప్పుడిక అమ్మా, నాన్న కూడా గుర్తుండరు” కూతురి వంక చూస్తూ నవ్వుతూ అంది.

నీకంతా నవ్వులాటగా ఉంది” కోపం నటిస్తూ తన గదిలోకి వెళ్ళింది వినతి. 

అసలు ఈ బావ మరదళ్ళ పెళ్ళే గమ్మత్తు పరిస్థితుల్లో జరిగింది. క్లుప్తంగా చెప్పాలంటే కరోనా మనదేశంలో ప్రవేశించిన సమయంలో వీళ్ళ  పెళ్ళి నిశ్చయమైంది.  పిల్లాడు, పిల్ల తొందర పడుతున్నారంటూ అటు ఇటూ పెద్ద వాళ్ళు కూర్చుని మాట్లాడుకుని ముహూర్తాలు నిర్ణయించడం జరిగిపోయింది. అయితే, ప్రోడక్ట్ రిలీజ్ రోజు దగ్గర పడటంతో చంద్రం అతి కష్టం మీద నాలుగు రోజులు సెలవు సంపాదించాడు. పెళ్ళికి రెండురోజుల ముందు చంద్రం హైదరాబాదు నుంచి వచ్చాడు. ఆ మర్నాడే దేశమంతా లాక్ డౌను ప్రకటించారు. పెళ్ళికి పురోహితుడిని మాట్లాడుకోవడం చాల కష్టమైంది. ఎంతమందిని బతిమాలినా కరోనా భయంతో రామంటే రామన్నారు. కావాలంటే ఫోనులో మంత్రాలు చదువుతాం, అయితే ఫీజు మటుకు ప్రీ పేయిడ్ ( అంటే సెల్ ఫోనులాగా ముందే చార్జ్ చేస్తాడన్నమాట) గా ఇవ్వాల్సిందే  అన్నారు. అలాయితే పెళ్ళి జరిపిస్తామన్నారు.  చివరికి చంద్రం వాళ్ళ బాబాయి ఎలాగో ఒక పురోహితుడ్ని సంపాదించాడు. ఆయనకు ఇదే మొదటి పెళ్లి పౌరోహిత్యం కాబోలు, పుస్తకం దగ్గర పెట్టుకుని మంత్రాలు చదవడం చూసి, చంద్రం నాన్నగారు విసుక్కున్నాడు. రాఘవరావు గారయితే, “మంత్రాలు తక్కువ, తుంపర్లు ఎక్కువ” అని పురోహితుడి మొహం మీదే అనేశాడు. కోపం వచ్చి లేచి వెళ్ళ బోయిన పురోహితుడు వేణుని చూసి మళ్ళీ కుర్చుని, మాట్లాడకుండా పెళ్లి అంతా జరిపించాడు. చంద్రం స్నేహితులు లాక్ డౌను మూలంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఫోన్లు, వాట్స్ అప్ లో మేస్సేజిలు పంపారు. బంధువులు  బతికుంటే బలుసాకు తిని పడి ఉండొచ్చు, ఇప్పుడీ పెళ్ళికి వెళ్ళి  రోగం కొని తెచ్చుకోవడం ఎందుకని అక్కడ్నుంచే అక్షింతలు వేస్తున్నట్లు వీడియోలు పంపి దీవించారు. మరికొంతమంది పెళ్ళి భోజనం చెయ్యని కాడికి, గిఫ్టు ఖర్చు మాత్రం ఎందుకని, దీవనలతో పాటు, గిఫ్టులు కూడా వీడియోలలోనే పంపించారు.  పెళ్లి కాగానే, చంద్రాన్ని మాత్రం ఎలాగో తన కారులో హైదరాబాదులో దింపి వచ్చాడు వేణు. అయితే, వినతిని పంపడానికి మంచి రోజు కాదని అతనితో పంపలేదు. ఇదిగో, అక్కడి నుంచీ మొదలైంది వీళ్ళ కధ.  కరోనా కేసులు రోజు రోజుకూ పెరగడంతో ప్రభుత్వం చాలా స్ట్రిక్టు రూల్సు ప్రవేశ పట్టింది. ఎక్కడివాళ్లు అక్కడే వుండాలన్నారు. నిత్యావస రాలకు సంబంధించిన షాపులు తప్ప ఇంకేవి తెరవడానికి వీల్లేదన్నారు. బస్సులు, రైళ్ళు, విమానాలు ఆపేయడమే కాకుండా, రోడ్డు మీద ఏ ఒక్కరు కనబడినా ఎక్కడికి వెడుతున్నావంటూ ఆపి అడుగుతున్నారు.  అనవసరంగా రోడ్ల మీదకు వచ్చినట్లు అనుమానం వచ్చిందంటే వాళ్ళకు బడితె  పూజ చేసి పంపేస్తున్నారు, లేదా చీపురుతో రోడ్లు వూడిపిస్తున్నారు. దాంతో చంద్రంకు ఫోను మాత్రమే దిక్కయ్యింది.        

 * * *

ఫోను మోగటంతో “హలో” అంటూ ఫోను తీసింది వినతి.         

“ఎన్ని సార్లు ఫోను చెయ్యాలి? ఫోను తియ్యవేం,ఎక్కడున్నావు ఇంతసేపూ?” కోపంగా అడిగాడు చంద్ర.  

“ఫోను ఛార్జింగ్ లేదు.  చార్జింగు  పెట్టి వంటింట్లోకి  వెళ్ళాను. అందువల్లే వినపడలేదు. ఇవాళ తెల్లారాక నువ్వు ఫోను చెయ్యడం ఇది అయిదోసారి. రాత్రి లోపల ఎన్ని సార్లు చేస్తావో అమ్మ లెక్కపెడుతోంది. ఏమైంది బావా నీకూ?” 

“ఏమవటం ఏమిటి? నీకంతా నవ్వులాటగా వుంది. నాకిక్కడ విసుగొస్తోంది. నువ్వు వచ్చేస్తావని, అందరూ ఉంటారని త్రీ బెడ్ రూం ఫ్లాటు తీసుకున్నానుగదా.  అద్దె దండగ. లంకంత ఇంట్లో నేనొక్కడినే. పొద్దున్న లేచి కాఫీ పెట్టుకోవడం దగ్గర నుంచీ వొండుకుని తినడం, ఆ తర్వాత పనివాళ్ళు రావడం మానేశారు. కనుక నేనే గిన్నెలు తోముకోవడం- ఈ  తిప్పలు నేను  పడలేను!  విసుగ్గా వుంది మొన్న గ్లోవ్స్ వేసుకుని కూరలు కొనితెచ్చానా, గ్లోవ్స్ వేసుకోవడంతో సొరకాయ ముదురు తెలియలేదు. కూరలన్నీ సబ్బునీళ్ళలో ఒకసారి,  తర్వాత మంచి నీళ్ళలో మరోసారి కడిగి, ఫాను కింద ఆరేసి  ఫ్రిడ్జి లో పెట్టాను. నిన్న కరోనాను చూసినట్లు  సొరకాయ బిగుసుకుపోతే, ఇవాళ బెండకాయలు  హడిలిపోయినట్లు వడిలిపోయాయి.  ఆవిడెవరో అనసూయదేవిట, గుగ్గిళ్ళు ఉడకబెట్టిందట. నేను సొరకాయ కూరకే ఆవిడను పిలవాల్సిందనిపించింది. ఎవర్ని పిలిచినా నేను ఉడకనంటే ఉడకనని, అది నా ఆఫీసు వేళ అయినా వుడకనే లేదు. మన కన్నా కుక్కరు గిన్నెలు నయం. పప్పు గిన్నె, అన్నం గిన్నెలోకి వొరిగి పోయి, పెళ్లినాటి పప్పన్నం అయ్యింది. బయటకు పోయి హోటల్లో తిందామంటే హోటళ్ళు మూతబడ్డాయి. ఒకవేళ వున్నా తింటే ఏమవుతానో,  నిన్నగాక మొన్న పెళ్ళి చేసుకుని హాస్పిటల్లో పడుండాల్సి వస్తుందేమోనన్న భయం.  అన్నీ దరిద్రాలూ మన పెళ్ళి వెంటనే రావాలా? ఎన్నాళ్ళిలా, అక్కడ నువ్వూ, ఇక్కడ నేనూ!

వినతి మాట్లాడ లేదు. తనకూ విసుగ్గానే ఉంది కానీ,  చెయ్యగలదు?

“సరేలే, నేనొక ఉపాయం చెబుతాను. విని, నీ ఆలోచనగా మామయ్యతో చెప్పు. మా వేణు బాబాయి  పోలీసు ఆఫీసరు. ఆయన్ను అడిగి, నిన్ను తన కారులో ఇక్కడకు పంపే ఏర్పాటు చేయమని మామయ్యను అడుగు. ఇక్కడకు వచ్చాక నీ బెంగ తీరుతుంది.”

“అబ్బా, అప్పటికి నీకే బెంగాలేనట్టు!” వెక్కిరించింది.

“అది సరేలే, అసలు ఇంత మంచి ఐడియా చెప్పినందుకు ఎగిరి గంతేసి కౌగలించుకోవాలి. ప్చ్! నువ్వక్కడా, నేనిక్కడా!  ఈ పధకం పారిందంటే మనం కలిసి ఉండొచ్చు. ఇంతకీ, నేను చెప్పినట్లు చేస్తావా?”

“చెయ్యక పోతే ఎలా? శ్రీవారు ఆర్డరు వేశాక తప్పుతుందా?”    

“అమ్మా, అమ్మా …” ఏదో చెప్పబోయి తండ్రి రాఘవరావు రావడం చూసి ఆగిపోయింది వినతి.

“చెప్పమ్మా, నాన్నేగా, చెప్పు! రహస్యమా?” అడిగింది సావిత్రి.

“పర్వాలేదు చెప్పమ్మా, నా దగ్గర దాపరికం దేనికీ?” తండ్రి లాలనగా అడిగేసరికి ధైర్యం తెచ్చుకుంది వినతి. 

“బావకు వొండుకోవడం సరిగా రాదుకదమ్మా, రోజూ ప్రతి వస్తువూ-కూరలతో సహా, అన్నీ కడుక్కోవడం, ఉడికీ వుడకని తిండి తినడం –  విసుగ్గా ఉందిట. పోనీ, చిన్న మామయ్యను అడిగి, నన్ను బావ దగ్గరకు తీసుకెడతాడేమో అడగండి నాన్నగారూ?” జాలిగా మొహం పెట్టింది వినతి.  

రాఘవరావు మోహంలో చిరునవ్వు  తొంగి చూసింది. ఏదో అనబోయి, సావిత్రి కళ్ళతోనే సైగ చేసి వారించడంతో, ఆగి పోయాడు. ఒక నిముషం ఆగి, “ సరే, నేను వేణుతో మాట్లాడుతా లేమ్మా” అంటూ వెళ్ళిపోయాడు.  వినతి సంతోషంగా తన గదిలోకి వెళ్ళి. చంద్రకు ఫోను చేసింది. 

 * * *

“బావా, నువ్వు అన్నది నిజమే, పెళ్ళయి ఇన్ని రోజులు విడిగా వుండటం పిల్లలకు కష్టంగా వుంటుంది.  వినతిని తీసుకు వెళ్ళడం పెద్ద సమస్య కాదు.  నేనిప్పుడు  కాన్ఫరెన్సుకు వెడుతున్నాను. బహుశా ఈ లాక్ డౌను మళ్ళీ పొడిగించాలా, ఒద్దా అన్న విషయం గురించే ఈ మీటింగు అనుకుంటాను. ఒక వేళ లాక్ డౌను ఎత్తేస్తే, ఏ ఇబ్బంది లేదు. నేను రేపు పొద్దున్నే వచ్చేస్తాను. వచ్చాక ఆలోచిద్దాం” అన్నాడు వేణు.

రాఘవరావు సరేనన్నాడు.  విషయం పూర్తిగా తెలియకపోయినా వినతి రోజూ ఆత్రంగా ఎదురు చూస్తోంది, తండ్రి ఎప్పుడు శుభవార్త చెబుతాడాని. అటుపక్క చంద్రం రోజూ వినతికి ఫోన్ల మీద  ఫోన్లు చేస్తూ, “ఈ పెద్ద వాళ్ళకు బుద్ది లేదు, పెళ్ళయిన కొత్త జంట ఇలా ఎన్నాళ్ళు విడిగా వుంటారని కూడా ఆలోచించరా?” అంటూ  ఫోన్లోనే అటు, ఇటూ పెద్దవాళ్ళ నందర్నీ కడిగి పారేస్తూ, వేడి నిట్టూర్పులు విడుస్తున్నాడు.  సూర్యుడికి ఆ గాలి తగిలి కోపం వచ్చిందేమో,  ఒక ఆటంబాంబు (అదే, విస్పోటనం అంటారట) పేల్చి, ప్రజలంతా ఎలావున్నారో చూద్దామని, ( వేడిగా) కిందకు చూడటం మొదలుపెట్టాడు. దాంతో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు చల్లగ ఉండాలంటే ఏం చెయ్యాలాని ఆలోచించి, లాక్ డౌనుకు కొంత సడలింపులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.  బారు షాపులు, వాటితోపాటు చిన్న చిన్న దుకాణాలు తెరుచుకోవచ్చని చెప్పారు. పబ్బులు, షాపింగు మాల్సు తెరవడానికి వీల్లేదన్నారు. బస్సులు, రైళ్ళు, విమానాలు తిరగవన్నారు. దొరికినంత తాగేసి కొందరు ఆనందంగా వీధుల్లోనే డాన్సులు చేస్తే, పన్లు లేక కొంతమంది వలస కూలీలు తమ తమ ఊళ్ళకు ప్రయాణమయ్యారు.  బస్సులు, రైళ్ళు  లేకపోవడంతో, చాలామంది సైకిళ్ళపైన, కాలి నడకన కూడా తమ ఊళ్లకు వెడుతున్నారు. లాక్ డౌను ఎత్తేసే సమయం త్వరలోనే రానున్నదని  సంబరపడ్డాడు చంద్రం.  రెండ్రోజుల తర్వాత తండ్రి మోహనరావు దగ్గర నుంచీ ఫోను వచ్చింది. వినతి వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో అని ఆత్రంగా ఫోను తీసిన చంద్రంకు నిరాశే మిగిలింది. 

కుశల ప్రశ్నలు అవి వేశాక, జాగ్రత్తలన్నీ చెప్పాక, “వినతిని ఇప్పుడే పంపే వీలు కుదిరేటట్లు లేదురా అబ్బాయ్! నువ్వు మటుకు జాగ్రత్తగా వుండు” అంటూ ఫోను పెట్టేశా డాయన.

పళ్ళు ఊడి వచ్చేలా కొరుక్కున్నాడు చంద్రం. మళ్ళీ అవి ఊడిపోతే తన  అందం కాస్తా పోతుందని, అన్నం తినడం కూడా కష్టమవుతుందని మానేశాడు.  

 వెంటనే వినతికి ఫోను చేశాడు. “ ఏమైంది మన వాళ్ళందరికీ? వీలుకుదిరేటట్లు లేదట, వీలు! ఒళ్ళు మండిపోతోంది. ఏం చెయ్యాలి వీళ్ళని?” అంటూ ఆగ్రహావేశాలన్నీ వినతి మీద కురిపించాడు. వినతికి కళ్ళంబడి నీళ్ళు తిరిగాయి. తనకు కూడా ఏమీ చెప్పలేదంటూ మంచం మీద వాలిపోయింది.  

 * *

వారం రోజుల నుంచీ చంద్రం ఫోను చెయ్యక పోవడంతో వినతి కాలు కాలిన పిల్లిలా తిరుగుతోంది. మొదట రెండ్రోజులు కోపం వచ్చి ఉంటుందిలే, తర్వాత తనే చేస్తాడు లెమ్మని సర్దుకుంది. అయినా ఊరుకోకుండా ఫోను చేస్తూనే వుంది. అటుపక్క నుంచీ కాల్ అందకపోవడంతో హతాశురా లయ్యింది. అమ్మతో గొణుగుతూ చెప్పింది కానీ, కోపం వచ్చి ఫోను చెయ్యలేదో , లేక ఆరోగ్యం బాగాలేదో ఆవిడకూ అర్ధం కాలేదు. ఒకటి రెండ్రోజులు వినతికి ఏదో సర్ది చెప్పింది కానీ, కూతురి ఆందోళన చూసి,  చివరికి భర్తతో చెప్పింది. ఆయన మోహనరావుతో విషయం చెప్పేసరికి ఆయన కూడా కంగారు పడ్డాడు. భార్య శాంతను  పిలిచి అడిగాడు, కొడుకు ఫోను ఏమైనా చేసాడేమోనని. ఆవిడ చెయ్యలేదని చెప్పడంతో పాటు, తను రెండు సార్లు చేసినా, ఫోను అతను తియ్యలేదనీ, బహుశా పనిలో వుండివుంటాడని ఊరుకున్నాని చెప్పింది. ఆయన వెంటనే తమ్ముడు వేణుకు ఫోను చేశాడు. అతను తను వేరే వూరిలో వున్నానని, కనుక్కుంటాను కంగారు పడద్దని ధైర్యం చెప్పాడు.  

రెండ్రోజుల దాకా వేణు నుంచీ కబురు లేకపోవడంతో అందరూ ఆందోళనతో  ఎదురు చూడసాగారు.  మూడోరోజు వినతిని పలకరించి ధైర్యం చెప్పడానికి రాఘవరావింటికి వచ్చారు చంద్రం తల్లిదండ్రులు. వాళ్ళను చూడగానే, వినతికి కళ్ళంబడి నీళ్ళు తిరిగాయి.  శాంత వినతిని దగ్గరకు తీసుకుని ఓదార్చింది.  

కాసేపట్లో బయట కారు చప్పుడు అవడంతో అందరూ పరుగున బయటకు వచ్చారు. కారులోంచి ముందు వేణు దిగాడు. వెనకాల సీటులో కూర్చున్న చంద్రం దిగగానే వినతి పరిగెత్తి రాబోయింది. 

“అక్కడే ఉండు” బిగ్గరగా చెప్పాడు వేణు. వినతి కంగారు పడుతూ నిలబడింది. 

“ఏమైంది వీడికి, అలా చిక్కిపోయావేమిట్రా?” గడ్డం మాసి, నీరసించి పోయిన చంద్రంను చూసి శాంత కంగారు పడింది.

“ఏమైందిరా నీకు, ఎక్కడికి వెళ్ళావు? నీకోసం మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఫోను నువ్వు చెయ్యలేదు సరికదా, మేము చేస్తే తీయకపోతివి? చూడు వినతి ఎంత కృశించి పోయిందో?” అడిగాడు మోహనరావు.

“ఏం  లేదన్నయ్యా, వీడూ, ఇంటి పక్కన పానీ పూరి అమ్మే వాడూ, వలస కూలీలతో కలిసి సైకిళ్ళ మీద విజయవాడకు  బయల్దేరారట. సరిహద్దుల్లోని చెక్ పోస్టులో వీరందర్నీపట్టుకుని క్వారంటైనుకు పంపారు. వీడికి, వాడికి ఇద్దరికీ కరోనా నెగటివ్ వచ్చినా పద్నాలుగు రోజులు అక్కడే వుంచేశారు. నిన్న నేను మా ఆఫీసరుకు వీడిని గురించి చెప్పినప్పుడు,  అతను ఎంక్వయిరీ చేసి వీడు ఇక్కడున్నాడని చెప్పాడు.  నేను వెళ్ళి, వాళ్ళకు నచ్చచెప్పి తీసుకు వచ్చాను.”

“అయితే ఇప్పుడు వీడికి కరోనా వున్నట్లా?” ప్రశ్నించింది శాంత భయంగా.

“లేదులే, వొదినా, వీడికి నిన్ననే టెస్టు చేశారు. లేనట్లు రిజల్టు వచ్చింది.  రెండో సారి టెస్టు చేశాక పంపుతామన్నారు. అయితే, నేను ఇక్కడ చేయిస్తానని చెప్పి తీసుకు వచ్చాను.” శాంత ఊపిరి పీల్చుకుంది. వినతి సంతోషంగా దగ్గరకు రాబోయింది. 

“ఆగవమ్మా, కోడలా! రేపు రెండో టెస్టు కూడా నెగటివ్ వచ్చేదాకా ఆగూ! మీ ఆయన దొరికాడు గదా, ఆందోళన తీరిందా?” నవ్వుతూ అడిగాడు వేణు. వినతి సిగ్గు పడింది. 

 “అన్నట్లు నువ్వు ఎప్పుడు బయల్దేరావు? మధ్యలో  ఎలా ఆగిపోయావు?” చంద్రంను అడిగింది వినతి. 

“నా ఫ్లాటు దాగారే పానీపూరి బండి వుంది. ఆఫీసు నుంచీ వచ్చేటప్పుడు రోజూ పానీపూరి తిని కాసేపు వాడితో మాట్లాడి ఇంట్లోకి వెడతాను.  అలా వాడితో బాగా పరిచయం. వాడొక సారి వాళ్ళ ఊరు విజయవాడని చెప్పాడు. ఇదిగో ఈ కరోనా గొడవలో పాపం, వాడి వ్యాపారం మూలపడింది. వాడికి తినడానికి తిండి కూడా దొరకలేదు. కొన్నాళ్ళు నేనే వాడికి డబ్బులిచ్చాను. చివరికి వాడు తన ఊరు వెళ్ళిపోతానని చెప్పాడు. ఎలా వెడతావురా బాబూ అంటే, సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోతానని చెప్పాడు.  ఇక అప్పుడు నేను కూడా వాడితో వచ్చేస్తే ఎలావుంటుందని ఆలోచించాను. ఇద్దరం సైకిల్ తొక్కుకుంటూ వచ్చేశాము. చివర్లో పోలీసులు పట్టుకుని క్వారంటైన్ లో పెట్టకపోతే, ముందే ఇల్లు చేరి ఉండేవాడిని. మాకు ఒక స్కూల్లో ఏర్పాటు చేశారు. అందరం ఒక్క సారి అక్కడకు చేరే సరికి, మాకు తినడానికి తిండి, తాగడానికి మంచి నీరు కూడా సరిగా అందలేదు. రెండు రోజులు నానా తిప్పలూ పడ్డాను. ఛార్జింగ్ లేక, ఎవరికీ  ఫోను చేసేందుకు లేదు. ఇక మూడో రోజు తప్పని సరిగా అక్కడ పోలీసులతో బాబాయ్ పేరు చెప్పాను. వాళ్ళు ఆశ్చర్య పోయారు. ముందే ఎందుకు చెప్పలేదని అడిగారు. ముందు నేను పని చేసుకోవడానికి ఇంటర్నెట్ సౌకర్యం వున్న స్కూలు కంప్యూటర్ రూమ్ ఇచ్చారు. తర్వాత ఒక పోలీసు అధికారి వచ్చి మళ్ళీ నన్ను వివరాలు అడిగాడు.  టెస్టు రిజల్టు రాగానే ఇంటికి పంపేస్తామన్నారు.  బాబాయ్  వచ్చి, ఇంటికి తీసుకెడాతానంటే, డాక్టరు రెండో సారి టెస్టు చేస్తేగానీ పంపలేమని చెప్పారు. అయితే బాబాయ్ ఇక్కడ తను రెండో టెస్టు చేయిస్తానని హామీ ఇవ్వడంతో వదిలేశారు.

“ అదన్నమాట సాహస వీరుడూ, అతిలోక సుందరి కథ” శాంత వినతి వంక చూసింది.  అందరూ నవ్వేశారు.  

“సరే, అన్నయ్యా, మనింటికి వెడదామా? అక్కడయితే వాడికి ఒక గది సపరేటుగా ఉంది గదా! కొద్ది రోజులు వాడు ఎవరినీ తాకకుండా, దూరంగా వుండాలి, మరి” వేణు నవ్వుతూ చూశాడు వినతి వంక. వినతి మొహం ఎర్రగా అయ్యింది.

“సరే, పోదాం. ఓకే, బావా వస్తాం మరి!” అంటూ లేచాడు  మొహనరావు.

“అమ్మా, బావ మనింట్లోనే వుండచ్చు గదమ్మా !  పైన మేడ మీద గది ఉంది కదా? భోజనం, కాఫీ, టిఫెన్లు లోపలికి  వెళ్ళకుండా కిటికీ లోంచీ ఇవ్వవచ్చు” తల్లిని చుట్టేసి చెప్పింది వినతి. “ఓ “ అంటూ వేణు నవ్వాడు.

అందరూ అతనితో పాటు నవ్వేసరికి, వినతి లోపలి పారిపోయింది. సావిత్రి, రాఘవరావు “చంద్రం ఇక్కడ ఉంటాడులే బావా, మాకేం ఇబ్బంది లేదు! అది ఇన్ని రోజులుగా ఎదురుచూస్తోంది చంద్రం కోసం. మేము జాగ్రత్తగా చూస్తాము.” అని గట్టిగా చెప్పేసరికి మోహనరావు  శాంత వైపు  చూశాడు.  శాంత “ఇన్నాళ్ళు వాడి కోసం అది ఎంత ఎదురు చూసిందో, వాడిని వెంటనే తీసుకుపోతే, ఆ పాపం మనదే” అంటూ నవ్వింది.             

* * *

ఈ మధ్య కాలంలో కరోనా కొద్ది రోజులు ఆకస్మికంగా మాయమైంది. కొంతమంది పెద్దలు “మనది ఆధ్యాత్మిక దేశం. మన వాళ్ళు చేసిన పూజలూ, యాగాలూ ఫలించి, కరోనా తోక ముడిచి పారిపోయింద”న్నారు. మరికొంతమంది అదేమీ కాదు పొమ్మన్నారు. అది కొద్ది రోజులు కొంచెం జలుబు చేసి సెలవ్ తీసుకుందని, మళ్ళీ వెనక్కి రాకపోదనీ అన్నారు. హూ (WHO ) కూడా అదే హెచ్చరించింది.  అలాగే  కరోనా వేషం మార్చుకుని, “నేనెక్కడికి పోలా,” అంటూ   భరోసా(ఇస్తూ) అనే పేరుతో మళ్ళీ వచ్చింది, “బొమ్మాళీ, నిన్ను వదలా” అంటూ. 

తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, అందరకీ బ్రతకడానికి భరోసా- ఇవి వలలో చిక్కుకుని పారిపోతున్న పావురాల్లా మనకు దూరంగా కనబడుతూనే వుంటాయి.  రోగాలకు కరువు లేదనే భరోసా, కార్పోరేట్ ఆస్పత్రుల ఆదాయానికి  భరోసాగా మారుతూనే వుంది. అయితే, పాత అనుభవాలతో కరోనా అంటే  కొంత భయం తగ్గింది జనాలకు.  ప్రభుత్వ ఆస్పత్రుల సామార్ధ్యానికి మించిన తాకిడి, అక్కడి ఇబ్బందులు స్వయంగా చవి చూసిన  ప్రజలు, ఈ సారి జాగ్రత్త పడ్డారు. ఎవరి ఇంట్లో వారు ఉంటూ, ఒక్క పశువుల మందులు తప్ప, ఇంగ్లీషు మందులు, ఆయుర్వేదం, హొమియోపతీ, యునానీ – ఏ మందులైనా వాడతాము కానీ, క్వారంటైనులో వుండలేమన్నారు. కావాలంటే, రోజల్లా మొహానికి మాస్కులు, చేతులకు గ్లోవ్స్ తొడుక్కునే ఉంటామని, “తుమ్మెదా, తుమ్మెదా” అన్న పాటను కూడా విననైనా వినమనీ, కొత్తగా పెళ్ళయిన వాళ్ళు తప్ప, ఎవరూ ఎవర్ని కౌగలించుకోమనీ, మళ్ళీ ప్రధాన మంత్రి చెప్పేదాకా, “చేతులు కలిసిన చప్పట్లు” అని పాడుకోమనీ వాగ్దానాలు చేశారు. పత్రికల దగ్గర్నుంచి, కూరగాయలూ, పాల పాకెట్ల దాకా అన్నీ సబ్బుతో కడిగి మరీ వాడతామనీ, రోడ్ల మీద ప్రభుత్వం తిరగమన్నప్పుడే తిరుగుతామని శపధం చేశారు.  తమ ప్రజలింత బుద్దిమంతు లైనందుకు ప్రభుత్వ పెద్దలూ, ప్రభుత్వ ఆస్పత్రులలో సిబ్బంది సంబర పడ్డారు. అయితే ప్రభుత్వం మరి కొన్ని నిబంధనలు పాటిస్తేనే  ప్రజలకు ఈ వెసులుబాటు కల్పిస్తామని షరతులు విధించింది. ప్రజలు వాటికీ ఒప్పుకున్నారు. అవేమిటంటే, బారు షాపులకు దూరం పాటించి,తొందర పడకుండా క్యూలోనే మందు కొనుక్కోవాలని , ఇళ్ళలోనే వుండటం వలన ఏ విధమైన గృహ హింసకు మగవారు కానీ, ఆడవారు కానీ పాల్పపడకూడదనీ,  కుటుంబ నియంత్రణ పాటించి తీరాలనేవి ఆ షరతులు. ప్రభుత్వం చూడవచ్చిందా పొమ్మని, ప్రజలు వాటికి కూడా అంగీకరించారు.  ఆ విధంగా  చాలామంది  కొత్త దంపతులకు మరి కొన్ని రోజులు “ప్రేమ యాత్రలకు, బృందావనమూ నందవనమూ ఏలనో” అంటూ పాడుకునే  అవకాశం కల్పించిందీ కరోనా, అదే భరోసా !         

వారం కాగానే వేణు వచ్చి చంద్రంను రెండవ సారి కరోనా టెస్టుకు తీసుకువెళ్ళాడు. అది కూడా నెగెటివ్ రిపోర్టు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వినతి మొహం వెలిగిపోయింది. వారంరోజుల నుంచి, కాఫీ టిఫిన్ల దగ్గర నుంచి భోజనం దాక, బావకు ఆమడ దూరంలో ఉంటూ టేబుల్ పై పెట్టేసి రావడమే కాక, ఏం మాట్లాడినా నాలుగడుగుల దూరంనుంచే మాట్లాడి రావడం దుర్భరంగా వుంది. రాఘవరావు, సావిత్రి, చంద్రంను ఎంతో జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా, అవసరమైన జాగ్రత్తలన్నీ పాటిస్తూ వచ్చారు. వినతి కూడా అవన్నీ పాటించేలా అడుగడుగునా జాగ్రత్త పడ్డారు. రిజల్టు వచ్చిన రోజునే మోహనరావు, శాంత సంతోషంగా రాఘవరావింటికి వచ్చి చాలాసేపు మాట్లాడుతూ కూర్చున్నారు. 

తర్వాత శాంత, “అన్నయ్యా, ఇవాళ దశమి కదా. వాడిని తీసుకు వెడదామని వచ్చాము. మళ్ళీ నాలుగు రోజుల్లో ఆషాడ మాసం వస్తోంది. అత్తారింట్లో అల్లుడు ఉండకూడదంటారు.” అంటూ చెప్పేసరికి వినతి మొహం మాడిపోయింది.

రాఘవరావు  “అలాగేనమ్మా” అంటూ సావిత్రి వైపు చూశాడు. 

సావిత్రి తల ఊపి వినతి కోసం చూసేసరికి అప్పటికే వినతి తన గదిలోకి వెళ్ళిపోయింది.  రాఘవరావు, సావిత్రి కొంచెం బాధపడ్డా “తప్పదు, ఆచారం” అంటూ సర్దుకున్నారు. 

“చంద్రం, ఇక బయల్దేరుదామా?” అంటూ అక్కడే మాట్లాడకుండా కూర్చున్న చంద్రం వంక చూసింది శాంత. 

“మీరు వెళ్ళండమ్మా, నేను వినతితో కాసేపు మాట్లాడి వస్తాను” ఎటో చూస్తూ చెప్పాడు. 

మోహనరావు లేచి, “మనం వెడదాము పద శాంతా, వాళ్ళిద్దర్నీ కాసేపు మాట్లాడుకోనీ” అన్నాడు. 

“చీకటి పడకుండా వచ్చెయ్యి నాన్నా” అంటూ జాగ్రత్తలు చెప్పింది శాంత.  వాళ్ళు వెళ్ళాక, కాసేపాగి, చంద్రం, వినతి “షాపింగు కోస”మని చెప్పి బయటకొచ్చారు. 

కాస్త దూరం నడిచి అటూగా వస్తున్న ఆటో ఆపి, గాంధీనగర్ పోనిమ్మని చెప్పాడు. వినతి మాట్లాడకుండా బుద్ధిగా చంద్రం పక్కన కూర్చుంది. సెంటరులో తెరిచి వున్న షాపులో వినతి కోసం రెండు చీరలు ఇంకా ఆమె కవసరమైనవి, తనకు కావాల్సిన బట్టలూ కొనాడు. వినతి “ఇవన్నీ ఇప్పుడెందుకు బావా” అంటే, కావాలి పొమ్మన్నాడు. మళ్ళీ ఆటో  ఎక్కి గాంధీనగర్ సత్యనారాయణ స్వామి టెంపుల్ పక్క వీధిలోకి ఆటో పోనివ్వమన్నాడు. వినతి “అదేమిటి, ఇంటికి కాదా?” ఆశ్చర్యంగా అడిగింది. “హుష్, మాట్లాడకు!” అంటూ వేలు చూపించాడు చంద్రం. ఒక ఇంటి ముందు ఆటో ఆపి, “దిగు” అన్నాడు. ఆటో అబ్బాయికి డబ్బులిచ్చి పంపేసి, ఇంటి తలుపు తాళం తీశాడు. వినతి తెల్లబోయి చూస్తూ వుండిపోయింది.

తలుపు తెరిచి, లోపలి అడుగుపెట్టి, “రా, ఇదే మన ఇల్లు ఇప్పుడు!” అన్నాడు. వినతికి అర్ధం అయ్యింది. “అమ్మ, ఎంత మాయ చేశావు బావా?” అంది  ఆశ్చర్యంగా.  

“నేను కాదు, మన పెద్ద వాళ్ళే పెద్ద మాయ గాళ్ళు! వాళ్ళే  మనం ఇలా మాయం అయిపోయే పరిస్థితి తెచ్చారు” అన్నాడు నవ్వుతూ.

“ఎవరి ఇల్లు ఇదీ? మనం ఇక్కడెందుకు వుండటం? అమ్మా, నాన్నా వాళ్ళు కంగారు పడతారు, మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళకపోతే!” గబగబా చెప్పింది. 

“ఎవ్వరూ ఏం కంగారు పడరు! అయినా మనల్ని ఎంత హింస పెట్టారు, ఈ పది రోజులూ? కొద్దిగా కంగారు పడితే అరిగిపోరులే. ఇది నా ఫ్రెండ్ కృష్ణ ఇల్లు. వాడీమధ్యే ఫ్యామిలితో వాళ్ళ వూరు వెళ్ళాడు, వాళ్ళ అమ్మకు బాగా లేదని. కరోనా కట్టడి కనుక ఇప్పుడిప్పుడే రాడు.  మనదే ఈ రాజ భవనం.” 

“మరి అమ్మ, నాన్నలు ఏమంటారో”  అంటూ వినతి భయంగా అనడంతో, చంద్రం ధైర్యం చెప్పాడు.     

 ఆ రాత్రి వాళ్ళు ఆనందంగా గడిపారు. ఒకరితో ఒకరు ఎన్నో ఖబుర్లు చెప్పుకున్నారు. 

కొత్త దంపతులు కనుక మర్నాడు లేటుగానే లేచారు. ఇద్దరూ ఒకర్నొకరు చూసుకుని, నిన్నటి తమ సాహస యత్నం గుర్తు చేసుకుని, ఆనంద పడ్డారు. మిస్సమ్మ సినిమాలో రమణారెడ్డి సావిత్రిని బలవంతగా లాక్కెళ్ళబోయిన సీను తన కలలో  వచ్చిన సంగతి చెప్పి, “నిజంగా అలా మనల్ని విడదీస్తారంటావా, బావా” అంటూ భయపడింది వినతి.  పాతాళ భైరవిలో తోట రాముడిలా, “మనల్ని ఎవరూ వేరు చెయ్యలేరు” అంటూ ధైర్యం చెప్పాడు చంద్రం. ఇద్దరూ తీరిగ్గా బ్రష్ చేసుకుని, కాఫీ తాగే అలవాటు లేదు గనుక, తదుపరి కార్యక్రమం గురించి ఆలోచిస్తుండంగా, తలుపు చప్పుడైంది. 

“ఎవరో కిష్టి గాడి కోసం అయివుంటారు” అంటూ వినతికి ధైర్యం చెప్పి తలుపు తీసిన చంద్రం కొయ్యబారిపోయాడు.  

ఎదురుగా వేణు బాబాయి “లోపలి రానియవేరా నన్నూ, మీ కొత్త సంసారం చూద్దామని వచ్చాను” అన్నాడు నవ్వుతూ.

వినతి గబగబా వచ్చి వేణు కాళ్ళకు దణ్ణం పెట్టింది. “నీకు భలే మొగుడు దొరికాడే తల్లీ వీడు!” అంటూ ఆమెను లేవదీ శాడు.  చంద్రం గొంతు సవరించుకుని, “మేము ఇక్కడ వున్నట్లు నీ కెలా తెలిసింది?” అడిగాడు ఆశ్చర్యంగా.

“ఎవర్ని తప్పించుకున్నా పోలీసాడిని తప్పించుకోలేర్రా” అన్నాడు వేణు నవ్వుతూ. 

“సరే, ఇంతకీ మీ ఇద్దర్నీ తీసుకుపోవడానికి వచ్చాను” అన్నాడు వేణు, వినతి ఇచ్చిన మంచి నీళ్ళు తాగుతూ.

“మేం రాములే బాబాయ్, ఈ నెలంతా ఇక్కడే వుంటాం. “

“కుదరదురా అబ్బాయ్, మిమ్మల్ని అరెస్టు చెయ్యమని పై వాళ్ళ ఆర్డరు. ఈ మధ్యలో మారిన పరిస్థితులు, రూల్సు  మీకు తెలియదు. మా వాళ్ళెవరైనా వస్తే, సమస్య మరింత జటిలం చేస్తారని, నేనే వచ్చాను. పదండి!” అంటూ తొందర పెట్టాడు.  

వినతి భయంతో చంద్రంను కౌగలించుకుని ఏడ్చేసింది.  చంద్రం ఆశ్చర్యంగా వేణు వంక చూశాడు. వేణు గంభీరంగా ఎటో చూస్తూ మాట్లాడలేదు. ఇక తప్పదని చంద్రం వినతికి ధైర్యం చెప్పి, తమ బ్యాగ్గు తీసుకుని “వెడదామా’ అన్నాడు. 

కారు అనేక మలుపులు తిరిగి,  ఒక మేడ ముందాగింది. “ఇదేమిటి, ఇది పోలిస్ స్టేషన్ కాదుగా?” అడిగాడు చంద్రం.  “ఇది స్టేషను వెనక వైపు. ఇక్కడ నా పై ఆఫీసరు ఉన్నాడు. ఇక్కడ ఒకే ఒక సెల్ వుంది. ఆయనతో మాట్లాడి మీకిక్కడ ఏర్పాటు చేశాను” అంటూ మేడ మెట్లెక్కి వాళ్ళను కూడా రమ్మన్నాడు. “మీరిద్దరూ ఇక్కడే కూర్చోండి! ఇటువైపు తలుపులు మాత్రం తీయకండి,  స్టేషను ముందు వైపుకు మెట్లున్నాయి” అంటూ మెట్లు దిగి కిందకు వెళ్ళాడు. వినతి దిగులుగా చూస్తూ కూర్చుంది. ఒక నిముషం ఆగి ఇక భరించలేక, “ఏమిటి బావా, ఇదీ? ఏమిటి మనకీ ఖర్మ! ఇప్పుడు మనల్ని జైల్లో పెడతారా? లేక క్వారంటైన్ లో ఉంచుతారా?” అంటూ చంద్రం భుజంపై వాలిపోయింది. 

“నువ్వేం ఖంగారు పడకు. మా బాబాయి ఏదో ఒకటి చెయ్యకపోడులే!” అన్నాడు చంద్రం. కానీ అతని మాటలో ధీమా కనబడక వినతి వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. చంద్రం ఆమెను దగ్గరకు తీసుకుని ఓదార్చాడు.

ఇంతలో కిందనుంచి విజిల్సు వినిపించాయి. ఆతర్వాత ఎవరో పైకి వస్తున్న అడుగుల చప్పుడు వినిపించింది. బహుశా కింద పోలీసుల హడావుడి అయివుండచ్చని చంద్రం లేచి వెళ్లి, హాల్లో వున్న కిటికీల తలుపులు తెరిచాడు.  దూరంగా పార్కులో పిల్లలు ఆడుకుంటూ కనిపిచారు. ఎవరూ లేరనుకుంటూ వెనక్కి తిరిగిడో లేదో, “హాయ్” అంటూ వేణు కొడుకు ఆరేళ్ళ విజయ్ తలుపు తెరుచుకుని లోపలి వచ్చాడు. అతని వెనకే చంద్రం తల్లిదండ్రి, వినతి తల్లిదండ్రి లోపలి వచ్చారు. ఆ వెనకాలే  వేణు, అతని భార్య సుభద్ర వచ్చారు. వాళ్ళందరూ నవ్వుతూ ఒకేసారి వచ్చేసరికి, చంద్రం మొహం చిన్నబోయింది. వినతి సిగ్గుతో తల వంచుకుంది. 

“అన్నయ్యా, వీళ్ళకేం శిక్ష వెయ్యాలో చెప్పు” అన్నాడు వేణు.

“వీళ్ళిద్దర్నీ ఈ గదిలోపెట్టి తాళం వెయ్యి. వారందాక ఇల్లు వదిలి బయటకు రావడానికి వీల్లేదు” అన్నాడు మోహనరావు గంభీరంగా.               

*****

Please follow and like us:

One thought on “కరోనా విరహం- భరోసా వరం (హాస్య కథ)”

Leave a Reply

Your email address will not be published.